కవిత్వం

మనిషికి అటువైపు

డిసెంబర్ 2014

Otherness of others
Otherness of self
మనుషుల ముఖాలనూ పార్శ్వాలనూ తెలుసుకోవడం నిజంగా కష్టమే
చాలాసార్లు మనింట్లోనే మనం అపరిచితులం కావడం
మనకు మనమే పరిచయం లేకపోవడం
తెలుస్తుంది మనకు.

లోపల “సారంగి” తీగలపై ఒక విషాద స్వరం వినబడి
దిగంతాల అవతలికి తరుముతుంది.
చుట్టూ దట్టంగా పొగమంచు
ఏ దారీ కనబడదు.
అడుగులను ధరించి బయటికి వెళ్ళినవాణ్ణి ప్రతిరోజూ ధ్వంసమై వస్తున్నాను ఇంటికి
అంతా శిథిల బీభత్సమే
మళ్ళీ మళ్ళీ ప్రతిరోజూ దారులను వెదుక్కోవడమే
పునర్నిర్మాణం..
నన్ను నేను ప్రతిదినం ఎన్నిసార్లని పునః పునః నిర్మించుకోవాలి?!

కూలిపోవడం, మళ్ళీ ప్రాకి ప్రాకి లేచి నిటారుగా నిలబడడం
Man within man, man without man
ఒంటరి నడక
ఎదురుగా ఒక లోహపు గుర్రం- కదలదు, కదిలించదు
కాని ఏదో కదుల్తున్నట్టు భ్రాంతి.
నిన్న రావిచెట్టుకింద ఆమె
తన కడుపులోని బిడ్డతో తనే సంభాషిస్తున్న దృశ్యం
ఒక తెగిపడే స్వప్న శకలమా?
దేహం ఆత్మను విడిచి గాలిలో ఎగిరిపోతున్న గులాబి రేకు పరిమళమెక్కడ?!
వెదకాలి
కాలాన్ని ఛేదించుకుంటూ
కాలంనుండి విడివడ్తూ
కాలంలో కలిసిపోతూ..
చివరికి కొన్ని పాదముద్రలు బురదలో.

కొలనులో చందమామ
అగ్నిపర్వతంలో మరిగే లావా
జీవితం అంతిమంగా ఉత్సవమో ఉత్సర్గమో అర్థంకాదు
విభాజ్యం తప్పనపుడు, నిసర్గానుభవం దిక్కే చివరి చూపు
ఆరిపోయిన కొలిమిలో సశేషామంతా బూడిదే
అంతా భస్మ వైభవం
అవశేషాల అనుశీలనా, అవక్షేపాల పరిశోధనా తప్పితే మిగిలిందేమిటి?

దేన్నైనా
ఎప్పుడు ప్రారంభించాలో తెలియాలి
అంతకంటే ముఖ్యం
సమయోచితంగా
ఎలా ముగించాలో తెలియాలి
గ్రహించు- అస్తమించని సూర్యుడు మళ్ళీ ఉదయించడు
ఇతరులయొక్క ఇతరాన్ని తెలుసుకోవడం అంటే ఇదే.