పాత పుస్తకం

జీవిగంజి

జూన్ 2015

చాలా రోజులయింది ఈ పుస్తకం విజయవాడలో పాత పుస్తకాల షాపులో కొని. ఈ రోజు వెతుకులాటలో మరల చేతిలోకి వచ్చి అలా మనసులోకి పయనించింది. జీవిగంజి, ఇది పేరుకు తగ్గ పుస్తకం. మనిషి జీవనక్రమంలో స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని మాతృత్వం నుండి జీవిత వివిధ దశలలో ఆమె యొక్క రూపాన్ని చిత్రీకరించిన విధం సహజంగానూ ఆత్మీయంగాను సాగిన ప్రేమ కావ్యం ఇది.

ఏడుపు గాలితోనే ప్రాణం శ్వాసగా మారింది
మొదటి శబ్దం దు:ఖానిదే
దాని వెంటే నేను అంటూ

ఆమె అడుగులతోనే తొలి స్త్రీ శబ్దాల గుర్తింపు

కంపకట్టెల పొయ్యికాడ
కొంగడ్డం పెట్టుకొని ఉడికిన అమ్మలోంచి
పొంగై పొర్లుకొచ్చిన కన్నీటిని
తొంగి తొంగి చూసి
మొదటి సారి స్త్రీ కోసం కళ్ళంట పారిన బాధ..

ఎంత ఆర్ధ్రంగా ఆత్మీయంగా ప్రేమగా పలికిన పలుకులివి..

యవ్వనంలో ఇలా చెప్తారు

మనిషి చాలా తేలిక
ప్రేయసి తెలుపు చూపులకు ఆవిరులై
వెన్నెల మండలం మీదికి వ్యాపించాను
ఆహ్వానంతో ఆమెను సమీపించాను
నాకు రంగుల మర్మం తెలిసింది
నాలోని నలుపు మాయమయింది

ఇంత సరళంగా వ్యక్తంచేసే ఉపాయం డాక్టర్ గారికి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యం.

ఇంకో చోట ఎడబాటునిలా చెప్తారు

బాధలకీ పునాదులుంటాయి
రంగు రుచి వాసనలన్నీ ఏకమై
చీకటిలో లీనమవుతాయి
ఆశ్చర్యంగా నేనక్కడే వుంటాను
ఒంటరిగా…

చివరిగా ఇలా

ఎడబాటును జోకొడుతున్న
ప్రతి దు:ఖ బిందువులోనూ ఆమే
ఆమె పాదముద్రల్లో నేను
నా అక్షరాల్లో ఆమె
జీవిత కావ్యం నిండా
ఆమె
నేను…

నిజంగా ఇది An opaque love poem కదా. కొని ఇన్నాళ్ళూ చదవకుండా మిస్సయ్యానే అనుకుంటూ ఇలా మీతో పంచుకుందాని. ఇంతకీ ఈ డాక్టర్ పోయిట్ ఎవరో మీకు తెలిసిపోయుంటుందనుకుంటా. ఆయనే మన డా. పులిపాటి గురుస్వామి గారు.