డైరీ

ఒక obese బంధం

మే 2015

వాళ్ళిద్దరి మధ్య బంధం నిలిచి ఉన్న నీళ్ళల్లో బాగా నాని, ఉబ్బిపోయిన శరీరంలా ఉంది. కదల్లేకుండా, ఆయాసపడుతూ ఉంది. చాన్నాళ్ళ తర్వాత చూశారేమో, వాళ్ళిద్దరూ మొదట గుర్తుపట్టలేదు దాన్ని.

ఇంతకు ముందు ఇంతిలా ఉండేది కాదుగా! ఇంత లావెక్కిపోయిందేంటి? – అని అవ్వాక్కయ్యారు ఇద్దరూ.

నిజమే, అదలా ఉండేది కాదు. మరీ సైజు జీరో కాకపోయినా, కొద్దో గొప్పో ఫిట్‌గానే ఉండేది వాళ్ళ పరిచమైన కొత్తల్లో. అంటే మరి, వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ ఆటపాటల్లో పాల్గొనాల్సి రావడంతో బంధానికి కసరత్తు బాగానే ఉండేది.

అలాగే ఉంటుందని అనుకున్నారు వాళ్ళిద్దరూ. అన్నీ అనుకున్నట్టే ఎక్కడ జరుగుతాయి? ఆఖరికి కథలకి కూడా అనూహ్యాలే ఆయువుపట్టు. రాజుగారి ఏడో చేప కూడా ఎండిపోతే, ఇహ కథేముంది?

మొదటే చెడిన బేరమే కనుక అప్పుడే వాళ్ళ బంధం ఎండగట్టుకొనిపోవాలి. వాళ్ళేమో, మళ్ళీ మాటా మాటా కలవకుండా పోతుందా అన్న ఆశతో కొన్నాళ్ళు కాలం గడిపారు. బంధాన్ని ఎటూ పదిమంది మధ్య పప్పన్నం పెట్టలేరు కనుక, రోడ్డు మీద కనపడ్డ బర్గర్-ఫింగర్ చిప్స్-కోక్‌లతో దాని కడుపు నింపారు. దొరికిందే పరమాన్నంగా భావించి పెట్టినదంతా తినడం అలవాటు చేసుకుంది.

మిగితా బంధాలైతే ఎంత తింటాయో అంతలా అరాయించుకుంటాయి. వాటికీ బోలెడన్ని బరువుబాధ్యతలు కదా, మరి? మెషీన్లురాని కాలంలో మనుషుల్లా వాటికి జిమ్‍లు, జుంబాలు అవసరం లేవు.

ఇదేమో టైమ్‍పాస్ బంధం. ఫేస్‍బుక్ వాల్ మీదో, ఈ-మెయిల్ సెర్చ్ లోనో, మ్యూచవల్ ఫ్రెండ్ గాసిప్‍‍లోనో అనుకోకుండా పేరు తగిలితే తప్ప వాళ్ళిద్దరికి వాళ్ళే గుర్తురారు. మళ్ళీ గుర్తొచ్చేంతవరకూ బంధాన్ని లైట్ తీసుకుంటుంటారు.

వాళ్ళ బంధం మాత్రం హెవీ (ఆండ్ డార్క్) తీసుకుంది. వాళ్ళ మీద బెంగ పెట్టుకుంది. తిండి లేక, నిద్ర రాక, చేయడానికి ఏమీ తోచక, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీక, అసలు వస్తారో రారో తేల్చుకోలేక, ఎదురు చూడాలో, అంతమైపోవాలో అర్థంకాక – అది డిప్రషన్ అంచుల్లో కొట్టుమిట్టాడింది.

ఫలితంగా బోలెడంత లావెక్కిపోయింది. వాళ్ళు ఎత్తలేనంత. కదపలేనంత!

వర్కవుట్ చేయిస్తే పనికిరావచ్చు – అన్నాడు అతడు.

నీకు మొదటినుండి చెప్తూనే ఉన్నా, ఇది వర్కవుట్ అయ్యేది కాదని – అంది ఆమె.

వాళ్ళిద్దరూ ఏం చేయాలన్నదాని మీద గొడవ పడ్డం మొదలెట్టారు. ఎన్నో సార్లు రిపీట్ చేసున్న డైయిల్ సీరియల్ చూస్తున్నట్టు వాళ్ళని చూస్తూ, వాళ్ళ బంధం వాళ్ళే తెచ్చిన జంక్ తింటూ ఉండిపోయింది.

**** (*) ****