కథ

ఆవు-పులి…2013

ఫిబ్రవరి 2013

విశాలమైన గడ్డి బీడు లో ఆదమరచిపోయి మరీ మేస్తోంది ఆవు.

అప్పుటికే బీడంతా అనేకసార్లు కలియతిరిగిన పాలేరు రంగడు ఆవు దగ్గరకి చేరుకున్నాడు.

దానికి భయమనిపించకుండా, సుతారాంగా తట్టి, గంగడోలు రాస్తూ అనునయంగా చెప్పడం మొదలు పెట్టాడు.

వాడి వయస్సు ఇంచుమించు పదహారేళ్ళు ఉంటుంది. ఎనిమిదో తరగతి వరకూ చదివాక, తండ్రి బలవంతం మేరకు చదువాపేసి ఆ ఊరి-పెద్ద చంద్రయ్య ఇంటిలో పాలేరు గా చేరిపోయాడు. ఆ మాత్రం చదువుకే వాడి నడకలోను, నడతలోనూ పరిణితి వచ్చి అది మాటల్లోను చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది.

“నీకు తెలియదని కాదు. ఐనా సరే మరోసారి చెబుతున్నా విను…” అని మొదలు పెట్టి, ఆవు దృష్టిని తను చెప్పే విషయం మీదకు తిప్పుకున్నాడు.

అప్పటికే పడమటి గూటికి చేరే ప్రయాణంలో ఉన్నాడు సూర్యుడు.

మరో కొద్ది సేపటిలో తనను ఇంటికి తోలుకుపోబోయే ముందు ‘ఇప్పుడంత ముఖ్యమైన విషయం ఏమిటి చెబుతాడబ్బా?’ అని కుతూహలంగా అతనివైపు చూసింది ఆవు.

అతను చెప్పడం ప్రారంభించాడు.

“చుట్టుపక్కల అడవుల్లోని చెట్టూ-చేమా కొట్టేసి కనిపించిన మొక్కల్నీ, జంతువులనీ స్వాహా చేయ్యడం వలన, మనిషి నీడ తాకినంత మేరా అడవులు వల్లకాళ్ళయిపోయాయి. ఊరులో ఉండే మనిషి అడవుల మీద కూడా ఆశ పడ్డాక, అడవుల్లోని జంతువులు కొన్ని చచ్చిపోయాయి, కొన్ని ఛస్తూ బతుకుతున్నాయి, మరి కొన్ని గతిలేక ఊరుల మీద పడటం మొదలెట్టాయి.”

రంగడు, అసలీ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నాడొ తెలియక ఇంకా కుతూహలం గానే ఉంది ఆవుకి.

” ఒకప్పుడు, అడవి నుండి ఊర్లోకి వచ్చే జంతువులలో కోతులు, కుందేళ్ళు, లేళ్ళు ఉండేవి. ఇప్పుడు, ఏనుగులు, పులులూ, ఇంకా అనేక కౄరజంతువులు కూడా తయారయ్యాయి.  మన చుట్టుపక్కల ఊరుల మీద పులొకటి పడి మేకల్ని, గొర్రెలని, కోళ్ళని చంపేస్తోందట. అదెవరి మాటా వినకుండా భయ పెడుతున్నట్టనిపిస్తోంది. వన్యప్రాణుల రక్షణ చట్టం ఒకటి అడ్డు పడి దానిని చంపే అవకాశం ఎవరికీ లేకుండా పోతోంది. అటవీశాఖ వాళ్ళకి, జూ వాళ్ళకీ చెప్పి రప్పించిన  ప్రతిసారీ అది కనిపించకుండా తప్పించుకు తిరుగుతోంది.”

గంగడోలు రాయడం ఆపి, ఆవు వంటి మీద నిమురుతూ చెప్పుకుపోతున్నాడు రంగడు.

“పులే కాదు, ఏ జంతువైనా ఎప్పుడు మీద పడి నిన్నేమి చేస్తుందో ఎవరూ చెప్ప లేరు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. చుట్టూ గమనించుకుంటూ మేత మెయ్యాలి. అనుమానం అనిపిస్తే ఉరకలేస్తూ ఊర్లోకి పోయి అందరికీ తెలిసేలా అరవాలి.”

వాడు చెప్పే తీరు ఆవు కి పాలేరు చెబుతున్నట్టు కాకుండా, పిల్లకి తల్లి చెబుతున్నట్టుంది.

“ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను రేపు పని మీద పట్నం పోతున్నాను.  నిన్ను మన పక్కింటోల్ల పాలేరు గులమయ్య గాడు రేపిక్కడ బీడుకి తీసుకొచ్చి వదిలేసి, వాళ్ళ ఆవుల్ని కాసుకునే ఆ దూరంగా ఉన్న బీడుకి పోతాడు. తిరిగి సాయంత్రానికి మళ్ళీ నిన్ను వెనక్కి తోలుకుపోతాడు. ఈ లోపల నీకు ఏమీ అవ్వకుండా చూసుకో. రేపొక రోజు గడిచిపోతే ఎల్లుండి మళ్ళీ నేనొచ్చి నిన్ను చూసుకుంటాను.”

చెప్పేది అయిపోయాక, మూసుకుపోతున్న పొద్దు వంక చూసుకుని ఆవుని తోలుకుని తమ యజమాని ఇంటి వైపు నడక ప్రారంబించాడు.

ఆవు ఇంటికి చేరాక, లేగదూడని తనివి తీరా నాకింది. కడుపారా పాలిచ్చి, ఆ రోజు జరిగిన విషయాలన్నీ దూడకు అర్ధమయ్యే రీతిలో పూసగుచ్చినట్టు చెప్పింది. మంచి చెడులు చెప్పుకునే ఆ సమయంలో యజమాని చంద్రయ్య కూడా ఒక చెవి పడేసి వింటూ ఉంటాడు.  ఆవు దూడల కబుర్లైపోయాక, చంద్రయ్య ఆవు నుండి పాలు తీసి, తల్లీ పిల్లల్నిద్దరినీ ఒకచోట కట్టేశాడు.

* * *

చాలా కాలం తరువాత రంగడి నీడా, జాడా లేని గడ్డి బీడులో మేత మెయ్యడం, కొత్తగాను, కొంత బెరుకుగాను అనిపిస్తోంది ఆవుకి. తనను తోలుకొచ్చి వదిలేసిన గులమయ్య, అతని ఆవులతో కబుర్లు చెప్పుకుంటూ దూరంగా ఉన్న వేరే బీడుకి వెళ్ళి పోయాడు.

అప్పటికి మద్యాహ్నం ఒంటిగంట అయ్యుంటుంది. తనకి చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ కనిపించ లేదు. మేతమేస్తూ అడవివైపు వెళ్ళిపోయిన విషయం అర్ధమై గుండె గుభేల్ మంది. వెంటనే వడి వడిగా ఊరి వైపు అడుగులేసింది.

సరిగ్గా చింతల తోపు దాటి మరి కొంత దూరంలో మిగిలిన ఆవులను చేరుకుంటాననుకుంటుండగా …..పులి గాండ్రించిన శబ్దం వినిపించింది. అది కేవలం తన భయం వలన అలా వినిపించి ఉంటుందిలే అని సరిపెట్టుకుంది. కానీ, మరోసారి బిగ్గరగా, స్పష్టంగా పులి గాండ్రింపు వినిపించేసరికి ముచ్చెమటలు పోసేశాయి. ‘రంగడు నిన్న చెప్పిన పులి అయ్యుండదు కదా’ అని, అనుమానిస్తున్నంతలోనే పులి ఇంకోసారి గాండ్రించింది.

ఆవుకి పై ప్రాణాలు పైనే పోయాయి.  ఎక్కడ దాగోవాలో?, ఎలా పారిపోవాలో? అర్థం కాలేదు. రక్షించమని అర్ధిస్తూ బిగ్గరగా అరిచింది. ఆవు అరుపులు మిగిలిన ఆవులని, గులమయ్యనీ చేరలేదు కానీ, పులిని మాత్రం చేరాయి. ఆవు తన ఉనికిని తనే పట్టిచ్చుకున్నట్టయ్యింది.  అప్పటివరకూ చెట్ల చాటునున్న పులి ఒక్కసారిగా ఆవు మీదకి దూకి పంజా విసిరింది. ఆ విసురు నుండి ఆవు లాఘవంగా ఐతే తప్పించుకుంది, కానీ తన పరిస్థితి ఎంత అభద్రంగా ఉందో తెలిసిపోతూనే ఉంది. ఆ క్షణంలో తను ఎంత పరుగు పెట్టినా పులి పాల పడక తప్పదు. ఉన్న శక్తినంతా కోల్పోవడం కన్నా, పులిని ఎదురించి అక్కడే ఆగడం మంచిదనిపించింది. ఆవేశంతో, ఆకలితో ఉన్న పులి తన మీద మరో సారి దాడి చెయ్యక ముందే చెప్పింది.

“నీకు ఆహారం కావడం మినహా నాకు మరో దారి లేదు. అందువలన సావధానంగా విను. నా మీద ఆధారపడి పాలు తాగుతూ బతుకుతున్న నా లేగ-దూడ ఇంటిదగ్గర ఉంది. ఆఖరిసారిగా దానికి పాలు ఇచ్చివచ్చి నీకు ఆహారం అయ్యిపోతాను. నా మాటా నమ్ము” అని విన్నవించుకుంది.

ఆ మాట విని అంత ఆకలిలోనూ, ఆవేశంలోనూ కూడా పులి గాండ్రిస్తూ మరీ నవ్వింది.

“ఎప్పుడో పురాతన కాలంలో, మా పులి జాతిలో ఒకటి, మీ ఆవు జాతిలో ఒక దానిని ఇలాగే నమ్మి, క్షమించి ఇంటికి వెళ్ళి దూడకి పాలు ఇచ్చి రానిచ్చిందని నాకు తెలుసు. అటు తరువాత, తిరిగి వచ్చాక కూడా ఆ ఆవు నిజాయితీకి ముచ్చటపడి క్షమించేసినదని తెలుసు. అంత మాత్రాన అది ఈ కాలంలో కూడా నిజమౌతుందనుకుంటున్నావా?” అని వికటంగా నవ్వుతూ ఆవు తెలివితేటలని గేలి చేసి అడిగింది.

“ఆ కధ గురించి నేనూ విన్నాను. నాకు ఈ రోజుకీ కూడా ఆ కధలోని ఆవు నిజాయితీ మీద నమ్మకం ఉంది. అదే నమ్మకంతో, విశ్వాసంతో చెబుతున్నాను…నన్ను నమ్ము.” ఆవు వేడుకుంది.

“మంచి తిండి లేక పది రోజుల నుండీ అల్లాడుతున్నాను. అడవులలో కావలసినంత తిండి దొరికితే ఇక్కడివరకూ వచ్చి నిన్ను తినాలని ఎందుకు అనుకుటాను?  నువ్వు, భయంతో పరుగెట్టకుండా ఆగిపోతే, ఎదురు తిరుగుతావనుకున్నాను. ఆగిపోయి అర్జీలు పెడతావనుకోలేదు. నువ్వు పోతే నీ లేగదూడకి మరొక వెసులు బాటు దొరికి, పాలో గడ్డో మరొకటో దొరుకుతాయి. నువ్విప్పుడు పోయి పాలిచ్చి వెనక్కు తిరిగొచ్చినా, రేపటి నుండీ నీ దూడ తల్లి లేని పిల్లై పొట్ట నిండటంకోసం మరొకరి మీద ఎలాగూ ఆధారపడక తప్పదు.  వెళ్ళిపోతే మళ్ళీ వస్తావని నమ్మకం లేదు. నువ్వొచ్చేసరికి, ఆకలితో శోష వచ్చి నేను పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఈలోగా చుట్టుపక్కలున్న మనుషులు నన్ను ఇక్కడ ఉండనిస్తారన్న నమ్మకమూ లేదు. ఐనా, పులికి వేటాడి తినడంలోనే సరదా ఉంటుంది. తనకు తానుగా వచ్చి ఎవరైనా ఆరగించమంటే నచ్చదు. నీ పరుగు నువ్వు పరుగెట్టు. నా వేట నేను వేటాడుకుంటాను. మార్పులొద్దు.” సహనం పోయి ఆవు మీదకి ఉరకలెయ్యాలని ఆవేశపడుతూ అంది.

“నువ్వు చెప్పినది బాగానే ఉంది. నీకు నచ్చినట్టు నన్ను వేటాడే చంపవచ్చును. అప్పుడు నా ప్రతిఘటనకి చుట్టుపక్కల నుండి ఎవరైనా రావొచ్చును. లేదా నేను తప్పించుకుని పారిపోవచ్చు. అడవిలో ఉండి నువ్వు అడవి ధర్మం గురించి, వేట గురించి చెబితే బాగుంటుంది. ఊరిలోకొచ్చి, నీకు ఏ సంబంధంలేని గడ్డి బీడులోకొచ్చి నువ్వు అడవిధర్మాన్ని ఆచరించమంటే ఎలా సాధ్యమో చెప్పు? ఐనా నేను, ధర్మం తప్పి తిరిగి రానని చెప్పట్లేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నా..తిరిగి వచ్చి నువ్వు వేటాడి నన్ను చంపి తినే అటవీ అవకాశం ఇస్తాను. ధర్మా ధర్మాలతో నీకు పని లేకపోయినా, నా లేగదూడ ని కడసారిగా చూసి రావాలన్న కడుపుతీపికోసమైనా నేను ఇప్పుడు నీ నుండి బయటపడే ప్రయత్నాలు చెయ్యక తప్పదు. “ ఆవు లో భయం పోయి తెగింపు వచ్చి మాట్లాడింది.

ఆవు ప్రవర్తనా, మాటలూ పులికి ఆశ్చర్యకరంగానూ, విచిత్రంగానూ అనిపించాయి. ఈ రోజు వరకూ తనని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయిన జంతువులనే చూసింది. తప్పీదరీ మార్పులుంటె, ఎదురుతిరిగి పోరాడి ప్రాణాలు కోల్పోయిన వేట కుక్కలను చూసింది. కానీ, ఈ ఆవులాంటి ధైర్యంగా విన్నపాలు చేసిన జంతువుని ఇప్పటివరకూ చూడలేదు.

ఆకలి తనని పులినే కమ్మంటే, ఆలోచన తనను కూడా ఆవుని కమ్మనేట్టు ఉంది.  నోటికందిన ఆవుని జారవిడుచుకోవటం ఎంత మాత్రం నచ్చట్లేదు. కానీ, మరో మూల ఇన్ని కబుర్లు చెబుతున్న ఆవుని వేటాడితే ఎటునుండి ఏమౌతుందో అన్న అనుమానం పీకుతోంది. ఈ రోజు వరకూ తను ఎప్పుడూ తన ఆకలి సమయంలో పరిస్థితులూ, పర్యవసానాలు ఆలోచించలేదు. యుక్తాయుక్త విచక్షణల మాటే తెలియదు. అనేకసార్లు, పురాతన కాలం నాటి ఆవు-పులి కధ ను సాటి పులులతో కలిసి చెప్పుకుని వేళాకోళం చేసుకుంటూ మరీ పదే పదే, పడి పడి నవ్విన సంగతి కూడా తనకి గుర్తొస్తోంది. కానీ, ఈ రోజు తనకి మనసంతా అడివంత గజి బిజిగా ఉంది.

ఏమి చెయ్యాలో ఆలోచించే సమయం లేదనిపించి “సరే వెళ్ళు…నన్ను మోసం చెయ్యాలనుకుంటే, అది మీ ఆవు జాతికే కళంకం అవుతుంది. నువ్వు ప్రమాణం చేసిన నీ లేగదూడ తో సహా మీరిద్దరూ పుట్టగతుల్లేకుండ మట్టికొట్టుకుపోతారు. పురాతన కధలోని పులిలాగ, నేను నీ నిజాయితీని మెచ్చుకుని వదిలేస్తానని ఆశ పెట్టుకోకు….నీ దూడ కడుపుని పాలతొ నింపిన మరుక్షణమే ఒక్క లిప్త కాలం కూడా ఆలస్యం చెయ్యక ఇక్కడికి వంటరిగా రా….” అని ఆవుకి అయిష్టంగా, అన్యమనస్కంగా చెప్పి…వెళ్ళి రమ్మంది.

ఆవు పులికి వేన వేల కృతజ్ఞతలు చెప్పి, పరుగు పరుగున లేగదూడను కలుసుకునేందుకు ఇంటికి పోయింది.

* * *

ఎప్పుడూ లేనిది తన తల్లి రొప్పుతూ, ఆయాసపడుతూ ఇంటికి రోజూ కన్నా చాలా ముందుగానే రావడం లేగదూడకి కొత్తగా అనిపించింది. రావడం రావడమే తనకి పాలు ఇచ్చి ఆకలి తీర్చడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది.

“కన్నా, రేపటి నుండీ నువ్వెలా బతుకుతావోనని బాధగా ఉంది” కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళను దాచుకుంటూ దూడకు చెప్పింది ఆవు.

“నువ్వుండగా, నాకేమౌతుందమ్మా?” అమాయకంగా అడిగింది దూడ.

“నేనే నీతో ఉంటాననుకుంటే ఇప్పుడిలా మాట్లాడే పరిస్థితి రాదు. నువ్వు మారాం చెయ్యకుండా మూడు పూటలా కుడితి తాగుతూ కడుపు నిండినంతా గడ్డి మేస్తూ, రంగడు చెప్పినట్టుగా నడచుకో. మన యజమాని, యజమానురాలు, వారి పిల్లడు నిన్ను బాగా చూసుకుంటారు. నీకేమి కావాలో వాళ్ళకి స్పష్టంగా చెబుతూ ఉండు. అల్లరిచిల్లరి దూడలతో కలిసి తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. ఎవరైనా తోడుంటే తప్ప, ఇల్లు దాటి బయటకు కదలకు. నీకు ఆపదొస్తే అందరికీ తెలిసేలా అరిచేయి.” ఇలా పలు జాగ్రత్తలు చెబుతున్న ఆవు మాటల్లో దుఃఖాన్ని ఎంత దాచాలన్నా దాయలేక పోతోంది.

తల్లి మాటల్లోని, ఆందోళన, దుఃఖాన్నీ అర్థం చేసుకున్న దూడకు పాలు మింగుడు పడట్లేదు. తల్లి నుండి పాలు తాగడం ఆపేసి, బేజారై పోయింది. తనూ ఏడవటం మొదలెట్టింది. దూడలోని ఆందోళనకు ఆవు మరింత చలించిపోయింది.

“ఈ రోజన్నా, పాలు కడుపునిండా తాగు. బాధ, ఆందోళనా నాకు వదిలేసి, నువ్వు ఎప్పటిలాగే ఆడుకుంటూ పాడుకుంటూ ఉండు” ఆవు మరింత బాధగా చెప్పింది.

“ఇంతకీ నీకు ఎమౌతోందమ్మా? నువ్వు ఏమైపోతావు? ఎందుకు ఏవేవో చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు? రొజూ కన్నా ముందే ఎందుకొచ్చేశావు? నేను కావాలని మారం చెయ్యకుండానే పాలెందుకు ఇచ్చావు?” దాగలేక సతమతమౌతున్న అనేక ప్రశ్నలను తల్లి ముందు ఉంచింది.

దూడ ప్రశ్నలకు, ఆవు ఆవేదనతో చెప్పడం ప్రారంభించింది.

“ఈ రోజు రంగడు లేక పోవడం వలన, ఒంటరిగా మేస్తున్న నేను పెద్ద పులి భారిన పడ్డాను. నన్ను నేను రక్షించుకోవడం దుర్లభమని తేలిపోయాక, నీకు పాలు ఇచ్చి వస్తానని మాట ఇచ్చి పరుగు పరుగున ఇలా వచ్చాను. ఇచ్చిన మాట తప్పలేను. నేను వెళ్ళి తీరాలి.” తనని రగుల్చుతున్న విషయాన్ని కాస్తా దూడతో పంచుకుంది, ఆవు.

ఆ మాటలకు, దూడకన్నా ముందుగా చలించారు అప్పటి వరకూ ఆ ఇద్దరి మాటలూ వింటున్న యజమాని చంద్రయ్య, అతని భార్య, వారి పదేళ్ళ కొడుకు.

ఒక్క అంగలో తనను సమీపించి, “ఏమిటేమిటీ? నువ్వు మాటిచ్చి నిలబెట్టుకోవాలని, పులికి ఆహారమైపోతావా? నిన్ను కొని పెంచిన నా ప్రమేయం లేకుండా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్న రంగడి గాడికి కూడా తెలీకుండా, లేగదూడని వదిలి చచ్చిపోతావా?” అని చంద్రయ్య ఆవుని పట్టుకుని కళ్ళెర్రజేసి వెటకారంగా మాట్లాడాడు .

ఊహించని పరిణామానికి ఆవు ఖంగు తిని, అవాక్కయ్యింది.

ఆ తరువాత, యజమానికి తన సత్యనిష్ట ఎంతటిదో చెప్పి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం తనకు ఇవ్వమని అతనిని అర్థించింది. ప్రాధేయపడింది.

ఆవు అమాయకత్వానికి బిగ్గరగా నవ్వాడు చంద్రయ్య.

“2013 సంవత్సరంలో కూడా నీ బోటీ అమాయకపు ఆవులు ఉంటాయని, ఇలా ఇచ్చిన మాట పాటిస్తామని అంటే నమ్మాలనిపించట్లేదు.  పులి నుండి బతికి బయట పడే అవకాశం వచ్చిందని ఇప్పటికైనా సంతోషించు.” అని ఎగతాళిగా మరోసారి నవ్వాడు.

చంద్రయ్య కొడుకు భార్గవ ముందుకొచ్చి, “నాన్నా మాకు మూడో తరగతిలో నేర్పిన ఆవు-పులి కధలో కూడా అంతా మన ఆవు చెప్పినట్టే ఉంది. ఆ కధలో కూడా నిజాయితీగా పులికి ఆహారం కావాలని వెళ్తుంది. కానీ పులేమో, ఆవు తిరిగి వచ్చినందుకు ఆశ్చర్యపడి పోయి, సంతోష పడిపోయి, దాని నిజాయితీ మెచ్చుకుని ‘నిన్ను తినను. హాయిగా ఇంటికి పోయి నీ దూడ ను పెంచుకో’ అని వదిలేస్తుంది. ఆ కధలో ఎక్కడా కూడా, యజమాని గానీ, పాలేరు గానీ ఆవుని పులి దగ్గరకు వెళ్ళకుండా ఆపినట్టుగా లేదు. నువ్వు మాత్రం ఇప్పుడు మన ఆవుని ఎందుకు ఆపుతున్నావు?” అని తండ్రిని ప్రశ్నించాడు.

నిలదీసినట్టున్న కొడుకు మాటలకు, అందులోని అమాయకత్వానికీ చంద్రయ్యకు చిర్రెత్తుకొచ్చింది. పీకలనిండా కోపం వచ్చింది. అంతలోనే కొడుకు మీద జాలి కల్గింది.

“నీక్కూడా బుధ్ధి పోయిందిరా? నీ పుస్తకం లో చెప్పినట్టున్న ఆవులా, మన ఆవు పులి దగ్గరకి నిజాయితీగా పోయినా, ఈ పులి మాత్రం ఆ కధలోని పులిలా దయదలచి, నిజాయితీని మెచ్చేసుకుని వదిలేస్తుందనుకున్నావట్రా…వెర్రోడా?” అని కోపం మిళితమైన జాలితో కొడుకువైపు చూశాడు.

కొడుక్కి, మరింత బోధపరచడం అవుసరమనిపించింది.

“నువ్వు మూడో తరగతిలో మరో కధ కూడా చదువుకున్నావు, మరచిపోయావేంట్రా?” అని కొడుకుకి పాఠ్యాంశాల పద్ధతతిలోనే అర్ధం చేయించాలన్న ఉద్దేశ్యంతో ప్రశ్నించాడు.

“ఏ కధ నాన్నా?” అమాయకంగా అడిగాడు భార్గవ.

“అదే కోతీ-మొసలి కధ”

“ఆ ఉంది. ఆకధకి ఈ కధకీ సంబంధం లేదే….”

“నేను చెప్పేది  విన్నాక సంబంధం ఉందో లేదో నీకే తెలుస్తుంది.”

తండ్రి వైపు కుతూహలంగా చూశాడు భార్గవ. ఆవు కూడా తండ్రీకొడుకుల సంభాషణలని ఆసక్తిగా వింటోంది.

“ ఆ కధలో…” అని తను చెప్పబోయి…మళ్ళీ ఏదో గుర్తొచ్చినవాడిలా,

“నేనెందుకు..? నువ్వే చెప్పు” అన్నాడు కొడుకుతో.

తండ్రి తనకు ఆ కధ చెప్పే అవకాశం ఇవ్వడం, తన మాటలకు ఎంతో విలువిస్తున్నట్టనిపించి వాడికి ఒకింత సరదాగా, మరి కొంత గర్వంగా కూడా అనిపించింది.

“ ఆ కధలోనేమో…. ఒక చెట్టు మీద ఉండే కోతికీ… కింద నదిలో ఈదే మొసలికీ ఫ్రెండ్షిప్ అవుతుంది. రోజూ చెట్టు మీద నుండి కోతీ, నీళ్ళలో మొసలీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఒక రోజు…మొసలి వీపు మీద ఎక్కించుకుని కోతిని నదిలో తీసుకు వెళ్తుంది. అలా అలా వెళ్తున్నప్పుడు …కోతి మొసలిని అడుగుతుంది… ‘మిత్రమా ఇంతకీ నన్ను ఎక్కడకు తీసుకు పోతున్నావు’ అని.  అప్పుడు మొసలి అంటుంది, ‘మా ఆయనకు వ్యాధి వచ్చినది…అది ఎంతకీ తగ్గ లేదు…వైద్యుడిని మందు కావాలని అడిగితే….. ‘కోతి గుండెకాయ కావాలి…దానితో మందు తయారు చెయ్యాలి’ అన్నాడు అని చెప్పింది” కధను మధ్యలో ఆపి తను చెబుతున్నది సరిగానే ఉందా? అన్నట్టు చూశాడు భార్గవ….

“చెప్పు… చెప్పు”అంటూ తండ్రి తల ఊపి సమాధానం ఇచ్చేసరికి, కొనసాగించడం మొదలు పెట్టాడు.

“అప్పుడు కోతేమో…’.తనకి రాబోయే అపాయం పసిగట్టి, వెంటనే తెలివిగా అంటుంది…”అయ్యయ్యో మొసలి మిత్రమా….ఈ విషయం మనము బయల్దేరే ముందు చెప్పి ఉండవలసింది. నేను నా గుండెకాయను, చెట్టుపై వదలి వచ్చాను. ఇప్పటికైనా మించిపోయినది లేదు. నన్ను ఆ చెట్టు వద్దకు తీసుకు పో…మనం గుండె కాయ తీసుకుని తిరిగి వద్దాము…’ అని మొసలికి చెప్పి…వెనక్కు పోయాక …కోతి అమాంతంగా చెట్టు మీదకిపోయి…మరి కిందకు రాదు….అప్పుడు మొసలి ‘త్వరగా రా కోతి మిత్రమా, నీ గుండెకాయ తీసుకుని రా’ అని తొందర చేస్తుంది. అందుకు కోతి, ‘మొసలీ… నీకేమైనా మతి పోయిందా? మితృడునైన నా ప్రాణాలు పణంగా పెట్టి నీ భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నావు. ఏ జంతువైనా తన గుండె కాయను వేరు చేసి చెట్టు మీద వదలి, తను వేరే చోటికి ప్రయాణిచగలదా? నీతో స్నేహానికి ఈ రోజు నుండీ చెల్లుచీటీ ఇచ్చేస్తున్నాను. మరి నన్ను తలవవద్దు, అని చెప్పి తెలివిగా తప్పించుకుంటుంది.” అని కధ ముగించాడు భార్గవ.

“ఇప్పుడు చెప్పు, ఆ కధలోని కోతిలా తెలివిగా ప్రాణం కాపాడుకోవాలా…? లేక ఆవు-పులి కధలోని ఆవులా నిజాయితీ కోసమని పోయి, ప్రాణం పోగొట్టుకోవాలా?” అని కొడుకుని ప్రశ్నించి ఆ ప్రశ్న ఆవుకి కూడా వర్తిస్తుందన్నట్టు ఆవు వైపు చూశాడు.

భార్గవ, తండ్రి తన మాటలతోనే తనకీ విషయాన్ని అర్థం చేయించినందుకు ఆశ్చర్యపోయాడు. లోలోపలే తండ్రిని మెచ్చుకుని మాట్లాడకుండా ఉండిపోయాడు.

ఆవుకి ఏమి మాట్లాడాలో తెలియట్లేదు. చంద్రయ్య ఆవుని ఎటూ పోకుండా కట్టేశాడు.

వెంటనే, అటవీశాఖ అధికారులకు, జూ అధికారులకూ పులి ఊరి పొలిమేరలో కొచ్చిన సంగతి ఫోన్లు చేసి చెప్పాడు.

రెండు వైపుల అధికార్లూ వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ముందు చంద్రయ్యకు అభినందనలు చెప్పారు.

తరువాత, అతనితో చెప్పారు. “మాకు మా దగ్గరున్న జీపుల కన్నా, మీ దగ్గరున్న ట్రక్కు-లారీ తోనూ, మీ ఆవు తోనూ పని ఉంది, దయచేసి మాకు కొంత సేపు ఇవ్వండి. వీలైతే మీరూ మాతో రండి ” అని చంద్రయ్యను అర్థించారు.

“అదెంత భాగ్యం. తీసుకోండి”. అని డ్రైవర్తో సహా ట్రక్కునీ,  ట్రక్కులో వారు కోరినట్టు ‘కాళ్ళతో సహా బయటకు కనిపించే విధంగా ఆవుని నిలబెట్టీ’ మరీ వాళ్ళకు ఇచ్చాడు. జీపులో అధికారులతో కలసి బీడులోకి వస్తానన్నాడు.

పులికి కనిపించే విధంగా ఆవుని ట్రక్కులో తీసుకుని చింతల తోపు వైపుగా ప్రయాణం చేశారు అధికారులు.

తనకి అందరూ ముందే చెప్పినట్టుగా ఆవు అరవడం ప్రారంభించింది

“పులీ..ఒప్పుకున్నట్టుగానే నీకు ఆహారం కావడానికి వస్తున్నాను..సిధ్ధంగా ఉండు” అని.

ఆవు వస్తున్నందుకు పులికి సంతోషమనిపించింది. మరో ఆలోచనలేకుండా పంజా విసిరి చంపెయ్యాలనుకుంది. కానీ, నడుస్తూనో, పరిగెడుతూనో వస్తుందనుకున్న ఆవు, ఇలా వాహనంలో ఎక్కి రావడం తనను కలవరపాటుకు గురిచేసింది. జరగరానిదేదో జరగబోతోందని పించింది.

ఆ వాహనంలో ఆవు తప్ప మరో జీవులేవీ కనిపించట్లేదు.

తను మోసపోయానని గ్రహించడానికి పులికి ఎంతో సేపు పట్టలేదు. ఆవు మీద పట్టరాని కోపం వచ్చింది. ఆవు జాతిని దూషించింది. ఎప్పటికైనా తనను మోసం చేసిన ఫలితం ఊరికేపోదని శాపనార్ధాలు పెట్టింది.

పులి మాటలకి ఆవు ఎంతో నొచ్చుకుంది, కానీ, నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడ లేక పోయింది.

పులి ప్రవర్తనకూ, ప్రయత్నాలకూ….చంద్రయ్య, అధికారులూ….పడి పడీ నవ్వారు…

పులి జీపు లోకి చేరింది. ఆవు చంద్రయ్యను అనుసరించింది.