కవిత్వం

అవసరార్ధం

జూలై 2015

ష్టాయిష్టాలు వ్యక్తావ్యక్తాలు
గతకాలపు గుర్తులు అప్రస్తుత అసందర్భాలు
ఊపిరాపి ప్రాణం నింపుకున్న ముద్దులు, విరోధాభాసలు

-

నువ్వు నేను-
విధి పన్నిన వలలోని పిట్టలం
పిట్టలను రారమ్మని ఆశపెట్టిన గింజలం
గింజలు చల్లి దాక్కున్న వేటగాళ్లం

పగలగొట్టాల్సిన గోడల నీడలో పద్యాలు రాసుకునే పిచ్చివాళ్ళం
దారికాచిన దుఃఖానికి పదే పదే దొరికిపోయే పిరికివాళ్లం
ఉత్తరాల్ని తప్ప మరేం దాచుకోడానికీ చోటు మిగుల్చుకోలేనివాళ్లం

-

సరే మరి ఏం చేద్దాం?
దూరం కదా- ఎవరి కన్నీళ్ళు వాళ్లమే తుడిపేసుకుందాం
ఇష్టం కదా- నిద్ర లేచాక కలల్ని, ఆఖరి వాక్యాలతో కథల్ని మొదలెడదాం
పూర్తిగా రాయబడని పద్యాల చేత రహస్యంగా క్షమించబడదాం
సిరా చుక్కల్ని విదిలించిన చోటల్లా వీలైతే మరకలు చెరిపేసిపోదాం