యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ… (7)

జూలై 2015


యెండ హోరు తగ్గిందో లేదో వానలు మృదువుగా కురవటం మర్చిపోయాయా అన్నంత వర్షం. చిన్న జల్లుకే యేరుల్ని తలపించే నగరాలు. అటువంటిది పది రోజుల్లో కురవాల్సిన వర్షం వొక్క రోజులో కురిస్తే యీ ముంబాయి మహా నగరం పొంగి పొరులుతోన్న అరబిక్ నదిలా వుంది. జన జీవనం స్తంభించటం అంటే యేమిటో మళ్ళీ యిప్పుడు మరొక్క సారి చూస్తున్నాను. ప్రతి యేడాది వానాకాలంలో యిలా జలమయం అవుతోన్న నగరాలని చూస్తూ కూడా వాటిని మెరుగు పరిచేవారెవ్వరూ వాటి మీద అవి అలా కాకుండా చూడటం పట్ల యేమంత శ్రద్ధ కూడా పెట్టరు.

సో … పనులన్నీ పోస్ట్ పోన్. నా రూమ్ లో నేను. యెదురుగా కడలి. యేది వానో యేది సముద్రమో తెలియట్లేదు. దట్టమైన నీల వర్ణపు జల ధారపై వుండుండి వో వూదా రంగు కాసింత కోరా రంగు సమ్మిళితమై విరగకురుస్తోన్న చినుకుల విశ్రుంఖల సౌందర్యాన్ని చూపుల విప్పార్చుకొని చూస్తోం టే తబ్బిబ్బవుతోంది మనసు. యే జీవన రహస్యాలని అందివ్వాలని యీ ఆకాశం సముద్రం ధారాపాతం గా యేకమయాయో … వుక్కిరి బిక్కిరిగా ఆలోచనలు.

కాఫీ కలుపుకొన్నాను. యే అరోమా లేదు. కాని మొన్నటి నుంచి అసలు యిలాంటి కాఫీ నే. కాని నీ దగ్గరకి వెళ్ళమని వో యెర్రని పరిమళం మారాం చేస్తోంది. అవును యెలాంటి చేతుల్ని నువ్వు నీ రెండు చేతుల్లోకి తీసుకొని నీ లాలిత్యపు ముఖానికి అద్దుకుంటావో, నీ అమాయకమైన పెదవులతో బుజ్జి ముద్దు పెడతావో , నీ వుచ్వాసనిస్వాసల చిరు వెచ్చదనపు గిలిగింతని అద్దుతావో అదే సౌరభం యీ ఆషాడం వచ్చిందంటే చాలు అప్రయత్నంగా గోరింటాకు సుగంధం హృదయాన్ని లేలేతగా యెరుపెక్కిస్తుంది. యీ సారింకా గోరింటాకు పెట్టుకోలేదు. యింటికి వెళ్ళాక ఆ చెట్టుని వెతుక్కుంటూ వెళ్ళాలి. అసలు ముందు తుప్పలు వెతకాలి. రోజూ కొత్త కట్టడాల కోసం చెట్టుపుట్టా కంపా రాయి రప్పా సమస్తాన్ని చదును చేసేస్తున్నారు కదా. సో… ముందు ఆ చిన్నిచిన్ని ఆకుపచ్చని చెట్టు కోసం తిరగాలి. చందమామని చుక్కలని అరచేతుల్లో పూయించటం భలే గర్వంగా వుంటుందనుకో. గోరింట సౌగంధానికి యెంత ముగ్దురాలినవుతానో ఆ పరిమళానికి నువ్వు కురిపించే మోహపు జల్లుకి యెంతో బానిసని. యెలాంటి ప్రేమని పండిస్తుందీ గోరింట. మన జీవనమెంత ఫలప్రదం…

అబ్బా వొక నవొల్లాసం కిలకిల్లాడుతోంది. యిప్పటికిప్పుడు యిక్కడ నుంచి యెగరాలని వుంది. కాని యెలా… విమానాలు చక్కగా నేల మీదే ముడుచుకు కూచున్నాయి. యెప్పుడు హాయిగా యెగురుతూండే వాటిని అలా వొదిగి వుండమంటే వాటికెంత బోర్.

గోరింటా గోరింటా అంటుంటే కృష్ణశాస్త్రి గారి పాట ‘ గోరింటా పూసింది’ అప్రయత్నంగా హం చేస్తుంది మనసు. యిలా మన జీవితాలని రాగభరితం చేసే కృషశాస్త్రి గారిని చదువుకోకపొతే ఆకులు కాస్త రంగు తక్కువగా కనిపించేవి కదా. అలానే తిలక్ గారు మాకెంత సంతోషాన్ని యిచ్చారో కదా అతని అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు అనటంతో. శ్రీశ్రీ గారి ‘వేలవేల వత్సరాల కాంతిలో మానవుడు వుదయించిన’ అని మెదలగానే పుట్టిన రోజులా అనిపిస్తుంది. ‘పిడికిటి తలంబ్రాల పెళ్ళికూతురు’ అని అన్నమయ స్వరనాడిలో కదిలారనుకో పెళ్ళికూతురై పోతుంది జడ పూలజడై. ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా’ పాట కూనిరాగం తీస్తుంటే నువ్వు నాకు పంపిన పాట విన్నాను. యెప్పటి పాట. అప్పుడెప్పుడో మొదటిసారి విన్నప్పుడు భలే వుంది అనుకున్నాను. కానీ యిప్పుడు వింటుంటే యెంతో మూవ్ అయ్యాను.

యీ ప్రపంచం అంతా కనికట్టు ప్రపంచంలా మారిపోయి చాలా కాలమే అయింది. అయితే ఆ మార్పు మరింత intensify అయింది. చుట్టూ గారడీ, కనికట్టు, మోసంతో నిండి వున్నప్పుడు అందులో ఆత్మవిశ్వాసంతో బతకాలంటే నిన్ను నమ్మేవాళ్ళు నిన్ను నమ్మగలిగే వాళ్ళు వొకరుండాలి. అలాంటి వొక్క మనిషిని పట్టుకోవటం కష్టం అవుతోంది అంటున్న ఆ పాట యెప్పటి పాట… 1933 లో Harold Arlen రాసినప్పటి నుంచి యెంతో మంది పాడుతునే వున్నారు. నేనూ పాడటం ప్రాక్టీస్ చేస్తున్నాను.

కాగితపు చంద్రుడు
అట్ట ముక్క సముద్రం మీద
తేల్తుంటావ్
చుట్టూ వున్న ప్రపంచం
అంతా నాటకమే అంటావ్
నిజమైనవి యేం వుండదు
కానీ నువ్వు నన్ను నమ్మితే
యిదంతా నిజమైపోతుంది… యెటువంటి పాట.

ప్రపంచంలో మనమన essential being మనకి దొరకటం అన్నది యెప్పుడు కష్టంగానే వున్నట్టుంది. యిప్పుడైతే మరీ కొరత వుందనుకొంటాను. టైం, స్పేస్ యిలా చాల సమస్యలు చుట్టుముడుతున్నట్టున్నాయి.

మనకి యిష్టమైనవన్నీ వొక్కరి నుంచే దొరకటం కూడా కష్టమే కదా … యివ్వటం కూడా … హో హో … నీ కళ్ళల్లో ఆ అనుమానపు పిల్లమేఘాలు మెదుల్తున్నా యేంటి… :) వో నా సప్త వర్ణ ప్రపంచమా, యిదంతా వొత్తి మాయే కానీ నువ్వు నన్ను నమ్మితే కాగితపు చంద్రుడిలోనే నాకు సంతోషం వుంటుంది.
చూడు బయటంతా అదే వర్షం ఆకాసమూ సముద్రమూ యేకమైనట్టు. యెప్పటికి సూర్యధూళి చెలరేగుతుందో తెలీదు. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా సూర్యుని కాంతి పుప్పొడి యీ అరబిక్ కడలిని అభిషేకిస్తుందనే నమ్మకం నాకుంది. నేను వచ్చే సరికి వీలైతే వొక గోరింట చెట్టుని వెతుకు.
వెంటనే మోహపు అరిచేతులని కాన్క చేస్తాను నీకు.

**** (*) ****