వ్యాసాలు

స్వప్నవాసవదత్తమ్ – చివరి భాగం

నవంబర్ 2014

కథ వెనుక కథలు, ఆ కథల వెనుక తొంగిచూచే చరిత్రా…:

భాసుని కొన్నినాటకాలలో అక్కడక్కడా అర్థం కాని సన్నివేశాలు లేదా ఏదో తెలియని కథలను ఉద్దేశించిన మాటలు అగుపిస్తాయి. దీనికి కారణాలు రెండు. మొదటిది – భాసుని కాలానికి రామాయణ, భారతాదులతో బాటు ఉదయనుని కథాకలాపాలు మౌఖికంగా వ్యాప్తి చెంది ఉండుట. రెండు – భాసుడు కాలంలో సంస్కృతనాటకాలు విరివిగా ప్రదర్శిస్తూ ఉండే సంభావ్యత. ఉదయనచరిత్రలో కొంతభాగమే నాటకంగా కవి స్వీకరించాడు కనుక అక్కడక్కడా ఉదయనునికి సంబంధించిన ఇతర కథలను అన్యాపదేశంగా సూచించి వదిలేశాడు. మౌఖికసాహిత్యవాప్తి కారణంగా నాటి ప్రేక్షకులకు ఆ కథలు సుపరిచితమే కాబట్టి నాటకంలో అలాంటి సూచనలను వారు పట్టించుకోకపోవడం జరిగి ఉంటుంది.

ఉదయనుని ప్రస్తావనలు మౌఖికంగా వ్యాప్తి చెందినాయని స్వప్నవాసవదత్తంలో రెండవ అంకంలో ఒక చిన్న సూచన ఉంది. పద్మావతికి ఉదయనునిపై అనురాగం ఉందని చేటి చెబితే, ఏ కారణాన అని అడుగుతుంది వాసవదత్త. అతడు దయగలవాడంటుంది పద్మావతి. ఒకవేళ అనాకారి అయితేనో అని హాస్యపూర్వకంగా అడుగుతుంది చేటి. వాసవదత్త ఛప్పున (తను అజ్ఞాతంలో ఉన్నానని తెలీక) లేదు లేదు, అతడు అందగాడేనంటుంది, నీకెలా తెలుసని పద్మావతి అడిగితే – ఉజ్జయినిలో ప్రజలందరూ అనుకుంటున్నారులే అని తప్పించుకుంటుంది. ఉజ్జయినిలో ప్రజలు ఉదయనకథాకోవిదులు.

కాళిదాసు మేఘసందేశంలో సరిగ్గా ఇదే మాట చెపుతాడు.

ప్రాప్యావన్తీ నుదయనకధాకోవిదగ్రామ వృద్ధాన్‌
పూర్వోద్దిష్టా మనుసర పురీం శ్రీవిశాలాం విశాలామ్ |….

భాసకవి అలా సూచించి వదిలివేసిన ఆ కథలను చూద్దాం.

ప్రథమాంకంలో వాసవదత్త మరణించిందని వత్సరాజు – “హా అవంతీరాజపుత్రీ! హా ప్రియశిష్యురాలా!” అని రోదిస్తాడు. ఉదయనునికి వాసవదత్త శిష్యురాలెప్పుడయింది? అది ఒక కథ!

ఉదయనుని కథలకన్నిటికీ పైశాచీభాషలో వ్రాసిన బృహత్కథ ఆధారం. బృహత్కథ ఇప్పుడు అలభ్యం. దీని సంస్కృతానువాదం సోమదేవసూరి వ్రాసిన కథాసరిత్సాగరం. ఇందులో ఒక కథ ప్రకారం – అవంతీరాజు ప్రద్యోతుని కుమార్తె వాసవదత్త. ఈమె ఉదయనుని గుణగణాలు, వీణావాదనాచాతుర్యం విని ప్రేమలో పడింది. ప్రద్యోతుడు ఉదయనుని ఒక మాయోపాయంతో బంధించాడు. తన కూతురికి వీణ నేర్పిస్తే తదనంతరం ఆమెకూ, ఉదయనునికి కల్యాణం చేస్తానంటాడు. అప్పుడు ఉదయనుడు వాసవదత్తకు వీణ నేర్పుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. (ఇద్దరూ కలిసి మంత్రి యౌగంధరాయణుడు పన్నిన ఉపాయంతో చండసేనుని బందీ నుండి తప్పించుకుంటారు. అది భాసుని ప్రతిజ్ఞాయౌగంధరాయణ నాటకం).

కథాసరిత్సాగరంలో లేని కథ, ఇంకేదో నాటకంలో ప్రస్తావించిన ఉపకథ కూడా ఒకటి ఉంది.

తన కూతురు ఉదయనుని ప్రత్యక్షంగా చూస్తే అతని సౌందర్యానికి ఆకర్షణ చెంది ప్రేమలో పడుతుందని అనుకొని, చండసేనమహారాజు ఒక తెరను ఏర్పాటు చేసి అటువైపు ఉదయనుణ్ణీ, ఇటువైపు వాసవదత్తను కూర్చోబెడతాడు. అంతే కాక వాసవదత్తతో తెరకు అటువైపు ఉన్న నీ గురువు ఒక గూనివాడని, అయితే వీణావాదనలో సిద్ధహస్తుడని చెబుతాడు. ఇటువైపు ఉదయనునికి కూడా తన కూతురు అనాకారి అని చెబుతాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా గురుశిష్యులవుతారు. ఒకనాడు వాసవదత్త వీణావాదనలో స్ఖాలిత్యాన్ని ఎత్తి చూపుతాడు ఉదయనుడు. వాసవదత్తకు కోపం వస్తుంది. ఇద్దరికి మాటా మాటా పెరుగుతుంది. “పోవే అనాకారీ” అని అతడు అంటే “పోవోయ్ గూని వాడా” అని ఈమె అంటుంది. “నేను గూని వాణ్ణా” అని అతడూ, “నేను అనాకారినా” అని ఈమె మండిపడి, కాసేపటికి విషయాన్ని గ్రహిస్తారు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించి, పెద్దదవుతుంది.

(పెళ్ళయిన తర్వాతా వాసవదత్త ఉదయనునికి వీణావాదనలో శిష్యురాలిగా కొంతకాలం ఉన్నట్టుంది. ఆమె శిష్యరికం ఎలా ఉండేదో ఒక చిన్న శ్లోకం స్వప్నవాసవదత్తం లో ఉంది.

అపిచ స్మరామి,
బహుశః అప్యుపదేశేషు యయా మామీక్షమాణయా |
హస్తేన స్రస్తకోణేన కృతమాకాశవాదితమ్ ||

ఇది ఒక పదచిత్రం. ఉపదేశవేళల్లో – అన్నాడు కాబట్టి ఉదయనుడు, వాసవదత్తా ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని (ఒకే రాగాన్ని) తమ తమ వీణలతో పలికిస్తున్నారు. అతణ్ణే చూస్తున్న ఆమె – తన వీణ జారిపోయినా గుర్తించక గాల్లో తీగలు కదుపుతోంది. అతడి వీణనుండి రాగం వస్తున్నది కాబట్టి తన వీణ నుండి శబ్దం రాకపోయినా ఆమెకు తెలియలేదు.

వివాహం విద్యానాశాయ – అని ఊరికే అనలేదు.:))

స్వప్నఘట్టంలో వత్సరాజు విచరిక అనే పరిచారిక గురించి ప్రస్తావిస్తాడు. పూర్వాశ్రమంలో విచరిక అనే పరిచారికతో చనువుగా ఉండబోతే వాసవదత్త కోపించింది. (భాసుడు కేవలం విచరిక పేరును మాత్రమే ప్రస్తావించాడు. వెనుక కథ నాటి కాలంలో మౌఖికం కావచ్చు)

వత్సరాజు ఉదయనుని కథలు మహాభారత, రామాయణాల తర్వాత భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందినట్టు కథాసరిత్సాగరం ద్వారా తెలుస్తుంది. పలువురు నాటకకర్తలు ఉదయనకథలను నాటకాలుగా మలిచారు. ఈ ఉదయనమహారాజు మహాభారతంలో అర్జునునికి ఆరవతరం వాడు. అర్జునుడు – అభిమన్యుడు – పరీక్షిత్తు – జనమేజయుడు – శతానీకుడు – సహస్రానీకుడు – ఉదయనుడు. ఇది ఆ వరుస. చంద్రవంశంలో 24 వ తరపు రాజు పేరు కూడా ఉదయనుడు. ఈ రెండవ ఉదయనుడు బహుశా బుద్ధుని సమకాలికుడు. బౌద్ధ సాహిత్యంలో కనిపించే ఈ ఉదయనుడు కూడా వీణావాదనానిపుణుడు. అయితే దుష్టస్వభావి. ఈతనికి మువ్వురు భార్యలు. ఈతని భార్యలలో ఒకానొక భార్య పేరు కూడా పద్మావతి! ఈ ఉదయనుడు తన మొదటి భార్య మాగంధియ సహాయంతో వీణలోపల పామును నిక్షేపించి పద్మావతిని చంపబోయినట్టు ఒక కథ. (నిజానికి బుద్ధుని సమకాలికుడు మొదటి ఉదయనుడా, రెండవ ఉదయనుడా అన్న విషయం స్పష్టంగా తెలియని చారిత్రక సమస్యగా కనబడుతూంది)

క్షేమేంద్రుని అవదానకల్పలతలో ఈ మరొక ఉదయనుని గురించిన ప్రస్తావన రెండు కథలలో వస్తుంది.

***

భాస కవిత, భాసోక్తులు:
———————-

నటునికి ఆంగికము, వాచికము, సాత్వికము, అభినయమూ ప్రధానమయితే నాటకకర్తకు ఇతివృత్తం, పాత్రచిత్రణ, సన్నివేశం, సంభాషణలూ, సంభాషణలకు బలాన్ని చేకూర్చగల అందమైన కవిత్త్వప్రతిభ అవసరమైన దినుసులు. భాసకవి వీటి మధ్య సమన్వయాన్ని చాలా సంయమనంతో పోషిస్తాడు. సన్నివేశాన్ని అధిగమించే వర్ణనలూ, లక్ష్యానికి మించిన భావుకతా, పాండిత్యప్రకర్షా, సుదీర్ఘసమాసాలు – ఇవి భాసకవి కవిత్త్వంలో సాధారణంగా కనిపించవు. అక్కడక్కడా కొన్ని సూక్తులు చెప్పినా సన్నివేశానికి పుష్టి కలిగించటం కద్దు. స్వప్నవాసవదత్తమ్ లోని కొన్ని శ్లోకాలను ఇప్పుడు చూద్దాం.

విస్రబ్ధం హరిణాః చరన్త్యచకితా దేశాగత ప్రత్యయా
వృక్షాః పుష్పఫలైః సమృద్ధవిటపాః సర్వేదయారక్షితాః |
భూయిష్టం కపిలాని గోకులధనాన్యక్షేత్రవత్యోదిశః
నిస్సందిగ్ధమిదం తపోవనమయం ధూమోహి బహ్వాశ్రయః ||

బాగా తెలిసిన ప్రదేశమన్న నమ్మకంతో లేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఫలపుష్పాలతో సమృద్ధిగా ఉన్న చెట్లకు కరుణతో రక్షణ దొరుకుతున్నది. గోవులు మిక్కిలిగా ఉన్నాయి. భూములు సాగు చేయక సహజమైన వృక్షాలతో కూడి ఉన్నాయి. అనేకములు ఆశ్రయంగా ఉన్న ఈ (యజ్ఞధూమం) తో కూడిన ఈ ప్రదేశం తప్పకుండా తపోవనభూమి.

(స్వభావోక్తి అలంకారంతో ఉన్న ఈ పద్యం శాకున్తలంలో కాళిదాసు ఆశ్రమవర్ణనకు మూలము కావచ్చును.)

అంకం చివర సాయంకాల వర్ణన:

ఖగా వాసోపేతాః సలిలమవగాఢో మునిజనాః
ప్రదీప్తోऽగ్నిర్భాతి ప్రవిచరతి ధూమో మునివనమ్ |
పరిభ్రష్టో దూరాద్రవిరపి సంక్షిప్తకిరణః
రథం వ్యావర్త్యాऽసౌ ప్రవిశతి శనైరస్తశిఖరమ్ ||

పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి. మునిజనులు నీటిని తెచ్చుకుంటున్నారు. (సాయంకాల నిత్యకర్మల కోసం). అగ్నిహోత్రం ప్రకాశిస్తూంది. దూరంగా జారిన ఉదయనుడు (సూర్యుడు) సంక్షిప్తకిరణాలతో రథాన్ని మరల్చి మెల్లగా అస్తాచలాన్ని చేరుకుంటున్నాడు.

మునివాటికల చిత్రీకరణ స్వభావోక్తి అలంకారం. ఉదయనుని పరిస్థితిని కూడా సమానంగా ప్రస్తావిస్తున్నది కనుక సమాసోక్తి. (ఒకే పద్యంలో రెండు సందర్భాలు ప్రస్తావిస్తూ, రెండూ సమానంగా చమత్కారభరితంగా ఉంటే అది సమాసోక్తి. ఒక సందర్భంలో చమత్కారం వాచ్యంగా, మరొక చమత్కారం సూచనగా ఉంటే ’ధ్వని’.)

వాసవదత్తకై వత్సరాజు వగపాటు:

దుఃఖం త్యక్త్వా బద్ధమూలోऽనురాగః
స్మృత్వా స్మృత్వా యాతి దుఃఖం నవత్వమ్ |
యాత్రాత్వేషా యద్విముచ్యేహ భాష్పం
ప్రాప్తానృణ్యా యాతి బుద్ధిః ప్రసాదమ్ ||

చిరపరిచయమైన అనురాగాన్ని విడువడం కష్టమవుతున్నది. పదే పదే స్మరించడం వల్ల దుఃఖం కొత్తదనాన్ని పొందుతూంది. ఈ స్మృతి ప్రసాదం కన్నీళ్ళై కరిగి నా చెలిఋణం తీరుతోంది. వ్యక్తిగతశోకాన్ని మించిన హృదయంగమమైన ఒక స్నేహభావం మనసుకు తట్టే అందమైన శ్లోకం ఇది.

కిం ను సత్యమిదం స్వప్నః సా భూయో దృశ్యతే మయా |
అనయాప్యేవమేవాऽహం దృష్టయా వంచితస్తదా ||

ఇది కలా? నిజమా? ఆమెను నేనిప్పుడు నిజంగా చూస్తున్నాను. ఈమే కదూ ఒకప్పుడు నన్ను చూసి చూడనట్లుగా మోసం చేసింది!

***

పూర్వరంగము – నాట్యశాస్త్ర ప్రస్తావనాంశాలు:

స్వప్నవాసవదత్తమ్ ఆరంకాల నాటకం. ఇందులో రెండు, మూడు అంకాలు స్త్రీపాత్రలతో, పూర్తిగా ప్రాకృతంలో నడుస్తుంది. మొత్తం నాటకంలో పురుషపాత్రలు, స్త్రీపాత్రలు దాదాపుగా సమానం. మొదటి మూడు అంకాలు గడిచిన తర్వాత కానీ నాయకుడు కనిపించడు. అయితే చివరికంటా నాటకం (చదవడం/చూడడం) పూర్తి అయిన తర్వాత నాయకుడే సామాజికుని మనసును ఆక్రమిస్తాడు. అది ఒక అందమైన మాయ. ఈ మాయను మరింత పొడిగించి, ఉదయనుడు-వాసవదత్త వీరికి సంబంధించిన మరొక కథను ఈ ఇద్దరు పాత్రలు లేకుండా ప్రతిజ్ఞాయౌగంధరాయణం అన్న నాటకంగా మలచాడు భాసుడు!

సంస్కృత నాటకాలు అన్నీ నాందితో ఆరంభమవుతాయి. నాంది అంటే దేవతాస్తుతి. అంతర్లీనంగా కథాసూచన/పాత్రలపరిచయం ఉండాలి. నాంది తర్వాత సూత్రధారుని ప్రవేశం ఉంటుంది. అయితే “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” – అన్న నిర్దేశంతో భాసనాటకాలు ఆరంభమవుతాయి. (ఈ నిర్దేశం కేవలం భాసనాటకాలలోనూ, చతుర్భాణి అన్న ప్రాచీనమైన నాటకాలలోనూ తప్ప మరే సంస్కృతనాటకాలలోనూ కనిపించదు.) ఆ పైన సూత్రధారుడు ఒక దేవతాస్తుతిని ఆరంభిస్తాడు.

స్వప్నవాసవదత్తమ్ లో దేవతాస్తుతి ఇది.

ఉదయనవేందుసవర్ణా వాసవదత్తాబలౌ బలస్య త్వామ్ |
పద్మావతీతీర్ణపూర్ణౌ వసన్తకమ్రౌ భుజౌ పాతామ్ ||

1. ఉదయనవేందుసవర్ణౌ = ఉదయ నవ ఇందు సవర్ణౌ = ఉదయించే సమయంలో కొత్తగా ఉన్న చంద్రుని కాంతికి సమానకాంతి కలిగిన
2. ఆసవదత్తా బలౌ = సురాపానముచేత కలిగిన బలము గల
3. పద్మావతీర్ణపూర్ణౌ = లక్ష్మీ అవతారముచే పూర్ణములైన
4. వసన్తకమ్రౌ = వసన్తుని వలె మనోజ్ఞములైన
5. బలస్య = బలరాముని
6. భుజౌ = రెండు భుజములు
7. త్వామ్ = నిన్ను
8. పాతామ్ = కాపాడుగాక !

నాంది ఎనిమిది, పంద్రెండు, పదునెనిమిది, ఇరువది రెండు పదములతో ఉండాలని, సూత్రధారుడు మధ్యమస్వరంతో గానం చేయాలని నాట్యశాస్త్రనియమం. ఇక్కడ అష్టపద నాంది. అయితే ప్రాచీనకాలంలో వాక్యాన్ని పదం అనేవారు. లేదా పదంగా శ్లోకపాదాన్ని పరిగణించేవారు. నాందిస్తుతి చంద్రుని సంప్రీతుణ్ణి చేయడానికని భరతముని నిర్దేశం. కొతమంది అర్వాచీనులు చంద్రనామాంకితం కావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పైన ఉదయనవేందు – అన్న చంద్రుని ప్రస్తావన ఆసక్తి కలిగిస్తుంది.

కథాపాత్రలను శబ్దశ్లేష ద్వారా సూచించాడు కవి. ప్రకృతార్థాన్ని సూచించటం ముద్రాలంకారం అంటారు.

భాసకావ్యాలలో ఈ విషయాన్ని, స్థాపనా అన్న మాటనూ వ్యాఖ్యాతలు ఇతరనాటకాలతో పోల్చి ఇది ఒక కొత్తగా వింత అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే భరతముని నాట్యశాస్త్రంలో పూర్వరంగం గురించి వివరించిన ఐదవ అధ్యాయంలో అంతర్యవనికా విధులు (ఇవి 9) బహిర్యవనికా విధుల (ఇవి మొత్తం 10) గురించి విశదంగా చెప్పారు. నాంది అన్నది బహిర్యవనికా విధిలో నాలుగవది. మొదటి మూడు – గీతవిధి, ఉత్థాపనము, పరివర్తనము. అన్ని విధులూ తప్పనిసరి కాదు కానీ నాంది తప్పనిసరి. ఇది సూచించటానికి “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” అని ప్రాచీనకవులు సూచిస్తారని నాట్యశాస్త్రానికి అభినవగుప్తుని వ్యాఖ్యానం. భాసుని కావ్యాలలో (చతుర్భాణి అన్న ప్రాచీనభాణాలలో) మాత్రమే ఈ వాక్యం, స్థాపనా అన్న శబ్దం కనిపిస్తాయి. అలాగే సూత్రధారుడు ప్రస్తావనను స్థాపన చేస్తాడు కాబట్టి అతడే స్థాపకుడు. ఆతడు చేసిన పనిని స్థాపనా అని భాసుడు పేర్కొన్నట్లు గమనించవచ్చు. భాసుని ప్రాచీనతకీ విషయాలు ఋజువు. అయితే భరతముని నిర్దేశించినట్లు స్థాపకుడు వచ్చి ’కావ్యపరిచయం’ చేయడమనే పద్ధతి ఎందుచేతనో భాసకవి పాటించలేదు. ఇందువల్ల ఈయన భరతునికి పూర్వుడని కొందరన్నారు. అది సబబుగా కాదనిపిస్తుంది. భాసకవికి, ఇంకా భారతదేశంలో అనేక ప్రాచీన కవులకు ఆత్మప్రశంసాపరాయణత్వం లేదన్నది సరైన కారణంగా కనబడుతుంది.

పూర్వరంగానికి నాట్యశాస్త్రవ్యాఖ్యాత అభినవగుప్తుడు ఒకానొక విచిత్రమైన లౌకిక ప్రయోజనం కూడా చెప్పాడు. నాటకం చూడ్డానికి వచ్చే ప్రేక్షకులు ఒకరొకరుగా వస్తారు కాబట్టి నాటకం ఆరంభం అవడానికి ముందు అలా ముందుగా వచ్చిన వారిని ఆనందపర్చడం ఒక ప్రయోజనమట.

పాశ్చాత్యదేశాల నాటకాలకూ ఇలాంటిది పద్ధతి ఉన్నట్టుంది. ఆంగ్లేయులు పెద్ద నాటకానికి ముందు curtain-raiser అని చిన్న ప్రహసనాన్ని ప్రదర్శించేవారట. మన దేశంలోనూ ప్రాంతీయభాషానాటకాలు ఆడబోయే ముందు ఏవేవో గమ్మత్తులు చేయడం ఉండేదని, తెలుగులో ’రెడ్డొచ్చె తిరిగి మొదలెట్టండి’అన్న సామెత కూడా వీధి నాటకాల నుండి వచ్చిందని చెపుతారు.

భాసుని నాటకాలను, ముఖ్యంగా స్వప్నవాసవదత్తాన్ని కేరళలో కూడియాట్టం అన్న నాట్యపద్ధతి ద్వారా చాక్యార్లు అనే ఒక గుంపు వారు వందల యేళ్ళుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. నాందికి ముందు దీపం వెలిగించడం కేరళ నాట్యకళారూపాలలో ఉన్న సాంప్రదాయం. బహుశా ఇది పూర్వరంగం అనే సాంప్రదాయానికి లుప్తావశేషం కావచ్చు

భరతముని విశదీకరించిన పూర్వరంగం తదనంతరం సంస్కృతనాటకాలలో పూర్తిగా తగ్గిపోయింది. పదవశతాబ్దంలో దశరూపకం అన్న లాక్షణికగ్రంథంలో కర్త ధనంజయుడు పూర్వరంగాన్ని నామమాత్రంగా పేర్కొన్నాడు.

***

ఇతివృత్తనిర్వహణా – నాట్యశాస్త్రమూ:
———————————-

ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికల్పితమ్ – నాటకానికి ఇతివృత్తం శరీరమైతే రసం ఆత్మ. రసం – ఆత్మ కాబట్టి రసనిర్వహణ ఇతివృత్తానికంటే ప్రధానమైనదని ఒక కృతకవాదం నేడు ఉంది. భాసుని నాటకాలలో ఈ రెండు అంశాలు అవిభాజ్యాలుగా గ్రహించవచ్చు.

ఈ ఇతివృత్తనిర్వహణకు సంబంధించి – భారతీయ నాట్యశాస్త్రం నాటక రచయితలకు క్రమబద్ధమైన నిర్మాణాన్ని సూచిస్తుంది. చాలా చిన్న ఇతివృత్తాన్ని ఎంచుకుని దానిని క్రమపద్ధతిలో పెంచుకుంటూ పోవడం ఈ నియమాల లక్షణమూ, లక్ష్యమూ కూడా. స్థూలంగా ఐదు అర్థప్రకృతులను – ఐదు సంధుల ద్వారా – ఐదు అవస్థలకు చేర్చడమే ఇతివృత్త నిర్వహణ.

1) అర్థప్రకృతులు అంటే – ప్రయోజనసిద్ధిహేతువులు. ప్రతి నాటకానికి ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం సిద్ధించడానికి పాత్రల ద్వారా కవి కొన్ని హేతువులను కల్పిస్తాడు. అవి స్థూలంగా ఐదు రకాలు -
బీజము – విత్తు. తొలుదొల్త చిన్నగా మొదలై, అనేకప్రకారాలుగా విస్తరించే హేతువిశేషం.
బిందువు – నూనెచుక్క నీటితలం పైన పడగానే అన్ని వైపులకు విస్తరిస్తుంది కదా. అలా ప్రధానకథలో భాగమైన ఒక కథాంశం పూర్తి కాగానే మరొక కార్యం ఘటించి అవిచ్ఛేదంగా విస్తరించే హేతుకారణాన్ని బిందువు అంటారు.
పతాక – ప్రధానకథకు దోహదపడే అవాంతరకథ. రామాయణంలో జటాయువృత్తాంతం లాంటిది.
ప్రకరీ – ప్రధాన కథకు దోహదపడే పెద్దదైన అవాంతరకథ. ఉదా: రామాయణంలో సుగ్రీవుని కథ.
కార్యము – ధర్మార్థకామములకు దోహదమైన ఫలకారణము.

2) హేతువుద్వారా సంక్రమించే ఫలితం అవస్థ. ఇవీ ఐదు విధాలు.
ఆరంభము – ఔత్సుక్యమాత్రమారంభము. (సంకల్పించుకోవడం)
యత్నము – అనుకొన్న పని త్వరితంగా చేయడానికి చేసే ఉపాయవిశేషము.
ప్రాప్త్యాశ – ఉపాయము, అపాయశంకా కలిగిన అనిశ్చితఫలప్రాప్తి.
నియతాప్తి – అపాయ అభావమైన నిశ్చయఫలప్రాప్తి.
ఫలాగమము – సమగ్రఫలసంపత్తి.

హేతువు(1) —-> ఫలము(2). వీటిని కలపడానికి ఉపయోగించే సంవిధానం సంధి.
3)ఈ సంధులు ఐదు.
ముఖసంధి – బీజసముత్పత్తి, నానార్థరససంభవయోగం
ప్రతిముఖ సంధి – కనీ కనబడకుండా బీజం ప్రకాశించడం
గర్భసంధి – అదివరకు ప్రకాశమైన బీజం ప్రకాశమై, లాభనష్టాలు పొందౌట, వాటి అన్వేషణ
అవమర్శసంధి – అదివరకు జరిగిన బీజార్థంలో నష్టాన్ని పరిహరించడం కోసం చేసే పర్యాలోచన
నిర్వహణ (ఉపసంహృతి) సంధి – చెదిరి ఉన్న బీజార్థాలను ఒక చోట చేర్చుట.

బీజం —ముఖసంధి— ఆరంభము
బిందువు — ప్రతిముఖసంధి— యత్నము
పతాక — గర్భసంధి — ప్రాప్త్యాశ
ప్రకరీ — అవమర్శసంధి — నియతాప్తి
కార్యము — నిర్వహణసంధి — ఫలాగమము

సంధులకు ఒక్కొక్కదానికి సంధ్యంగాలు ఉన్నాయి. విస్తృతంగా ఉన్న ఈ విషయాలను ఇక్కడ చర్చించడం లేదు. భరతముని నిర్దేశం ప్రకారం – ఇతివృత్తం సామాన్యమైనదైనా, సంధినిర్వహణ సక్రమంగా ఉంటే నాటకం రక్తికడుతుంది.

***

బీజం —ముఖసంధి— ఆరంభము

పై సమీకరణానికి స్వప్నవాసవదత్తం ప్రకారం ఉదాహరణ ఇది:

1) పద్మావతిని వత్సరాజుకు కట్టబెట్టాలని యౌగంధరాయణుడు కల్పించిన వాసవదత్తాన్యాసం (వాసవదత్తను దాచడం) “బీజం”.
2) పద్మావతి ఆశ్రమరాక బీజసముత్పత్తి, నానార్థరససంభవమైన “ముఖసంధి”.
3) పద్మావతిని యౌగంధరాయణుడు చూసిన ఉత్సాహం “ఆరంభం”. (ఔత్సుక్యమాత్రమారంభః)

***

బీజాన్ని ముఖసంధి ద్వారా ఆరంభమనే అవస్థకు చేర్చడం మొదటి అంకంలో జరిగింది. ఇలాగే మిగిలిన అర్థప్రకృతులను, అవస్థలనూ నాటకంలో కలపడం జరుగుతుంది.

నిర్వహణసంధిలో అద్భుతరసం నిర్వహించాలని భరతముని ఆదేశం. చివరి అంకంలో వత్సరాజుకు వాసవదత్త బ్రతికి ఉందన్న విషయం తెలియడం, మంత్రి యౌగంధరాయణుడు వత్సరాజుకై సంకల్పించిన పద్మావతి అన్న కన్యాలాభ ప్రాప్తి యొక్క పరిపూర్ణానందమనే బీజార్థము – చివరి అంకంలో వస్తుంది. అవంతిక అనబడే వాసవదత్త గురించి పద్మావతి చెప్పగానే వత్సరాజు ఇలా అంటాడు.

“కథమ్? మహాసేనపుత్రీ! దేవి! ప్రవిశత్యభ్యన్తరం పద్మావత్యా సహ – ఎట్టూ? మహాసేనపుత్రి వాసవదత్తా! దేవి! పద్మావతితో సహా అభ్యన్తర మందిరానికి రమ్ము”

వాసవదత్తా! అన్న తర్వాత దేవి అనడం తత్తరపాటు. అభ్యన్తరమందిరప్రవేశం – ఇదివరకే సన్నివేశనిర్వహణలో చర్చించబడింది. మరణించిన ప్రియురాలు బ్రతికే ఉందన్న నిజం, అదీ రాజ్యం దక్కిన తర్వాత జరిగే ఆనందకరఘట్టంలో తెలియడం – అద్భుతరసావిష్కరణ. ఇక్కడ రాజు ఉద్వేగంతో కూడిన ఉత్సాహం స్థాయీభావం. వాసవదత్త – విభావం. తత్తరపాటు – అనుభావం.

***

ముగింపు:
———-
నాటకానుశీలనం – అంటే ఒక ఆనందకరమైన అనుభూతిని పొందే ప్రయత్నం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. ఇది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక సంస్కారం, సాంప్రదాయాల సమ్యగనుశీలనం. తద్వారా అంతర్ముఖంగానూ, బహిర్ముఖంగానూ ఏర్పడే సమ్యగవగాహన. కళారూపాలను, సంస్కారవంతమైన సాహిత్యాన్ని అనుశీలనం చేస్తున్న కొద్దీ వ్యక్తికి ఆ సాహిత్యాంతర్గతమైన సంస్కారం తనకు తెలియకుండా అలవడుతూ పోతుంది. ఈ సంస్కారపు అభివృద్ధిని బయటకు కనిపించకుండా అలవోకగా, గుంభనగా నిర్వహించే కాంతాసమ్మితాలలో దృశ్యకావ్యాలు ప్రధానమైనవి. ఆ దృశ్యకావ్యాకాశంలో భాసుడు ఉజ్జ్వలంగా భాసించే భాస్కరుడు భాసుడు. మహాకవి భాసమైన రచన స్వప్నవాసవదత్తమ్. ఈ కావ్యానుశీలనం ద్వారా ప్రకటించిన ఈ వ్యాసంలో మంచి ఏ కొంచెమైనా గ్రహించే సహృదయులయిన పాఠకులకు నమ్రతాపూర్వకమైన ప్రణామాలు.