ముఖాముఖం

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

జనవరి 2015


సుప్రసిధ్ధ స్త్రీవాద రచయిత్రి, కార్యకర్త, విమర్శకులు, పరిశోధకులు, తెలుగు ఆచార్యులు కాత్యాయనీ విద్మహే గారితో దాసరి అమరేంద్ర గారు జరిపిన ఇంటర్వ్యూ. స్త్రీల సాహిత్య అధ్యయనం గురించీ, తన నేపథ్యం గురించీ, మూడు దశాబ్దాల సాహిత్య కృషి గురించీ, విమర్శా ప్రక్రియ గురించీ, కాత్యాయని గారు చెప్పిన వివరాలు- వాకిలి పాఠకులకోసం…

Q: 2013 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు కదా, మీ మనోభావాలు?

“ సాహిత్యాకాశంలో సగం “ అన్న నా ఇరవై ఎనిమిది వ్యాసాల సంపుటికి ఈ బహుమతి వచ్చింది. స్త్రీల సాహిత్య అధ్యయన అవసరాన్ని, పధ్ధతిని, ప్రయోజనాన్ని వివరించే వ్యాసాలతోపాటు, కొండేపూడి నిర్మల, విమల, ఘంటశాల నిర్మల లాంటివాళ్ళ కవిత్వం గురించీ, రంగనాయకమ్మ, సత్యవతి, నల్లూరి రుక్మిణి లాంటివాళ్ళ కథల గురించీ విశ్లేషణలు నా పుస్తకంలో ఉన్నాయి. దీనికి అవార్డు రావడం అన్నది తెలుగులో స్త్రీల సాహిత్యానికి వచ్చిన గుర్తింపుగా నేను భావిస్తాను. ‘స్త్రీల సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది’ అన్న స్పృహ జాతీయస్థాయిలో కూడా కొరవడిన సమయంలో ఈ అవార్డు ఆ అవసరానికి ఒక గుర్తింపు, ఒక ముందడుగు. ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన గుర్తింపు అనుకోను. తెలుగు రచయిత్రులందరి ఆవేదనలూ, ఆకాంక్షలూ, అస్తిత్వ చైతన్యాలూ జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించడం అన్న సంగతి వల్ల ఈ అవార్డు నాకు చాలా సంతోషం కలిగిస్తోంది.

Q: మీ నేపథ్యం, చిన్నతనం, చదువు, ఉద్యోగం గురించి చెప్పండి?

పుట్టింది మైలవరంలో అయినా పెరిగిందీ, చదువుకున్నదీ, ఉద్యోగం చేస్తున్నదీ, సామాజిక సాహిత్య రంగాలలో పని చేస్తున్నదీ వరంగల్లును వేదికగా చేసుకునే. దాదాపు జీవితమంతా ఇక్కడే గడిచింది.

నాన్న కేతవరపు రామకోటి శాస్త్రి సాహితీవేత్త, విద్యావేత్త. ఇంట్లో సాహితీ వాతావరణం పుష్కలంగా ఉండేది. దాని ప్రభావం వల్ల బియ్యే లో ఎకనామిక్స్ తీసుకునే అవకాశం ఉండికూడా, తెలుగునే ఎంచుకున్నాను. ఆ తర్వాత తెలుగు ఎమ్మే. ఇంకా ముందుకువెళ్ళి , కోవెల సుప్రసన్నాచార్య గారి పర్యవేక్షణలో ‘ చివరకు మిగిలేది’ నవల మీద డాక్టరేటు. 1978 లో వరంగల్లు ఆర్ట్స్ కాలేజీలో తెలుగు లెక్చెరర్ గా చేరాను. ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్నాను.

Q: సాహిత్యంతో మీ పరిచయం ఎప్పుడు మొదలయింది?

బాగా చిన్నప్పట్నించీ! నాన్న ప్రభావం ఎలానూ ఉంది- అమ్మ ఇందిరాదేవి కూడా బాగా చదివేది. సాంఘిక నవలలు, పత్రికల్లో సీరియళ్ళు – అన్నీ చదివేది. ఆ అలవాటు నాకూ సహజంగానే చిన్నప్పటి నుంచీ ఏర్పడింది. ఆరోక్లాసులో ఉన్నప్పుడు చదివిన ‘ ఏటి ఒడ్డున నీటిపూలు ‘ నవల నా మనసుకు బాగా హత్తుకుపోయింది. ఆ తర్వాత రంగనాయకమ్మ స్వీట్ హోం, బలిపీఠం, ద్వివేదుల విశాలాక్షి నవలలు, మరో పక్క యద్దనపూడి సెక్రెటరీ, మీనా, జీవనతరంగాలు… టీనేజ్ లో నన్ను బాగా ప్రభావితం చేసిన రచనలవి.

ఇహ కవిత్వం దగ్గరకు వస్తే బియ్యే లో క్లాసికల్ కవిత్వం చదువుకున్నాను. ఎమ్మేలో ఆధునిక కవిత్వం – రాయప్రోలు, విశ్వనాథ, శ్రీశ్రీ, ఆరుద్ర పరిచయం.
ఎమ్మేలో అప్పుడే మొదటిసారిగా “నవల “ ను ఆప్షనల్ సబ్జెక్టు గా పెట్టారు, తీసుకున్నాను. నవలతో అలా ఏర్పడిన నా అనుబంధం పీఎచ్ డీ లో అదే నా విషయమవడానికి దారి తీసింది.

Q: సాహితీ ఉద్యమాల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది? రచయితగా మీ ప్రయాణం ఎలా సాగింది?

ఎమ్మే ముగిసేదాకా నాకు సాహిత్యంతో తప్ప ఉద్యమాలతోనూ, రాజకీయాలతోనూ పరిచయం లేదు. అవగాహన అసలే లేదు. చెప్పాగదా 1978 లో ఆర్ట్స్ కాలేజీలో లెక్చెరర్ గా చేరాను. అది సామాజికంగా, రాజకీయంగా వరంగల్లు ఎంతో చైతన్యవంతమూ, క్రియాశీలమూ అయిన సమయం. పాఠాలు చెపుతున్నపుడు విద్యార్ధులు కొత్త కొత్త ప్రశ్నలు వేసేవారు. సాహిత్యాన్ని కొత్త కొత్త కోణాల్లోంచి చూసేవారు. అది నాకు అర్ధమయ్యేది కాదు. సమాధానాలు తోచేవి కావు. అయినా సమాధానాలు వెదికే క్రమంలో, కాలేజీ లైబ్రరీలో వాటికి సంబంధించిన పుస్తకాలు వెదికి..వెదికి.. చదివాను. అధ్యయనం చేశాను. ఐరోపా దేశాల చరిత్ర , ఆర్ధిక శాస్త్ర మూలసూత్రాలు – ఇలాంటి పుస్తకాలను శ్రధ్ధగా చదివాక మనిషి మనుగడ, చరిత్ర, మానవ సంబంధాలు, సమాజం, జీవితాన్ని నడిపించే శక్తులు – వీటిమీద ఒక అవగాహన కలిగింది. ఆ తర్వాత “కాపిటల్ “ చదివాను. రష్యన్ ఎకనామిక్స్ చదివాను. “ అదనపు విలువ సిధ్ధాంతం” తో పరిచయం నా ప్రాపంచిక అవగాహనలో ముఖ్యమైన మలుపు.

చిన్నప్పట్నించీ చదివే అలవాటుతోపాటు రాయాలన్న కోరికా బాగా ఉండేది. ‘72 లో బంగ్లాదేశ్ యుధ్ధం నేపథ్యంలో “ దేశంకోసం “ అనే కథ రాసాను. బియ్యేలో ఉండగా మరో నలుగురు స్నేహితురాళ్ళూ, ఒకరిద్దరు టీచర్ల ప్రభావంతో “ స్నేహం “ అన్న నవలా రాసాను. అంతకు ముందే నాన్న సలహా మీద “ మనోవాణి “ అన్న లిఖిత పత్రిక నడిపాను. బియ్యే రోజుల్లోనే కవిత్వమూ రాసాను. 1976 లో విశ్వనాథ వారి “ సహస్ర చంద్ర దర్శనం “ సందర్భంగా విజయవాడలో జరిగిన సెమినార్లో “ గిరి కుమారుని గీతాలు “ మీద ఆయన సమక్షంలోనే ఓ విమర్శా వ్యాసం చదివాను. కానీ 1978-80 ల మధ్య నా సామాజిక, రాజకీయ అవగాహన స్పష్టమవసాగింది. జీవితమూ, సాహిత్యమూ వేరు వేరు కావని అర్ధమయింది. సమాజాన్ని విశ్లేషించడానికి నాకున్న ఏకైక ఆయుధం సాహిత్యం అని స్ఫురించింది. దాన్ని విరివిగా వాడుకోవాలనుకున్నాను. అప్పటికే నాకు భావజాలపరంగా సన్నిహితులు అయిన జ్యోతిరాణి, శోభ, సీతారామారావు, జనార్దన్, బుర్రారాములు, పాపిరెడ్డి, మురళీమనోహర్ సర్ , శివరామకృష్ణ సర్ , గిరిజారాణి, విద్యారాణి – అందరం కలిసి 1982లో “ స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ “ ఏర్పాటు చేసుకొని పని ప్రారంభించాం. అందులో భాగం గానే మా మా పరిశోధనలను స్త్రీల సమస్యల మీదే కేంద్రీకరించాలనీ, ఎవరు ఏ సెమినార్ కి వెళ్ళినా , స్త్రీల సమస్యల పైనే రాయాలనీ, మాట్లాడాలనీ అనుకొన్నాం. అప్పట్నించీ నా అధ్యయనం, కృషీ – స్త్రీల సాహిత్యం మీదా, తెలుగు సాహిత్యం లో స్త్రీల స్థానం మీదా కేంద్రీకృతమయింది. ఇప్పటికీ ఆ ఒరవడిలోనే సాగుతోంది. ఇప్పటిదాకా పంథొమ్మిది పుస్తకాలు తీసుకువచ్చాను. మరో ఇరవైఆరు పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యత వహించాను.

Q: స్త్రీల సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, స్త్రీవాదం – ఇలాటివాటిమీద మీ అవగాహన?

స్త్రీ తనను తాను “ తెలుసుకోవడం “ కోసం చేసే బహుముఖ అన్వేషణలో స్త్రీవాద సాహిత్యం ఒక ముఖ్యమైన అంశం. కీలకమైన అంశం కూడానూ. స్త్రీ పురుషుల మధ్య ఉన్న లైంగిక కౌటుంబిక సామాజిక సంబంధాలనూ, సాంస్కృతిక విలువలనూ – స్త్రీ అవసరాలూ-ప్రయోజనాలూ అన్న దృక్కోణం నుంచి చూసి వ్యాఖ్యానించే తాత్విక దృక్ఫధమే స్త్రీవాదం అని నేను నమ్మాను. ప్రధాన సామాజిక స్రవంతిలో , అభివృధ్ధి క్రమంలో స్త్రీలను ప్రవేశపెట్టడం; స్త్రీల ఆలోచనలూ, అభిప్రాయాలూ, క్రియాశీలక భాగస్వామ్యాల సాయంతో సామాజిక వ్యవస్థను స్త్రీలపట్ల స్నేహంగా, ప్రజాస్వామిక స్వభావంతో ఉండేలా చెయ్యడం అన్నది – స్త్రీవాదానికి ఉన్న ఒకే ఒక్క కార్యక్రమం అని భావించాను. నాకున్న సాహితీశక్తిని ఈ లక్ష్యసాధన దిశగా వినియోగించాను.

Q: గత నాలుగయిదు వందల సంవత్సరాలలో తెలుగులో స్త్రీసాహిత్యం ఎలాటి పరిణామాలు చెందింది?

మధ్య యుగాలనాటి తెలుగు స్త్రీలకు రాయడమన్నదే ఓ సాహస కృత్యం. పదిహేనో శతాబ్దం నుంచీ స్త్రీలు రాస్తోన్న దాఖలాలు ఉన్నా, వెదికితే పంథొమ్మిదో శతాబ్దం వరకూ – ఆ నాలుగు వందల ఏళ్ళలో పట్టుమని పదిమంది కూడా కనిపించరు. వాళ్ళల్లోనే బెదురు బెదురుగా తమ తమ రచనలను పదిమంది ముందూ ఒదిగి ఒదిగి ఉంచినవాళ్ళు ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో రాసిన మొల్ల, తన రామాయణాన్ని రాజసభలో వినిపించడానికి నానా ప్రయత్నాలూ చేయవలసివచ్చింది. తరిగొండ వెంగమాంబ వితంతువుగా వివక్షతను చవి చూసింది. రంగాజమ్మ, ముద్దుపళని లాంటివాళ్ళు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా రాయ గలిగారు.

పంథొమ్మిదో శతాబ్దం చివరి రోజులూ, ఇరవయ్యో శతాబ్దం తొలిరోజులూ చూస్తే కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, బత్తుల కామాక్షమ్మ, బండారు అచ్చమాంబ, నాళం సుశీలమ్మ లాంటి రచయిత్రులు కనిపిస్తారు. ఆ ఒరవడి కొనసాగి ఇరవయ్యో దశాబ్దపు ప్రధమార్ధంలో అనేకానేక మహిళలు కథలూ, కవిత్వం, వ్యాసాలూ రాయడం కనిపిస్తుంది. స్త్రీల పత్రికలు రావడం కనిపిస్తుంది. స్త్రీ విద్య, పాతివ్రత్యం, జాతీయ ఉద్యమం – ఆ కాలపు ప్రధాన వస్తువులు. అదో మిశ్రమ చైతన్యం.

పంథొమ్మిది వందల ఏభైలనాటికి స్త్రీలు విరివిగా రాయడం మొదలయింది. కుటుంబజీవితాలనూ, విలువలనూ చిత్రీకరించే నవలలే అయినా – రాయడమన్నది స్త్రీలకు బాగా అలవడిన దశ ఇది. స్త్రీల వ్యక్తిత్వం గురించీ, అస్తిత్వం గురించీ రాయడం మొదలయింది. సులోచనారాణి నవలలు కొన్నింటిలోకూడా ఈ స్పృహ కనిపిస్తుంది. “కాలాతీత వ్యక్తులు, అవతలి గట్టు, స్వీట్ హోం “ లాంటి నవలలు ఈ దశలో రావడం యాధృఛ్ఛికం కానేకాదు. ఆనాటి రచనలలో స్త్రీల సమస్యల మీద అవగాహనా, స్పృహా, కుటుంబ వ్యవస్థలోని అసమానతల మీద నిరసనా ఉంది. ఈ స్పృహా,అవగాహనా, నిరసనా, తరువాతి స్త్రీవాద సాహిత్యానికి భూమిక అయింది. 70 వ దశకం ముగిసేసరికి ఆ స్పృహ చైతన్య స్థాయికి చేరింది. ఎనభైల చివరికల్లా అది స్త్రీవాద సాహిత్య ఉద్యమంగా రూపు దిద్దుకొంది.

మొదట్లో స్త్రీవాద రచయితలు తమ గురించీ, తమతమ శరీరాలగురించీ మాత్రమే రాసారుగానీ , ఆ తర్వాత వచ్చిన నూతన ఆర్ధిక విధానాలూ, ప్రపంచీకరణా, బాబ్రీ మసీదూ, స్త్రీల రచనా పరిధి విస్తరిల్లేలా చేశాయి. ఆయా పరిణామాలు స్త్రీల స్థితిగతులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో విప్పిచెప్పే రచనలు వచ్చాయి. మతమూ, దళితత్వమూ స్త్రీలను ఎలా అదనపు వివక్షకు గురిచేస్తున్నాయో – ఆ వివరాలు రాసే స్త్రీలూ ముందుకొచ్చారు.

చల్లపల్లి స్వరూపారాణి, షాజహానా,సుభద్ర, శ్యామల లాంటివాళ్ళు తమతమ రచనల్లో కొత్త కోణాలు ఆవిష్కరించారు. కానీ ఒక్క మాట- మార్క్సీయ స్త్రీవాద భూమిక ఉన్నప్పుడు ఈ కొత్తకోణాలు కొంత ముందూ వెనుకలుగా అయినా మనకు తెలిసివస్తాయి. వాటిని స్వీకరించే ప్రజాస్వామిక దృక్పధం అలవడుతుంది. నా విషయంలో అదే జరిగింది.

Q: కొందరు ప్రతిభావంతులైన సమకాలీన మహిళలు.. “మేం స్త్రీవాదులం కాదు. మానవత మాకు ముఖ్యం, ఒకే మూసలో బంధింపబడడానికి మేము ఇష్టపడం..” అంటున్నారు. మీ అభిప్రాయం?

ఈ ధోరణిని రెండు మూడు విధాలుగా అర్ధం చేసికోవచ్చు. ప్రతిభ ఉన్నా జెండర్ విషయాలమీద సామాజిక, చారిత్రిక స్పష్టత లేకపోవడం ఒక కారణం. ఆ అవగాహన పుష్కలంగా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలలో సమాజం స్త్రీవాదుల మీద చేస్తోన్న దాడి, దండయాత్రలకూ, విపరీత వ్యాఖ్యలకూ భయపడడం మరో కారణం. ఇదే కాకుండా “ అందరి ఆమోదం “ తమ ఎజెండా అయినపుడూ, అన్ని ప్రయోజనాలూ కావాలనుకొన్నప్పుడూ ఇలాంటి మాటలు వినిపిస్తాయి. ఏది ఏమయినా “ నేను ఏమీ గాను “ అనడం ఒక పెద్ద అబధ్ధం. చాలా ప్రమాదకరం కూడానూ!

Q: స్త్రీవాదం పెట్టుబడిదారుల కుట్ర, వామపక్ష స్ఫూర్తికి వ్యతిరేకం- అన్న అభిప్రాయం ఉందికదా?! మీరేమంటారు? 

ఒకప్పుడు ఉండేది. అది తొంభైలనాటి మాట. అది పూర్తిగా పాక్షికమైన అభిప్రాయం. క్రమక్రమంగా ఆ అభిప్రాయాన్ని వాళ్ళే సవరించుకొన్నారు.
నిజానికి వ్యక్తులు స్త్రీవాదులయ్యాక వారికి మార్క్సిజాన్ని అర్ధం చేసికొనే అవకాశం మెరుగుబడుతుంది. పేదలు, స్త్రీలు, దళితులు ఎవరి ఉద్యమాలు వాళ్ళే నడుపుకోవాలి. కానీ అవసరమయినపుడు , అంతా కలవగలగాలి. సమన్యాయం కోసమే పోరాడుతున్నపుడు ఇలాంటి సమన్వయం సులభసాధ్యం.

Q: మన స్త్రీవాద సాహిత్యం సాధించిన విజయాలు?

స్త్రీలలో స్పృహ, చైతన్యం, ఆత్మవిశ్వాసం, నిర్భీతి, నమ్మినదానికోసం నిలబడే శక్తి, సమిష్టికృషిమీద గురి. స్త్రీల రచనల్లో వస్తు విస్తృతి పెరగడం. అలానే సమాజంలో జెండర్ స్పృహ పెరగడం, స్త్రీపురుష అంతరాలు తగ్గించడంలో సఫలత.

నిజమే. ఈ ఫలాలన్నీ మధ్యతరగతికే అందాయి అని మనకు స్థూలంగా అనిపించవచ్చు. కానీ వాటి ప్రభావం ఒక్క మధ్యతరగతికే పరిమితం అయిందని నేను అనుకోను. పరోక్ష ప్రభావాలనూ లెక్కలోకి తీసుకోవాలిగదా.. అంచేత స్త్రీవాదం సాధించిన విజయాలను తక్కువ చేసి చూడనక్కర్లేదు. ప్రత్యక్ష ప్రయోజనాలు పొందిన మధ్యతరగతి మహిళలు కూడా ఆ అవగాహనా బలంతో “డీక్లాస్” అవవలసిన అవసరం ఉంది.

మా ‘ప్రజాస్వామ్య రచయితల వేదిక’ తరఫున, దళిత గిరిజన వర్గాల మహిళలలో కొత్త రచయితలను వెదికే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాం.

Q: స్త్రీల సాహిత్య అధ్యయన క్రమంలో మీరు విమర్శకురాలిగా పరిణమించారు. కానీ విమర్శ అంటే తప్పులు ఎత్తిచూపడం, లోటుపాట్లను చూపించి ‘మందలించడం’ అన్న ఒక అభిప్రాయం ఉందిగదా. విమర్శ ఎలా ఉండాలంటారు?

అది తప్పు. తిట్లూ మందలింపులూ విమర్శ కానే కాదు. కారణాలు ఏమైనా సామాన్య వ్యవహారంలో , విమర్శ విషయంలో ఈ భావన ప్రాచుర్యం పొందింది అన్నమాట నిజం. విమర్శ తిట్టుకు పర్యాయపదంగా పరిణమించింది.
నిజానికి విమర్శ అంటే వింగడించి చూడడం. ఒక రచనను అధ్యయనం చేసి- అది మంచిది అయితే ఎందుకు మంచిదో, లోపాలు ఉంటే ఆ లోపాలు ఏమిటో చెప్పడమే విమర్శ. అంతేగాకుండా, రచయిత చెప్పీచెప్పకుండా వదిలిన విషయాలను పట్టుకోగలగాలి. ఉదాహరణకు కారా గారి “ దీర్ఘసుమంగళి” అన్న కథ ఉంది. ఎలక్షన్లు, ఓటింగు, పోలింగుఆఫీసరు.. ఓ ఇల్లు..ఇల్లాలు.. మంచానబడిన భర్త… స్థూలంగా చూస్తే అది ఓ మామూలు ఎలక్షను కథ అనిపిస్తుంది. కొంచెం లోపలకి వెళ్ళగలిగితే .. మంచాన బడిన భర్తా, పోలింగుఆఫీసరూ నిర్వీర్యమైన కుటుంబవ్యవస్థకూ, రాజకీయ వ్యవస్థకూ ప్రతీకలని అర్ధం అవుతుంది. “ దీర్ఘసుమంగళీభవ“ అని ఆవిడను దీవించడంలో , ‘ఇదే వ్యవస్థ ఇలా కలకాలం కొనసాగుగాక’ అన్న ఆ పోలింగుఆఫీసరు ఆకాంక్ష తెలిసివస్తుంది. విమర్శకులు ఇలాటి కోణాలను ఆవిష్కరించగలగాలి. రచనల సాగరంలో ఈదగల గజఈతగాళ్ళుగా పరిణమించాలి….

Q: విమర్శకులకు ఎలాంటి అర్హతలు, లక్షణాలు ఉండాలి?

డిగ్రీలూ, పీఎచ్ డీలూ అత్యవసరమేంకాదు – ఉంటే మంచిదే. విమర్శకులు ముఖ్యంగా అధ్యయనశీలురు కావాలి. జీవితాన్ని అర్ధం చేసికోగలగాలి. ప్రపంచమంటే శాస్త్రీయ అవగాహన ఉండాలి.

చిత్తశుధ్ధితో ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసే రచయితల రచనల్లో ఒక “నిరసన ధ్వని” ఉంటుంది. తెలిసో తెలియకో , స్పష్టంగానో అస్పష్టంగానో తాను గమనిస్తోన్న సమాజంలోని అపసవ్యతలను సవ్యతలుగా మార్చే ప్రయత్నం చేస్తారు రచయితలు. విమర్శకులు ఆ ప్రయత్నాన్ని గ్రహించి గుర్తించగలగాలి, పట్టుకోగలగాలి. రచయితలు ఏ విలువలను ప్రశ్నించారు, ఏ విలువలను ప్రతిపాదించారు అన్న విషయం ఎత్తి చూపగలగాలి.

Q: పరిశోధన- విశ్లేషణ- విమర్శ.. వీటిలోని తేడాలు వివరిస్తారా?

పరిశోధనలో విషయ సేకరణ, దానిని ఓ పధ్ధతి ప్రకారం అమర్చడం, వర్గీకరణ చెయ్యడం, తీసుకున్న విషయాలకు ముందూ వెనక ఉన్న నేపథ్యాలను శోధించడం – ఇవి ముఖ్యం. దీంట్లో భౌతిక శ్రమ ఎక్కువ. అది ఒక్క మనం తీసుకునే రచనకూ, విషయానికి మాత్రమే పరిమితంగాదు.
విశ్లేషణ విమర్శ లో ఒక ముఖ్యమైన భాగం. ఇది రచననే కేంద్రంగా చేసుకుంటుంది. ఇది దృక్పధానికి సంబంధించింది.

విమర్శ పరిధి మరింత విస్తృతం. గుణదోషాలను ఎత్తి చూపడం, చెప్పీ చెప్పని విషయాలను వెలుగులోకి తీసుకురావడం, రచనలోని అంతః సూత్రాన్నీ, నిరసనధ్వనినీ , నిరసించే విలువలనూ , ప్రతిపాదించే విలువలనూ ,ఒడిసి పట్టుకోవడం విమర్శ లక్ష్యం.

Q: సమీక్ష, పీఠిక, ముందుమాట. వీటిగురించి?

ఇవి ముఖ్యంగా పరిశోధనకు ఉపయోగపడతాయి. ముందుమాటల్లో రచయిత విమర్శకులకు ఉపయోగపడే “ ఆధారాలు “ ఇచ్చే అవకాశం ఉంది. “ విమర్శకులకు పనికిరాని సమాచారమంటూ లేదు..” అంటారు బంగోరె.. నిజం.

Q: విమర్శలో మనస్సు పాత్ర ఎంత? మేధస్సు పాత్ర ఎంత?

విమర్శ అంటే అది పూర్తి మేధో ప్రక్రియ అన్న అభిప్రాయం ఉన్నమాట నిజమే. కానీ హృదయం పాత్ర లేదన్నది నిజం కాదు. అసలు మనకు నచ్చకుండా, ఏ రచనా విమర్శకూ పూనుకోంగదా! ముందు ఆ రచన మనస్సుకు హత్తుకోవాలి, మనస్సును కదిలించాలి. ఇప్పటిదాకా మనస్సుదే ముఖ్యపాత్ర. ఒకసారి ఆ కదిలించడమూ, హత్తుకోవడమూ జరిగాక అందుకు కారణాలు శోధించే ప్రయత్నంలో పడతాం. ఇక్కడ మేధస్సుకు పని పడుతుంది. అంచేత విమర్శలో మనస్సూమేధస్సులు – రెండింటి పాత్రా ఉంటుంది. పాళ్ళు వేరవవచ్చు.

Q: రచనను రచయిత దృక్కోణంనుంచి చూడాలా, విమర్శకుల దృక్కోణమా, తటస్థ దృక్కోణమా?

“ఏ రచననైనా రచయిత దృక్కోణంనుంచే చూడాలి, విమర్శించాలి” అన్న ధోరణికి సంప్రదాయవాదం పట్టం కడుతుంది. అలాగాకుండా విమర్శకుడి దృక్కోణంలోంచి మాత్రమే చూస్తే , ఆ రచన రాసినప్పటి కాలమాన పరిస్థితుల్నీ, నేపథ్యాన్నీ పట్టించుకోకుండా పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ పట్టించుకొంటూనే –పూర్తిగా రచయిత దృక్కోణాన్ని మాత్రమే ప్రతిబింబించకుండా, ఆ రచన బాగోగులూ, విలక్షణతలూ, విశిష్టతా ఎత్తిచూపించాలంటే, వస్తు నిష్ఠ, ఆబ్జెక్టివిటీ- చాలా అవసరం. నేను ఈ పధ్ధతినే నమ్ముతాను.

Q: మీ విమర్శా పధ్ధతి ఏమిటీ? విమర్శ కోసం రచనలను ఎలా ఎంచుకొంటారు?

నేను నా లక్ష్యపరిధిలోకి వచ్చిన అన్ని రచనలూ చదువుతాను. ముందు నాకు ఆయా రచనలు నచ్చాలి. విప్పిచెప్పవలసిన లోతులు కనిపించాలి. అది నా లక్ష్యం – స్త్రీల కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయడంతో ముడిపడి ఉండాలి. ఇహ అప్పుడు సంతోషంగా పనిలోపడతాను.

Q: మీరు మీ విమర్శల్లో వస్తువూ, ఇతివృత్తాల మీదే దృష్టి నిలుపుతారనీ, శైలీ, శిల్పం, భాష, పాత్రచిత్రణ లాంటివి స్పృశించరనే అపవాదు ఉంది. దానికి మీరేమంటారు?

నిజమే. నేను ప్రధానంగా వస్తువుమీదే కేంద్రీకరిస్తాను. నా మౌలికలక్ష్యం దృష్ట్యా చూస్తే వస్తువే నా విమర్శకు కేంద్రబిందువుగదా! అంతేగాకుండా వస్తుపరంగానే విశ్లేషించి విమర్శించవలసిన అంశాలూ కోణాలూ అనేకానేకం ఉన్నప్పుడు మిగిలిన అంశాలమీదకు నా దృష్టి వెళ్ళదు. శిల్పమూ శైలీ లాంటివి కూడా రచనకు ముఖ్యమే. అవే ఆయా రచనలను పాఠకులచేతా, విమర్శకులచేతా చదివింపజేస్తాయి. వీటిగురించీ మాట్లాడవచ్చు. ఉదాహరణకు ఒక రచనలో మాజిక్ రియలిజం వాడిన పక్షంలో దానివల్ల ఆరచనకు బలం చేకూరిందో లేదో చెప్పవచ్చు. అలాగే భాషా, పాత్ర చిత్రణల గురించి మాట్లాడవచ్చు. కానీ నా లక్ష్యసాధనలో ఈ అంశాలు అంతగా దోహదపడవు. అందుకే వస్తువుమీద నా ఏకాగ్రత. అయినా వస్తుగత అర్ధాన్ని ఆవిష్కరించే శిల్పం గురించి విశ్లేషణలో అవసరమయినప్పుడు ప్రస్తావించకుండా ఉండను.

Q: మార్క్సిష్టు విమర్శకురాలైన మీకు మత ఆధార తాత్వికతతో రాసిన రచనల విమర్శ ఇబ్బంది కలిగించలేదా?

మనుషులన్నాక అనేకానేక విశ్వాసాలు ఉంటాయి. అవి వ్యక్తిగతస్థాయిలో ఉన్నంతవరకూ భరించవచ్చు. దాన్ని సామాజికం, రాజకీయం చేసినప్పుడే అసలు సమస్య. అపుడు తప్పకుండా ఖండించవలసి ఉంటుంది. నేను విమర్శ చేసిన కొన్ని రచనల్లో మత తాత్వికతలు వ్యక్తిగత స్థాయిలో ఉన్నమాట నిజమే. కానీ ఆయా రచనల్లో అంతకంటే ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయిగాబట్టి వాటిల్ని ఎత్తిచూపడం మీదే నా దృష్టి నిలిపాను. ఇబ్బంది అంటూ ఏమీ కలగలేదు.

Q: ముందు ముందు మీ ప్రణాళికలు?

‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది. అది రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1900 నుండీ 2015 వరకూ రాసిన, రాస్తోన్న వారి కృషిని గ్రంధస్థం చెయ్యాలని నా సంకల్పం. ఇప్పటిదాకా 1950 వరకూ రాసిన ఐదారువందల స్త్రీరచయితల వివరాలు సేకరించాను. ఆ కృషి ఇంకా కొనసాగుతోంది. ఈ చరిత్ర కొన్ని సంపుటాలుగా వస్తుంది. మొదటి సంపుటి ఓ ఏడాదిలో తేవాలని నా ప్రయత్నం.

Q: మీ తరపున ఏమన్నా చెపుతారా?

మూడు దశాబ్దాలు పైబడిన నా సాహితీయానం నన్ను అడుగడుగునా ఆనందాలకూ ఆశ్చర్యాలకూ గురి చేసింది. కొత్త కొత్త ఆవిష్కరణలకు దారి తీసింది. ఎంతో సంతృప్తి కలిగించింది. నా లక్ష్యం వేపుకు నిరంతరంగా సాగిపోతున్నానన్న నమ్మకం నాకు కలిగించింది. మళ్ళా ఈ ప్రయాణంలోనే అడపాదడపా ఆహ్లాదం కలిగించే సంఘటనలు… నా పరిశోధనలో భాగంగా “ గృహలక్ష్మి “ పత్రికలో సుసర్ల లక్ష్మీనరసమాంబ అన్న ఆవిడ 1930-33 ప్రాంతంలో రాసిన రచనలు కొన్ని చదివాను. ఆకట్టుకొన్నాయి. కానీ ఆవిడ ఎవరో ఆ వివరాలు ఎక్కడా లేవు. ఇలాంటి సందర్భాల్లో – ఏ సభలూ, సమావేశాలకూ వెళ్ళినా , వారివారి పేర్లు చెప్పి “ మీలో వీరిగురించిన వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? “ అని అడుగుతూంటాను. ఒకోసారి వివరాలు తెలియడం, విషయం పరిష్కరింపబడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఓ సభలో సుసర్ల లక్ష్మీనరసమాంబ గారిగురించి అడిగాను. ఆ సభలో ఉన్న ఇంద్రగంటి జానకీబాలగారు “ ఆవిడ మా అమ్మగారే ..” అన్నారు. అది నన్నెంతో ఆనందానికీ, ఆశ్చర్యానికీ గురిచేసింది. మనకు తెలియని మన స్త్రీల సాహిత్య చరిత్ర రచనకు – మనం, అలెక్స్ హెయిలీ లాగా – మూలాలు తెలుసుకునే ప్రయత్నాలూ, పరిశోధనలు ఎన్నో చెయ్యాలి…

**** (*) ****4 Responses to ‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న కోరిక ఉంది.

 1. January 1, 2015 at 12:27 pm

  “తెలుగు రచయిత్రులందరి ఆవేదనలూ, ఆకాంక్షలూ, అస్తిత్వ చైతన్యాలూ జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించడం అన్న సంగతి వల్ల ఈ అవార్డు నాకు చాలా సంతోషం కలిగిస్తోంది.” ఇది ఆమె నిరాడంబరత. ఇంటర్వ్యూ చాలా బాగుంది.
  “దీర్ఘసుమంగళీభావ” నా? “మహదాశీర్వాదమా?” ఈ కధకు ఇంతకు ముందు ఇంకో పేరు ఉండేదా?

 2. January 1, 2015 at 5:17 pm

  బాగుంది.

 3. NS Murty
  January 1, 2015 at 10:36 pm

  కాత్యాయనీ విద్మహే గారూ,
  చాలా మంచి ప్రశ్నలకు అంతకంటే మంచి సమాధానాలు చెప్పేరు.
  ‘ఆధునిక స్త్రీ సాహిత్య సమగ్ర చరిత్ర’ రాయాలన్న మీ కోరిక ఫలవంతమవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నిజంగా ఒక epoch అవుతుందనడంలో సందేహం లేదు.
  అమరేంద్రగారికీ, మీకూ అభివాదములు

 4. MI
  October 9, 2015 at 10:06 pm

  తెలుగు వికీపీడియా పుటలో కేంద్ర సాహిత్య అకాడేమీ ప్రదానం గురించి ఇంకా చేర్చలేదెవరూ…

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)