వాడు చస్తుంటాడు
పుడుతుంటాడు
విసుగన్నదే తెలీకుండా
తన కన్నా హీనంగా
బ్రతికుండీ చనిపోయిన,
ప్రపంచాన్ని పట్టించుకోని ప్రపంచంపై జాలితో,
తిరిగి తిరిగి అరిగిపోయిన కాళ్ళతో
ఖాళీ కాలిబాటని కామించుకుంటూ
తనకోసం తానే తయారు చేసుకున్న తత్వాన్ని
మానవత్వాన్ని మనుషులందరికీ
మౌనంతోనే పంచాలనే పిచ్చి ప్రయత్నంతో…
వాడు ఏడుస్తుంటాడు
అంతలోనే నవ్వుతుంటాడు
తనను చూసి నవ్వుతూ
తనలాగా నవ్వలేని వాళ్ళను
అన్నీ ఉన్నా అసూయతో ఏడ్చేవాళ్ళను
ఏమని ఓదార్చాలో అర్ధం కాక
ఒంటరిగా వీధులలో నగ్నంగా సంచరించుకుంటూ
పగటినీ, చీకటినీ ఒకే రకంగా పగబడుతూ
కష్టానికీ, నష్టానికీ పగలబడి నవ్వుతూ
అందరికోసం రచించిన అమాయకత్వాన్ని
చినిగిన అంగిగా వేసుకుని
రాలిన చుక్కలన్నింటినీ కప్పుకున్న చందమామలా…
వాడు నడుస్తుంటాడు
అడుగు అడుగుకు ఆగుతుంటాడు ఏదో గుర్తొచ్చీ, మరేదో మర్చిపొయీ
తనవెనుక ఎవరో వస్తున్నారని
ఐనా ఎవరు వస్తారని
నీడలు కూడా తోడురాని నిశీధిలో
జాడల జవాబులు లేని నిశ్శబ్దంలో
తనకు తానే సమాధానం చెప్పుకుంటూ
సముదాయించుకుంటూ
ఎవరికీ అర్ధం కాని అస్తిత్వాన్ని
ఆస్తిలా కాపాడుకుంటూ
అస్థికలుగా మిగిలిపోతూ…
అందరికోసం రచించిన అమాయకత్వాన్ని
చినిగిన అంగిగా వేసుకుని మొత్తం కవిత కి ప్రాణం ఇదుగో ఇక్కడ వచ్చేసింది . మంచి వాక్యాలు
థ్యాంక్ యూ నిశీధి గారు
Nicely crafted poem. చాలా బాగుంది.
బాగుంది స్వామి…