చలువ పందిరి

మనసేదో అందా…? ..ఏమీ లేదు..

ఫిబ్రవరి 2013

సామాజిక సినిమాలు నేర్పుగా తీయటంలో నిష్ణాతుడైన “హృషీకేశ్ ముఖర్జీ” చేతుల్లో అందంగా ముస్తాబైన చిత్రం “అనుపమ”. “అనుపమ” అంటే ఉపమానం లేనిది.. సాటిలేనిది.. అని అర్థం. అటువంటి అనుపమానమైన పాత్రలో ‘షర్మిలా టాగూర్’ని మలిచారు ముఖర్జీ. బిమల్ రాయ్ వంటి ప్రఖ్యాత దర్శకుడి వద్ద ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన పనితనం ఈయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది.

చిత్రకథలోకి వెళ్తే అనుపమ ఒక ధనవంతుడి ఏకైక కుమార్తె. బయటవారికి ఆమె ఏ లోటు లేని రాజకుమార్తె. కానీ కుమార్తెకు జన్మనిచ్చాకే భార్య మరణించటం వల్ల కుమార్తెను దగ్గరకే రానివ్వడు ఆ తండ్రి. తండ్రి నిరాదరణకూ, కేకలకూ భయపడి నోరే తెరవకుండా పెరుగుతుంది అనుపమ. చెట్లు, ఆకులూ, పువ్వులు,పక్షులూ ఇవే ఆమె నేస్తాలు. ఆమెకు తన స్నేహితుడి కుమారుడు అరుణ్ తో సంబంధం కూడా ఖాయం చేస్తాడు తండ్రి. ఈలోపూ తన అనారోగ్యం వల్ల, డాక్టర్ సలహాపై విశ్రాంతి కోసం కూతురు తో “మహాబలేశ్వర్” వెళ్తాడు ఆయన. అక్కడ అరుణ్ స్నేహితుడు అశోక్ పరిచయమౌతాడు. సినిమాలో ఇక్కడి దాకా నాయిక నోటి వెంట ఒక్క డైలాగ్ కూడా వినం మనం. ఆమె అభినయం అంతా కళ్ళతోనే.

కథానాయకుడి చుట్టూ తిరుగుతూ, చాలీచాలని దుస్తులతో డాన్సులు చేస్తూ, అతడిని “ఏరా.. ఒరే..” అని పిలుస్తూ, వీలైతే రెండు మూడు పలక్కూడని పదాలు కూడా పలికే నాయిక ఈనాడు మనకి వెండితెరపై ఎక్కువగా కనిపిస్తోంది. యువత కూడా అదే లేటెస్ట్ ఫ్యాషన్ అని నమ్మేస్తున్నారు. డెభ్భైల్లో, ఎనభైల్లో వెండితెరపై నాయిక ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ముఖ్యంగా “అనుపమ”లో నాయికను చూస్తే గౌరవం, అభిమానం కలిగి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. వంద మాటలు, ఒకరిపై ఒకరు ఎగిరి మీదపడే పాటలు లేకుండా కూడా గాఢమైన ప్రేమను ప్రేక్షకులు అర్థం చేసుకునేలా చూపించవచ్చు అని సినిమా చెప్తుంది.

ఈ సినిమాలో అన్ని పాటలకు “హేమంత్ కుమార్” సంగీతాన్ని అందించారు.  ”ధీరే ధీరే మచల్ ఏ దిలే బేకరార్ “, “క్యో ముఝే ఇత్నీ ఖుషీ దేదే కే ఘబ్రాతా హై దిల్”, “యా దిల్ కి సునో దునియా వాలో..”(ఇది నాకు బాగా నచ్చుతుంది), “భీగీ భీగీ ఫజా…” నాలుగూ బావుంటాయి. ప్రత్యేకంగా  మాత్రం “కుచ్ దిల్ నే కహా..” పాట గురించి చెప్పుకోవాలి. పాటకు సందర్భోచితమైన సాహిత్యాన్ని  ప్రముఖ ఉర్దూకవి, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ఎన్నో అద్భుతగీతాల సృష్టికర్త, “కైఫీ ఆజ్మీ“(షబానా ఆజ్మీ తండ్రి) అందించారు. తన మేజికల్ వాయిస్ తో ఈ పాటకు ప్రాణం పోశారు లతా మంగేష్కర్.

ఉమ,ఆశోక్ ల మధ్య ఆకర్షణ, ఆపై ప్రేమ చిగురించే  సందర్భంలో ఎంతో సహజంగా, సున్నితంగా ఈ పాటను చిత్రీకరించారు ముఖర్జీ. అశోక్ పరిచయమయ్యాకా అనుపమ మనసులో కదలాడిన సంఘర్షణ ఈ పాటలో కనబడుతుంది. ఆహ్లాదకరమైన ఓ ఉదయాన కొండకోనల్లో చెట్ల మధ్యన తిరుగుతూ, పువ్వులతో,ప్రకృతితో సంభాషిస్తున్నట్లు “ఉమ” పాడుతుందీ పాటను. అప్పటిదాకా ఎవ్వరితోను మాట్లాడని ఆమెకు నేస్తాలు అవే మరి.

 

వాక్యార్థం:

ప :   कुछ दिल ने कहा, कुछ भी नहीं

మనసేదో అందా…? ..ఏమీ లేదు..

कुछ दिल ने सुना, कुछ भी नहीं

మనసేదో విందా…? ..ఏమీ లేదు..

ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..

అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..

 

భావం: ఉమ మనసులో అలజడికి ప్రతీకలే వాక్యాలు. మనసేదో అనీ అననట్లు, మనసేదో వినీ విననట్లు అనిపిస్తుంది ఆమెకి. మనసులో ఇంతవరకూ తానెరుగని స్పందన కలుగుతోందనీ, అలా జరుగుతుంది.. అలా కూడా జరుగుతుంది అంటుంది ఆమె.

 

 

1చ:  लेता हैं दिल अंगडाइयां..  इस दिल को समझाए कोई

మనసు విచ్చుకుంటోంది.. ఎవరైనా సర్దిచెప్పకూడదూ..

अरमा न आँखे खोल दे..  रुसवा न होजाए कोई

కోరిక వికసించేస్తే.. ఎవరైనా అవమానపడతారేమో..

पलकों की ठंडी सेज पर, सपनों की परियाँ सोती हैं..

చల్లని రెప్పల పానుపుపై, కలల దేవకన్యలు నిదురిస్తూంటారు..

ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..

అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..

 

భావం:  ఇన్నాళ్ళు నిద్రపోయిన భావనేదో ఇప్పుడే రెక్క విప్పుకుంటోందనీ, ఆ కోరిక బహిర్గతమవకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటుంది ఆమె. కనురెప్పలపై కలల దేవకన్యలు నిద్ర పోతూంటారనీ.. వాళ్ళు గనుక నిద్రలేస్తే తన కలలన్నీ మేల్కొంటాయనీ.. తనలోని కోరిక మేల్కొంటే తండ్రి అవమానపడవచ్చని భయపడుతుంది.

.

 

2చ:  दिल की तसल्ली के लिए, झूठी चमक झूठा निखार

మనసుని సంతృప్తి పరచటానికే ఈ అబధ్ధపు తళుకులు, అబధ్ధపు నిగారింపులు

जीवन तो सूना ही रहा.. सब समझे आई हैं बहार

జీవితం వెలితిగానే ఉంది.. అందరూ వసంతం వచ్చిందనుకున్నారు

कलियों से कोई पूछता.. हँसती हैं वो या रोती हैं ?

పూమొగ్గలనెవరు అడుగుతారు.. నవ్వుతున్నావా.. ఏడుస్తున్నావా.. అని ?

ऐसी भी बाते होती हैं.. ऐसी भी बाते होती हैं..

అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది..

 

భావం: సిరిసంపదలనూ, హోదానూ ఇచ్చిన సింగారాలనూ, నిగారింపులనూ చూసి అంతా నా అదృష్టానికి ఈర్ష్యపడతారు కానీ నా జీవితమెంత       నిస్సారంగా గడిచిందో..నా మనసెంత ఒంటరిదో ఎవరికి తెలుస్తుంది? అడవిలో పూసిన పూమొగ్గల క్షేమం అడుగుతారా ఎవరైనా అని తన మనస్థితిని

అడవి పూమొగ్గలతో పొలుస్తుంది ఆమె. బయటకు కనిపించేదంతా నిజం కాదనీ.. అలా జరుగుతుంది .. అలా కూడా జరుగుతుంది అని ఆమె భావన.

 

పాటను ఇక్కడ వినవచ్చు:

http://smashits.saavn.com/audio/player.cfm?vt1xD5gO1JW9UM1N8nzOZGa9sN6UIjlN

 

చిత్రం చివరికొచ్చాకా తన ఇంటి తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయనీ, ఆమె ఎప్పుడైనా తన తలుపు తట్టవచ్చుననీ చెప్పి ఊరుకుంటాడు అశోక్. అమాయకురాలైన ఉమ ఎలా బయటకు రాగలదు? ఇంతటి నిర్దయుడివా? ఆమెనలా వదిలేస్తావా? అని అశోక్ ను నిలదీస్తుంది ఆమె స్నేహితురాలు. అప్పుడు అశోక్ చెప్తాడు.. ” ఇన్నాళ్ళు ఆమె తన లోకంలో తానే బ్రతికింది. ఇప్పుడు స్వేచ్ఛ కావాలంటే అది మరొకరి ప్రోద్బలంతో రాకూడదు. నే చెప్పవలసింది ఆమెకు చెప్పేసాను. ఇక ఆమె తనంతట తానుగా తన చుట్టూ ఏర్పరుచుకున్న ఒంటరితనపు సంకెళ్లను ఛేదించుకుని బయటకు రావాలి..” అని. ఆమెను ప్రేమించటమే కాక మానసికంగా ఆమెలో ఏర్పడిన శూన్యతను కూడా అతను మాయం చేసే ప్రయత్నం చేస్తాడు. అది ఈ కథలో గొప్పతనం. ఆఖరులో ఉమ తన తండ్రితో చెప్పే డైలాగ్స్ కూడా ఎంతో బావుంటాయి. యూట్యుబ్ లో ఈ సినిమా చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=TT9JIX7pB8c