ఆల్చిప్పలతో గోడ కట్టినట్టు మెరుస్తోంది తోవ. మంచుకొండల నడుమ చిన్ని బాట యిది. చాల అరుదుగా యీ దారంట మనుష్యులు నడుస్తారంట. కానీ నాకెవ్వరు కనిపించలేదు. వొక్కదాన్ని నడుస్తూనే వున్నాను. అప్పుడప్పుడు వాహనాల్లో మనుష్యులు వెళుతుంటారంట. నడుస్తుంటే దరిదాపుల్లో యెవ్వరు లేరనే తలంపు వొక్క క్షణం బాప్ రే అనిపించింది. యీ మధ్య యిలాంటి సందర్భాలు యెదురైనప్పుడు ‘గ్రావిటి’ సినిమా గుర్తోస్తోంది. ఆ వొంటరితనం ముందు యిదేమంత పెద్ద విషయమనిపిస్తుంది.
ఆ సినిమాని యెంత అద్భుతంగా ఫీల్ అయ్యానో. అంతకంటే అద్భుతంగా అనిపించిందేంటంటే ఆమె స్పేస్ నుంచి రేడియోలో భూమి మీద వున్న వాళ్ళని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు వో అపరిచిత వ్యక్తికి కాంటాక్ట్ అవుతాయి సిగ్నల్స్. వీళ్ళిద్దరికి వొకరి భాష మరొకరికి అర్ధం కాదు. కాని వొళ్ళు జలదరించే ఆ భయంకరమైన వొంటరితనంలో వున్నఆమెకి వొక మానవుని గొంతు వినటమే వూరట. కొంత సంభాషణ తరువాత అప్పుడొక పసిపిల్ల యేడుపు వినిపిస్తుంది. అప్పుడామె చాలా వుద్వేగానికి లోనవుతుంది. పసివాళ్ళవి విశ్వజననీయమైన పలకరింపులు. హిమాలయాలంత ఆశని మెరిపిస్తాయి.
ఆ సన్నివేశంలో ఆ మాటాడే వ్యక్తి వున్న ప్రదేశం కాని ఆ వ్యక్తిని కాని ప్రేక్షకులకు అప్పుడు చూపించలేదు తెరపై.
ఆ సమయంలో అక్కడ ఆమె అనుభవిస్తున్న ఆ వొంటరితనపు వుద్వేగాన్ని మనమూ ఫీల్ అవుతుంటాం. అలాంటప్పుడు మరో వ్యక్తి భౌతిక మానసిక పరిస్థితిలోని ఎమోషన్ తో మనం ట్రావెల్ చెయ్యలేం. అంతే కాకుండా మనలో ఆ ఎమోషన్ పలచబడుతుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే.
అందులోని ఆ సన్నివేశాన్ని షార్ట్ ఫిల్మ్ గా ‘గ్రావిటి’ డీవీడీలో పొందుపరిచారు.
ఆ మాట్లాడే వ్యక్తి వొక మంచుఖండంలో అతని కుటుంబంతో కలసి వుంటాడు. అతనూ పూర్తిగా మిగిలిన ప్రపంచంతో డిస్కనెక్టై వుంటాడు. భూమి మీద వున్న అతను, అంతరిక్షంలోని ఆమె, యిద్దరు రెండు రకాల వాతావరణాల్లో వుంటారు. ప్రపంచమంతటిలో ప్రతి మనిషి మనసుకి బలాన్ని యిచ్చే మానవీయ స్పర్శ వొక్కలానే కావాలనిపిస్తుంది కదా.
అలా తీయాలనే ఆలోచనే యెక్సయిటింగ్ గా అనిపించింది. నీకు వీలైతే ఆ షార్ట్ ఫిల్మ్ చూడు.
నీతో కలసి ధియేటర్లో సినిమా చూడటం యెంతో యిష్టం. సినిమాలో వొక్కోసారి యే మవుతుందిప్పుడు అని అడిగినప్పుడు నువ్వు ‘నేను తీయలేదు యీ సినిమా’ అని చెపుతున్నప్పుడు తడి తగిలిన కనకాంబరపు విత్తనాల్లా నీ గొంతులో విసుగు పేల్తుంటే భలే భయమేస్తుంది. మళ్లీ సినిమాలో మునిగిపోయి తిరిగి అలానే అడుగుతాను. తిరిగి తడి తగిలిన కనకాంబరపు విత్తనాల చిటపట. రాగానే సినిమాకి వెళ్లదాం.
అసలు మనుష్యులు హైరిస్క్ వున్న పనులు చెయ్యడాన్ని చాల యిష్టంగా వొక భాద్యతగా భలే యెంచుకొంటారు. అది అంతరిక్ష పరిశోధన కావొచ్చు. సముద్ర శోధనా కావొచ్చు. పర్వతాలు అధిరోహించటం కావొచ్చు. ఆర్మీలోకి వెళ్ళటం కావుచ్చు. వుద్యమాల్లోకి వెళ్ళటం కావొచ్చు. ప్రేమించటం కావొచ్చు. యెంతటి సాహస హృదయాలో కదా.
సరే నేను యీ మంచు పర్వతపు దారుల్లో ఏం వెతుకుతూ వొంటరిగా బయలుదేరానో తెలియదు. యెప్పుడు యెక్కడికైనా యేదోవొకటి చూడాలని బయలుదేరటం వుండదు. వెళ్ళుతూ వుంటే యేదో వొకటి ఆశ్చర్య పరుస్తుంది. సంతోషాన్నిస్తుంది. భయాన్ని పుట్టిస్తుంది. మోహాన్ని విసురుతుంది. వొక్కోసారి రిక్త హస్తాలతో పోపో పోమంటుంది. యెలాంటి అనుభవమైనా కాని మళ్ళీమళ్ళీ ట్రావెల్ చెయ్యమంటుంది మనసు.
మేలిమి ముత్యాలు కుప్పపోసినట్టుంది యీ ప్రదేశంలో మంచు. యెంతసేపు నడిచినా యీ తెల్లని మంచు తప్ప యింకేమి కనిపించటం లేదు. వొక్క ఆకూ లేదు. కాని అక్కడక్కడా క్యారీ బేగ్స్ కనిపింస్తున్నాయి. యింత దూరం వొక సౌందర్యాన్నో మరేదో చూడాలని వస్తారు కదా… యిలా యెలా కలుషితం చెయ్యాలనిపిస్తుందో.
యింత చలిలో నడుస్తున్నానా, అయినా యెండా చురుక్కుమంటునే వుంది. యెంతైనా సూరీడు సూరీడే. యెక్కడా తన అస్థిత్వాన్ని వదులుకోడనుకో.
అటూయిటూయెటు చూసినా మంచే. మధ్యలో యీ బుజ్జి దారి. పైన అమయాకమైన తేటచూపుల సూర్యాకాశం. వొక్కసారి యీ మంచుపర్వతాలని హత్తుకోవాలనిపించింది. యీ మహోన్నత హిమశిఖరపు లాలిత్యంలో నాలోని అనవసరపు మాలిన్యాలన్ని కడిగేసుకోవాలనిపించింది నా చిన్ని తనువుకి. అప్పుడు మరింత తేటగా నిన్నూ ప్రపంచాన్ని చూడొచ్చుననిపించిది. నీ చేతి వేళ్ళ అంచుల్లోంచి వెచ్చని అనురాగపు స్పర్శ నా అరిచేతుల్లోకి ట్రాన్స్మిట్ అవుతుంటే నాకు మాత్రమే అచ్చంగా తెలుసు నువ్వెంత అపురూపమైన అనురాగానివో.
మంచు సూర్యకాంతి సుగంధం నా యీ వెచ్చని వస్త్రాల నుంచి నన్ను కమ్ముకొంటునే వుంది, నీ అల్లరిపొగలా.
యిక్కడ నిలబడి నీ నుదిటిపై ముద్దు పెట్టుకోవాలి. యీ మంచుకొండలకి, ఆ నీలాకాశానికి నాకు నువ్వెంత అపురూపమో చూపించాలని వుంది. కోటి కలలు కిక్కిరిసిన నీ కన్నుల మీద, లక్ష ముద్దులు కోసం పరచుకున్న నీ అర్ధచంద్రుని నుదిటి మీద నాకు కవిత్వం కవిత్వంగా వుంది. యెడ తెగని మోహం మోహంగా వుంది.
యిలా యీ సువిశాల మంచు సానువుల్లో ఆగి నీకు నా మనసంతా రాసేసుకోవటం ప్చ్… భలే వుందనుకో… యీ పదాలు హిమసుమాలై నీకు చక్కిలిగింతలు పెడతాయంటా హిమబిందువులు నవ్వుకొంటూ చెపుతున్నాయి.
యిలా నడుస్తుంటే నాకు అక్కడక్కడా చిన్ని చిన్ని యిళ్ళు కనిపించాయి. కొన్ని కుటుంబాలు. అక్కడ వాళ్ళ యిళ్ళు . తమ చుట్టూ యెంత ప్రపంచం విస్తరిస్తూ వున్నా వాళ్ళు యిక్కడే తమ జీవితాలని ఆనందంగా గడుపుతున్నారు.
తమతమ రూట్స్ ని కోల్పోకపోవటంలోని సొగసు సంతోషం వారిలో నిండుగా వుందన్నదో వృద్ధురాలు. కాసేపు వారందరితో గడిపి బయలుదేరుతుంటే బెంగ మంచుతెరలా మనసుని మెలిపెడుతూ చుట్టుకొంది. మానవ సాంగత్యంలోని ఆకర్షణే అది. అంతకు మించిన సౌందర్యం యేముంది. వెనక్కి తిరిగి ఆ వృద్ధురాలిని హత్తుకొన్నాను. ఆమె మా అమ్మమ్మకి అక్కో అమ్మో, యేమో … యేం కాదేమో… యేమో నాకైతే ఆమె నా పూర్వీకురాలిలానే అనిపించింది. ఆ మంచు కొండలు నాలోని మాలిన్యాలని యెంత వరకు తొలగించాయో లేదో కాని ఆమెని స్పర్శిం చాక మనసంతా మరింత శుభ్రంగా అనిపిస్తోంది.
దా హత్తుకొంటా. నువ్వూ శుభ్రపడు. యెంత రమ్యమైన కానుక మన ప్రేమకి.
**** (*) ****
కుప్పిలి పద్మ గారు మీరు రాసిన”శీతవేళ రానీయకు” అంత బాగుంది ఈ “యెల్లో రిబ్బన్”.ఇన్ని భావాలను ఇలా ఈ శీతాకాలపు మంచులా ఒక్కో అక్షరంపై పేర్చుకుంటూ వెళ్లారు.పదం పదం సున్నితంగా పోటిపడ్డట్టు తోచింది చదువుతూ ఉంటే.నిశీధిలో వేలాడే వెన్నెలలా ఉంది మీ భావప్రకటన.మానవీయ స్పర్శను అద్భుతంగా రాయడం మీ తరువాతే.బోలెడు నచ్చేసింది నాకు మీ “యెల్లో రిబ్బన్”.ఇంత గొప్ప ఆర్టికల్ రాస్తున్నందుకు కృతఙ్ఞతలు/\
తిలక్ గారు , Thank You.
కోటి కలలు కిక్కిరిసిన నీ కన్నుల మీద, లక్ష ముద్దులు కోసం పరచుకున్న నీ అర్ధచంద్రుని నుదిటి మీద నాకు కవిత్వం కవిత్వంగా వుంది. యెడ తెగని మోహం మోహంగా వుంది…ఈ మాటలు ఇలా తిరిగి ఈ అపురూపమైన నేపథ్యం లో వినగలగటమెంత బావుందని ……ఎడ తెగని మీ తారుణ్యం సొగసు చిందిపోతూ ఉంది…
మైధిలి గారు, మీకు నచ్చితే నాకు భలే సంతోషంగా వుంటుంది. కృతజ్ఞతలు.
పద్మ గారూ, మీ ఆర్టికిల్ చాలా బావుందండీ. హిమ సోయగాల్లాంటి భావాల్లో ఇలా కొట్టుకుపోవడం బావుంది.
“వొక్కసారి యీ మంచుపర్వతాలని హత్తుకోవాలనిపించింది. యీ మహోన్నత హిమశిఖరపు లాలిత్యంలో నాలోని అనవసరపు మాలిన్యాలన్ని కడిగేసుకోవాలనిపించింది నా చిన్ని తనువుకి. అప్పుడు మరింత తేటగా నిన్నూ ప్రపంచాన్ని చూడొచ్చుననిపించిది. నీ చేతి వేళ్ళ అంచుల్లోంచి వెచ్చని అనురాగపు స్పర్శ నా అరిచేతుల్లోకి ట్రాన్స్మిట్ అవుతుంటే నాకు మాత్రమే అచ్చంగా తెలుసు నువ్వెంత అపురూపమైన అనురాగానివో. ” భలే వ్రాసారు.
Prasuna ravindran garu, మీకు నచ్చిన భావాలని పంచుకొన్నందుకు ఆనందం గా వుండండి. Thank You.
మనుషులను మనస్ఫూర్తిగా ప్రేమించగల వారే ఇంత అందంగా రాయగలరు..mee expression adhbhutam….
రజిత గారు, మీకు పారిజాత పువ్వులతో కృతజ్ఞతలు.
“పైన అమయాకమైన తేటచూపుల సూర్యాకాశం…
మంచు సూర్యకాంతి సుగంధం…
యీ సువిశాల మంచు సానువుల్లో ఆగి నీకు నా మనసంతా రాసేసుకోవటం ప్చ్…”
…ఇంకా ఆ చివరి రెండు లైన్లు అద్భుతం.
అందంగా, సబ్బు బుడగని కొనగోటి మీద నిలబెట్టుకున్నంత సున్నితంగా… కనిపించే ప్రకృతి అందాలను, కనపడని అందమైన మనసుల్ని, వాటి సువాసనల్ని కలెగలిపి బోకే కట్టి మా ముందు పెట్టినట్టు… భలే ఉండండి మీ రచన!
రామకృష్ణ గారు, సబ్బు బుడగని కొనగోటి మీద నిలబెట్టుకున్నంత సున్నితంగా… యెంత మృదువుగా చెప్పారో… Thank you.
మంచు పర్వతాలలో ప్రాజెక్ట్స్ లో మైనస్ 20 డిగ్రీలలో పని చేసే మాకు >>>.మంచు ఇంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందని తెలియలేదు . మంచుని తవ్వి ఆలుగడ్డలు ఉల్లిపాయలు తీసి కూర వండి పెడితే తిన్నమేగని వాళ్ళ మూలాలు ఇంత లోతుగా ఉంటాయని ఇప్పుడే తెలిసింది . నైస్ Padma garu.
రాజేంద్ర ప్రసాద్ గారు, మంచు అందంగా నే వుంటుంది. కాని నిరంతరం అక్కడే పని చెయ్యాల్సివస్తే అప్పుడు మంచు విసిగిస్తుంది. కాని మనం వొక చోట తప్పకుండా వుండాల్సివస్తే ఆ పరిసరాలని ప్రేమించటం మొదలుపెడతాను నేను. ఆలుగడ్డలు ఉల్లిపాయలు కూరని గుర్తు చేసి రుచిని వూరించింది.:) Thank you.
దా..హత్తుకుంటా
రా కాదు….దా . .
ఈ దా ప్రయోగమే చాల చాల ,స్వచ్చంగా ,సహజంగా వుంది
చాల బాగుందండి.
nuvvuu shubhrapadu…
హిమాలయాలయలంత లో ఉన్నంత హాయిగా వుంటుందండీ ..మీ యెల్లో రిబ్బన్…ఇపుడే చదివాను పద్మ గారు !!!ఈ సూర్యోదయవేళ …లో నా కాఫీ పరిమళ అబ్బాయిని తలుచుకుంటూ.ఇంత ప్రేమ గ ఉండాలని అనిపిస్తుంది …ఎవరికైనా …
పద్మగారు ఇపుడు మీరు ఎం రాస్తున్నారో తెలుసుకోవాలని వుంది ..వీలైతే తెలపగలరు ..మీ అభిమాని ..సంతోషి కుమారి ..