నీ బాహువుల్లోంచి వుదయోత్సవం చూడటం యెంత అపురూపం వో నా గోరువెచ్చని సూరీడా… మృదు వెచ్చని నీ భుజం మీద మోహాతీతపు నా లాలన ముద్దు నీకెంత భరోసాని యిస్తుందో నువ్వు పాట పాడి విన్పించినప్పడు నీ గొంతులో విప్పారిన స్నేహం నన్ను అనేక సార్లు సుశక్తిమంతురాలిని చేస్తుంటుంది.
ప్రతి సూర్యోదయం మనం కలసి చూస్తే యెంత బాగుంటుంది. యేమోలే రోజు వొక్కలానే ప్రతీది కలసి చూడటం వినటం పని చెయ్యటం కూడా వొక్కోసారి బోర్ కదా. కొంతమందికి అలా ప్రతి క్షణం కలసి వుండటం యిష్టంగా వుంటుంది. జీవనాన్ని ఆస్వాదించడాన్ని ప్రతి మనసు వొక్కోలా కోరుకుంటుంది. మనసేం యెస్కలేటర్ కాదు కదా. వెళ్ళిన దారిలో కనీసం వెనక్కి కూడా దాని మీద నుంచే రాలేం కదా. మనం యెంచుకొన్న పని యిద్దరం సర్వ కాలాల్లో సర్వ సమయాల్లో కలసి వుండలేం. అందుకని కూడా మనం పంచుకోడానికి యెక్కువ సంగతులు వుంటాయనుకుంటాను. అందుకే మన స్పర్శ యెంతటి కాంక్షాభరితమో యెంతటి మోహలావణ్యమో అంతటి పసిమోహనం కూడా.
యిప్పుడు యీ వుదయం యీ నదీ తీరంలో వుదయించే విభాతుని కోసం యెదురు చూస్తు నీకు రాస్తున్నాను. పసి అలల రెక్కల్లోంచి విరిగే నీలివర్ణపు తుంపర నా జుట్టులో తీయని పన్నీరులా చిందుతోంది. జాలరులు వలల్ని అల్లుకొంటూ, కుట్టుకొంటున్నారు. లంగరేసిన పడవల దగ్గర వూసులాడుకొంటున్నారు కొందరు. కొంతమంది అప్పుడే చేపల వేటకి నదిలోకి వెళ్ళారు. యెంత శారీరకశ్రమ. యెంత సాహసం.
లంకల్లోకి వెళ్ళబోతున్న పడవతను లంకలోకి వస్తారాని అడిగాడు. ఆ పడవ కెపాసిటి యెంతో తెలీదు కాని వూరు వూరంతా యెక్కినా లంకలోకి తీసుకు పోతాననేట్టు వున్నాడతను. నీటి మీద ప్రయాణాలకి సంబంధించిన సేఫ్టీ స్పృహ మన దేశంలో చాల తక్కువ అని నాకనిపిస్తుంది. వుదయమే లంకలోకి వెళ్ళటం భలే వుత్సాహంగా అనిపించింది. యెక్కేసాను.
నీకు గుర్తుందా మనం పరిచయం అయిన కొత్తలో లంకలోకి వెళదామని పుట్టే యెక్కమంటే ‘నువ్వు నడుపుతావా’ అని నువ్వెంత కంగారు పడ్డావ్. అప్పటికి ఆ కుర్రాడు నేను యెంత బాగా నడపగలనో చెపుతున్నా నువ్వు మాత్రం నమ్మలేదు. అదే కారు అయితే నీకు యెలాంటి సందేహం వుండదు. యెందుకంటె అమ్మాయిలకి సంబధించినంత వరకు అది అలవాటైన యిమేజ్. భలే నవ్వొచ్చింది ఆ రోజు. మనకి స్టీరియో టైప్ యిమేజస్ ని బ్రేక్ చెయ్యటం భలే కష్టం. మొదట్లో లేడి పైలెట్స్ ని చూసి కంగారు పడి ఫ్లైట్ దిగిపోదాం అనుకొన్న పెద్దమనుషుల గురించి విన్నప్పుడు యెంతగా స్త్రీలు చేసే పనులు మనస్సులో స్థిరంగా ముద్ర వేసుకున్నాయాని. యిప్పుడు అన్ని యిమేజెస్ బ్రేక్ అయిపోయాయి. యిప్పుడు నీకు యే సంకోచం లేదనుకుంటా నేను తెప్పని నడిపితే యెక్కటానికి:)
సరే యిప్పుడే యీ పడవ కదిలింది. పడవ నిండుగా మనుష్యులు. తట్టలు. బుట్టలు. ముగ్గురు ఆడ పిల్లలతో వొక తల్లి తండ్రి. లంకలో పుల్లలు యేరుకు రావడానికి. వంట చెరకు వాళ్ళకి. పిల్లలు లంకలో తాగబోయే కొబ్బరి బొండాల గురించి ముచ్చటించుకొంటున్నారు.
మెల్లగా సూర్యుడు వస్తున్నాడు. వుదయించే సూర్యునికి నమస్కరించాను. నీకు తెలుసుగా ప్రకృతికి నమస్కరించటం నాకు యిష్టమని. అలానే నదికి అరణ్యానికి చంద్రునికి నిండుగా ఫలవంతమైన మామిడి చెట్టుకి బంగారు కాంతితో వికసించిన వరిచేలుకి దిగంతాలకి పుష్పించిన రంగురంగు పుష్పాలకి, చంద్రరశ్మికి యిలా ప్రకృతిలోని ప్రతి అణువుకి నమస్కరించాలని వుంటుంది. నమస్కరిస్తాను కూడా. అప్పుడే పుట్టిన బిడ్డని ప్రతి వొక్కరు చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ హృదయానికి హత్తుకున్నప్పుడు ఆ పసిప్రాణంకి యీ ప్రపంచంలో నన్ను ప్రేమించే వాళ్ళు బోలెడంత మంది వున్నారనే నమ్మకాన్ని యిస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే మనం ప్రేమించటానికి పసితనం మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలానే ప్రకృతి కూడా పసితనంతో చిగురిస్తున్నప్పుడు ముద్దాడాలనిపిస్తుంది. పెద్దరికంతో యెదురైనప్పుడు నమస్కరించాలనిపిస్తుంది.
సూర్యకిరణాలు చురుక్కుచురుక్కుమంటున్నాయి కొన్ని సమయాల్లోని నీ చూపుల్లా. నదిలో నీళ్ళు తళతళలాడుతున్నాయి నీ పాటలోని పదాల్లా. కాస్త దూరంలో లంక కనిపిస్తోంది పచ్చగా.
లంకలోకి వెళ్ళాక మళ్ళి రాస్తాను.
…
I am back…:)
ముదురాకుపచ్చని లంక. నిలువెత్తూ కొబ్బరాకుల పందిరిలా వుంది. పూల పొత్తిళ్ళల్లోంచి లంకతుమ్మెదలు పలకరించాయి. మరో పక్క ఆకులు రాల్తున్నాయి. నది మీద నుంచి వీసే చల్లని గాలి పల్చని యెండతో మిళితమై రాలిన ఆకులు, పూస్తున్న పువ్వుల పరిమళంతో సమ్మిళితమైన వొక విధమైన తీపివగరు కలబోసిన పరిమళం. వంట చెరకు కోసం పుల్లలు కట్టెలు యేరుకొంటున్నారు చాలా మంది కబుర్లు చెప్పుకొంటూ. యెన్నెన్ని నవ్వులనుకున్నావ్. అంత వేడిగా అనిపించిందా పడవలో. యిక్కడ యెంత చల్లగా వుందో. లంకంతా తిరిగితిరిగి కొబ్బరి బోండం నీళ్ళు తాగి యిదిగో యిక్కడ వో మామిడిచెట్టుకి ఆనుకొని నీడలో కూర్చుని నీకు తిరిగి రాస్తున్నాను.
నాకు యిలాంటి పచ్చదనం చూసినప్పుడంతా విభూతిభూషణ్ గారి ‘వనవాసి’ గుర్తువస్తోంది. మహా లిఖారూప పర్వతం దిగువున వున్న ఆ వేల యెకరాల అరణ్యంలో గుర్రమెక్కి సత్యాచరణ్ వెన్నెల్లో మనలని తనతోపాటు అరణ్యమంతా తిప్పటం గుర్తువచ్చింది. గుర్రం మీద అరణ్యమంతా తిప్పుతానంటే వస్తావా … వద్దులే అలా భయంగా చూడకు:) నీకెప్పుడు తెలియని దారుల్లోకి నాతోపాటు తిరగమంటానని వొక్కోసారి నీకు భలే భయంగా వుంటుందని చెప్పావ్ కదా. అప్పుడు నువ్వు యెంత ముద్దేసావో. చాల సార్లు మనం మన భయాలని సంశయాలని చెప్పుకోం. మనిద్దరం అరటి పువ్వు పొరలుపొరలుగా విచ్చుకొన్నట్టు మనం మన మనసులోని అన్ని యిమోషన్స్ ని విప్పుకొంటుంటాం అప్పుడప్పుడు.
సరే… ఆ విషయాలని మళ్ళి మాటాడుకొందాం.
నాకైతే యీ లంకలో మనిద్దరం చేతుల్లో చేతులు పెనవేసుకొని ప్రతి ఆకుని పువ్వుని పిట్టని పలకరించాలి. వుండుండి గాలి వీచగానే మనం పెనవేసుకొని యేది మా యిద్దరి మధ్య నుంచి వెళ్ళగలవాని అప్పుడెప్పుడో ఆ కొండవాగు వాలులో గాలిని ఆట పట్టించినట్టు యిప్పుడు యీ చల్లని తీపి వగరుల గాలిని ఆటపట్టించాలనిపిస్తోంది నీతో చేరి. నీ మనసుకి రెక్కలు కట్టుకొని యిక్కడికి యెగిరొచ్చెయ్. యీ చెట్ల మధ్యలో మనిద్దరం కలసి పాటలు పాడుకోవాలి.
చుట్టూ నది. యెదురుగా నువ్వు నీ పాట… యింకేం కావాలి నేనొక మోహనావ కావటానికి.
పద్మ గారూ, ఎప్పటిలానే ఎల్లో రిబ్బన్ బావుంది (ఈసారి అచ్చు తప్పులు చాలా ఎక్కువున్నప్పటికీ). అయితే ఈ కామెంట్ కి ముఖ్య కారణం ఇది నచ్చిందీ అని చెప్పడం కాదు. మీరు ఉద్దేశ్యపూర్వకంగా వ్రాసారో, లేదా ఉత్తరంలోని సంఘటనలకు ప్లోలో యాదృచ్చికంగా వచ్చిందో తెలీదు కానీ, మీరు వ్రాసిన ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి.
—————————————————————
యెందుకంటె అమ్మాయిలకి సంబధించినంత వరకు అది అలవాటైన యిమేజ్. భలే నవ్వొచ్చింది ఆ రోజు. మనకి స్టీరియో టైప్ యిమేజస్ ని బ్రేక్ చెయ్యటం భలే కష్టం. మొదట్లో లేడి పైలెట్స్ ని చూసి కంగారు పడి ఫ్లైట్ దిగిపోదాం అనుకొన్న పెద్దమనుషుల గురించి విన్నప్పుడు యెంతగా స్త్రీలు చేసే పనులు మనస్సులో స్థిరంగా ముద్ర వేసుకున్నాయాని. యిప్పుడు అన్ని యిమేజెస్ బ్రేక్ అయిపోయాయి.
గుర్రం మీద అరణ్యమంతా తిప్పుతానంటే వస్తావా … వద్దులే అలా భయంగా చూడకు
———————————————————————————–
మహిళా దినోత్సవం అని మహిళాల గొప్పదనం గురించో, లేక వాళ్లకి జరిగిపోతున్న అన్యాయాల గురించో గగ్గోలు పెట్టకుండా, ఇంత సున్నితంగా మహిళల ప్రగతి గురించి చెప్పడం నచ్చింది. నేను ముందే చెప్పినట్టు, మీరు ఆ దృష్టితో వ్రాసి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడ చూసినా మహిళా దినోత్సవ మాసం అని నారాయణమూర్తి లెవల్లో వ్రాతలు చూసిన నన్ను, ఈ దృష్టితో చూసేలా చేసాయి. థాంక్స్ .
పద్మవల్లి గారు, మీరు మీ అభిప్రాయాలని వ్యక్తం చేసినందుకు, మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
కుప్పిలి పద్మ గారు మీ యెల్లో రిబ్బన్ రెగ్యులర్ గా చదువుతున్నాను,బోలెడు నచ్చుతుంది నాకు మీ ఆర్టికల్.మనిషి తన లోపలి భావాలను వ్యక్తపరిచే తీరును చాలా బాగా రాసారు,ఈ వాక్యాలెందుకో చాలా నచ్చేశాయి నాకు”సూర్యకిరణాలు చురుక్కుచురుక్కుమంటున్నాయి కొన్ని సమయాల్లోని నీ చూపుల్లా. నదిలో నీళ్ళు తళతళలాడుతున్నాయి నీ పాటలోని పదాల్లా. కాస్త దూరంలో లంక కనిపిస్తోంది పచ్చగా”.పదం పదం పొందికగా ఒదిగిపోయాయి మీ అక్షరాలతో.ఆ పదాలకే తెలియదేమో తమకింత అందం ఉందనీ ,అవి ఇలా నచ్చేస్తాయనీ అందరికీ.మనఃపూర్వక అభినందనలు కుప్పిలి పద్మ గారు.
Thank you Tilak gaaru.
బావుంది పద్మా>>>
Rajendra Prasad. Y garu Thank You .
” ప్రకృతి కూడా పసితనంతో చిగురిస్తున్నప్పుడు ముద్దాడాలనిపిస్తుంది. పెద్దరికంతో యెదురైనప్పుడు నమస్కరించాలనిపిస్తుంది.”…అందమైన, సరైన మాటలు…!
మైధిలి గారు, మీకు సరైన మాటలుగా అనిపించిందుకు భలే సంతోషంగా అనిపిస్తోంది. నేను ఆ విషయాన్ని నమ్ముతాను.Thank you .
డియర్ పద్మ గారు..
మీ యెల్లో రిబ్బన్ తో మనసును కట్టేస్తున్నారు.
ప్రతి పదం లో ను భావుకత్వం వాసంత సమీరంలా హాయిగా మనసును పలకరిస్తోంది.
మీకు అభినందనలు.
వాసంత సమీరం ని గుర్తు పట్టే మనసున్న ప్రియమైన లలిత గారు మీకు నా కృతజ్ఞతలు. చదివిన తరువాత మీరు పంచుకొనే భావాలు భలే సంతోషాన్ని అందిస్తున్నాయి.
కుప్పిలి పద్మ గారు ..బుడి బుడి నడకల చిన్న పిల్లలా….ఒకసారి అప్పుడె స్కూలు వదిలేసాక గంతులేస్తున్న రెండు జడల పిల్లలా…మరో సారి కాలేజీ బంక్ కొట్టి స్నెహితురాల్లతొ షికారుకు తిరిగే గడసరి పిల్లలా….మరెప్పుడైనా నడి వయస్సు లాలన చూపే ప్రౌఢ గా….ఇలా ఎన్నో అనుభూతులతో వైవిధ్యంగా romantic feeling ను సున్నితంగా పండిస్తుంది. మధ్య మధ్య లో ‘ lady pilot ‘ జోక్ చెపుతున్నట్టు చెప్పినా స్త్రీ వ్యక్తిత్వం గురించి న్యాక్ గా ప్రెమికుడైన వాడి బుర్రలోకి ఎక్కించడం…..ఈ స్టైల్ లో వ్రాయడం అంత సులభ తరం కాదు. ఇలాంటి గల్ ఫ్రెండ్ నాకు కూడా ఒకతి ఉంటే ….ఇలా ఈ ప్రెమ లేఖలన్నీ పోగేసి రొజుకో రెండు సార్లు చొప్పునైనా చదివి బతికేసుకుందామని మీలొ మీరు అనుకోకపొతే చెప్పండి చూద్దాం..:) ….
విజయ కుమార్ గారు, రోజుకో రెండు సార్లు చదువుతున్నారా లేదా నేనైతే మీరు రాసింది రెండు సార్లు చదివాను. Thuank you very much Vijay Kumar gaaru.
పసిఅలల రెక్కల్లోంచి విరిగే నీలి వర్ణపు తుంపర నా జుట్టులో తీయని పన్నీరు లా చిందుతోంది.మేడమ్ ఈ వాక్యాలు నా మనసు ను హత్తుకున్నాయి.