ప్రత్యేకం

కీట్స్… మూడు స్మృతిగీతాలు

నవంబర్ 2014

(అక్టోబరు 31 కీట్సు 220వ జయంతి సందర్భంగా నివాళి)

జాన్ కీట్స్ (31 October 1795 – 23 February 1821) సౌందర్యారాధకుడు. అయితే ఆ సౌందర్యం బాహ్య /భౌతిక స్వరూపం కాదు. సత్యస్వరూపమైన సౌందర్యం. అందుకే, Truth is beauty and beauty is truth. That is all you know on earth; and that is all you need to know అంటాడు. భౌతికమైన సౌందర్యపు క్షణికత ఎరిగినవాడవడం వల్లే, A Thing of beauty is joy forever అని అనడంలోనూ, Heard Melodies are sweet, unheard melodies are sweeter అనడంలోనూ, రసాత్మకమైన సౌందర్యం ఎలా శాశ్వతమో, దాని ఆలంబన గతించినా, సౌందర్యం తన ఛాయ ద్వారా మనిషికి పదేపదే తొలి అనుభూతిని ఎలా వెంటాడుతూ పునరావృతంచేస్తుందో ఆవిష్కరించేడు.

ఇంగ్లీషు సాహిత్యానికి షేక్స్ పియర్ తర్వాత అంత మహత్తరమైన సేవచేసినవాడు కీట్స్ అంటే అతిశయోక్తి కాదు. అతనిది సుకుమారమైన హృదయం. అతనెప్పుడూ కవిగా స్థిరపడదామనుకోలేదు. కవిత్వం రాయడం కూడా చాలా ఆలస్యంగా ప్రారంభించేడు. (అసలు అతను బ్రతికిందే నిండా పాతికేళ్ళమీద నాలుగు నెలలు లేదు.) అతని సాహిత్యకృషి అంతా కేవలం 54 కవితలు. కాని ఇంత చిన్న పరిధిలోనే యవ్వనానికి ప్రతీకాత్మకమైన ప్రయోగశీలతతో భావప్రకటనలో, కవితాస్వరూపాలలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశాడు. ఇంగ్లీషు ఛందస్సుగా పిలవబడే “ODE” కి ఒక పరిపూర్ణత తీసుకువచ్చేడు.

కానీ, John Gibson Lockhart, John Wilson Croker వంటి సమకాలీన విమర్శకులు అతనికి సాంప్రదాయకంగా నేర్పబడే క్రమబద్ధమైన చదువు లేదన్న విషయంకూడా పరిగణనలోకి తీసుకోక, అతని కవితా ప్రతిభని అంచనా వెయ్యలేక ఎంత నిర్దాక్షిణ్యంగా విమర్శలు చేసేరంటే, దానికి అతని హృదయం తల్లడిల్లిపోయింది. అందుకే తన సమాధిమీద “Here Lies One Whose Name was writ in water” అని వ్రాయమని శాసించేడు.

పిన్నవయసులోనే తల్లిదండ్రుల మరణం అతన్ని అకస్మాత్తుగా కుటుంబానికి పెద్దని చేశాయి. విధికూడా అతనికి సాయం చెయ్యలేదు. వారసత్వంగా రావలసిన ఆస్తి ఒక మోసగాడి కారణంగా బ్రతికుండగా చేతికి రాలేదు. ఆ రోజుల్లో సరియైన వైద్యంలేని క్షయవ్యాధి సోకింది. చిత్రం ఏమిటంటే, ఆ రోజుల్లో వైద్యవృత్తి చాలా గౌరవప్రదంగా ఉండడంవల్ల, ప్రతి యువకుడిలాగే, ప్రపంచానికి ఏదైనా మంచి చేద్దామన్న తలపుగల కీట్స్ తను ముందు వైద్యుడు కావాలనుకున్నాడు. (25 July 1816న వైద్యపరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు కూడా). అతని వైద్యపరిజ్ఞానం అతన్ని కాపాడలేకపోయింది.

16-17 ఏళ్ళు కూడా నిండా లేని కీట్స్ గురించి అతని గురు పుత్రుడు, బాల్య స్నేహితుడు Cowden Clarke ఇలా అంటాడు: “అతను పుస్తకాలు చదవడం కాదు, ఆర్తితో తాగేసేడా అన్నట్టు కనిపించేవాడు. Ovid’s Metamorphosis, John Milton’s “Paradise Lost”, Virgil’s Eclogues, కాకుండా ఎన్నో పుస్తకాలు చదివేడు. అయితే, అతన్ని అమితంగా ప్రభావితం చేసిందీ, అతని జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిందీ, కవిత్వాన్ని అతనికి సరికొత్తగా నిర్వచించి దానిపట్ల అపారమైన ప్రేమని కలిగించిన పుస్తకం మాత్రం “Edmund Spencer’s Faerie Queene”“.

అప్పటికే అతను లాటిన్ నుండి Virgil’s Aeneid అనువాదం పూర్తిచేశాడు. ఆ తర్వాతే, అతని కలల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ “In Imitation of Spencer కవితని రాసేడు. 21వ ఏట ఉద్యోగంలో చేరక ముందు, George Chapman అనువదించిన Homerను తన గురువు చదివి వినిపించిన తర్వాత, ఆ రాత్రికి రాత్రే ఒక అపూర్వమైన కవిత On the first looking into Chapman’s Homer రాసి గురువుకి పంపించేడు.

ఒక కవి ఇంకొక కవి ఇయ్యగల మహత్తరమైన నివాళి ఇంతకంటే ఏముంటుంది?

బహుశా అందుకేనేమో మూడు కాలాలకు చెందిన కవులు అపురూపమైన నివాళి అందించేరు. నిజానికి లెక్కకు రాని ఎన్ని వందల మంది కీట్స్ కి నివాళి ఎన్ని రూపాలుగా అర్పించేరో చెప్పడం కష్టం.

ఈ చిన్ని నేపథ్యంలో, భిన్న కాలాలకు, దేశాలకు చెందిన ముగ్గురు కవులు, కీట్స్ కి అర్పించిన నివాళి చదివితే మనకి చాలా కుతూహలం రేకెత్తించే విషయాలూ, వాళ్ల చమత్కారాలూ తెలుస్తాయి.

కవులకి క్లుప్తత ఇష్టం. మన నన్నయచెప్పిన ‘అల్పార్థముల అనల్పార్థ రచన ‘ సాధించిన వారిలో షేక్స్ పియర్, ఆస్కార్ వైల్డ్, కీట్స్ ని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగని అన్నివేళలా క్లుప్తత సాధించడం కష్టం. అయితే, కీట్స్ కి నివాళిగా రాసిన కవితా త్రయంలో లాంగ్ ఫెలో కన్నా, అసమాన ప్రతిభావంతుడైన ఆస్కార్ వైల్డ్ కన్నా, కౌంటీ కలెనే తన భావాన్ని రసవత్తరంగా చెప్పేడని ఒప్పుకోక తప్పదు.

లాంగ్ ఫెలో కీట్స్ కి సమకాలికుడు. అమెరికను కవిత్వం ఇంగ్లీషు కవిత్వపు ప్రభావం నుండి వేరుపడి తన అస్థిత్వాన్ని నిలుపుకుందికి ప్రయత్నిస్తున్న కాలం అతనిది. అందుకే కీట్స్ రాసిన ఎండిమియాన్ కవితని అతనికి అనువదిస్తూనే, చివరకి ఒక అద్భుతమైన ఉపమానాన్ని వాడేడు. తనయితే శిలాఫలకం మీద “పొగరాజుతున్న జనపనార ప్రజ్వరిల్లకముందే మృత్యువు నీరు చిలకరించిందని” రాస్తానని . జనపనార గిరించి తెలిసినవారికి అది ఎంత త్వరగా అంటుకుంటుందో తెలిసినవిషయమే. ఎటువంటి ఉజ్జ్వలమైన భవిష్యత్తు మొగ్గలోనే మృత్యువు చిదిమేసిందో చెప్పడానికి చక్కని ఉపమానం.

ఆస్కార్ వైల్డ్ అసమాన ప్రతిభావంతుడు, భావుకుడు, భాషలోని సౌందర్యపులోతులు తెలిసినవాడు. సందర్భానికి తగిన మాటని ఎప్పుడు ఎలా వాడాలో బహుశా అతనికి తెలిసినట్టు మరెవరికీ తెలీదేమో. అందుకే, షేక్స్ పియర్ తర్వాత మాటల్లో, ఉపన్యాసాలలో అత్యధికంగా ఉటంకించబడే వ్యక్తి వైల్డే. సంప్రదాయాన్ని ప్రేమిస్తూనే అభివ్యక్తిలో కొత్తపుంతలు తొక్కిన వ్యక్తికి నివాళిగా సంప్రదాయపు గాథలలోని ఉపమానాలనే ఎక్కువగా వాడేడు. చివరగా, కీట్స్ ఎన్నుకున్న మృత్యుల్లేఖనానికి ఒక సమర్థింపు నిస్తున్నాడు. నిజానికి చాలా చరిత్రలు మృత్యువుతో ముగిసిపోతాయి. వారి జ్ఞాపకాలూ వారితోపాటే సమాధిచెయ్యబడతాయి. కానీ, కీట్స్ కై విలపించే వైల్డ్ లాంటి వేలమంది అభిమానుల కన్నీరు కీట్స్ పేరు తాజాగా, లేతగా, సరికొత్తగా ఉంచుతుందని అంటాడు. ఇలా అన్నప్పటికీ అది సంప్రదాయమైన అభివ్యక్తే.

కౌంటీ కలెన్ హార్లెం రినైజాన్స్ కు (Harlem Renaissance ) చెందిన ప్రముఖ ఆఫ్రికన్- అమెరికన్ కవి. నాలుగే నాలుగు పాదాల్లో … Death not be proud!” అని జాన్ డన్, చెప్పినరీతిలో, అగ్నిశిఖలాంటి అతని పెదాలని ముద్దిడిన మృత్యువు, తనకి తనే వాతలేసుకుందంటూ… అతిశయోక్తిని కూడా సహజోక్తిగా చమత్కరించేడు.

Three Epitaphs on Keats

1. For John Keats, Apostle of Beauty

Not writ in water nor in mist,
Sweet lyric throat, thy name.
Thy singing lips that cold death kissed
Have seared his own with flame.

-Countee Cullen

సౌందర్య పిపాసి కీట్స్ కి…

నీటిమీదా కాదు, మంచుతెరలమీదా కాదు
నీ పేరు రాయబడింది, తీపి పాటవంటి గళమా!
జ్వలిస్తున్న నీ పెదాలని ముద్దిడుకున్న చల్లని మృత్యువు
దాని పెదాలపై తనే వాతలేసుకుంది.

-కౌంటీ కలెన్
May 30, 1903- January 9, 1946 American Poet

2. Keats

The young Endymion sleeps Endymion’s sleep;
The shepherd-boy whose tale was left half told!
The solemn grove uplifts its shield of gold
To the red rising moon, and loud and deep
The nightingale is singing from the steep;
It is midsummer, but the air is cold;
Can it be death? Alas, beside the fold
A shepherd’s pipe lies shattered near his sheep.
Lo! In the moonlight gleams a marble white,
On which I read: “Here lieth one whose name
Was writ in water.” And was this the meed
Of his sweet singing? Rather let me write:
“The smoking flax before it burst to flame
Was quenched by death, and broken the bruised reed.”

-Henry Wadsworth Longfellow

కీట్స్

ఆ నూనూగు మీసాల చందన రాజు చందనరాజులాగే నిద్రపోతున్నాడు.
ఆ ప్రేమికుడి గాధ సగమే కీర్తించి విడిచిపెట్టారెవరో
విచారవదనయై ఆ తోపు తన బంగారు పతకాన్ని
ఉదయిస్తున్న చందమామకు ఎత్తి చూపుతోంది.
కోనల చివరలనుండి కోయిల ఎలుగెత్తి ఆలపిస్తోంది
ఇది మండువేసవి, అయినా గాలి చల్లగా వీస్తోంది;
కొంపదీసి అది మృత్యువుకాదుగద? అయ్యో! పక్కన
గొల్లవాని మురళి తన మంద మధ్యలో ముక్కలై పడుంది.
ఓహ్! వెన్నెల పాలరాయిలా మెరుస్తోంది.
దాని మీద ఇలా రాసుంది: “ఇక్కడ ఒక వ్యక్తి నిద్రిస్తున్నాడు
అతని పేరు నీటిపై రాసి ఉంది.” అంతటి అపురూపమైన అతని
కవితాగానానికి ఇదా ప్రతిఫలం? నే నయితే ఇలా రాస్తాను:
“పొగరాజుతున్న జనపనార మంటగా ప్రజ్వరిల్లకముందే
మృత్యువు నీరు చిలకరించింది, అరకాలిన పిల్లనగ్రోవి ఫెళ్ళుమంది.”

-హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో
February 27, 1807 – March 24, 1882 American Poet

(చందన రాజు: చంద్రహారం సినిమాలో రాజకుమారుడి పేరు. ఒక దేవకాంత అతని అందానికి మోహించి పెళ్ళిచేసుకోమని అడుగుతుంది. అతను నిరాకరించడంతో, అతనికి రాత్రిపూట ప్రాణంపోసి, ఉదయంకాగానే ప్రాణం హరిస్తూంటుంది. గ్రీకు పురాణగాథలో ఎండిమియాన్, సెలీన్ ల కథ కూడా అలాంటిదే. )

3. The Grave of Keats

Rid of the world’s injustice, and his pain,
He rests at last beneath God’s veil of blue:
Taken from life when life and love were new
The youngest of the martyrs here is lain,
Fair as Sebastian, and as early slain.
No cypress shades his grave, no funeral yew,
But gentle violets weeping with the dew
Weave on his bones an ever-blossoming chain.
O proudest heart that broke for misery!
O sweetest lips since those of Mitylene!
O poet-painter of our English Land!
Thy name was writ in water–it shall stand:
And tears like mine will keep thy memory green,
As Isabella did her Basil-tree.

-Oscar Wilde
16 October 1854 – 30 November 1900 Irish Poet

కీట్స్ సమాధి

ఈ ప్రపంచపు అన్యాయాలనుండీ, తన బాధనుండీ ముక్తుడై
కడకి, భగవంతుని నీలి ముసుగు మాటున శయనిస్తున్నాడు:
జీవితమూ ప్రేమా ఇంకా పలకబారకముందే
జీవితంనుండి కనుమరుగైన త్యాగమూర్తి,
సెబాస్టియన్ అంత అందగాడు; అంత పిన్నవయసులో అస్తమించాడు
అతని సమాధిపై ఏ తమాలమూ, ఏ హరిత వృక్షమూ
నీడలు వీయవు;అనవరతమూ కుసుమిస్తూ
శీతల అస్థికలపై శోకించే నీలాల పూలబాలలు తప్ప!

ఈ ఇంగ్లీషు నేలకి చెందిన పదచిత్రకారుడా!
మైటిలీన్* అంత అందమైన సుభాషితాలు పలికినవాడా!
దురదృష్టానికి లొంగిన స్వాభిమాన హృదయా!
నీ పేరు నీటమీద రాయబడింది… అయితేనేం? అది చెరగలేదు:
నాలాంటి ఎందరివో అశృవులు నీ జ్ఞాపకాన్ని లేతగానే ఉంచుతాయి
తులసికోటలో లోరెంజో కోశం దుఃఖించిన ఇసబెల్లాలా

-ఆస్కార్ వైల్డ్
16 October 1854 – 30 November 1900 ఐరిష్ కవి

(*మైటిలీన్: Pittacus of Mitylene)