“హలో”
“హలో …. ఏం చేస్తున్నావ్? “
“…….. పేపర్ చదువుతున్నాను. నువ్వేం చేస్తున్నావ్? “
“…….”
“ఏంటి? అక్కడ మబ్బుగా ఉందా? వర్షం పడుతోందా? “
“హే .. నీకెలా తెలుసు? ఓ .. న్యూస్లో స్క్రోల్ వేశాడా “
“స్క్రోల్ లేదు రీల్ లేదు. మబ్బుపట్టినప్పుడో, వర్షం పడినప్పుడోనే కదా నీకు నేను ఇంతపొద్దున్నేగుర్తొస్తాను.”
చిరునవ్వు శబ్దం. “అవును. ఈ ఉదయం అద్భుతంగా ఉంది. పైనంతా నల్లమబులు. టైం ఏడైనా ఇంకా వెలుగు రాలేదు. చల్లటి గాలి. ఏ సమయంలో అయినా పెద్ద వాన కురిసేట్టుగా ఉంది. “
“ఊ…”
“ఇలాంటి సమయాల్లో నీతో మాట్లాడితేనే కదా. ఆనందం పరిపూర్ణమయ్యేది. “ తేనె చుక్కొకటి ఆమె గొంతులోంచి మొబయిల్ తరంగాల ద్వారా అతని చెవులో దూరి, అక్కడినుండి గుండెలోకి జారింది.
అతనేదో అనబోయి మళ్ళీ ఊరుకున్నాడు.
“పైన ఇలా నల్ల మబ్బుల్లో మునిగిపోయిన ఆకాశం, తనువుని చుట్టేస్తూ చల్లటి గాలి, క్రింద చల్లగా నేల, ఎదురుగా నువ్వు కూడా ఉండుంటే ఈ దృశ్యం పూర్తయ్యుండేది. పోనీలే ఈ ఫోనయినా ఉంది కనిపించని వారధి మీంచి నిన్ను తీసుకొచ్చి నా కళ్ళముందు నిలబెట్టడానికి. “ ఈ సారి, జారిన తేనె చుక్క అతని గుండె నిండా వ్యాకోచించి బరువుగా ఊయలూగింది.
***
“హలో …”
“ఏం చేస్తున్నావ్? “
“ఏముంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ వెబ్సైట్ చూస్తున్నాను. దగ్గర్లో ఏదైనా కోర్సు ఉందేమో చూద్దామని. “
“ఆర్ట్ ఆఫ్ లవింగ్ ఎంతో బాగా తెలిసిన దానివి, నీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎందుకు?”
“…”
“చెప్పు… ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది జీవితాన్ని ప్రేమిస్తూ బ్రతకడం తెలీని వాళ్ళకేమో. నీకెందుకు? నీ క్షణాలన్నీ మన ప్రేమతో రాగరంజితంగానే ఉన్నాయి కదా. ఏం లేవా? “ రెట్టించాడు.
అతని ప్రశ్నకేం చెప్పాలో వెంటనే ఆమెకు తెలీలేదు.
“మాట్లాడవేం? “
“ఏం మాట్లాడను? నువ్వంత ఖచ్చితంగా చెప్పాక? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరికీ. జీవితాన్ని మరింత కాంతివంతం చేసుకోవడానికి అని మాత్రమే చెప్పగలనేమో ఈ క్షణంలో. “
“ఊ.. ఏమయింది? ఏదైనా సమస్యా? “
“ఛా.. ఏ సమస్యా లేదు. “
“లేదు . ఏదో ఉంది. నీ గొంతులో తేడా ఆ మాత్రం గమనించలేనా? నాతో చెప్పవా? ”
“ఏంలేదన్నాగా! ఏమైనా ఉంటే నీ దగ్గర దాస్తానా? “
“దాస్తున్నావ్. లేదని నువ్వంటున్నావ్. కానీ, ఏదో ఉంది. బహుశా అది నీక్కూడా తెలీట్లేదేమో. నా మీద బెంగా? ఈ వీకెండ్ రానా హైదరాబాదుకి?” అతని గొంతులోంచి ప్రేమ తరంగం ఆమె హృదయాన్ని తాకింది.
తడిసిన హృదయాన్ని అనుభూతించడంలో పడిపోయి తన లోపలెక్కడో అస్పష్టంగా రూపు దిద్దుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా “ఊ… “ అంది.
ఆ తరువాత అయోమయంగా గొంతు సవరించుకుని ఏదో చెప్పాలని చూసింది.
“బ్యూటిఫుల్. ఈ వీకెండ్ నీ సమక్షంలో.. ఉంటాను. ఇక రెండు రోజులేగా ఉంది. మళ్ళీ మాట్లాడదాం. “
అతని గొంతులో ఆనందంతో కూడిన హడావిడి.
***
కొన్ని నెలల తరువాత.
“హలో ..”
“హలో ..” అతని గొంతులో కోపం.
“ఏం చేస్తున్నావ్? “
“ఏం చేస్తాను? ఆఫీసులో ఉన్నాను. పని చేస్తున్నాను. నువ్వేంచేస్తున్నావేంటి?”
“నాన్నగారి ఎల్.ఎఫ్.సీ లో టూర్ వచ్చాం. ఊటీ రోజ్ గార్డెన్లో ఉన్నాను. “ ఆమె గొంతులో తొణకని మెత్తదనం.
“ఊ.. ఆ గులాబీలన్నీ చూసేసరికి నేను గుర్తొచ్చాను. “ వెటకారం.
“అవును, చాలా ఆహ్లాదంగా ఉంది. వర్షాలు పడుతున్నాయ్ ఇక్కడ. నీ ముఖమంత వెడల్పైన గులాబీలు కూడా ఉన్నాయ్. మేఘాలు నా మీదనుంచి సాగిపోతున్నాయ్. “ ఎప్పటిలాగే ఆమె గొంతులో పరవశం. కానీ, ఆ పరవశం అతని హృదయాన్ని చేరలేదు. అడ్డంగా ఏదో పొర. అది అహమా? కోపమా ? ఏమో.
“జీవితమంతా ఇలా నీకు పరవశం కలిగినప్పుడల్లా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటావా? ఇంతేనా ఇంక? ఆ పరవశాన్ని నాతో కలిసి నేరుగా పంచుకోవడానికి మాత్రం విముఖత చూపిస్తావ్. ప్రేమంటావ్. ప్రేమకి పెళ్ళి పరాకాష్ట కాదా? ఎన్నేళ్ళిలా? దూర దూరంగా? “
ఆమె కాసేపు విస్తుపోయింది. రేండు క్షణాల మౌనం తరువాత అంది.
“దూర దూరంగా ఎక్కడున్నాం? నా దృష్టిలో ఎప్పుడో మనిద్దరం ఒకటయ్యాం. నాలోనే ఉన్నావ్ నువ్వు. అసలు నిన్ను తల్చుకోని క్షణం నిద్రలో కూడా లేదు నాకు. నువ్వు నా ప్రాణానివి కావా. నీకు తెలీదా? “
“నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం .. సినిమా లిరిక్స్ చెబితే జీవితం గడిచిపోదు. నేనే నీలో ఉన్నానని అంటున్నదానివి నాతో పెళ్ళెందుకు వద్దంటున్నావ్?”
“ పెళ్ళి ప్రేమని కలుషితం చేసేస్తుంది. ఈ ప్రేమ భావనలెంత బావున్నాయ్? నీ గురించి తల్చుకోవడం. నువ్వు నా గురించి తల్చుకోవడం. ఇంత ఇష్టంగా మాట్లాడుకోవడం ఏవీ పెళ్ళయ్యాక ఉండవు. ఈ ఆనందం ఉండదు. ప్రేమలేని యాంత్రిక జీవనం నాకిష్టం లేదు.“ ఆమె గొంతులో మెత్తదనం ఏ మాత్రం సడలలేదు.
“అలా ఎందుకనుకుంటున్నావు? ఎవరో ఒకరిద్దరి జీవితం అలా అయిందని అందరిదీ అలాగే ఉంటుందనుకుంటే తప్పే కదా… అసలు నా ప్రేమ మీదే నీకు నమ్మకం లేదనుకుంటా. “
“కాదు. మనుషుల మీద నమ్మకం లేదు. మనిద్దరం ఒకటయ్యాక , మన చుట్టూ ఉండే మనుషులమీద నమ్మకం లేదు. ప్రేమలో మునిగి , ప్రేమలో తేలిపోతూ జీవితం గడిపేద్దామనుకునే మన మనస్తత్వాల్ని కూడా మార్చేస్తారు. ఒకరి మీదొకరికి కోపం పుట్టేలా చేస్తారు. పరిస్థితులూ అలాగే వస్తాయ్. పెళ్ళయిన కొద్ది కాలానికి పెరిగే బాధ్యతల వల్ల ఇద్దరికీ ఒకరిపై ఒకరికుండే ఇష్టం , గౌరవం తగ్గిపోతాయ్. విసుక్కుంటూ, అసంతృప్తిగా జీవితాన్ని బలవంతంగా నెట్టుకు రావాలి. “
“నువ్వు చెప్పే లాజిక్ కి ప్రేమించుకున్నవాళ్ళెవరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ముద్దూ, ముచ్చటా లేకుండా అలా ఉండిపోవాలా?”
“అందరి ప్రేమికుల సంగతీ నాకెందుకు? నువ్వు , నేను వేరు అనుకోవడంలేదు నేను. నా ఊపిరిలో ఉన్నావ్. నాకు ఏ బాధ కలిగినా, ఆనందం కలిగినా నా మనసులో మెదిలే మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. నిన్ను ఆ స్థానం నుంచి ఈ జన్మలో ఎప్పటికీ దింపే సాహసం నేను చెయ్యలేను. పెళ్ళయితే నా నుంచి ఏవేవో ఎక్స్పెక్ట్ చేసే నీ వాళ్ళ ద్వారా, నీ నుంచి ఏవేవో ఎక్స్పెక్ట్ చేసే నా వాళ్ళ ద్వారా , వారి అసంతృప్తిలోంచి కలిసిపోయిన మనిద్దరి మనసుల్లోనూ కనపడని చీలిక మొదలవుతుంది. అదే మన ప్రేమని మెల్లమెల్లగా మింగేస్తుంది. ఆ రకంగా నీకు నేను భార్యగా దగ్గరగా ఉండీ మానసికంగా దూరమవడం నేను భరించలేను. “
“అందరూ ఇలాగే అనుకుంటున్నారా? ఇక అయితే మనం ఎప్పటికీ కలిసి ఉండలేనప్పుడు మన ప్రేమకి విలువేముంది? అయినా అలా ఒంటరిగా ఉండిపోయి ప్రేమ ప్రేమ అని తలుచుకుంటూ ఏం సాధిస్తాం? ప్రేమతో దగ్గరైతేనేగా ఒక చక్కటి కుటుంబాన్ని తయారుచేసుకోగలం? “ కటువుగా అతని మాటలు.
“డార్విన్స్ థియరీ ఆఫ్ నేచురల్ సెలెక్షన్ తెలుసు కదా నీకు. అలాగే కుటుంబ జీవితం గడపాలంటే కూడా అర్హమైన స్వభావం కావాలి. అది నాకు లేదు.
మనుషుల్లో మంచిని తప్ప చెడుని భరించలేకపోతున్నాను. అన్నీ ఆనందం కలిగించే పనులు , ఆనందాన్నో, ఆహ్లాదాన్నో ఎదీ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాటలో తప్ప ఎటువంటి వ్యతిరేకమైన భావాలూ, మాటలూ నేను మనుషుల్నుంచి స్వీకరించలేకపోతున్నాను. కుటుంబంలో కొత్త మనిషి రావడంతోనే వ్యతిరేక భావాలూ, విమర్శలూ వాటంతటవే వచ్చి చేరుతూంటాయ్. అవన్నీ తేలిగ్గా తీసుకోగలిగేవాళ్ళే పెళ్ళి చేసుకోవాలి. నేనందుకు అర్హురాలిని కాదు. అర్థం చేసుకో. “
“ఏ డాక్టర్ దగ్గరికి వెళితే నీ పిచ్చికి మందు దొరుకుతుందో నేను చెప్పలేను. కానీ, ఒకటి విను. ఇంట్లో నన్ను పెళ్ళి చేసుకోమని తొందర చేస్తున్నారు. ఇప్పటికే నీ నిర్ణయంలో మార్పు కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉండిపోయాను. జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా అలా ఉండిపోలేం. పెళ్ళి చేసుకోకుండా కలిసి ఒకచోటా ఉండలేం కదా. సంబంధాలు చూస్తున్నారు. రేపో, మాపో నా ప్రమేయం లేకుండానే పెళ్ళి చేసినా చేసేస్తారు. “
***
ముప్ఫై సంవత్సరాల తరువాత…
బీచ్ ఒడ్డున ఒక కాఫీ షాప్లో వాళ్ళిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు.
ఆమె అతని ముఖంలోకి చూస్తూ చాలా సేపు ఒక అలౌకిక స్థితిలోకి వెళ్లిపోయింది.
అతను దగ్గాడు పొడిగా.
వెంటనే చూపుల్ని తరంగాల మీదకి మరల్చింది.
“నీ కళ్ళలో అదే ఆరాధన ఇంకా నా మీద …. “ అనకూడదనుకుంటూనే పైకే అనేశాడతను.
నవ్విందామె కెరటాల మీద నుంచి చూపులు తిప్పకుండా.
“ఎంత మంది పిల్లలు?”
“ఇద్దరూ అబ్బాయిలే. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడ నేనూ, నా భార్యా. తను చాలా మంచిది. అనుకూలవతి. “ ఇంకా ఏదో చెప్పబోయాడు.
చప్పున అతని కళ్ళలోకి చూసిందామె. “అనుకూలవతి అని నీ చేత అనిపించుకోవడానికి తను ఎన్ని ఒదులుకుని ఉంటుందో, ఎన్ని భరించి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? “
ఉలిక్కిపడ్డాడతను. ఇటువంటి ప్రశ్న ఆమె నుంచి అతను ఎదురుచూడలేదు.
“నీ సంగతి చెప్పు. ఒంటరిగా మిగిలిపోయి ఏం సాధించావ్? “
“చాలా సాధించాను. నా ప్రేమని కాపాడుకుంటూనే , నా స్వేచ్చని కోల్పోకుండానే . తృప్తిగానే ఉన్నాను నేను. లోటేమీ లేదు. “
“ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చి చెబుతున్నావు కానీ, ఇలా ఒంటరిగా ఉండటంలో ఎంత బాధ ఉంటుందో తెలీనిదా? “
“నేను ఒంటరిగా లేను. నేను బ్రతకగలిగిన వాతావరణం ఇదే మరి. అందులోనే ఉన్నాను కాబట్టే జీవితాన్ని ఇంత తృప్తిగా గడుపుతున్నాను. నేనెంత బిజీగా ఉంటానో, ఎన్ని పుస్తకాలు నా చుట్టూ ఉండి నిరంతరం నన్ను చదువుతూ, శోధిస్తూ ఉంటాయో నీకు తెలీదు. నా ఇంటి తోట చూస్తావా. ఎన్ని మొక్కలు ప్రతి రోజూ నన్ను కొత్తగా వికసింపజేస్తాయో. ఎక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినా వెళతాను. ప్రతి చిత్రంలోనూ కొత్త భావాన్ని చూస్తాను చూపుల్ని పంజరంలోంచి బయటికెగరేసి స్వేఛ్ఛగా. ఇంకా చాలా ఉన్నాయ్. నా ఇంటి చుట్టూ ఉన్న పిల్లలకి కొత్త కొత్త కథలు చెబుతూ, వాళ్ళని ఆడిస్తూ ఉంటే వాళ్ళు నాకెన్ని నేర్పిస్తారో.“
ఇంకా అర్థంకానట్టే చూశాడతను.
“ప్రేమని కాపాడుకుంటూనే అన్నావ్. అంటే ..నన్ను మర్చిపోలేదా నువ్వు? “
“పిచ్చి ప్రశ్న. మర్చిపోవడానికా నీతో పెళ్ళి వద్దన్నది?”
“మరెలా తట్టుకున్నావ్? నా పెళ్ళి అవుతూనే నాకు ఫోన్ చెయ్యడం కూడా మానేశావ్. “
ఆమె తన హాండ్బేగ్లోంచి ఒక లావు పుస్తకం తీసి అతని ముందు పెట్టింది.
“నీతో మాట్లాడాలనిపించిన ప్రతి సారీ, ఓ కవిత వ్రాసుకోవడం ద్వారా” అంది.
“సావిరహే .. “ అందంగా టైటిల్ ముద్రించి ఉన్న ఆ పుస్తకాన్ని అప్రయత్నంగా తడుముతూ పేజీలు తిప్పాడు.
ఎదురుగా కనిపిస్తున్న సముద్రంలా లోతైన కవిత్వం. విరహ బాధేమీ ఎక్కువ లేదు. వ్రాసిన ప్రతి వాక్యమూ ఆహ్లాధభరితంగా వాన గాలిలా ఉత్తేజపరుస్తూ, ఉల్లాసపరుస్తూ, ఉపశమనాన్నిస్తూ. అలా ఎంత సేపు ఆ కవితలు చదువుతూ ఉండిపోయాడో. నిజానికతనికి కవిత్వం మీద ఆసక్తి లేదు. కానీ, ఆమె వచన కవితలు అతన్ని అంతలా చదివించాయ్. ప్రియురాలు ఎన్నో రకాల ఊసులు తన పియుడితో చెబుతున్నట్టు ఉన్న కవిత్వం.
అతని కళ్ళలో చెమ్మ. ఆమె కళ్ళలో ఏమాత్రం వెలుగు తగ్గని ప్రేమ.
“ఎందుకిలా? ఇంత ప్రేమ నా మీద పెట్టుకుని, ఇలా ఒంటరిగా ఉండిపోయి ఏం సాధించావ్? “ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడతను.
ఆమె కెరటాల వైపు చూపించింది.
పైకెగసిన ప్రతి కెరటం తీరాన్ని తాకడంలేదు. కొన్ని కెరటాలు తమలోకి తాము ముడుచుకుంటున్నాయ్. కొన్ని తమని తాము శోధించుకున్నట్టుగా కనపడుతున్నాయ్. ఆ కెరటాల వెనుక చిన్నగా అలలు కదుతున్నాయ్. ఆకాశం మీదున్న ప్రేమ దేహంపై మెరిపిస్తూనే ఏ ఉద్వేగానికీ లోనవనట్టుగా. ఏ వత్తిడికీ తమ అస్తిత్వాన్ని కోల్పోనట్టుగా.
**** (*) ****
కథనం, కథాంశం రెండూ చక్కగా ఉన్నాయి ప్రసూన గారూ! మీకు ఎన్నో అభినందనలు!!
ధన్యవాదాలు రాజేష్ గారూ.
వండర్ఫుల్… ప్రసూన గారు .
కథ నచ్చినందుకు ధన్యవాదాలు వనజ గారూ.
ప్రసూన గారు….మీ కధ చదివాను.చక్కటి శైలి మీది..చదువరులను విసిగించకుండా సాగింది..కానీ….పరిపూర్ణం అని మీరు పెట్టిన శీర్షిక కి ఇది ఆప్ట్ గ లేదనిపించింది..ఆమె అంత ప్రేమించి పెళ్లి వద్దనటానికి చెప్పిన కొన్ని కారణాలలో..మంచిని తప్ప చెడు ని స్వీకరించలేకపోతున్న. ..ప్రేమ తగ్గిపోతుంది ఇలా చెప్పారు..పరిపూర్ణత అంటే ఎంటండి…కష్టాలు వద్దని..avoid..చేయడమా …..పరిపూర్ణం అంటే అన్నీ andi..మంచి చెడు ..కష్టం సుఖం..ఇవన్ని అనుభవించినా..అన్నిటిలోనూ ఒకరికొకరు తోడు నీడయ్యి..ప్రేమ ను చెదరకుండా కాపాడుకుంటే అది పరిపూర్ణం అవ్తుంది ..కానీ అవన్నీ ఎదుర్కోవల్సోస్తుందని వాటినే తప్పించుకోవడం ..అ స్వభావం నాలో లేదు అన్నప్పుడు అది అసంపూర్ణం అవ్తుంది…థాంక్ u
సరళా మోహన్ గారూ. నా కథకు స్పందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కథకు పరిపూర్ణం అని శీర్షిక ఎందుకు పెట్టానంటే, కథానాయకురాలు తన స్వభావాన్ని బట్టి తీసుకున్న నిర్ణయం ద్వారా జీవన గమనంలో తన ప్రవృత్తినే తోడుగా ఎంచుకుని తృప్తిగా జీవిస్తోంది అని చెప్పడానికి. జీవితంలో చాలా సందర్భాల్లో మనం కొన్ని పొందాలంటే కొన్ని ఒదులుకోవాల్సి ఉంటుంది. వేటి కోసం వేటిని ఒదులుకోవాలి అనేది మన ప్రాధాన్యతల మీద, మన స్వభావాల మీదా ఆధారపడి ఉంటుంది అని అనుకుంటాను. ఇక్కడ తను ప్రేమ భావలనలందించే మధురానుభూతులు ఎప్పటికీ చెక్కుచెదరకూడదని కోరుకుంది. కథలో నేను చర్చించిన కొన్ని విషయాలు వాస్తవాలు. అంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, బాధ్యతల బరువు వగైరా పెరిగేసరికి ప్రేమలో ఉన్నప్పటి మాధుర్యం కొంత కోల్పోతామన్నది కాదలేని నిజమనే నేను అనుకుంటున్నాను. కథానాయిక స్వభావాన్ని బట్టి ఈ శీర్షిక సరయినదే అనిపించింది.
ఒక తాత్విక ప్రేమ భావన ఉంది మీ ఈ కథలో,చాలా నచ్చింది నాకు .అతని కళ్ళలో చెమ్మ. ఆమె కళ్ళలో ఏమాత్రం వెలుగు తగ్గని ప్రేమ.ఎంత అద్భుత వాక్యాలు .కథ చాలా చాలా బాగుంది ప్రసూన గారు.కవిత్వ భావాలతో రాసిన కథ.
అభినందనలు.
తిలక్ గారూ, కథ నచ్చినందుకు మీకు ధన్యవాదాలండీ.
తేనె చుక్కొకటి ఆమె గొంతులోంచి మొబయిల్ తరంగాల ద్వారా అతని చెవులో దూరి, అక్కడినుండి గుండెలోకి జారింది.Very Nice
అవును ప్రసూన గారు..మీ ప్రతిస్పందనకు …మీ వివరణకు ధన్యవాదములు ..నిజమే మీరు చెప్పింది..కొన్ని పొందాలంటే కొన్ని వదులుకొవలిసిన్దె …ప్రేమించి పెల్లిచేసుకున్నవారు ప్రేమ మాధుర్యాన్ని కొంత కోల్పోతరన్నది నిజమే ప్రసూన గారు..ఐ ఉండవచు ..కానీ..కష్టం లేకపోతే సుఖం విలువ…..బాధ్యత లేకపోతే బంధం విలువ..ఏమివుంటుంది….ఆమె కూడా కొన్ని కాదు చాల వదులుకున్నారు ..ప్రసూన గారు..బంధం ముడుపడితే వచ్చే చాల వాటిని వదులుకున్నారు ..కానీ అవన్నీ ఆమె ద్రుష్టి లో విలువ లేనివి…తన ప్రేమ భావన ..తను మిగిలిన వాటిలో పొందుతున్న ఆనందాల కన్నా మిగిలినవన్నీ విలువలేనివి ..అంటే అక్కడ తను తన ఆనందానికే ప్రాధాన్యం ఇచారు ..తన ప్రేమ భావన చెదరకూడదని ప్రేమించిన వ్యక్తి కె దూరమయ్యారు ..ఇది ఒకరకమైన అభద్రతా భావన ….అతనిని వేరే! జీవితం ..గడపమన్నారు..ప్రేమించిన వ్యక్తి బాధ పడిన దానికన్నా తన ప్రేమ తగ్గకుండా తన మనసులో ఉండటానికే ప్రాధాన్యం ఇచారు ..మల్లి అతనిని ఆలంబనగా …స్వాంతనగాp భావిస్తూనే వున్నారు..అలా మనసులో ఆరాధిస్తూ బాధలు లేకుండా నచినదాన్ని ఆనందిస్తూ ఉండిపోవడం ఆమె ద్రుష్టి కి అది పరిపూర్ణం …
ఒక ప్రేమ కథ బావుంది.
కథ నచ్చినందుకు ధన్యవాదాలు దమయంతి గారూ.
ఆమెకు తెలిసిన ప్రేమ అతనికి తెలియలేదు, అలాగని ఆమె అతనిని కోల్పోలేదు. చక్కటి కధ.
ధన్యవాదాలు ప్రవీణగారూ.
కథ, కథనం, శైలి, ముగింపు అన్నీ బాగున్నాయి. అభినందనలు.
ధన్యవాదాలు ఉమామహేశ్వరరావు గారూ.
Prasuna Garu,
It’s indeed a matured concept and an apt title. When it is read from the point of view of ‘her’ any one can fully relate to what she is saying and where she is coming from. I particularly liked your last paragraph- analogy with the waves of the ocean.A heart touching nice story!
థాంక్యూ వెరీ మచ్ వల్లీ గారూ.
ప్రేమ కధ చాలా బావుంది
థాంక్యూ వీరా రెడ్డి గారు.
సింపుల్ గా.. వావ్……
థాంక్యూ అనూష గారూ.