సమీక్ష

నా ఎఱుక

జూన్ 2015

ఆదిభట్ల నారాయణ దాసుగారు రాసిన తన జీవిత కథ ‘నా ఎఱుక’

గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.

1864-1945 మధ్యలో జీవించిన దాసుగారు ఆ నాటి వాతావరణాన్నిచక్కగా వర్ణించారు. అంతేగాక తనలో ఉన్న లోపాల్ని నిర్భయంగా వెళ్ళగక్కారు. కాబట్టి శ్రీ శ్రీ ఆద్యుడేం కాదు ఇలాంటి ఒప్పుకోళ్ళకు. ఇలాంటి ఎన్నో భ్రమల్ని బద్దలు కొట్టే గ్రంథం ఇది.
దాసుగారి జననం దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జరిగింది. తనలో ఉన్న సంగీత సాహిత్య ప్రతిభ కాకుండా ఆయన బాల్యం గురించి చెప్పుకునేటప్పుడు కనిపించే ఒక ముఖ్యమైన విశేషం వాళ్ళ నాన్న గారు. ఈయన పరమ పరిశుద్ధుడై ఉండి ఉండాలి అని అనిపించక మానదు – దాసుగారు ఈయన్ని గురించి రాసిన ఒకటి రెండు సంఘటనలు చదివితే (నిప్పు కణిక కాలి మీద పడినా ఏమీ తొణక్కుండా ‘బ్రాహ్మణుడూ అగ్ని ఒకటే’ అనడమూ, బావిలో గంగ పడడానికి మంత్రం పఠించడమూ – అంతకన్నా ముఖ్యం ఇలాంటి సంఘటనల పట్ల ఎలాంటి ఆర్భాటమూ లేకుండా సాక్షీమాత్రంగా ఉండడమూ).

పదమూడు పద్నాలుగేళ్ళకే సంగీతంలోనూ, సాహిత్యంలోనూ వీణ్ణి కొట్టేవాడు లేడురా అని అందరి చేతా అనిపించుకునేంత ప్రతిభ చూపించేరట దాసుగారు. కన్నమనాయుడు అనే ఆయన హరికథ చెప్తుంటే విని తను కూడా అలా ఆడి పాడి రంజింప చేయాలన్న కోర్కె కలిగి హరికథా ప్రక్రియ మీద పడ్డారు. ఇక ప్రతి ఉన్నతోద్యోగి వద్దా, జమిందారుల వద్దా అష్టావధానమో (గ్రీకు అక్షరాలతో సాముగరిడీలు, ఆల్జీబ్రా ప్రాబ్లమ్ సాల్వ్ చేయుట అనే అంశాలు కూడా దాసుగారు చేసిన అవధానాల్లో ఉన్నై – అంటే అప్పుడే ఈ ప్రక్రియలో వినూత్న ధోరణులు ప్రవేశ పెట్టారన్నమాట దాసుగారు), హరికథలను అప్పటికప్పుడు రాసి పాడటమో, ఆరేడు గంటల పాటు ఏకబిగిన అందరినీ స్పెల్ బౌండ్ చేస్తూ కథాకాలక్షేపం చేయడమో చేసి కట్నాలు లాగడం (నగదు, ఇతర బహుమతులు) లాంటి సంఘటనలను వర్ణించారు ఈ పుస్తకంలో. దాంతో పాటే చిన్న గురుడికీ (అంటే దేశవాళీ నల్లమందు మత్తు) తర్వాత క్రమంగా పెద్ద గురుడికీ (అంటే సీమ సరుకు) అలవాటు పడ్డారు. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే అలవాటైన ఈ విపరీతాలకు తోడు వేశ్యాలంపటం. ఇవేవీ దాచకుండా 1940 ల్లోనే ఇంత నిర్భయంగా తన జీవిత చరిత్రని రాసుకోవడం ఒక రకంగా గొప్ప విషయమే. వీటన్నింటినీ యవ్వనపు “శాఖామృగచేష్టలు” గా అభివర్ణించుకున్నారు దాసుగారు.

ఆ కాలంలో ఉన్నత వర్గాల (జమిందార్లు, ఉన్నతోద్యోగులు) వద్ద సాంప్రదాయికంగా కళాప్రదర్శన చేసే వారికి లేని సౌలభ్యం దాసుగారి వద్ద ఒకటి (సంగీత సాహిత్యాలలో తనకున్న అత్యుత్తమ ప్రతిభావ్యుత్పత్తులు కాక) ఉండేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేమిటంటే ఇంగ్లీషులో కూడా కవిత్వం చెప్పగలగడం. తను తెలుగులో, సంస్కృతంలో పాడిన వాటిని తక్షణమే ఇంగ్లీషులోకి కవితాత్మకంగా మార్చగలిగే ప్రతిభ దాసుగారికి ఉండేది. తెలుగు తెలియని మైసూరు మహారాజా గార్ల లాంటి వారి వద్ద తన తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషులోకి వెంటనే అనువదించి చెప్పగలగడం వల్ల మిక్కిలిగా కీర్తి, ధనమూ సంపాదించారు.

అయినా తను చేసేదంతా రంజింప చేయడమేననీ, ‘అసలు’ కాదని అంతర్గతంగా దాసుగారికి అనిపించిందేమో! – ఒకచోట ‘రూపమునకెల్కగాని చేయునవి పందికొక్కు చేష్టలన్నట్లు విశ్వాసమునకు తగు వైరాగ్యమబ్బలేదు. తత్త్వజ్ఞానమునేమాత్రమును లేదు’ అని రాసుకున్నారు.

ఇంకా ఒకళ్ళ వద్ద ఉద్యోగం చెయ్యలేని తన ధోరణిని, స్వేచ్ఛాప్రవృత్తిని వివరిస్తూ – ‘విహంగన్యాయమున బ్రతుక నిశ్చయించితిగాని యొరుల నౌకరీసేయునుద్దేశము నాకెన్నటికినీ లేదు. మరియూ కొండలు, నదులు, వనములు, జంతుజాలములు, సూర్యాదిగ్రహములు, ప్రకృతి మహిమయూ చూసి ఆనందించుటయు, జనుల మంచి చెడ్దలు కనిపెట్టి తర్కించుటయు, తరచుగా గురునివశమున యదేచ్ఛాసంచారము సేయుచుంట నా వృత్తి’ అన్నారు.

రంజింప చేసే ప్రతిభే కాకుండా దాసుగారిలో పాండితీప్రకర్షకి కొదవ లేదని తెలుస్తుంది. కా్త్వర్థక ప్రయోగంలో భిన్న కర్తృకం ఉండేటట్లు ఏదో పద్యం చెప్పారట దాసుగారు విజయనగరం రాజా వారి ముందు. (ప్రధాన క్రియ ముందు వాడే అసమాపక క్రియా రూపాలు – చేసి, చూసి, నిలబడి లాంటివాటిని కా్త్వర్థక క్రియలు అంటారు. ఇవి ప్రయోగించబడిన వాక్యంలో క్రియలన్నింటికీ ఆశ్రయంగా ఉండే కర్త ఒకరే ఉండాలనేది బాల వ్యాకరణంలో ప్రముఖ సూత్రం. నేను పాలు తాగి వాడు నిద్ర పోయాడు లాంటి వాక్యాలు వ్యాకరణ సమ్మతాలు కాదు అని చెప్పేది ఈ సూత్రం).

‘మీరు చేసిన ప్రయోగం తప్పు అని ఒప్పుకోండి లేదా ప్రమాణమైనా చూపండి’ అని రాజావారు అంటే ఆ రాత్రి భారతమంతా వెతికి భిన్న కర్తృక కా్త్వర్థక ప్రయోగానికి – ‘రాహుకంఠముదెగి దేహము ధరణిబడియె’ అనే దాన్ని ప్రమాణంగా చూపించారట.
దాసుగారు ‘శంభో’ అంటే విజయనగరమంతా ప్రతిధ్వనించడం, కాళ్ళతో చేతులతో తలతో ఐదు భిన్న తాళాలను ఏకకాలంలో వేయగలగడం లాంటి విషయాలు చాలా ప్రసిద్ధాలు కాని కా్త్వర్థక ప్రయోగాల గురించి కూడా పండితుల్ని ఎదుర్కొనే సత్తా, పాండితీవైదగ్ధ్యం ఉందన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. దాసుగారి దగ్గు కూడా లయబద్ధమే అంటున్నారు శంకర శ్రీరామారావు అనే ఆయన తన వ్యాసంలో (అనుబంధంలో ఇచ్చారు).

(కా్త్వర్థకాలు భిన్న కర్తృకాలను సహించవు అనే సూత్రానికి చాలానే మినహాయింపులని చేకూరి రామారావు గారు తన తెలుగు వాక్యం అనే పుస్తకంలో సంశ్లిష్ట వాక్యాలు అనే రెండో అధ్యాయంలో విపులంగా చర్చించి ఇచ్చారు – గొర్రెలని తినేవాడు పోయి బర్రెలని తినేవాడు వచ్చాడు, ఈ రాష్ట్రంలో కమ్యూనిష్టులు గెలిచి ఆ రాష్ట్రంలో కాంగ్రెసోళ్ళు గెలిచారు లాంటివి. ఆసక్తి కలవారు చేరా పుస్తకం చూడవచ్చు)

ముప్ఫై ఏళ్ళు దాటాక ఇక తన సంసారాన్నీ, దాంతో పాటే సంప్రదాయాన్నీ, తనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఫ్యూడల్ సంస్కృతినీ కాపాడుకోవాల్సిన అగత్యం దాసుగారికి కలిగినట్లు కనపడుతుంది. పోకిరీ వేషాలు (సానులు, మత్తు మందులు వగైరా) కొంత మానినట్లు దాంతో పాటే హిపోక్రిట్ గా మారినట్లు అనిపిస్తుంది. కొంత వయసొచ్చాక ఆయన – ‘సంగీత విద్యకలవానికి దుష్ప్రవర్తన సహజం’, ‘సంసార స్త్రీలకు భోగం స్త్రీలకిమల్లే సంగీతం నేర్పకూడదు’ లాంటి భావాలు వెలిబుచ్చారు.

తను శారీరక భోగాలన్నీ బాగా అనుభవించేసి కొంత వేడి తగ్గాక ఛాందస భావాలతో దేశోద్ధరణ చేసే భావజాలం అనిపిస్తుంది ఇదంతా. అట్లానే వితంతు వివాహాల్ని, స్త్రీ విద్యను, కందుకూరి వీరేశలింగం గారి కార్యక్రమాల్ని వ్యతిరేకించారు దాసుగారు.

దాసుగారి కన్నా రెండేళ్ళు ముందు పుట్టి దాసుగారి కన్నా ముప్ఫై ఏళ్ళ ముందే మరణించిన గురజాడకీ ఈయనకీ ఎంత తేడా? అనిపిస్తుంది.

ఎన్ని దురలవాట్లు ఉన్నా, డబ్బు కోసం ఉద్యోగుల వెంటా ప్రభువుల వెంటా పడినా దాసుగారిలో ఉన్న ఒక అమోఘమైన తేజస్సు, శక్తి వల్ల అందరూ ఆయనకి దాసోహం అయ్యారు అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. ఒక మునసబు గారితో దాసుగారి సంభాషణ దీన్ని పట్టిస్తుంది.

ఈ పుస్తకంలో ఆసక్తి కలిగించే పదాలు, ప్రస్తావించబడ్డ విశేషాలు, సంఘటనలు ….

1. పిడకలు ఎత్తుకునే అమ్మాయికి దాసుగారు ‘కరీషకరండవాహిని’ అనే పదం వాడారు (రాజులకి తాంబూలం కట్టి ఇచ్చే అడపకత్తెను తాంబూలకరండవాహిని అన్నట్లుగా). ఏదో పితూరి వచ్చి కరీషకరండవాహినితో కలబడ్డారట దాసుగారొకసారి!

2. గురజాడ తన డైరీలలో ప్రస్తావించిన మద్రాసు ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదం గురించి దాసుగారు కూడా ఒకచోట ప్రస్తావించారు. అట్లానే బెంగుళూరు లాల్ బాగ్ లో పుష్పప్రదర్శనని చూశారట దాసుగారు.

3. కించిద్భోగోభవిష్యతి కథ – నారదుడు ఓ పుర్రెనెత్తుకుని (సముద్రతీరంలో) తన తాత దాని నుదుటన రాసిన కష్టాలు, సుఖాలు చదివి చివర్లో ‘చనిపోయిన కొన్నేళ్ళకు అనుకోని అపూర్వమైన అదృష్టం పడుతుంది’ అన్న వాక్యం చదివి ఆశ్చర్యపోయాట్ట. ఇదేంటో తెలుసుకుందామని బ్రహ్మలోకం వెళ్ళి తాతగారిని ప్రశ్నిస్తే “ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా లభ్యం కాని బ్రహ్మలోక ప్రవేశం ఈ వ్యక్తి పుర్రెకు లభించింది కదా! అదే ఆ అదృష్టం అన్నాట్ట.

4. ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా – అంటే ఈ జన్మలో నేర్వకుండానే పూర్వజన్మ నించి పట్టుబడ్డ విద్యలట. కుమార సంభవం లో పార్వతి గురించి కాళిదాసు అన్న ఈ మాటను తనకి దాసుగారు అన్వయించుకున్నారు. నిజమే కదా! అని అనిపించక మానదు.

5. ఏతచ్చిత్ర పటం భాతి…. – పటంలో ఉన్న పచ్చిక బయలు కళ్ళకు ఎలా తృప్తినిస్తుందో విద్వాంసులు కూడా దర్శనమాత్రం చేత సంతోషాన్ని కలిగిస్తారు.

6. వేసవికాలం గురించి దాసుగారి కవితాత్మక వాక్యం – ‘అగ్ని తూలుతున్నట్లున్న ఎండ’ చదివితే శ్రీశ్రీ వాక్యాలు – ఎండ తీవ్రంగా ఉపన్యసిస్తోంది, మధ్యాహ్నపు మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతోంది’ లాంటివి గుర్తుకొస్తాయి.

7. అచ్చతెలుగు మాటలు వాడటంలో ఘనుడనిపించుకున్న దాసుగారు రిహార్సల్స్ కి ‘శుష్కేష్టి’ అన్న సంస్కృత పదం వాడటం ఆశ్చర్యం అనిపిస్తుంది – ‘ఒద్దికలు’ అన్న తెలుగు మాట ఉండగా.

ఈ పుస్తకం వేయడంలో రవికృష్ణ గారి కృషి అభినందనీయం. కొన్ని సందేహాలు, సూచనలు ….

1. దాసుగారు చేసిన ప్రయాణాలు, కలుసుకున్న ప్రభువులు, పొందిన అనుభవాలు – వీటి గురించి ఆయన రాసుకున్న ధోరణి చూస్తే ఆయనలో సహజంగా కొంత పెడసరితనం, మొండితనం, తెంపరితనం ఉన్నాయనిపిస్తుంది. ఈ విషయాన్ని చక్కగా ముందుమాట లో నిదానించారు మోదుగుల రవికృష్ణగారు. కాని దాసుగారు తన చెడ్డ అలవాట్లన్నింటిని ముప్ఫై ఏళ్ళకే వదుల్చుకున్నారని తేల్చేశారు. తిరుమల రామచంద్రగారి ఆత్మకథ – ‘హంపీ నుంచి హరప్పాదాకా’ లో – నెల్లూరు మూలపేట వేదపాఠశాలలో చదువుకుంటున్న సమయంలో దాసుగారి హరికథా కాలక్షేపానికి వినాయక హాలుకి వెళ్ళాననీ, ఆరోజు దాసుగారు వేదిక మీదకి వచ్చి ‘వ్యత్యస్త పాదారవిందా’ అని అంటూ తూలి విరుచుకు పడిపోయారని టిక్కెట్లు కొని వచ్చిన జనం పెద్ద గోల చేశారని రాసుకొచ్చారు. ఈ సంఘటన తిరుమల రామచంద్రగారి కథనం ప్రకారం 1932-34 మధ్య జరిగింది. అంటే దాసుగారికి దాదాపు డెబ్భై ఏళ్ళన్నమాట. కాబట్టి ముప్ఫై ఏళ్ళకే దురలవాట్లన్నింటిని వదుల్చుకున్నారన్న విషయం సరికాదనిపిస్తుంది.

2. బందరులో దాసుగారికిచ్చిన వీడ్కోలు సభలో ఒకాయన బొంబాయిలోని ‘బ్రాడ్లా’ గారి గురించి ప్రస్తావించారు. ఈ బ్రాడ్లా ఎవరనే వివరం అధోజ్ఞాపికలో ఇస్తే బాగుండేది.

3. మత్తుమందులు, శృంగారపిపాసలతో సలసల మరిగిపోతూ తన సంగీత సాహిత్యాలతో ఉర్రూతలూగించగల దాసుగారు పరమ పవిత్రమైన హరికథలు చెప్పడం మనస్సుకి కష్టంగా తోచి ఒక ప్రముఖ వెలయాలు సలహా ఇచ్చిందట – ‘మీకు ఉద్యోగమే ఉచితం, సానిపాప వలె ఆడి జీవించుట కాదు. పరమ పవిత్రులు చేయాల్సిన హరికథావృత్తికి మీ వంటి శృంగార శేఖరులు తగరు’ అని. దానికి ఆదిభట్ల గారి జవాబు “కొలనునుండి కొండకేగిన కలహంసది తప్పుగాని కాకిది తప్పా?” – ఈ జవాబు కొంచెం కన్ఫూ్యజింగ్ గా ఉంది. అంటే నిజానికి తాను కలహంసలాగా కనిపించే కాకినని దాసుగారి ఉద్దేశమా? నేను కాకి వంటి వాడినే, నాకు ఈ రంజింపచేసే వృత్తే (కొండ మీద కాకిలాగా తిరగడం) విధాయకం అని దాసుగారు అంటున్నారా? అన్న సందేహం వస్తుంది. అలా చటుక్కున అనేసే వ్యక్తి కాదు అని కూడా అనిపిస్తుంది. దీనికి కొంచెం వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.

సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఆనాటి సమాజపు ధోరణులు తెలుసుకోవాలనుకున్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం.

**** (*) ****