రాత్రితో రమించిన కాలం చందమామకి అమ్మవుతూ
పగటిని ప్రసవిస్తూ నెత్తుటి ముద్దలా సూర్యుడు
మబ్బుల్లోంచి చినుకుల్ని పొదుగుతున్న ఆకాశం
పక్షుల గుంపుల్ని మోస్తూ బరువైన గాలి గర్భం
నేల తల్లి వొడిలో ఆటలాడుతూ పచ్చని పాపాయిలు
చెంగెగరేసుకుంటూ చెంగు చెంగున దూకుతున్న నది
వేళ్ళ మునివేళ్ళ మీద చెట్టు తపస్సు
కొమ్మల జేబుల్లోంచి తొంగి చూస్తున్న పసరు కాయలు
పురిటి నొప్పుల సుగంధాల్ని మింగుతూ మొగ్గ
తుమ్మెదలకి చనుబాలనిస్తూ తన్మయత్వంలో పూలు
మంచు గొడుగు కింద ముడుచుకున్న పర్వతం
ఇసుకతో నలుచుకుని స్నానమాడుతూ సముద్రం
మట్టి పెదాలని పారిజాతాలతో ముద్దాడుతున్న తొలి పొద్దు
కొబ్బరాకుల జారుడు బల్ల మీద సాయంత్రం
బండరాళ్ళని వాయిస్తూ అలల పియానిస్ట్
భూమినీ ఆకాశాన్నీ కలిపి కుడుతున్న దిక్కుల దారం
పసితనంలో పొర్లాడుతూ పడుచుదనాన్ని పరిచి పెడుతూ
ప్రతీ క్షణం సజీవ కావ్యమవుతున్న ప్రకృతి
గడ్డకట్టిన ముసలి భావాల్లోంచి అక్షరాల్ని స్రవించలేక
కాగితాల తెల్లదనం మీద ఖాళీగా నిండుతూ నేను నా కలం
సాయికిరణ్ గారు మీ కవిత్వం ఎప్పుడూ కుతూహలమే నాకు,ఎంతో కొత్తదనం అక్షరం అక్షరంలో మీ సొంతం.అందంగా పరిమళిస్తున్న కవిత్వం మీది.అనుభవాలన్నీ మంచు వానలా రాసారు.కంగ్రాట్స్ సాయికిరణ్.
సాయి కిరణ్ గారూ ….! ఎక్కడ ఎక్కువ బాగుందో చెప్పటం …చాలా కష్టమండీ—-ఏ మని చెప్పాలో తెలియనంత ‘బా….గా’వ్రాసేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు సుమండీ! మీకు నా అభినందనలు. ఇలాగే—అనేకానేక కవితలు వ్రాసేయండి!