కవిత్వం

ఎలా? ఇలా…

ఫిబ్రవరి 2015

క్కడంతే. అలలు నిశ్శబ్దంగానే మింగడానికి వస్తాయ్. ఇసుక నిర్మోహంగానే మెరుస్తుంది.

నా ఆకాశం అంతే. ఏ మేఘ శకలాలూ లేనప్పుడే జోరుగా వాన కురుస్తుంది.

నేల పొత్తిళ్ళలో నిశ్చలంగా ఉన్న నీటి పడెల్ని, పిట్టలా పొడుస్తూంటాను. ఒక యుగాంతం చివర్న నా సందేహాలన్నిటినీ వలయాలుగా విడగొట్టుకోడానికి.

అప్పుడు పొందే జ్ఞానం మొయ్యలేనంత బరువయ్యాక, పదాలు పట్టవని తెలుసుకున్నాక, ఒక నైరూప్య చిత్రంగా ఒలికిపోవడమే మంచిది.
ఎవరికీ అర్థం కాకపోవడమే మంచిది.

ఎప్పటికీ తడారని రంగుల్లో వేళ్ళు పెట్టి సున్నాలు చుడుతూ ఏ చిత్రాన్ని పాడతాను? గడిచిన శతాబ్దాల్ని లెక్కించుకునే నిట్టూర్పు శబ్దాలతో ఏ పాటని చిత్రిస్తాను?

అవును, నాలో నేనుండి ఎన్నాళ్ళయిందో మరి. ఎప్పుడొస్తావ్?

పూలు చిన్నబోయే మధువుని అందుకుని ఎంత కాలమయిందో. ఎప్పుడు పాడతావ్?

అదృశ్య తరంగాల్లోంచి నీ మాటల్ని కోసి ఒడి నింపుకునే వేళయింది. ఎప్పుడు మాట్లాడతావ్?

ప్రశ్నించడమొకటే పరమావధిగా మారిందా నాకు? సముద్ర ప్రేమని వెతుక్కుంటూ ఆగని పరుగుతో సాగిపోయేదే ప్రశ్న. ప్రవాహాన్ని నా వైపు మళ్ళించుకోవడం ఒక్కటే తెలిసినదాన్ని. ఎన్ని దోసిళ్ళతో తోడి ఎన్ని రకాల గవ్వల్ని తెచ్చి చూపించినా కళ్ళలో వెనక్కిపోని వెలితి.

ఎన్ని యుగాలుగా జలపాతాన్నై లోయల్ని నింపేస్తూ పచ్చగా పొంగుతున్నా, తరగని అక్షర జ్వాలలు.

అసలెక్కడ ఎదురుపడ్డాం ఇలా?

వెన్నెలా వాగూ సరసాలాడుకునే మెరుపుల్లోనా? పచ్చటి పైరూ, పొద్దుటి పాటా పెట్టుకున్న ఒప్పంద పత్రాల సంతకపు రంగుల్లోనా? ఎక్కడ?