కవిత్వం

తంత్రీ…తాంత్రికుడు

జనవరి 2013

(పండిట్ రవిశంకర్ స్మృతిలో…)

1
మహా గురువుల మహా పాద యాత్ర
శ్రవణేంద్రియానికి నిర్వాణ సుఖం
ఒక చీమ నిద్రలోకి
కంజు పిట్టల కలల్లోకి
ఎండిన భూమి సణుగుడులోకి
బర్రెల పుర్రెల ప్రాణ సొరంగాల్లోకి
గాలి గాథల్లోకి
నీ సంగీతం…

2
సమాధులే మబ్బుల్లోకి లేచి
ప్రాణాయామాలు చేసినట్టు
మానస సరోవరాలు ముచ్చట్లు చెప్పినట్టు
గాయాలు చప్పట్లు కొట్టి
తంత్రులు యక్షులై ఆడి
గునుగుపూల చుంబన పరిస్పర్శలు
అంతా…
నీ సంగీతం ….

3
మంచు పూలు పసుపు పూసుకొని
నూనె రాసుకొని
కాటుకని కళ్ళకు పెట్టుకున్నట్టు
సరస్వతీ నది…మళ్ళీ ఎక్కడో పుట్టి
గమకాల్లో దుఃఖించినట్టు
సశబ్దంగా…

4
నీ సింధుభైరవి నా ఆదిమ గుహ
ప్రాచీ సంధ్య
గగనద్వారం
పాలపుంత ఊయల

5
తంత్రిని దేహంగా దాల్చిన
బాటసారీ…
నువ్విక్కడ పుట్టనే లేదు
నువ్విక్కడ చచ్చిపోనూ లేదు
నీ స్వరతంత్రమంతా…బ్రహ్మ కపాలాన్ని
పేల్చిన ఊపిరి సంతకం
కొన్ని పగోడాలపైన వివశంగా
కురిసే మలిఝాము వెన్నెల
గడచిపోయిన శతాబ్దాలూ
మునిగిపోయిన నాగరికతలూ
నీ స్వరాల్లో పూచిన మొగ్గలూ …వాగులూ
ఆకాశంలోని రవ్వలూ…గవ్వలూ…

6
నేను కేవలం వినేవాడ్ని
నీ స్వేద రంధ్రులు …అంగజ జలపాతాలు
నీ సంగీతం…
ప్రవక్త ఆకలి…
జీబ్రాన్ ఏకాంతం…

7
నువ్వు తిలక్ కామోద్ వి.
నువ్వు యమునా తిలకానివి
నువ్వు ‘శ్రీ’ …శర్వానివి
నువ్వు నిద్రని కనే రాత్రివి
రాత్రిని కనే రాగానివి…

8
నీ సితార్
కాశీ శ్మశానాల…. పక్కన
గంగలో తేలే పడవ
దానిపై కూర్చుంది భూమి.
కడుపుతో వుండి
కనబోయే వాగ్గేయకారుడి కోసం
కడుపును నిమురుకుంటూంది.

9
నాయ్ నా…
నువ్వు చందమామ చుట్టూ కట్టిన
కాంతి తోరణానివి
నా కామాఖ్య భృకుటివివి
జన్మ పేటికవు
శంకరుని
రవివి.