లాఫింగ్ 'గ్యాస్'

దిష్టిబొమ్మల వ్యాపారం

ఆగస్ట్ 2015

డయవర్లు పదిహేనేళ్ల కిందట అందరు కుర్రాళ్లకు మల్లేనే రెండు కంప్యూటర్ భాషలు టకటక నేర్చేసుకొని అమెరికా ఎగిరెళ్ళినవాడే! రోజులు బావోలేక రెండేళ్ల కిందటే ఇండియా తిరిగొచ్చేసాడు. ఇక్కడు పరిస్థితులు అప్పట్లో అంతకన్నా అర్థ్వానంగా ఏడ్చాయ్!

స్వఛ్చందపదవీవిరమణ వంకతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగుల్ని పీకేస్తున్నాయి. కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగాల్లో పెద్దతలల రద్దీనే ఎక్కువగా ఉంది. బాగా నడిచే బ్యాంకులూ ఉన్నట్లుండి బోర్డులు తిప్పేయడటంవల్ల అందులో పనిచేసే ఉద్యోగులూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వరస కరువులవల్ల పల్లెల్లో పనులక్కరువు. వృత్తిపని చేసుకొందామన్నా పెద్ద కంపెనీల వత్తిడి పెద్ద అవరోధంగా మారింది. బహుళజాతి కంపెనీల బహుకృతవేషాలముందు బక్కజాతి మనిషుల కళ ఎక్కడెక్కి వస్తుంది?!

ఉన్న కాసిని ఉద్యోగాలీ సర్కార్లు ఔట్ సోర్సింగులకే సంతర్పణ చేస్తున్నదని తిట్టుకుంటూ కూర్చోలేదు ఉడయవర్లు. బిల్ గేట్ సు పీల్చి వదిలిని గాలిని మూడేళ్ళు పీల్చి వచ్చిన మల్లుడు ఉడయవర్లు. బ్యాంకులోనుకి దరఖాస్తు చేసాడు.

ప్రోజెక్టు రిపోర్టు చూసి డైరక్టర్లకు మతిపోయింది. రోజుకు రెండుకోట్ల టర్నోవరు! పదిరోజుల్లో బ్రేక్ ఈవెన్. వరల్డ్ వైడ్ మార్కెటింగు! పోటీతంటాలేని వ్యాపారం! ‘వెయ్యిశాతం లాభం గ్యారంటీ!’ అంటున్నాడు ఉడయవర్లు!

వినడానికి గిరీశం దంచే లెక్చర్లాగే ఉన్నా.. ఎకనామిక్సన్నీ మినిమమ్ రిస్కే చూపిస్తున్నాయి!

‘ఎండుగడ్డీ.. పాతగుడ్డలూ.. కర్రముక్కల్తో ఇదంతా సాధ్యమా!’ గుడ్లు తిప్పుతూ అడిగాడు బోర్డాఫ్ డైరక్టర్సు హెడ్డు.

‘ఇప్పటికే ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నాను సార్! మిమ్మల్నేమీ మోసం చేసేందుకు రాలేదు. ఇరాక్ నుంచి ఆర్డర్సొచ్చి ఉన్నాయ్. చూడండి! అమెరికాకీ మన సరుకే కావాలి!అదీ అర్జంటుగా! బ్రిటన్నుంచి బొలీవియా వరకూ అందరికీ తొందరే! వెంట వెంటనే కావాలని వత్తిడి ఎక్కువైనందువల్లనే పెట్టుబడికోసం మిమ్మల్నాశ్రయించాల్సి వచ్చిందిగానీ.. విదేశీమారకద్రవ్యం వరదలా వచ్చిపడే మా ప్రాజెక్టుల్లో మేజర్ వాటాకోసం పెద్ద కంపెనీలే పోట్లాడుకొంటున్నాయ్! చెమట నాది.. సెంటు వాళ్లదవుతుందని నేనే సందేహిస్తున్నా’ అన్నాడు ఉడయవర్లు.

ఉక్కిరి బిక్కిరయిపోయారు బ్యాంకు డైరక్టర్లందరూ! ఒక బొజ్జాయనకు మాత్రం ఇంకా అనుమానం పీకుతూనే ఉంది ‘అయితే మాత్రం చెత్తగడ్డికీ.. పాత గుడ్డపేలికలకీ .. పాతిక కోట్లా?!’

‘పోనీ.. కుండపెంకులక్కూడా కలిపి ఇప్పించండి సార్!.. అవీ కావాల్సినవే దిష్తిబొమ్మల తయారీకి!’

‘ఓ సారి ఓటికుండల ప్రదర్శన చేబడితే కోటి కుండపెంకులకుప్ప పోగవుతుంది. వాటినీ కొనాలా?!’ ఉద్యోగస్తుల తరుఫున బోర్డులో కూర్చున్న సభ్యుడు ఆయన.

‘పెంకులు ఏరడానికైనా మ్యాన్ పవర్ కావాలిగా సార్! ఎంత హైటెక్కైనా కంప్యూటర్లెళ్ళి పెంకులు ఏరలేవుగా! పోనీ.. పెయింట్ డబ్బాలకైనా డబ్బివ్వండి! బొగ్గు ముక్కలకిచ్చినా ఫర్వా నై!’

‘ దిష్టిబొమ్మక్కట్టిన కర్రెలాగూ కాలుతుందిగా! బైప్రొడక్టుగా బొగ్గదే బోలెడంత దొరుకుతుందిలేవయా!’

ఉడయవర్లుకు విషయం అర్థమయింది. ఒంటివేలు చూపించి బైటికొచ్చాడు. డైరెక్టుగా మేనేజింగు డైరెక్టురుకే ఫోన్!

శౌచాలయంలోనుంచే వ్యవహారాలన్నీ చక్కబడ్డాయి.

‘డిపాజిటర్ల డబ్బులయ్యా ఇవి. కమీషన్లు పుచ్చుకొని లోన్లిచ్చే బాడీ కాదు మనది.’ అంటూ రుసరుసలాడుటూ బైటికెళ్ళిపోయాడు ఉద్యోగస్తుల తరుఫు సభ్యుడు. అప్పుడు లోపలికొచ్చాడు ఉడయవర్లు.

‘కొత్త రకం ప్రాజెక్టు. కొద్దిగా రిస్కు తీసుకొని ఇస్తున్నాం లోను. మాకు మాటరాకుండా చూసుకునే పూచీ నీదే!’ అంటూ పాతిక కోట్ల అప్పుకు సమ్మతి తెలిపింది మిగతా బాడీ!

***

‘ఇంకో పాతిక కోట్లైనా ఇచ్చేదేగానీ.. ఈ లోపలే బ్యాంకు చతికిలబడింది.’ అన్నాడు ఉడయవర్లు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేకరితో కులాసాగా.
‘దిష్టిబొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా తట్టింది సార్ మొదట్లో?’ అనడిగాడు విలేకరి.

‘అమెరికానుంచి తిరిగొచ్చిన రోజున విమానాశ్రయంలో పిల్లలు క్రికెట్ ఆటగాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టడం చూసాను. రామలీలా మైదానంలో ఎప్పుడో
దసరాకోసారి జరిగే సరదా ఈ దేశంలో ప్రతీరోజూ ఏదో ఓ మూల జరుగుతూనే ఉంటుందని వార్తలు చూసేవాళ్ళెవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది. పాడెలు కట్టడం, కుండలు పగలగొట్టడం, జెండాలు తగలెట్టడం పాతకాలంనాటి మూటు నిరసనలు దిష్టిబొమ్మలు తగలెట్టడం లేటెస్టు ట్రెండు! అప్పట్లో గోద్రా గోల.. అయోధ్య అల్లర్లు.. ఎన్నికల కొట్లాటలు.. ఉద్యోగుల నిరసనలు.. విద్యార్థుల ఉద్రేకాలు.. పార్టీల ప్రొటెస్టులు.. కస్టడీ లాకప్ డెత్తులు,. ఎన్ కౌంటర్లకు కౌంటర్ ర్యాలీలు, ఉగ్రవాదులమీద ఆగ్రహాలు, మహిళామణుల ఆందోళనలు, మతమార్పిడి ఉద్రిక్తతలు, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, అతివాదులు దాడుల నేపథ్యంలో ప్రతిదాడుల హడావుళ్ళు.. ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా ఇక్కడ దిష్టిబొమ్మల తగలెడితేనే తంతంగం పూర్తయినట్లు లెక్క.

మాది కొండపల్లి. బొమ్మలు చేసి అమ్మేవృత్తి అనుభవం ఉంది. ముందు కొద్ది పెట్టుబడితో పని మొదలుపెట్టా. ఇంతలో ఇరాక్ వార్ వచ్చిపడింది. వరల్డు వైడుగా దిష్టిబొమ్మలకు డిమాండు పెరిగింది. బుష్ దిష్టిబొమ్మలకున్నంత గిరాకీ అప్పట్లో మరి దేనికీ ఉండేది కాదు. తొగాడియా బొమ్మలక్కూడా తెగ గిరాకీగానే ఉండేదిక్కడ. మధ్య మధ్యలో ముష్రాఫ్.. షరీఫు సరేసరి! సమయ సందర్భాల్నిబట్టి లోకల్ లీడర్లకూ ఆర్డర్లొస్తుంటాయ్! ఈ మధ్య ప్రభుత్వాలుకూడా దిష్టిబొమ్మలు తగలేయిసున్నాయ్ .. చూస్తున్నారుగా!’

‘ఆర్డర్లన్నీ మీకే ఎందుకొస్తున్నట్లు?!’

‘మా దిష్టిబొమ్మలకు ఆకారాలేగాని.. పోలికలు ఉండవు. సందర్బాన్నిబట్టి అదే మోదీ.. అదే సొనియా! అదే చంద్రబాబు.. అదే జగన్ బాబు! ఒక దిష్టిబొమ్మకొంటే నల్లజండా ఉచితం. పాడెలు డిస్కౌంట్లులో కట్టి ఇస్తాం. వీలును బట్టి వాటినే వాలుకుర్చీలు.. వీలుకుర్చిలుగాకూడా మార్చుకోవచ్చు. ఆటల్లో ఓడితే పడుకోబెట్టి తగలేయడానికి, గెలిస్తే కూర్చోబెట్టి ఊరేగించడానికి ఒకే బొమ్మ ఉపయోగించుకోవచ్చు. కాలం మారుతోంది సార్! మన ఆలోచనల్లోకూడా మార్పు రావాలి. అప్పుడే విజయం. మా నాయన కొండపల్లి బొమ్మలు మాకు రెండుపూటలా తిండి పెట్టలేకపోయాయి. దిష్టిబొమ్మలు చేస్తూ నేనిప్పుడు కోట్లాదిమందికి తిండి పెడుతున్నాను.’

‘అది సరే! మీకు లోనిచ్చిన బ్యాంకు మునిగింది కదా! పాతరుణం తీర్చి పనిచేసే ఉద్యోగులకు, నమ్మి మదుపు చేసిన కాతాదారులకూ మీ వంతు సహకారం అందిచవచ్చుకదా?’

‘దిష్టిబొమ్మలు చవకగా ఇచ్చి నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నానండీ! బ్యాంకు డైరక్టర్లో ఒకాయనకు అనాథశరణాలయం ఉంది. అది సేకరించే పాతగుడ్డలను కొనే షరతుమీద నాకు రుణమిచ్చారు. కుండపెంకులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఖాళీ కుండల ప్రదర్శన ఏర్పాటు చేసే శ్రామికనేత
డైరక్టరు ఇంకొకరు. వాళ్లవంతు లాభాల్లో కొంతైనా కడితే మిగతా కంతులు నేను కట్టడానికి సిద్ధం. రుణం సొమ్ము నాకు బిర్యానీలో ఎముకముక్క.
‘బ్యాంకు మూసివేతకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నాలుగురోజులీ నిరసనలు ఇలాగే కొనసాగితే నాలుగు దిష్టిబొమ్మలు అదనంగా అమ్ముకోవచ్చన్న దురాలోచన మీదని మీమీద అభియోగం?’

‘దురాలోచనా లేదు. దూరాలోచనా లేదు. లోను పూర్తిగా కడితే మా ఉద్యోగులు సమ్మె కడతారు.ముందు వాళ్ల జీతాలు పెంచాలని ఆందోళన చేస్తారు. ఆనక నా దిష్టిబొమ్మలు తగలెడతారు. ఆ నష్టం ఎవరచ్చుకొంటారన్నా’ అన్నాడు ఉడయవర్లు చల్లంగా నవ్వుతూ.

**** (*) ****