ముద్దపప్పు, జీడిపప్పు, నూపప్పు… యిలా యీ రోజుకి నీకు యే పేరు పెడదామాని ఆలోచిస్తున్నాను యీ గోదావరి వొడ్డున కూర్చుని.
వో పెద్ద వుత్సాహపు కిక్కిరిసిపోయిన సుసంభరం తిలకించిన ప్రేక్షకులు వాళ్ళవాళ్ళ గమ్యాలకి వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా వున్నయీ ఆవరణలో కూర్చుని వున్నాను. నిజానికి అంతా బోసి పోయినట్టు కనిపించాలి. కాని అలా లేదు. యెదురుగా వున్న గోదావరి తనని చూడటానికి అంతమంది వచ్చారు. యిప్పుడు యీ రోజు వేళ్ళమీద లెక్కపెట్టగలిగేంత మంది మనుష్యులు మాత్రమే వున్నారిక్కడ… అయినా ఆ ప్రవాహపు మిలమిలలో తేడా యేమిలేదు.
గత కొద్ది రోజులుగా యెటు చూసినా మనుష్యులే. గుంపులుగుంపులుగా. వొక్కసారే అంతమంది చూడటం భలే అనుభవం. కలిసిమెలిసి వుత్సాహంగా వొక వేడుకగా నవ్వుతూ తుళ్ళుతూ వొడ్డువొడ్డంతా నీట మునుగుతూ చెవులూ ముక్కు వొకేసారి మూసుకొని బుడుంగని నీటమునిగి పైకి లేచి కేరింతలు కొడుతూ అప్పుడప్పుడు యిలా నదిని సమిష్టిగా పలకరించే విభ్రమ సమయాలని బంధించాలని కెమేరా కన్నులో కన్ను వుంచి గోదావరి వైపు చూస్తుంటే యెన్నెన్ని విషయాలు ఫ్లాష్ బ్యాక్ లా తిరిగాయో.
యీ నది వొడ్డున బంక మన్నుతో బొమ్మలు చేసి ఆడుకోవటం. యీత కొట్టటం. లంకల్లోకి పడవ యెక్కి వెళ్ళటం. వచ్చేపోయే రైళ్ళకి టాటా చెప్పటం. రావిచెట్టు కింద గోదావరిమాత దగ్గర చెప్పుకొన్న కవిత్వం, వనవాసిని చదుకోవటం, యెప్పటికప్పుడు అదే మొదటిసారన్నట్టు వర్షంలో, వెన్నెల్లో గోదావరిని చూడాలని వెళ్ళటం, వరద గోదారి మట్టిరంగుని కళ్ళనిండుగా నింపుకోవటానికి పరిగెత్తటం, గాలితెరల్లో కార్తీకం బుగ్గపై చిటికలు వేసివేయ్యగానే అరటిదొన్నెల్లో దీపపు మిలమిల చూపులంతా పరుచుకొంటుంటే గోదారొడ్డుకి నిదానంగా వెళ్ళటం… వొకటారెండా… వొకప్పుడు గోదావరి నిత్యానుభవం.
కుతూహలం, ఆశల, ఆకాంక్షల వుగ్గుగిన్నె తీసుకొని ప్రపంచ అన్వేషకురాలిగా బయలుదేరానో అప్పటి నుంచి యీ నది జ్ఞాపకంగా మారిపోతూ వచ్చింది. గోదావరి వొక జ్ఞాపకంగా స్థిరపడుతుందనుకోలేదెప్పుడు. నిత్యం చూస్తూనే వుంటాననుకొన్నాను. యిప్పుడీ గోదావరి వో నెలవంక నా రోజువారి జీవితంలో.
యెప్పుడు నిదానంగానే వుంటుంది. కాని అక్కడెక్కడో జోరున వాన కురిస్తే నదినదంతా వరద గోదారవుతుంది. గోదారొచ్చింది గోదారొచ్చింది అంటూ యింట్లో సామానంతా అటక యెక్కించి యే బడిలోనో, గుడిలోనో తలదాచుకొంటూ, తిరిగి వరద పొంగు తగ్గగానే వొడ్డునున్న ప్రజలు అటక మీద సామాను దింపుకొంటూ కూడా చెప్పుకొనే ముచ్చట్లు, కార్తీక హేమంతుల్లో నదిలో కార్తీకదీపాలు వదుల్తూ పాడుకొనే పాటలని పల్చని మంచుతెరలు కప్పేసుకొని ఆలకిస్తూ … అంతే అలానే వుంటుంది గోదావరి. రుతువు యేదైనా గోదావరి మనసెప్పుడూ స్థిమితమే. గోదావరి స్థితప్రజ్ఞ. తనని చూస్తూ అసూయ, ద్వేషం, అహంకారం యిలా అనేకానేక మానసిక రుగ్మతలు వదిలించుకోవచ్చనిపిస్తుంటుంది. వొడ్డున కూర్చుని చిన్నిచిన్ని గులక రాళ్ళని నీళ్ళల్లోకి విసిరిన్నట్టు మనసులోకి రకరకాల ఆలోచనలని విసురుతోంది గోదావరి.
ఆ రావి చెట్టు అలానే వుంది. ఆ కొత్త ఆకుల గాలికి మేం కొత్త కవులం. ఆ కొమ్మలు మాత్రం మమ్మల్ని యెప్పటిలా గుర్తుపట్టాయి. యీ వూరి వీధులు, యీ వూరి రోడ్స్ అన్నీ విస్తరించటం చూస్తూనే వున్నాను. చిన్నప్పుడే మనలో మొలకెత్తే అన్వేషణ నిరంతరం పూత పూస్తూనే వుంటుంది మనలో. కడియం పంటకాలువ వెంట నడిచి పొతే వేమగిరి రావటం చూసి వాస్కోడిగామలా ఫీల్ అయిపోయి యిష్టమైన వాళ్లకి చెప్పాను. కనిపెట్టిన విషయం వదిలేసి ‘అంత దూరం నడిచావా,యెందుకు ‘ అని ఆశ్చర్యపోతూ ‘గుర్రబండి యెక్కొచ్చుగా’ అన్నారు. అప్పటికే ఆ దారులన్నీ కనిపెట్టేసారని తెలిసి కూడా నేనేం నిరాశపడలేదు. అప్పటికే వేసిన దారిలో ప్రవహిస్తున్న ఆ గోదారి కాలువ వెంట కొంత దూరం నడవటం, యేదోవొకటి తెలుసుకోవటం అప్పట్లో నా బుజ్జి మనసుకి నేనే వాస్కోడిగామాని. యెన్నెన్ని జ్ఞాపకాలని చుక్కానిగా తుళ్ళింత గోదారి సజీవ జీవశక్తిగా అందిస్తుందో ప్రతి మలుపులో అపారమైన జీవితేచ్ఛని.
యిప్పటికీ యీ రోజుకి నీకేం ముద్దుపేరు పెట్టాలో తెలియటం లేదు. యిక్కడికి రా. నీకు గోదారి ప్రతి మలుపుని చూపిస్తా మరొక్కసారి. యెన్నిసార్లు చూసినా వో కొత్త వుద్వేగం వొక పసిపాప తొలి గుక్క పెట్టిన స్వరంలా. పైన ఆకాశంలో చంద్రుడు. నీటి తళతళ. లంగరేసిన గూటిపడవలోంచి సన్నని కూనిరాగం. మన చుట్టూ వొక ముద్దు గిరికీలు కొడుతోంది. పదేపదే నిన్ను రమ్మని చెపుతోంది.
అమ్మో… యింక యిక్కడ కూర్చోవటం కష్టం. దోమలు. నువ్వు వచ్చినప్పుడు వోడమాస్ స్ప్రే మర్చిపోకుండా తెచ్చుకో మై డియర్!
**** (*) ****
బ్యూటిఫుల్. ఒక్కసారైనా గోదారి ఒడ్డున అలా కూర్చోనందుకు బాధగా, ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోవాలన్నంత ఆశగా ఉంది..
V మల్లికార్జున్ గారికి , యిప్పుడు కూర్చున్నారుగా Thank you.
ఒక అందమైన దృశ్యాన్ని సృస్టించారు బావుంది
అనిల్ డ్యాని గారికి, మీకా దృశ్యం నచ్చినందుకు Thank you very much.
కుప్పిలి పద్మ గారూ!
మీ యీ యెల్లో రిబ్బన్ చదువుతుంటే వూరు గుర్తొస్తోంది.వర్షం పడిందంటే చాలు పిలవకుండా వచ్చే పిల్లకాలువలు,కట్ట వెంబడి నిలబడి ఆ బురదలో ఆడుకోవడం భలే బాగుంటుంది.యిన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చింది మీ గోదారి.థాంక్యు.
తిలక్ బొమ్మరాజు గారు, జ్ఞాపకాలను గుర్తు చేయించినందుకు సంతోషం కలిగింది. Thank you.
గోదావరి జ్ఞాపకాలు నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చినై .కవితాత్మకంగా చెప్పి పద్మగారు గోదావరి గొప్పతనాన్ని మరింత పెంచారు.
గోదావరి ఒడ్డున బంక-మన్ను లభిస్తుందా పద్మగారు ?నేను చూసిన గోదావరి వద్దు ఎప్పుడూ ఇసుకమయమే సుమండీ !!
మీకు అభినందనలు.
DR.K L V PRASAD gaaru, గోదావరి జ్ఞాపకాలు మీకు మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చినందుకు ఆనందించాను. Thank you very much.
మీరు అందంగా రాయగలరు ….అనుబుతి నివ్వగలరు ….కంగ్రాట్స్ ….మదన్మోహన్
madanmohan rao k garu, Thank you very much.
నేను గోదారిని బాసర లో చూసాను. మీ వూళ్ళో చూడలేదు … రామన్నారు గదా దోమల మందుతో …మందుతో వస్తాను పద్మ గారు..–Sridhara
Sridhara gaaru, యెక్కడున్నా గోదావరి గోదావరే. దోమల మందు దొరికిందానండి రండి తప్పకుండా. Thank you.
బావుందండి..
ఆర్.దమయంతి గారు, Very nice of you. Thank you.