సామాజిక సినిమాలు నేర్పుగా తీయటంలో నిష్ణాతుడైన “హృషీకేశ్ ముఖర్జీ” చేతుల్లో అందంగా ముస్తాబైన చిత్రం “అనుపమ”. “అనుపమ” అంటే ఉపమానం లేనిది.. సాటిలేనిది.. అని అర్థం. అటువంటి అనుపమానమైన పాత్రలో ‘షర్మిలా టాగూర్’ని మలిచారు ముఖర్జీ. బిమల్ రాయ్ వంటి ప్రఖ్యాత దర్శకుడి వద్ద ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన పనితనం ఈయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది.
చిత్రకథలోకి వెళ్తే అనుపమ ఒక ధనవంతుడి ఏకైక కుమార్తె. బయటవారికి ఆమె ఏ లోటు లేని రాజకుమార్తె. కానీ కుమార్తెకు జన్మనిచ్చాకే భార్య మరణించటం వల్ల కుమార్తెను దగ్గరకే రానివ్వడు ఆ తండ్రి. తండ్రి నిరాదరణకూ, కేకలకూ భయపడి నోరే తెరవకుండా పెరుగుతుంది అనుపమ. చెట్లు, ఆకులూ, పువ్వులు,పక్షులూ ఇవే ఆమె నేస్తాలు. ఆమెకు తన స్నేహితుడి కుమారుడు అరుణ్ తో సంబంధం కూడా ఖాయం చేస్తాడు తండ్రి. ఈలోపూ తన అనారోగ్యం వల్ల, డాక్టర్ సలహాపై విశ్రాంతి కోసం కూతురు తో “మహాబలేశ్వర్” వెళ్తాడు ఆయన. అక్కడ అరుణ్ స్నేహితుడు అశోక్ పరిచయమౌతాడు. సినిమాలో ఇక్కడి దాకా నాయిక నోటి వెంట ఒక్క డైలాగ్ కూడా వినం మనం. ఆమె అభినయం అంతా కళ్ళతోనే.
కథానాయకుడి చుట్టూ తిరుగుతూ, చాలీచాలని దుస్తులతో డాన్సులు చేస్తూ, అతడిని “ఏరా.. ఒరే..” అని పిలుస్తూ, వీలైతే రెండు మూడు పలక్కూడని పదాలు కూడా పలికే నాయిక ఈనాడు మనకి వెండితెరపై ఎక్కువగా కనిపిస్తోంది. యువత కూడా అదే లేటెస్ట్ ఫ్యాషన్ అని నమ్మేస్తున్నారు. డెభ్భైల్లో, ఎనభైల్లో వెండితెరపై నాయిక ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ముఖ్యంగా “అనుపమ”లో నాయికను చూస్తే గౌరవం, అభిమానం కలిగి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. వంద మాటలు, ఒకరిపై ఒకరు ఎగిరి మీదపడే పాటలు లేకుండా కూడా గాఢమైన ప్రేమను ప్రేక్షకులు అర్థం చేసుకునేలా చూపించవచ్చు అని ఈ సినిమా చెప్తుంది.
ఈ సినిమాలో అన్ని పాటలకు “హేమంత్ కుమార్” సంగీతాన్ని అందించారు. ”ధీరే ధీరే మచల్ ఏ దిలే బేకరార్ “, “క్యో ముఝే ఇత్నీ ఖుషీ దేదే కే ఘబ్రాతా హై దిల్”, “యా దిల్ కి సునో దునియా వాలో..”(ఇది నాకు బాగా నచ్చుతుంది), “భీగీ భీగీ ఫజా…” నాలుగూ బావుంటాయి. ప్రత్యేకంగా మాత్రం “కుచ్ దిల్ నే కహా..” పాట గురించి చెప్పుకోవాలి. పాటకు సందర్భోచితమైన సాహిత్యాన్ని ప్రముఖ ఉర్దూకవి, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ఎన్నో అద్భుతగీతాల సృష్టికర్త, “కైఫీ ఆజ్మీ“(షబానా ఆజ్మీ తండ్రి) అందించారు. తన మేజికల్ వాయిస్ తో ఈ పాటకు ప్రాణం పోశారు లతా మంగేష్కర్.
ఉమ,ఆశోక్ ల మధ్య ఆకర్షణ, ఆపై ప్రేమ చిగురించే సందర్భంలో ఎంతో సహజంగా, సున్నితంగా ఈ పాటను చిత్రీకరించారు ముఖర్జీ. అశోక్ పరిచయమయ్యాకా అనుపమ మనసులో కదలాడిన సంఘర్షణ ఈ పాటలో కనబడుతుంది. ఆహ్లాదకరమైన ఓ ఉదయాన కొండకోనల్లో చెట్ల మధ్యన తిరుగుతూ, పువ్వులతో,ప్రకృతితో సంభాషిస్తున్నట్లు “ఉమ” పాడుతుందీ పాటను. అప్పటిదాకా ఎవ్వరితోను మాట్లాడని ఆమెకు నేస్తాలు అవే మరి.
వాక్యార్థం:
ప : कुछ दिल ने कहा, कुछ भी नहीं
మనసేదో అందా…? ..ఏమీ లేదు..
कुछ दिल ने सुना, कुछ भी नहीं
మనసేదో విందా…? ..ఏమీ లేదు..
ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..
అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..
భావం: ఉమ మనసులో అలజడికి ప్రతీకలే ఈ వాక్యాలు. మనసేదో అనీ అననట్లు, మనసేదో వినీ విననట్లు అనిపిస్తుంది ఆమెకి. మనసులో ఇంతవరకూ తానెరుగని స్పందన కలుగుతోందనీ, అలా జరుగుతుంది.. అలా కూడా జరుగుతుంది అంటుంది ఆమె.
1చ: लेता हैं दिल अंगडाइयां.. इस दिल को समझाए कोई
మనసు విచ్చుకుంటోంది.. ఎవరైనా సర్దిచెప్పకూడదూ..
अरमा न आँखे खोल दे.. रुसवा न होजाए कोई
కోరిక వికసించేస్తే.. ఎవరైనా అవమానపడతారేమో..
पलकों की ठंडी सेज पर, सपनों की परियाँ सोती हैं..
చల్లని రెప్పల పానుపుపై, కలల దేవకన్యలు నిదురిస్తూంటారు..
ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..
అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..
భావం: ఇన్నాళ్ళు నిద్రపోయిన భావనేదో ఇప్పుడే రెక్క విప్పుకుంటోందనీ, ఆ కోరిక బహిర్గతమవకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటుంది ఆమె. కనురెప్పలపై కలల దేవకన్యలు నిద్ర పోతూంటారనీ.. వాళ్ళు గనుక నిద్రలేస్తే తన కలలన్నీ మేల్కొంటాయనీ.. తనలోని కోరిక మేల్కొంటే తండ్రి అవమానపడవచ్చని భయపడుతుంది.
.
2చ: दिल की तसल्ली के लिए, झूठी चमक झूठा निखार
మనసుని సంతృప్తి పరచటానికే ఈ అబధ్ధపు తళుకులు, అబధ్ధపు నిగారింపులు
जीवन तो सूना ही रहा.. सब समझे आई हैं बहार
జీవితం వెలితిగానే ఉంది.. అందరూ వసంతం వచ్చిందనుకున్నారు
कलियों से कोई पूछता.. हँसती हैं वो या रोती हैं ?
పూమొగ్గలనెవరు అడుగుతారు.. నవ్వుతున్నావా.. ఏడుస్తున్నావా.. అని ?
ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..
అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..
భావం: సిరిసంపదలనూ, హోదానూ ఇచ్చిన సింగారాలనూ, నిగారింపులనూ చూసి అంతా నా అదృష్టానికి ఈర్ష్యపడతారు కానీ నా జీవితమెంత నిస్సారంగా గడిచిందో..నా మనసెంత ఒంటరిదో ఎవరికి తెలుస్తుంది? అడవిలో పూసిన పూమొగ్గల క్షేమం అడుగుతారా ఎవరైనా అని తన మనస్థితిని
ఆ అడవి పూమొగ్గలతో పొలుస్తుంది ఆమె. బయటకు కనిపించేదంతా నిజం కాదనీ.. అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది అని ఆమె భావన.
ఈ పాటను ఇక్కడ వినవచ్చు:
http://smashits.saavn.com/audio/player.cfm?vt1xD5gO1JW9UM1N8nzOZGa9sN6UIjlN
చిత్రం చివరికొచ్చాకా తన ఇంటి తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయనీ, ఆమె ఎప్పుడైనా తన తలుపు తట్టవచ్చుననీ చెప్పి ఊరుకుంటాడు అశోక్. అమాయకురాలైన ఉమ ఎలా బయటకు రాగలదు? ఇంతటి నిర్దయుడివా? ఆమెనలా వదిలేస్తావా? అని అశోక్ ను నిలదీస్తుంది ఆమె స్నేహితురాలు. అప్పుడు అశోక్ చెప్తాడు.. ” ఇన్నాళ్ళు ఆమె తన లోకంలో తానే బ్రతికింది. ఇప్పుడు స్వేచ్ఛ కావాలంటే అది మరొకరి ప్రోద్బలంతో రాకూడదు. నే చెప్పవలసింది ఆమెకు చెప్పేసాను. ఇక ఆమె తనంతట తానుగా తన చుట్టూ ఏర్పరుచుకున్న ఒంటరితనపు సంకెళ్లను ఛేదించుకుని బయటకు రావాలి..” అని. ఆమెను ప్రేమించటమే కాక మానసికంగా ఆమెలో ఏర్పడిన శూన్యతను కూడా అతను మాయం చేసే ప్రయత్నం చేస్తాడు. అది ఈ కథలో గొప్పతనం. ఆఖరులో ఉమ తన తండ్రితో చెప్పే డైలాగ్స్ కూడా ఎంతో బావుంటాయి. యూట్యుబ్ లో ఈ సినిమా చూడవచ్చు.
http://www.youtube.com/watch?v=TT9JIX7pB8c
నాకో సందేహం తృష్ణ గారెప్పుడూ హిందీ పాటలు తప్ప తెలుగు పరిచయం చేయటం లేదు.
వాకిలి పత్రిక తెలుగుదే కదా!!
స్వర్ణ గారూ, హిందీపాటైనా పరిచయం వ్రాసినది తెలుగులోనే కదండీ.. ! నేనీ శీర్షికలో ఇంకా ఏ విషయాలు రాయబోతున్నానో మీకు తెలీదు కదా.. పైగా ఇదింకా “రెండవ” సంచికే !! ఇంకొన్ని శీర్షికలు వేచి చూస్తే బావుండేదేమో… అయినా మీ సందేహాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు… చూస్తూ ఉండండి “చలువ పందిరి”.
ఈ చిత్రం ని నేను రెండు మూడు సార్లు చూసాను. సున్నితమైన భావప్రకటన. చాలా బావుంటుంది.
పాట అనువాదం బావుంది. ధన్యవాదములు.
వనజ గారూ, అనువాదం నచ్చినందుకు ధన్యవాదాలు.
తృష్ణ గారు నాకు హిందీ పూర్తిగా అర్ధం కాదు. మీ అనువాదంతో ఆ పాట అందం తెలిసింది. థాంక్యు
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ.
తృష్ణా,హింది సాహిత్యంతో పెద్ద పరిచయం లేని మా బోటివారికి ఈ శీర్షిక చాలా బాగుంది.మిగిలిన భాషలకన్నా,తెలుగు తరువాత ఎక్కువగా వినేవి హింది సినిమా పాటలే!!స్వర మాధుర్యంవల్లో,సంగీతంవల్లో ఆసక్తిగా వినటమే తప్ప ఇలా అర్ధం కూడాతెలిస్తే బాగుంటుంది.
ఈ పాటలు తెలియనివారికి కొన్ని మంచి పాటల్ని పరిచయం చేసినట్లుంటుందని ఇలా కొన్ని మంచి హిందీ పాటల గురించి రాస్తున్నానండి.ధన్యవాదాలు ఇందిరగారూ.
చాలా మంచి పాటని ,అందంగా అనువదించి పరిచయం చేసారు తృష్ణ గారు . ఈ సినిమాలో నా ఫేవరేట్ పాట మాత్రం “ధీరే ధీరే మచల్ యే దిలే బేకరార్ “. ముఝ్ కో ఛూనే లగీ ఉస్కీ పర్‌ఛాయియా…అనే వాక్యం మాత్రం , ఆ పాటని తలుచుకున్నప్పుడల్లా వెంటాడుతుంటుంది. మీకు వీలయితే ఆ పాట ని కూడా అనువదించరా ? అలాగే ఖామోషి మూవీ లోని “హమ్ నే దేఖీ హై ఉన్ ఆంఖోం కీ మెహక్ తీ ఖుష్బూ ” పాట కూడా ….
ఈ పాటలన్నీ చాలా ఇష్టం, వింటాను,పాడుతాను. కానీ కొన్ని పదాలకు అర్థం తెలియదు, తెలిసినా ఆ ప్లేస్ లో ఎందుకని వాడారో అర్థం కాదు. తెలుగు పాటలను చాలా వెబ్ సైట్స్ లో , బ్లాగ్స్ లో పరిచయం చేస్తున్నారు.లిరిక్స్ కూడా చాలా మందే పోస్ట్ చేస్తున్నారు,అల్లాగే హిందీ లిరిక్స్ కూడా చాలా వెబ్ సైట్స్ లో దొరుకుతాయి.కానీ మీ లాగా హిందీ పాటలకు తెలుగు అనువాదం, పైగా ఆ సినిమా కి ఆ పాటని ,లిరిక్స్ ని రిలేట్ ఎవ్వరూ చెయ్యడం నేను చూడలేదు.
You are doing a great job. Thank you
‘हमनॆ दॆखी हैं..’ నా లిస్ట్‌లో ఉంది మహెక్. నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఇంకా ఒకరిద్దరు మిత్రులు కూడా అది అడిగారు.. ఆ పాట గురించి రాయాలంటే సాహసమే! ప్రయత్నిస్తాను. పాటకు సినిమా కథతో ఉన్న అనుబంధాన్ని కూడా వివరిస్తే పాట ఇంకా బాగా అర్థమౌతుందని నా అభిప్రాయం.. మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.
తృష్ణా, మీ చలువ పందిరి నిజంగానే ఎండలో మైళ్ళు నడిచిన తర్వాత చలువ పందిరి క్రింద నుంచున్న అనుభూతిని కలుగ చేస్తోంది. ముందుగా మంచి పాటలు ఎంచుకుని మీ రాతల్లో చూపిస్తున్నందుకు, వినిపిస్తున్నందుకూ ధన్యవాదాలు. అసలే తెలుగు పాటలకే అర్ధాలు చెప్పకపోతే అర్ధం కాని రోజులు.
పాట గురించీ, అనుపమ గురించీ చాల బాగా చెప్పారు అసలు హృషీదా సిన్మాలూ, పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం ఒక్కసారి మాత్రమే చూసిన సినిమాల్లో కూడా పాత్రలు మన మీద వదిలే ప్రభావం అసలు మాటల్లో చెప్పలేనిది, అలాంటిది ఇక పారాయణ చేసే ఆనంద్ లూ, అభిమాన్ లూ , గోల్ మాల్‌లూ ఆహా..
ఇందిర గారు చెప్పినట్టూ, తెలుగు వాళ్ళు తెలుగు తర్వాతా (కొన్నిసార్లు అంత కన్నాఎక్కువగా కూడా) ఎక్కువగా వినేవి హిందే పాటలే. అందులోనూ ఒకప్పటి ఆణిముత్యాలు మనలో చాలామంది వివిధభారతి లోనో, సిలోన్ లోనో విని, అర్ధాలు తెలీక పోయినా కూడా వాటిని హృదయానికి హత్తుకునే ఉంటాము. ఇలా వివరించి భావాన్ని, వాటి సందర్భాన్ని వివరించటం వలన పాట తెలిసినా పూర్తిగా అర్ధం తెలీక భావాన్ని అనుభవించలేక పోయినవాళ్ళకీ, అర్ధం తెలిసి భావాన్ని ఆరాదించినవాళ్ళకి ఇంకోసారి మీ దృష్టితో కూడా చూడటానికి చాలా సంతోషం కలిగిస్తుందని మాత్రం చెప్పగలను.
మేహేక్ గారు చెప్పినట్టు “ప్యార్ కో ప్యార్ హీ రేహనే దో , కోయి నామ్ న దో ” మీదా ఇంకా కొన్ని అన్మోల్ గీతాల మీదా మీ వాఖ్యానం వినాలని ఎదురు చూస్తూ … అభినందనలతో.
“ప్యార్ కో ప్యార్ హీ రెహ్నే దో కోయి నామ్ న దో…” hmm… ఎంత చక్కని భావనో కదా!! తప్పకుండా ప్రయత్నిస్తాను పద్మ గారూ. పైన మెహెక్ గారికి కూడా అదే చెప్పాను ఇలా రాస్తున్నందువల్ల నాక్కూడా మళ్ళీ కొత్తగా పరిచయమౌతున్నాయీ పాటలు..! చలువ పందిరి లోకి వచ్చినందుకు बहुत शुक्रिया… )
trishnagaru,
meru cinemala to patu chaduvu ki sambandinchina vati gurinchi kuda prachurista ma lanti variki adi inka baga upyoga padutundi.deeni valana maku kotta kotta vishayamula meeda kuda asakti perugutundi.
rajsekhar gaaru, ఎడ్యుకేషనల్ బ్లాగ్ ఏదన్నా తెరిస్తే లింక్ పంపిస్తానండి ఇప్పటికా ఆలోచన లేదు.
अरमान आँखे खोल दे, रुसवा न होजाए कोई
रुसवा(Rusva) అంటే అనుమానం కాదు, అపఖ్యాతి, అప్రతిష్ట. తనలోని కోరికల కనురెప్పలు తెరిస్తే తన తండ్రి అపఖ్యాతి పాలవుతాడని భయపడుతుంది.
సురేష్ గారు, అనువాదం సరిగ్గానే ఉందండి.. మీరు మరోసారి చూడండి.
its nice
thanks for the visit Narayana rao gaaru.
ఇది చాల బాగుంధి
Nice Column
శంకర్ గారూ, శివ గారూ, ధన్యవాదాలు.
తృష్ణ గారూ
చిక్కని కవిత్వం పాటలు గా వచ్చిన రోజులు అవి . కవిత్వానికి భావం రాయడం కష్టమైన పని . మీరన్నట్టు “భాష ఏదైనా కొన్ని పాటలు వింటుంటే తెలియని ఆనందం, హాయి కలుగుతాయి మనకి.” ఒకోసారి -అర్ధం తెలీక, సందర్భం తెలీక – పాట పూర్తిగా అర్ధం కాదు !! అలాంటి సందర్భాల లో మీ కాలం చాలా ఉపయోగ పడుతుంది .
మీరు వేస్తోన్న – చలువ పందిరి బాగుంటున్నది . మా లాగా చల్లని దేశాల లో ఉండేవారికి ఇది ‘వెచ్చని పందిరి’ కూడా !!
రామ్
మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు రామ్ గారూ.
చాల బాగా అనువాదం చేసారు .. నాకు పెద్దగ హిందీ రాదు నేను నేర్చుకోవచ్చు ….:)
చాల మంచి ప్రయత్నం
72, Silpa Brindavan
Kukatpally Hyderabad 500072
I am a writer ,Sr citizen, res of Hyd. I am collecting Hindi songs translated into Telugu for publishing. I request your permission for including your songs ,in Telugu.