కరచాలనం

ఈ తరం కథల్లో ఆర్ద్రత తగ్గింది

ఫిబ్రవరి 2013

పెద్ది భొట్ల సుబ్బ  రామయ్య……

ఈ  పేరు వినగానే దిగులు మేఘపు  చాటు గుబులు జాబిలీ గుండెలను పిండి వేస్తుంది. మనసు కరుణ రసప్లావితమై  కరిగి నీరయ్  పారిపోతుంది ఒక దుఖపు తెర  మనసు మీద అలా పర్చుకుంటుంది. రవ్వంత జాలి, గోరంత సానుభూతి కొండంత కరుణ జమిలి గా ఒక దాని మీద మరొకటి ఆవరించుకొని ఏ  భావోద్వేగానికీ  అందని దృశ్యం ఏదో మనో యవనిక మీద అల  లాగా తారాడుతుంది. మనం మనంగా ఉండలేము. మన లోపల సున్నితమైన  కరుణ అనే సూత్రం ఒకటి హృదయాన్నీ బుద్దినీ ఏకం  చేస్తుంది. కరుణ ఆయన కధాత్మ . కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమి ఈ సంవత్సరం ఆయనను తన వార్షిక పురస్కారానికి ఎన్నిక చేసింది. ఆ సందర్భం గా ‘వాకిలి’ కోసం ప్రముఖ కథకుడు, కవి వంశీ కృష్ణ ప్రత్యేక ముఖాముఖి.
మీ కధా  రచనకి నేపధ్యం ఏమిటి ?


నా కదా రచనకు ఆ మాట కొస్తే ఏ  రచయత సృజనకి అయినా నేపధ్యం జీవితమే. జీవితమే నా కధా  రచనకి ముడి సరుకు. అయతే అన్నిటి కంటే ముందు ఒక విషయం చెప్పాలి. నా  ఐదో  సంవత్సరం లో లంకల కోడేరు లో నన్ను మొదటి సారి  స్కూల్  కి పంపిస్తూ  మా నాన్ని ఒక మాట చెప్పారు మా గురువు గారికి. ” వీడి కి మీరు చదువు సంధ్య చెప్పకండి. భయ భక్తులు నేర్పండి చాలు ” అని. ఆయన  మా నాన్న చెప్పినట్టుగానే నాకు చదువు చెప్పలేదు కానీ భయ భక్తులు పుష్కలం గా నేర్పాడు. తరువాత భారతుల మార్కండేయ శర్మ గారనే మా తెలుగు మాస్టారు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని “చదవటం” అనే క్రియను అలవాటు చేసారు.

పుస్తకాలు చదవటానికి ఒక పద్ధతి వుంది. పసి పిల్లలకు చిన్నప్పుడు ఫారెక్స్  పెట్టినట్టు గా తేలికగా అర్ధం అయ్యే చందమామ , బాల మిత్ర లాంటి పుస్తకాలు అలవాటు చెయ్యాలి. క్రమేపీ స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. నా సాహిత్య చదువు కూడా అలాగే జరిగింది. చందమామ , బాల మిత్రలతో మొదలు పెట్టి కొవ్వలి, జంపన ల మీదుగా సాగింది. కొవ్వలి జంపన వాళ్ళు రాసిన సాహిత్యం చదవడం వలన నాకు చదవడం లో వున్న  ఆనందం ఏమిటో తెలిసింది. ఈజీ రీడింగ్ అయితే ఆవ వచ్చు కానీ అలా విపరీతం గా చదవడం వలన భాష స్వరూపం , పద రహస్యం అవగతమైంది.     ఇంటర్ వచ్చేసరికి విశ్వనాధ, అడవి బాపి రాజు నా సాహిత్య ఆవరణం లోకి వచ్చి చేరారు. నేను మొదటి సారి వేయి పడగలు చదివినప్పుడు వర్ణనలు వదిలివేసి, కదా మాత్రం చదువుకుంటూ వెళ్ళాను. ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతా మళ్ళీ వేయి పడగలను కధ  వదిలివేసి వర్ణనలు మాత్రమె చదివాను. ఇలా విపరీతం గా చదువుతున్నప్పుడే ఎప్పుడో, ఎక్కడో, ఏదో మూల ఒక బీజం పది వుంటుంది. అలా మొదటి కధ “చక్ర నేమి” ఆంధ్ర ప్రభ లో రాసాను .

 

సాహిత్యం చదివితే  భాషా స్వరూపం తెలుస్తుందా? పద నిర్మాణం, పద సంయోజనం  ఇవన్నీ భాషా శాస్త్ర విషయాలు కదా?

సాహిత్యం చదివితే పద స్వరూపం భాషా స్వరూపం ఖచ్చితం గా తెలుస్తుంది. ప్రతి భాష నేర్చుకోవడానికి దానిదైన  ఒక సంప్రదాయం వుంటుంది. ఆ సంప్రదాయాన్ని కాదు అనుకుంటే భాష దానికి అదే మరణిస్తుంది. తెలుగు లో 56 అక్షరాలు  వున్నాయి. తెలుగు భాష నేర్చుకోనాలంటే ముందు 56 అక్షరాలూ నేర్చుకోవలసిందే. అక్షరాలు , తర్వాతా గుణింతాలు ఇలా నడిచిన దారిని  మనం మరవకూడదు. ఇంగ్లిష్ వాళ్ళను చూడండి. వాళ్ళకు 26 అక్షరాలు  వున్నాయి. ఏ  అక్షరాన్ని వద్దు అనుకోలేదు. OFTEN అనే పదం రాయాలి అంటే T సైలెంట్ కదా అని , అది ఉచ్చారణలో పలకటం లేదు కదా అని OFEN అని రాయరు. ఇంతెందుకు పక్కనే వున్న తమిళం  వాళ్ళు కూడా ఒక్క అక్షరాన్ని కూడా వాదులు కో లేదు. కానీ మన తెలుగు లో మనం చూస్తువుండగానే ఎన్ని అక్షరాలు  అంతర్దానమై పోయాయి . చ చ ఛ  ల లో చ . జ జ  ఝ  ల లో జ  అంతర్దానమై  పోయాయి. ఱ  అసలు కనిపించనే కనిపించదు. ఎన్ని అక్షరాలూ వదులుకుంటే, ఆ మేరకు భాష పేదది అవుతుంది. ఇవాళ  చందమామ ని చన్దమామ్  అని పలికే తరం వచ్చింది. పదాలతో భాష నేర్పడం తో వత్తులు ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూదదో తెలియని స్థితి వచ్చింది. నీరు  అని రాస్తే నీళ్ళు అని అర్ధం . నీ పక్కన ఱ  రాసి దానికి కొమ్ము ఇస్తే బూడిద అని అర్ధం. భాష లో నుండి ఱ  తొలగిస్తే ఏం  జరుగుతుంది?

నిప్పున నీరయ్యెన్  అని దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు రాస్తే  నిప్పులో కలిస్తే బూడిద కావాలి కదా నీరు కావడం ఏమిటి అని పెద్ద చర్చ లేవదీసారు. నిజానికి నీరు  అంటే బూడిద అనే అర్ధం వుందని నీ పక్కన ఱ  రాసి కొమ్ము ఇస్తే బూడిద అవుతుందని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా సాహిత్యం చదివితేనే తెలుస్తుంది. అయితే భాష బాగా తెలిసిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితేనే ఇవన్నీ అర్ధం అవుతాయి. మీరు శ్రుతి ఎలా రాస్తారు. శ్రుతి అని రాస్తేనే సరిగా రాసినట్టు. శృతి  అని రాస్తే తప్పు. ఈ స్వరూప స్వభావాలు అన్నీ నిఘంటువుల లో వుండవు. కొన్ని వందల సార్లు చదవటం వలన ఆ పదం ఆ రూపం తో మనసు లో  ముద్రించుకుంటుంది .
భాష  సంగతి కాస్త పక్కన పెడదాం మీరు వుధృతం గా కధలు రాసిన 1960-1970  దందహ్యమాన  దశాబ్దానికి 90 ల తర్వాతి ఉదార ఆర్ధిక వాద సంస్కరణల దశాబ్దానికి మధ్య వున్నా తేడా ని కదారచయత గా ఎలా గుర్తిస్తారు?
నా వరకు నేను 80 ల తర్వాత రాసిన కధలలో ఆర్డ్రత  తగ్గింది. మనం ఎప్పుడైతే  stupidity, sex, violence లను ఆనందించటం మొదలు పెట్టామో  అప్పుడే మనం stupid గా violent గా తయారు అయ్యాము. సెక్స్ perverted గా మారి పోయాము. ఒకప్పుడు సినిమా లో ” అమ్మ గారు స్నానం చేస్తున్నారు ” అన్న డైలాగ్  ఉంటేనే B N రెడ్డి గారు వప్పుకోలేదు. స్నానం చేస్తున్నారు అన్న మాట వినగానే ప్రేక్షకుడి మనో ఫలకం మీద స్నానం చేస్తున్న ఒక స్త్రీ నగ్న దేహం కదలాడుతుందని ఆయన వద్దు అన్నారు. ఈనాడు స్త్రీ లంటే కేవలం మాంస ఖండాలే . నా లోను ఆర్ద్రత తగ్గి పోవడం వలననే “మరో వీధి పాప” లాంటి కధ రాసానేమో| సున్నితత్వం తెగి పోయింది. విలువలు లుప్తమయినాయి.
సుబ్బ  రామయ్య పాత్రలు అయితే చనిపోతాయి. లేకపోతే మరణిస్తాయి అన్న వ్యాఖ్య  పైన మీరేమంటారు? అసలు చావు లేకుండా  మీరు కధ రాయరా?
ఆ మాట అన్నది కప్పగంతుల మల్లికార్జున రావు . లతా, తెన్నేటి హేమ లత కూడా సరదాగా నావి ఏడుపు  గొట్టు కధలు అనేది. “రాజశేఖరం రమాదేవి ప్రేమిచుకున్నారు. ఇద్దరూ కలిసి సరదా గా నడుచుకుంటూ వెళుతున్నారు. వెనుక నుండి వేగం గా వచ్చిన లారీ  రాజసేఖరాన్ని గుద్దేసింది. రాజశేఖరం చనిపోయాడు. సుబ్బ రామయ్య కధ అయిపొయింది. అనేది. అయితే కొన్ని వృత్తాలకి చావు తోనే సంపూర్ణత్వం లభిస్తుంది. లేదు కొన్నింటికి చావు ఒక పరిష్కారం అవుతుంది. “నీళ్ళు” కధ లో జోగినాధం మరణించక పోతే కదేమి లేదు. అలాగే  “WAGES OF FEAR”  అన్న సినిమా లో కూడా కధానాయకుడు అంత క్లిష్టమైన పనిని సాధించి కూడా ట్రక్కు లోయ లో పది చనిపోక పోతే ఆ సినిమా కు అర్ధము , విలువ వుండవు. అయినా మృత్యువు మన చివరి అతిధి.

జీవితానికి అర్ధం వెతకడం ఇంగువ గురించి తెలుసుకోవడం ఒకటేనా?

మనకు ఎంతో  తెలుసునని మనం అనుకుంటూ ఉంటాము. అనవసర సమాచారాన్ని అనంతం గా పోగేసి నాలెడ్జ్ సొసైటి అనుకుంటాము. కానీ చాలా అత్యల్పమైన విషయాలు కూడా మనకు తెలియవు. వాటిని తెలుసుకోకుండానే ఒక్కొక్కసారి జీవితం ముగిసిపోతుంది. మనిషి జీవితం ఒక పెపీలికం . అన్నీ తెలుసు అని అనుకుంటాడు కానీ ఏదీ తెలియదు. కనీసం ఇంగువ కూడా
ప్రశ్న6 : ఇంతకూ ఇంగువ అంటే ఏమిటో ఆ కధలో మీరు చెప్పలేదు. చదువరిని ఆ అసంతృప్తి వేటాడుతూనే వుంటుంది. ” కధ లో ఇంగువ గురించి చెప్తే ఆయన విశ్వనాధ సత్యనారాయణ అయ్యేవాడు. చెప్పలేదు కాబట్టి సుబ్బరామయ్య అయ్యాడు ” అని కదా పావని శాస్త్రి అన్నది.

విశ్వనాధ తో మీ అనుబంధం?


విశ్వనాధ తో నాకు చెప్పలేనంత అనుబంధం వుంది. ఆయన తో గంటల తరబడి గడిపాను. చివాట్లు తిన్నాను. రెండు, మూడు సార్లు దెబ్బలు కూడా తిన్నాను. B.A  స్పెషల్ తెలుగు లో ముగ్గురమే వుండే వాళ్ళం. విశ్వనాధ సరిగా క్లాసు తీసుకునేవాడు కాదు. ఇవ్వాళ అన్నం తిని రాలేదు. నీరసం  గా వుంది , ఇంటికి రా అనే వాడు. మరొక రోజు ఇవ్వాళ అన్నం తిని వచ్చాను. ఆయాసం గా వుంది. ఇంటికి రా అనేవాడు. ఇంటికి వెళితే వాలు కుర్చీ లో కూర్చుని సమయం తెలీకుండా ఏడెనిమిది గంటలకి పైగా చెప్పేవాడు. ఆయన పెట్టిన భిక్షే  ఇది. ” వసంత ఋ తు వర్ణన ” అని పద్యాలు రాసుకుని తీసుకెళితే యతి, ప్రాసలు అన్నీ బాగానే వున్నాయి కానీ నువ్వు కవిత్వానికి పనికి రావు అని తేల్చేశాడు . ఆ తరువాత నేను కవిత్వం జోలికి వెళ్ళ  లేదు.
“కరుణ మీ కధాత్మ” కరుణ పాసివ్  గా వున్నట్టు కనిపిస్తుంది కానీ చాలా అగ్రెసివ్. దానిని మీరు ఎలా నిర్వచిస్తారు. ?
కరుణ రస సూత్రం తెగిపోతే మానవుడు మానవుడు కాదు. జంతువు . నిజానికి కరుణ లో గొప్ప డైనమిజం  వుంది. అది మన మనో మాలిన్యాలని తొలగిస్తుంది. మనసుని స్వచ్ఛ , శుభ్ర , స్ఫటికం  లాగా చేస్తుంది. అది దైవిక గుణం. అది మనిషిని మంచితనం వైపు నడిపిస్తుంది. సమస్త చరాచర జీవ రాశి  నుండి మనిషిని వేరు చేసేది ఒక్క “కరుణ” మాత్రమె. కరుణ ముఖ్యం.
“పూర్ణాహుతి” లో బీద బ్రాహ్మణుడు , కోదండం గారి కల  లో నిప్పుకోడి , లేదా చింపిరిగాడు .. వృద్దాప్యం , బాల్యం, ఆ రెండు మనస్తత్వాలని  ఎలా ఔపోశన  పట్టారు.?


మన చుట్టూ  వున్నా వాళ్ళే మనకు ఏదో ఒకటి ఇస్తారు. ఈ బెజవాడ మహానగర రైల్వే స్టేషన్ లో రైళ్ళు సమయానికి వస్తూ, పోతూ , వుంటాయి . ఒక రైలు సకాలం లో ప్లాట్ఫారం మీదకి రావాలి అంటే ఎన్ని మానవ హస్తాల శ్రమ వుంటుందో మనం, ఎప్పుడైనా గమనించామా ? నలుగురు పిల్లలు రైలు కదిలే ముందు రైల్లోకి ఎక్కి రైలు పెట్టె అంతా శుభ్రం గా తుడిచి తృణమో, ఫణమో, ఇవ్వమని చెయ్యి చాపు తాడు. వాళ్ళ గురించి నాలుగు కధ లు రాసాను. ఇక బీద బ్రాహ్మణులు అంటారా? ఇప్పటికీ వాళ్ళు కనిపిస్తారు, నాతొ రండి, మీకూ చూపిస్తాను. అంతా సమాజం నుండి తీసుకున్నదే. నేను ప్రత్యేకం గా ఔపోశన  పట్టిందేమి లేదు.
ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని మధ్యతరగతి పూర్తిగా లుప్తమై పోయింది. ఒక నియో రిచ్ , లంపెన్ వర్గం తెలుగు సమాజం లో ఊపిరి  పోసుకున్న విషాద దృశ్యం గురించి కద రచయత గా మీ వ్యాఖ్య?

మధ్య తరగతి పూర్తిగా లుప్తమైన్దిఅని  అనుకోను. కానీ నియో రిచ్ వర్గం ఒకటి ఖచ్చితం గా మొదలయింది. వీళ్ళు మొదట రాజకీయాలని . తరువాత సాహిత్యాన్ని, తరువాత అన్ని రంగాలని ఆక్రమించుకున్నారు. దాని దుష్ఫలితాలని మనం ఇప్పుడు చూస్తూనే వున్నాము. ఒకప్పుడు సత్యనారాయణ పురం లో “సత్య హరిశ్చంద్ర” నాటకం వేస్తే  తెల్లవారుజామున మూడు గంటల దాకా మేలుకుని వుండి  నాటకం చూసే వాళ్ళం. సత్యం పలకడం కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవాలని స్థిర నిశ్చయం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు నాటకం చూపిస్తే ” సత్యం చెపితే ఇన్ని కష్టాలు వస్తాయి కనుక సత్యం చస్తే చెప్పకూడదు” అనే నిర్ణయం  తీసుకుంటున్నారు. నియో రిచ్ వర్గం సమాజం లోని అన్ని విలువలని ధ్వంసం చేసింది . ఒక్క డబ్బు సంపాదించడం అనే కల ని తప్ప. ఎలాగైనా డబ్బు సంపాదించు. అదే ఇప్పటి నినాదం.
 జీవితం లో అసంతృప్తి మీద ఇన్ని కధలు రాసారు కదా మీకు జీవితం లో అసంతృప్తి ఉందా ?
లేదు. నాకు జీవితం లో అసంతృప్తి లేదు. విశ్వనాధ తో శిష్యరికం దగ్గర నుండి, లయోలా కళాశాలలో  అధ్యాపక జీవితం మీద గా ఇప్పటి వరకు నాకు జీవితం లో ఎలాంటి అసంతృప్తీ లేదు, నా సహచరులు నన్ను ప్రేమించారు. నా విద్యార్ధులు నన్ను గౌరవించారు. నా రీడర్స్ నన్ను అభిమానించారు. జీవితం లో కొన్ని కష్టాలు, నష్టాలు వుంటాయి. అవి తప్పని సరి విషాదాలు. వాటిని యదా తదం గా తీసుకున్నాను. కనుక నాకు ఎలాంటి అసంతృప్తీ లేదు.