కవిత్వం

పూతకొచ్చిన చీకటి

అక్టోబర్ 2014

నిశీధి నడుమొంపున నక్షత్రపు మెరుపునంటించి
వెలుగుపువ్వుల జరీచీర జారిపడుతుంది.

ప్రేమావేశంతో ఒక్కపెట్టున హత్తుకున్నట్టు
గదులన్నీ అదాటున ఆక్రమించబడతాయి.

కలల్ని juggle చేస్తూ వచ్చిన అతిధి
కొనగోటితో ఖాళీలను పూరిస్తూ ఉంటాడు.

ఎగిసిపడే నిట్టూర్పుల జ్వాలల్లోంచి
సింహిక నిద్రలేస్తుంది.

శిఖరపు అంచున మోహరించిన మోహం
పలవరించే పల్లాల్లోకి సాగిపోతుంది.

పూతకొచ్చిన చీకటి
వెన్నెల ముసుగేసుకుని
ఊరుమీద పడుతుంది.