ఒకరి అనుభవాల్ని ఒకరు తెలుసుకుంటూనో
ఒకరి అనుభూతుల్ని ఒకరు పంచుకుంటూనో
మాటంటే ఒకప్పుడు..
మౌనాన్ని బద్దలు చేసే అక్షర ప్రవాహం
మనుషుల మధ్య మమతలు పుట్టించే పద విన్యాసం
ఎవరి చెవి తీగల్ని వారు సవరించుకుంటూనో
ఎవరి ‘చేతిస్వర్గాన్ని’ వారు స్పృశించుకుంటూనో
అయోమయంలోనో అదోరకపు భ్రాంతిలోనో
మనుషులంతా ఇప్పుడు.. మౌనశిలలుగా మరో రూపమెత్తారు
పెదాల కదలికల్ని పెనుతీరాలకు విసిరేసి
వేలిస్పర్శల్ని వెంటేసుకుని తిరిగే విషాద మునులుగా మారిపోయారు
ఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?
రెండు శిలల మధ్య రాపిడైతే అదో రకం శబ్దం
ఇద్దరు వ్యక్తుల మధ్య నిరంతరం భయంకర నిశ్శబ్దం
విధ్వంసానికి మహా సంగ్రామాలు అక్కర్లేదు
ఎదురెదురుగా ఉన్నా మాటలు రాలని మౌనం చాలు..!
అందుకే ఇప్పుడు..
మాటల్ని మౌనపు ముద్దలుగా మూలకి విసిరేసి
మనుషులంతా నడిచే మౌనశిలలుగా బతుకీడ్చుతున్నారు..!
“విధ్వంసానికి మహా సంగ్రామాలు అక్కర్లేదు
ఎదురెదురుగా ఉన్నా మాటలు రాలని మౌనం చాలు..!” బాగా చెప్పారు!
రామకృష్ణగారూ…. ధన్యవాదాలు సార్.