డైరీ

మై బంజారన్!

మే 2015

చెరుకు తోట కోతకొచ్చింది. కోసిన పంట కోసినట్లే బోగీలలో వేసుకుని గూడ్సు బండ్లు ‘కూ…’ అంటూ షుగర్ ఫ్యాక్టరీకేసి పరుగులు తీస్తున్నాయి. బోగీల వెంట పరిగెత్తి టాటాలు చెప్పేవాళ్ళతో… చెరుకులు లాగే పిల్లలతో ఊరికి ఈ చివరంతా అదో సందడిగా వుంది. దూరమవుతున్న బోగీని అనుకరిస్తూ మేమంతా ‘కూ… చుక్..చుక్..చుక్’ మంటూ కొండ పైకి పరిగెత్తాం.

తెచ్చుకున్న చెరుకులని ఆ కొస నుండి ఈ కొస వరకూ చచకా నమిలి తాగేసి ఆటల్లో పడ్డాం. సమయం తెలియటం లేదు. వున్నట్లుండి మాలో ఏవరో గట్టిగా అరిచారు “అదిగదిగదిగో వాళ్ళే!” అంటూ. “అవునవును మన ఊరికే!” అన్నారింకెవరో. “హొ! హొ! హో! వచ్చేస్తున్నారోచ్!” ఉద్వేగం పట్టలేక అరిచారు మరెవరో. కొద్ది క్షణాలు అందరం ఆ కొండ మీద రాళ్ళలాగే కదలక మెదలక కళ్ళూ నోరు విప్పార్చుకుని చూస్తుండి పోయాం.

దూరంగా కొండల వెనుక ఎర్రటి ఛాయ మాత్రమే వుంది. ఆ వైపు నుండే సుడిగాలేదో గిరగిరా తిరుగుతూ కదిలి వస్తున్నట్లు వేగంగా వస్తున్నారు వాళ్ళు. ‘ఝణ ఝణ ఝణ – ఝణ ఝణ ఝణ’ – మంటూ… అస్పష్టమైన ధ్వని గాలిలో తేలివస్తోంది. క్షణాల్లో తేరుకుని మేమందరం కొండ క్రిందకి పరిగెత్తాం. కొంత మంది ఆవు దూడల్లా చెంగున దూకుతూ వెళ్తే, మరి కొందరు గులక రాళ్ళలా దొర్లి పోతూ క్రిందకి పరుగుపెట్టాం.
అప్పటికే మా వూరొచ్చి గుడారాలు వేసుకుని వుంటున్న మరో తండా ఎక్కడి పనులు అక్కడే ఆపి వాళ్ళని స్వాగతించడానికి ఎదురెళ్ళారు.
మేమూ వాళ్ళతో కలిసాం. ముందర జట్లు జట్లుగా మొగవాళ్ళు. అందరి చేతుల్లో మూటలు. కొంత మంది బుజాల మీద చిన్న పిల్లలు. వాళ్ళ వెనుకాల అంతే వేగంతో నడవలేక పరిగెడుతూ వస్తున్న కాస్త పెద్ద పిల్లలు. ఆదిగో వాళ్ళ వెనుక – కాళ్ళ కడియాలు, చేతులకి ఆ వైపునుండి ఈవైపు వరకూ ఉన్న దంతపు గాజులు , మెడలో గొలుసులు కణకణ మంటూ చప్పుళ్ళు చేస్తూ… తలపైన కుండలు, బిందెలతో ఆడవాళ్ళు. వరసలు కట్టి వచ్చేస్తున్నారు… వచ్చేస్తున్నారు… వచ్చేసారు.

ఊరిలో గుంపు ఎదురెళ్ళారు. రెండు చేతులు చాచి ఆహ్వానించారు. గుండెలకి హత్తుకున్నారు. అలా వొచ్చి చేరిన స్త్రీలు, అక్కడే వున్న వాళ్ళతో కలిసి వలయాకారంలో నిలుచున్నారు. ఎవరు ముందుగా మొదలు పెట్టారో… ఓ ఆలాపనలా… తీగలా ఒకరినుండి ఒకరికి పాకి నెమ్మది నెమ్మదిగా వాళ్ళ దుఃఖం తారాస్థాయిని అందుకుంది. నెమ్మదిగా కదులుతూ – తలపైన కొంగుని ముఖం పైకి లాక్కుంటూ – అప్పుడప్పుడు చేతులతో గుండెలు బాదుకుంటూ – ఆభరణాల లయతో ఆ కదలికే నృత్యం. వాళ్ళ రాగమే పాట. కలిసి అదో బృందగానం.

కళ్ళప్పగించి చూస్తున్న నా బుజం పైన ఎవరిదో చెయ్యి పడింది. ఎప్పుడొచ్చి నిల్చుందో నా వెనకాలే చిన్నక్క. కళ్ళతోనే ‘పద ‘ అంది.
ఆటల్లో పడి ఊర్లో ఏ మూలో చేరితే చిన్నన్నో , అక్కో వెతుక్కుంటూ రావడం మాములే.

“ఎందుకలా?” అక్క చెయ్యి పట్టుకుని నడుస్తూ అడిగాను.

“ఎవరెక్కడ వుంటారో తెలియదు. ఎన్నాళ్ళకి కలుసుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు చెరుకు కొయ్యడానికి వచ్చి ఇలా కలిసారు.
వెళ్ళేముందుకూడా అందుకే ఏడుస్తారు”.

“ఉత్తరాలు రాసుకోవచ్చుగా?!”.

“చదువుకోలేదుగా!”.

“లేకపోతేనే? గంగారాం వాళ్ళలా అమ్మతోనో, నాన్నతోనో రాయించుకోవచ్చుగా?”.

“ఊరూరు తిరుగుతుంటారు. ఒక చోటే వుండరు. ఎడ్రస్సే లేనప్పుడు ఉత్తరాలెందుకు”.

“ఎందుకలా తిరగ…”

“ఇంక నీ ప్రశ్నలు ఆపుతావా?”

***

ఇంటి కొచ్చేటప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. పెద్దక్క నుండి వచ్చిన ఉత్తరం గట్టు పైన వుంది. శ్రీకాకుళం నుండి వీరన్నగుట్ట చేరడానికి వారం రోజులు తీసుకునే ఉత్తరం. నెలకి రెండు సార్లు ఠంచన్గా వచ్చే ఉత్తరం. “అందరం చదివేసాం. తీగకి గుచ్చేసెయ్” అంది అమ్మ.

అల్మారాలోనుండి ఉత్తరాల తీగని తీసాను. ఒక చివరని గుండ్రంగా చక్రాలలా తిప్పి… పై చివర ఒంపు తిరిగి మధ్యలో గుత్తిగా గుచ్చివున్న వుత్తరాలు. నాన్నే తయారు చేస్తారు అలా. అక్క రాసినవి, రాజమండ్రి నుండి పెద్దన్న రాసినవి. హైద్రాబాద్ నుండి… అమలాపురం నుండి ఎన్నెన్నో. తీగ బుట్టని పక్కన పెట్టి అక్క ఉత్తరం చేతిలోకి తీసుకున్నాను.

కవరు విప్పితే ముత్యాలు పేర్చినట్లు రెండున్నర పేజీల విశేషాలు. అక్కడే నేల పైన బోర్లా పడుక్కుని చదివాను. మ చుక్క, రా చుక్క… మ.రా. నాన్నగారికి. మ చుక్క… మ.ల.స. అమ్మకి ప్రభ నమస్కరించి వ్రాయునది. మేము ఇక్కడ కులాసా. మీరందరూ క్షేమమని తలుస్తాను…

***

మనిషిని మనిషికి దగ్గర చేస్తూ… ప్రపంచాన్ని చిన్నది చేసే ప్రయత్నంలో రన్వే పైన విమానాలు వచ్చి వెళ్తున్నాయి. తీగల అవసరం లేని వార్త క్షణాల్లో కళ్ళముందు ప్రత్యక్షమవుతోంది. అన్నీ వుండి ట్రాన్సిట్లో వంటరిగా కూర్చున్న ఈ క్షణాల్లో – ఏ వైపునుండి ఏవైపుకి వెళ్తోందో తెలియని అయోమయంలో జీవితం కొట్టుమిట్టాడుతోంది.

దూరాన్ని కాలంతో కొలవడం మాని తీరికతో కొలవడం సాధారణమై – కలుసుకోలేనితనాలకి వేల కారణాలు చెప్పే వాళ్ళు తారసపడుతునే వున్నారు. మేము మాత్రం ఎక్కడ కలుస్తున్నామని చిన్ననాటి జ్ఞాపకాలలో తప్ప.

పోనీ కలిసిన ఆ నాలుగునాళ్ళు గుండెలు బాదుకుని వ్యక్త పరచ లేకపోయినా – కనీసం గొంతు విప్పి చెప్పలేక పోయిన ఆశక్తత ఏదో కళ్ళనీళ్లు తెప్పిస్తోంది. చెప్పాల్సింది చెప్పలేక ఇంకేదేదో చెప్పి తేలిపోయినందుకు నవ్వోస్తోంది.

నవ్వీ నవ్వని నవ్వు… రెప్పల అంచున దాగి దాగని తడి… విడీ విడలేని చేతుల కలయికా… అదేగా వీడుకోలంటే!

**** (*) ****