కవిత్వం

కొమ్మల మధ్యన

సెప్టెంబర్ 2015

లా వచ్చి వెళ్ళిపోతావ్. లిప్త కాలమే అయినా, నీ నీడ పడిన ప్రతి చోటా నీ నవ్వు రంగులో ఓ పదం పూయడం విస్మయంగా చూస్తూ నిలబడిపోతాను.

గంభీరమైన మేఘం, హృదయాన్ని ముద్దాడి, ప్రవాహమై, మమేకమై, నేల చేరిపోయినా, ఆర్తిగా పిలిచే ఆకాశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నట్టు, పూసిన ప్రతిసారీ వెతికి మరీ జీవితాల్ని కలుపుతూ విస్తరిస్తున్న ఈ వలపు దారపు కొలత మనకి అవ్యక్తమో అపరిచితమో కాదని నీకూ తెలుసు.

కాలాన్ని గడ గడా తాగుతూ ఉంటారెవరో…

సముద్ర వేదన తీర్చాలని వెర్రిగా ప్రయత్నించిన రోజుల్లో ఎప్పుడో ఒకసారి నాకు దొరికిన శంఖాన్ని చెవికానించుకుని నా ఏకాంతాన్ని సవరించుకుంటానో లేదో, నేను పాడిన అదే పాట ఇప్పుడు అంతులేని కథలా మళ్ళీ చెవిలో ఇలా … అందులో మన పేర్లు కూడా వినపడి, తిరిగి ఆ భాషని ఆ ఇసుకలోనే గవ్వలుగా చల్లేసి పోవాలని ప్రయత్నిస్తూ ఎంత సేపు ఉండిపోతానో తెలీదు.

అకస్మాత్తుగా రెక్కలొస్తాయ్. సమాధానాలన్నిటినీ పొదవుకుని తెల్లటి జాగాలో జారవిడిచి రాకుండా, ప్రశ్నల్లోనే తప్పుల్ని లెక్కిస్తూ ఉండిపోయానని, రాలిపోయిన రెక్కల్ని జాలిగా చూస్తూ రంగు మార్చుకుంటుంది సమయం.

ఖాళీ ఐన మట్టిముంతలో క్షణాల్ని చిలికే ప్రయత్నం చేస్తూంటారెవరో…

ఎవరెంత చెప్పినా, ఎవరెన్ని రాసినా, దారి కాచి చీకటిని దోచుకుంటూ దగా చేసే కలల్ని నేనెప్పుడూ నమ్మను. మళ్ళీ నువ్వొచ్చేవరకూ కంట్లోనే ఇరుక్కుపోయిన నీ రూపమొక్కటే నా కోసం కాలాన్ని వడగడుతుంది తెలుసా.

**** (*) ****