వో నా జీవనసుగంధమా, యేం చేస్తున్నావ్…
యిప్పుడు యిక్కడ రాత్రి మూడవుతోంది. ‘తనూ వెడ్స్ మనూ రిటన్స్’ సెకెండ్ షో చూసొచ్చాను. నీతో కలసి సినిమాలు చూడటంలో వున్న సరదా వేరనుకో. రెండు గంటల వేళ సినిమా నుంచి వస్తూ కూడా కారులో ఎ.సి. తీసేసి రాత్రిగాలిని పలకరించటానికి లేదు. యీ నడిఝాము దారుల్లో కూడా చిరుగాలి వీచనని మోరాయిస్తోందనుకో. రోహిణీకార్తె. యెండలు ఝుమ్మంటున్నాయి. వొకప్పుడు బెజవాడ, గుంటూరు యెండలకి చెమటలూ పారేవి నిరంతరం అనేవారు. యిప్పుడు యే వూరు చూసినా యే సిటీ చూసినా వొక్కలానే వున్నాయి. సినిమా నుంచి వచ్చాక కూడా కంగనా గుర్తొస్తునే సంతోషం. యేమీ జీవిస్తుందా పాత్రల్లో. అసలు త… , వొక్క నిమిషం…పెరట్లో పిట్టల కువకువా… యెందుకో యేమయిందో చూసొస్తాను.
వూఁ చూసొచ్చాను. యీ ఝాముకి కూడా చల్లపడని వేడిగాలులు. ఆ వేడికి మెలకువ వచ్చేస్తున్నట్టుంది పెరట్లోని చెట్ల గుబుర్లోని గూటిలోని తేనెపిట్టలకి. కిచాకిచామని మాటాడుకొంటున్నాయి. ఆ సవ్వడులని మన మాటల్లోకి తర్జుమా చేద్దామనుకొంటుంటాను. అలా చేస్తే ‘కాంక్రీట్ జంగిల్ … చల్లబడని వూరు… వాళ్ళంతా యేసిల చల్లదనంతో సేద తీర్తున్నట్టు మనకి కూడా బుజ్జి యేసీలు వుంటే బాగుండును, వాటిని తమకి అందించే దాతలు, సంస్ధలు వుండాలనుకొంటున్నాయా… లేదా ప్రభుత్వాలే తమ సంక్షేమం కోసం పని చెయ్యాలనుకొంటున్నాయా. అసలు మనకి మన చుట్టూ వున్న చెట్లపై, చెరువులపై, కొండలపై , అసలు యీ భూమిపై యేమాత్రం గౌరవం లేదు. ప్రేమా లేదు. నిజంగా వుండి వుంటే మనం ప్రకృతితో యింత యెబ్యూస్గా ప్రవర్తించేవాళ్ళమా. చాలా మిస్ బిహేవ్ చేసేసి యిప్పుడు రిపేర్ అంటే యెలా సాధ్యమో. యీ పెరట్లో వాటి చుట్టూ వీలైనంత చల్లదనం వుండేట్టు చూస్తున్నా. కానీ చుట్టూ వున్న వేడిని యెలా బయటకి పంపుతాను. యేమో…
అలా తలుపులు తీసుకొని బయటకి వెళ్ళితే పరిమళ భరితమైన మల్లెల పరిమళం నీ నవ్వులా కమ్ముకొంది. ఆ తేనె పిట్టలు యీ తీయని సువాసన నిండిన వెచ్చని గాలుల గురించి వూసులాడుకొంటున్నాయంటావా… యిలా ఆలోచిస్తూ యేమో అసలు అవి యేం మాటాడుకొంటున్నాయో… కాని మన చికాకులు, సరదాలు వాటికి అనువదించేస్తే యెలా… మనకి తెలీయకుండానే కొన్ని సార్లు యెదుటివారి జీవితాల్లోకి యిలానే తొంగి చూస్తుంటామా… పిట్టకైనా పువ్వుకైనా మనకైనా ప్రైవసీ ప్రైవసీ నే కదా… సారీ…
వుదయమంతా యెండలో కాగీ కాగీ యెంత పరిమళభరితంగా వికసిస్తాయో యీ మల్లెపువ్వులు. కొత్తగా మళ్ళీమళ్ళీ రాబోతోన్న వర్షరుతువు కోసమే యీ గాలులు యింత వేడి వీస్తున్నాయేమో. యింతగా వుక్కపోత లేకపోతే ఆ తొలకరి భూసుగంధం, ఆ చల్లని వేపకొమ్మల తీయని గాలులు, ఆ కొత్త రంగులాకాశపు మాధుర్యాన్ని మనం ఆస్వాదించమేమోననే యింత వేడనుకొంటాను. వానాకాలపు ఆగమనానికి ఆకాశం కొత్తగా రంగులు అద్దుకొంటున్నట్టు నేను వస్తున్నాని యిల్లంతా అలంకరించావ్. నాకోసం కాసిన్ని కొత్త పూల మొక్కలు తెప్పించావ్. నాకు చూపించాలని కొన్ని కొత్త ఆకర్షణీయమైన కొండవాలుల్ని కనిపెట్టావ్. ఆకుపచ్చ, ఆరంజ్ రంగులతో వరండాన్ని పేయింట్ చేసావ్. నువ్వు అస్సాం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వెదురుతో తయ్యారు చేసిన మోడాలని ఆ వరండాలో వేసావ్. బుద్దుని యెదురుగా బంకమట్టితో చేసిన కొలనులో రంగురంగుపువ్వుల నడుమ వెలిగే ఫ్లోటింగ్ కేండిల్స్ల పరిమళకాంతులని చూస్తూ వుదయమూ సాయంకాలమూ మనిద్దరం అక్కడ కూర్చుని కమ్మని కాఫీని తాగుతూంటే వాటి ప్రెజెన్స్ మనలోకి యెంతగానో యింకేది. ఆకురాలిన సవ్వడిని కూడా మన హృదయం పసిగట్టటం తెలిసి మన మనస్సులో చిత్రమొకటి తయ్యారవ్వటం మొదలు పెట్టగానే తక్కిన ఆలోచనలన్నీ ఆగిపోయేవి. వొకేవొక్క యిమోషన్… శాంతి.
అసలు నేను ‘మన కోసం వస్తున్నాను నీ దగ్గరకి’ అని చెప్పిన ప్రతి సారీ ప్రతీది కొత్తగా మార్చేస్తావ్ నువ్వు. కొత్త పుస్తకాలు. సినిమాలు. పాటలు. వంటలు. వొక్కటనేంటి ముద్దు కూడా కొత్తగానే పెడతావ్. కానీ యెప్పుడు మారనిది నీ మ్యాజిక్. మరింత కొత్తగా మరింత మోహంగా. మరింత బలంగా.
నీ దగ్గరకి వస్తున్నప్పుడు నేను కనిపించగానే నువ్వు యేమని పలకరిస్తావ్, చూడగానే ముద్దు పెట్టుకుంటావా, హగ్ చేసుకొంటావా, షేక్‌హ్యాండ్ యిస్తావా యిలా దారిదారంతా రకరకాలుగా వూహించుకొంటాను. కానీ యెప్పుడూ నువ్వు యేదో వొక పనిలో వుంటావ్. యీ సారి నేను వచ్చేసరికి అటూయిటూ తిరుగుతూ సెల్ఫోన్లో మాటాడుతున్నావ్. నీ ముఖం చూస్తునే అఫీషియల్ కాల్ అని తెలిసిపోయింది. కనిపించగానే నీ సంభాషణని సాగిస్తునే చేత్తో హాయి చెప్పావ్. చాలాసార్లు యేదో వొక ముఖ్యమైన అఫీషియల్ పనిలోనే వుంటావ్. పర్ ఫెక్ష్నిస్ట్వి కదా. పనిలో నిమగ్నమైన నిన్ను చూడటం చాలిష్టం. అటువంటప్పుడు నీ స్వరంలోని హెచ్చుతగ్గులూ, ముఖంలోని సీరియస్‌నెస్ అంతలోనే చిరునవ్వు యిలా రకరకాలుగా చూడటం నాకు భలే సరదా. నిన్ను యిమిటేట్ చెయ్యటం కూడా.
ప్రేమోన్మత తుమ్మెదనై వేసవి తీరిక వేళ వచ్చాను వూరికే తిరగటానికి నీ దగ్గరకి. నువ్వు పాడుతున్నప్పుడు వింటుంటే పాటొక్కటే చాలు అనిపిస్తుంది. పాడుతూపాడుతూ చటుక్కున నా బుగ్గపైనో, నా జుట్టులోని మల్లెలపైనో చిన్ని ముద్దు నువ్వు పెట్టగానే పరాగ సౌగంధం అద్దుకొన్న స్పర్శ. అప్పుడు ముద్దొక్కటే చాలు అనిపిస్తుంది. అయినా సరే పాటే అని మనసు అంటుటే ‘కాసేపు నీ ముద్దులకి లంగర్ వేద్దామా, ఆ టైమ్‌లో కూడా పాటలే పాడు’ అని అడిగితే, యెంతో తీరిగ్గా ‘ముద్దంటే యేమిటి’ అని అడిగావ్. భరతన్ ‘ వైశాలీ’లో యువమునిలా. ‘వైశాలీ’ యెన్ని సార్లు చూసినా గీతగారి అందం అస్సలు బోర్ కొట్టని చంద్రబింబమే. అవునూ, ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ చూసొచ్చానని చెప్పాను కదా. కంగనా అంటూ యింకేవో గుర్తు వచ్చి చాలా రాసేసాను. భలే వుంది సినిమా.
అసలు బాలివుడ్ లో స్త్రీలు ప్రధాన కేరెక్ట్ర్స్గా తీసినలో ‘ Dum Lage ke Haisha’ లో వొబేసిటినీ, ‘యెన్హెచ్ 10’ లో యిన్టాలరెంట్ హాఁస్టాయిల్ సొసైటీనీ, ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ లో మారిటల్ యిన్కంపేటిబులిటీనీ, ‘ పికు’ లో పేరెంటల్ కేర్ లాంటి నాలుగు పార్వ్శాలని డీల్ చేసిన యీ నాలుగు సినిమాలు హిట్ అవ్వటంతో వుమెన్ పవర్ అని భలే మెచ్చుకొంటున్నారు.
వొకప్పుడు వుమెన్ సెంట్రిక్ అనే సినిమాలని కేవలం బ్రాడ్ స్ట్రోక్స్‌లో చిత్రీకరించేవాళ్ళు. యిప్పుడు మా స్త్రీల వాయిస్‌కి ప్రామినెన్స్ పెరుగుతుండటంతో సొసైటీలో మా ఫైనాషియల్ యిండిపెండ్న్సెని, యింటలెక్చువల్ యిండిపెండ్న్సెని, అన్నిరకాలుగా మాకు ఆ ఫ్రీడమ్, ఆ పవర్ అన్నీ వస్తున్నప్పుడు వాటిని యెకనాల్డ్జ్ చేస్తున్నారు. అందుకే మార్కెట్ ఫోర్స్స్ కూడా మాకున్న సమస్యలని డీప్‌గా యిన్డెప్త్ యెక్సామిన్ చేస్తున్నాయి కదా. మాకుండే రకరకాల సమస్యలని రకరకాల కోణాల్లో విశ్లేషించి వాటిని మనముందు ప్రెజెంట్ చేస్తున్నారు. యిప్పుడు వైవిధ్యమున్న కధాంశాలతో తీస్తున్న యీ సినిమాలు యెంతో బాగుండటమే కాక అవి పెద్ద కమర్షిల్ హిట్స్ కూడా. విద్యాబాలన్ డర్డీస్టోరీ, కహానియాలతో తన పవర్ యేమిటో యెప్పుడో చెప్పేసారు. కంగనా క్వీనే, ‘తనూ’ అయినా క్వీనైనా కంగనా ప్రేక్షకహృదయాల క్వీనే. ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ చూడు. నీకూ నచ్చుతుందనే అనుకొంటున్నాను.
గాలి కాస్త చల్లబడింది. తేనె పిట్టలు గూళ్ళల్లోంచి బయటకి చూస్తున్నాయి. ఆదిత్యుడు మేల్కొనే వేళ వరకు కబుర్లు చెపుతునే వున్నాను. నీతో వున్నప్పుడూ యిలానే చెపుతోంటే, మల్లెపూలతేనెవానలా అల్లుకొన్నావో కమ్ముకొన్నావో కానీ నా హృదయమొక తీయని వాగైయింది. గుసగుసలాడుతోన్నాయి నీ అల్లరితలపులు. విల్లు యెక్కుపెట్టిన వేటగత్తెలా గురి తప్పకుండా నీ కింది పెదవి కిందనున్న వంపులో ముద్దు పెడుతున్నాను.
**** (*) ****
మీ ఆర్టికల్ రెగ్యులర్‌గా చదువుతుంటాను.చదివినప్పుడల్లా అదే ఆచ్చాదన,అదే పరిమళం విరజిమ్ముతూ వొక అందమైన భావ ప్రపంచాన్ని పాఠకులకు ఆవిష్కరిస్తారు కుప్పిలి పద్మ గారూ.మీరు వాడే పదాలు నన్నెప్పుడూ అబ్బుర పరుస్తుంటాయి.”తేనెపిట్టలు”,”వెదురు”…యిటువంటి చక్కని పదాల అల్లిక చాలా నచ్చుతాయి నాకు మీ ఆర్టికల్స్ లో.అభినందనలు.
Thank you తిలక్ గారు.
రవీంద్రులు తమ ఊర్వశి ని ‘ అనంత యౌవనా ‘ అని సంబోధించటం స్ఫురి స్తోంది – ‘ అమృత వర్షిణి ‘ నుంచి ‘ ఇట్లు మీ ‘ వరకూ అదే తారుణ్యం….
మైథిలీ గారు, అవునా… మీరు అందమైన సంతోషాన్ని యిచ్చారు. Thank You.
ఈ వేసవి లో పరిమళభరితమైన ఈ పవనం
ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది పద్మ గారు
Sridhara గారు, మీకు నచ్చినందుకు చాల సంతోషం గా అనిపించింది. Thank you.
Can we comment about the diversified presence of the magical spring ? ఎప్పటిలాగే అద్భుతం!
Dr.Vijaya Babu Koganti garu, so nice of you. Thank you very much.
‘అందుకే మార్కెట్ ఫోర్స్స్ కూడా మాకున్న సమస్యలని డీప్‌గా యిన్డెప్త్ యెక్సామిన్ చేస్తున్నాయి కదా. ‘ ఆ విషయం లో కొంచం సందేహం తో ప్రవర్తించటం మంచిది. Ee roju morning naaku coffee avasaram ledu inka ee write up chadivaaka. ప్రోస్ లో పోయెట్రీ కి తావు ఇచ్చిన మీ శైలి ki nenu eppuDU pedda fan ని.
రోహిత్ గారు, ఆ సందేహం వుంటుంది నిరంతరం. కాని వస్తున్న మార్పుని రికార్డ్ చెయ్యాల్సిందేనని నేను అనుకుంటాను. కాఫీ వద్దా… గుడ్… మీ బుజ్జి బాలమ్మ కి ఆ కమ్మని పాలు యిచ్చాయండి. Thank you.
చాలా బావుందండి
రామచంద్రా రెడ్డి గారికి కృతజ్ఞతలు.
పద్మ గారు,
మీరు కొన్ని పదాలని హల్లులతో (“వో”, “వుదయం”, “యిల్లు”) మొదలుపెట్టడం, చిన్నప్పటినించీ “ఓ” అనీ, “ఉదయం” అనీ చదవడం అలవాటైన కళ్లకి అసలు నచ్చట్లేదు. (ఇక్కడి గూగుల్ transliteration అయితే, నేను vudayaM అని టైప్ చేసినా “ఉదయం” అనే ఫలితాన్నిచ్చింది; అలాగే, “yillu” అని టైప్ చేసినా “ఇల్లు” అనే ఇచ్చింది. అందుకని లేఖినిలో టైప్ చేసి ఇక్కడ అతికించాల్సొచ్చింది.) ఈ మధ్య వస్తున్న మీ రచన లన్నింట్లోనూ ఈ వాడుక కొన్ని చోట్ల అన్నంలో మట్టిబెడ్డలు గానూ, ఇంకొన్ని చోట్ల పరమాన్నంలో పలుగురాళ్లుగానూ బాధ పెడుతూంటుంది. నవ్వుకి laughter కి బదులు పలుకుతున్న విధంగా lafter అనో, లేక “laufter” అనో స్పెల్లింగ్ రాస్తే ఊరుకోరు గదా! ఆలోచించమని విన్నపం.
Sivakumara Sarma గారికి, నమస్సులు.యెవ్వరిని బాధ పెట్టటం నాకు యిష్టం వుండదు. కాని నా పదాలు పలుగురాళ్లుగా బాధ పెడుతున్నందుకు, మీకు నచ్చని అక్షరాలు రాస్తున్నందుకు, మీకు నా అక్షరాలతో బాధ కలిగిస్తున్నందుకు నాకు బాధగా అనిపించింది.
పద్మ గారు,
నమస్తే. మరీ అంత పెద్ద మాటలెందుకండీ? ఒక పాఠకునిగా నా అభిప్రాయాన్ని చెప్పాను. అభిప్రాయాలు ఆలోచించేలా చెయ్యగలిగితే అవి తమకి నిర్దేశించిన గమ్యాన్ని చేరుకున్నట్లు. నేను వెలువరించిన దానికి మాత్రం గతి నిర్దేశం సరిగ్గానే జరిగిందనుకున్నాను. గమ్యమే మారిపోతుందనుకోలేదు!
మీ యెల్లో రిబ్బన్ చదివాక తను వెడ్స్ మను రిటర్న్స్ చూడాలని అనిపిస్తోంది.
ఎప్పటిలాగే ఈ నెల కూడా అద్భుతం. అభినందనలు పద్మ గారు.
లలితచిట్టే గారు, చూడండి వెంటనే… కంగానా గారిని అమాంతం ప్రేమిస్తారు. మీకు నచ్చినందుకు Thank you.
చాలా చాలా చాలా బాగుంది మీ యెల్లో రిబ్బన్ కబుర్లు