వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ
అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని
గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…
స్వప్నసంచారాల నిదురవేళల్లో
కొబ్బరాకుల చివుళ్ళపై
రేపటి కలల్ని పేరుస్తుంటాయి..
పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం…
నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు…
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ…
మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!
అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…
అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!
కానీ..
నైరాశ్యపు క్షణాలు కొన్ని
అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా
చుట్టుముట్టునప్పుడు మాత్రం…..
శీతాకాలపు సాయంకాలాలలో
నిశ్శబ్దపు వాగుమీద
వంతెనొకటి పేర్చాలన్నా…
లోపలా.. బయటా..
తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని
దారిమళ్ళించాలన్నా…
అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగులుతుంది!
గుప్పెడన్ని అక్షరాలు ఎన్నెన్నో అనుభూతులని ఆవిష్కరించగలిగినా,భాషకందని ఎన్నో భావాలని మౌనమే కమ్యూనికేట్ చేయగలదు. చాలా మంచి కవిత నిషీ కవిత్వం అర్థం కాని నాలాంటి పామరులకి కూడా అర్థమయ్యే రచనా శైలి మీ సొంతం. రెగ్యులర్ గా రాస్తూ ఉండండి, ప్లీజ్.
nishiji, i second mahek gaaru keep writing !
బాగుంది
నది నడిచినట్టు సాగింది కవత!
తెలిసిన అక్షరాలు గుప్పెడే అన్నారు, మరి అంత భావాన్నెలా “అక్షరాలు అదృశ్యమైన భాష”లోనొ పదాలలో పొదిగారు?
అద్భుతంగా ఉంది.
అద్భుతంగా ఉంది
ధన్యవాదాలు – మహెక్ గారు, తృష్ణ, కొత్తపాళీ గారు, భాస్కర్!
మహెక్ గారు, నేను ఎక్కువ రాయాలంటే ఎక్కువ మౌనంగా ఉండాలండి.. అదేమో అస్సలు చాతకాని పని! అక్కడొస్తోంది సమస్య
Nishigandha garu,
“స్వప్నసంచారాల నిదురవేళ; పొగమంచుని తాకిన పొద్దుటెండలోని మెత్తదనం; తుంపులు తుంపుల జ్ఞాపకాలు; మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి నింపాదిగా ప్రవహించే భావాలు”
మీ కవితా సామగ్రి చాలా బాగుంది. There is no wonder they give form to your experiences.
But I expected a twist (contrast) when you started the second part of your poem with కానీ…
with best regards
నిషి గారు,కవితలన్నా,కవులన్నా పెద్దగా ఆసక్తి లేని నేను క్రమంతప్పక చదివే అతికొద్దిమంది లో మీరొకరు!!మీవి కొన్ని నేను నాడైరి లో రాసుకున్నాకూడా.అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగలడం అద్భుతం!!ఇది ఎన్నోసార్లు అనుభవైకవేద్యమే..అభినందనలు మీకు.
Just beautiful, Nishi!