కవిత్వం

Friday Funda

జనవరి 2013

సాదాసీదా క్షణమేదో
అసాధారణమవుతుంది
సాగేగాలి తీరు కూడా
సాఫీగా వుండదు
కుదురులేని యవ్వనమవుతుంది

వారం మొత్తం కష్టమంతా
శుక్రవారం సాయంత్రం
ఓబిర్యాని పొట్లంలానో
సినిమా కష్టాలుగానో
స్నేహితుల ఇంట
సన్నాయి నవ్వులగానో…
ఏదీ లేదంటే ,
సోఫాలో సహచరుని భుజం మీద
సోలిన సంగీతంలానో
తర్జుమా కాబడుతుంది

ఆసాయంత్రమెందుకో
ఎవరూ తమలోకి తాము
తొంగిచూసుకోరు
తప్పొప్పులు,లోటుపాట్లు,
తప్పటడుగులు గురించి
అస్సలు తెలుసుకోరు

అదో రెండు రోజుల భారీ విరామానికి
ముందొచ్చే పండగలాంటిది
బహుశా మెదడుని మభ్యపెట్టి
మనసుని మోహించే సమయంలాంటిది

చీకటికేదో బలముంది..ఆకర్షణుంది…
అది అకస్మాత్తుగా
ఆ సాయంత్రమే రెండింతలవుతుంది
చంద్రునిలోంచి ఊడిపడ్డకలలా
వెన్నెల రుచిచూపెడుతుంది !