కవిత్వం

రాహిత్యం లోంచి

జూన్ 2015

యెక్కడైనా
మనుషులూ మాటలూ వినిపించని
వొక జనసమ్మర్దపు రణగొణ ధ్వనుల చౌరస్తాలో
చెవి దగ్గర
తెరవని పెదవులు పెట్టి
వొక నిశ్శబ్దాన్ని గుసగుసగా చెప్పు.

యెపుడైనా
మనకన్నా ముందుగానే
చిమ్మ చీకట్లు కప్పుకుంటున్న
అతి సమీప స్పర్శారాహిత్య వేళ
మూతబడని కంటిపాప మీద ఊపిరితో
వొక ప్రతిబింబాన్ని అదృశ్యంగా అద్దు.

యేదైనా
వొక అతి దగ్గరైన క్షణాన
యెంతో దూరంగా విసిరికొడుతున్న
దిక్కు తెలియని కాలం ముళ్ళలో చిక్కుకొని
నెత్తురు రాకుండా విలవిలలాడినప్పుడు
యెండిన నుదిటిపై చెమటచుక్కను నాటు.

యిప్పుడు మెరిసి
యెప్పుడో మాయమయిన
అభౌతికానుభూతులతో
యిగిరిపోయిన నా రెండు చేతుల్లో
వొక్క సారైనా
నీ ముఖమేఘాన్నుంచి
యింత ప్రేమనీ
కాకుంటే
కించిత్తు ద్వేషాన్నో
తడివెచ్చగా తొలకరించు!