కవిత్వం

పొరపాటే!

25-జనవరి-2013

వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే!

సాహసాల సంచిని భుజాన వేసుకొని
రహదార్లు, విద్యుత్తుదీపాలులేని
గుబురు అలుముకున్న చెట్లలోంచి
మెలికలు తిరిగిన కాలిబాటను
ఒంటరిగా నడవడమే!

బాల్యంలో విన్న దెయ్యంకథలు
వెనుకనుంచి విసిరే గాలిలోంచి
చెవిలో గుసగుసలాడొచ్చు

దారితప్పిన గువ్వపిట్ట
గుబులు గుబులుగా పాడేరాగం
వెన్నంటే రావొచ్చు

తప్పిపోయిన కుమారుడు
దూరాన నెగడై ఎందరికో వెచ్చదనానిస్తూ
పిలుస్తున్నట్టే అన్పించొచ్చు

మిణుగురులు పంపే ప్రేమసంకేతాలు
కన్రెప్పలను గుచ్చి గుచ్చి
ఆదమరచిన చెలిజ్ఞాపకాలు
మువ్వల సవ్వడై ముందు నడవనూవచ్చు

పేగుచివర రేగిన ఆకలిమంట
విద్యుల్లతలా ఆవరించి
దేహాన్ని వణించనూవచ్చు

వెన్నెలను ప్రేమించేది
నేనొక్కణ్ణే అనుకుంటే పొరపాటే!

విరహపు రెక్కలను తెరచి
పరిష్వంగం కోసం పరితపించి
నాగరాజులు నాట్యమాడతాయి

రహస్య సంకేతాలను
చేరవేసే నక్కలు ఊళవేస్తాయి

ఇంద్రలోకపు వయ్యారాలను
తలదన్నే కలువభామలు
చెరువు వేదికపై
చంద్రుణ్ణి తేవాలనిచూస్తుంటాయి

ఎవ్వరూ రారక్కడికి
నా వూహలు తప్ప
అల్లుకున్న అక్షరాలు
అప్పుడప్పుడూ పలకరించిపోతుంటాయి

అడుగులను కొలతలుచేసి
ఎన్నిసార్లు ఈ దారిని కొలిచే ప్రయత్నంచేసానో
చీకటిపొరల మధ్యొకసారి
ఆత్రాల అంగలమధ్య ఇంకోసారి
తప్పించుకుంటూనే వుంది

వెన్నల తడిపిన
తెల్లటి బాటవెంట మోసుకుపోతున్నవన్నీ
బుజాన బరువెక్కి
గుండెల్లోకి చేరుతాయి

ఏనాడైతే కాంక్రీటు అడవిలో
బ్రతుకుతెరువు వెదక్కున్నానో
అప్పుడే వెన్నెలను
నియోన్‌లైట్ల కాంతికి కుదువపెట్టడమైయ్యింది

ఇక
వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే!