నిద్రరాని,
మెలకువలేని
దినాలలో కాళ్ళీడుస్తున్న క్షణాలు.
నడువరాని అడవుల మంచు కోతలు,
జడలు గట్టిన సముద్ర కెరటాలు,
యెండిన ఆకుల్లాంటి నదీ తీరాలు,
పాలిపోయిన ఆకాశం చెంపలపైంచి రాలే
చీకటి క్షణాల అగాధాలు.
వెల్తురు సోకని మైదానాల్లో,
దారితప్పిన అడుగుల
అమాయకత్వం.
యెవరివో అనాథ శవాల మీద నుంచి
వీస్తున్న దుర్భర జీవన దుఃఖాలు,
వొడి చేరని
అశాశ్వతపు పిట్టల పాటలు.
యెటు పోతుందో తెలువని,
నావ అంచు కోస్తున్న నీళ్ళలోకి
మునిగిపోతున్న ముఖాలు,
జారిపోతున్న చూపులు.
చేప కళ్ళల్లో
మిగిలిన కన్నీళ్ళను
దోసిళ్ళలో పట్టుకుని,
పగిలిన రాళ్ళకోరల మీద నాట్యం చేస్తూ
వొళ్ళు చితికిపోయిన
కెరటాల నెత్తుటి నురగల
ముద్దులు .
చెరిగిపోయిన ఆనవాళ్ళు
గుర్తుపట్టే మిత్రుల కోసం,
తెలిసిన తోవలో తెలవని
అడుగులని గుచ్చుకుంటున్న
పూల ముళ్ళు.
పారిపోతున్న పక్షుల తలలమీద,
తుంచేసిన రెక్కలమీద,
యెప్పుడూ కాని ఉదయం కోసం
కళ్ళను పొడుస్తున్న
వొక నిరాకార కాంక్ష .
తొక్కేసిన యెండుటాకుల రెపరెపల్లో
నోరు పెగలని,
అందరి నోటా నానే
నిశ్శబ్దపు నినాదాలు -
చేతుల్లో పగిలిన అద్దం ముక్కల్లో
ప్రతిబింబించే కళ్ళ మసిపొరలు,
కరగని మంచు కడ్డీల
కలయికల ఇనుప కౌగిళ్ళలో,
దొరికినదాన్నే ప్రతిసారి
పోగొట్టుకున్న ప్రయాణంలో
తోడెవ్వడు వొంటరెవ్వడు ,,,,
సమూహమే వంటరైన దారుల్లో
వొంటరే సమూహమైన కల ఎక్కడ?
పారిపోతున్న పక్షుల తలలమీద,
తుంచేసిన రెక్కలమీద,
యెప్పుడూ కాని ఉదయం కోసం
కళ్ళను పొడుస్తున్న
వొక నిరాకార కాంక్ష …………అద్భుతం
దొరికినదాన్నే ప్రతిసారి
పోగొట్టుకున్న ప్రయాణంలో
తోడెవ్వడు వొంటరెవ్వడు ,,,,
-గతించిన క్షణాల పునాదులమీద నిలబడి , వర్తమానాన్ని పరపర చీలుస్తూ భవిష్యత్తు మీదికి విసిరిన శూలాల్లా వున్నాయి కొన్ని వాక్యాలు . మిత్రమా ఇందాకట్నించి మీ పద్యంలోనే ఈదులాడుతున్నా. బైటకు రాబుద్ధి కావడం లేదు .కవికి అభినందనలు .
కాలానికి భాష్యం చెప్పే కవితలు అరుదుగానే వస్తాయి. అలాంటి అరుదయిన కవితల్లో అరుదయిన స్వరంతో వినిపించిన ఈ కాలపు వాక్యం నారాయణస్వామీ నీ ఈ కవిత! ఇప్పటి సంక్షోభానికి వొక దృశ్యాన్ని గీసి, ఆ దృశ్యానికి త్రికోణ విస్తృతినిచ్చే పదచిత్రాలతో, ఆలోచనా, ఆవేశమూ సమంగా కలిసిన విజన్ తో వూహించిన కవిత ఇది.
Thank you very much all for your kind words!
బాగుందండి,.