కథ

కబ్జా

సెప్టెంబర్ 2015

విజయ దాన్ని చూడగానే కోపంతో ఉగిపోయింది. అన్నాళ్ళుగా తనకు అందాల్సిన సుఖాన్ని బలవంతంగా లాగేసుకున్నారన్న భావన ఆమెను కుదిపేసింది. కోపంతో పళ్ళు పటపట కొరికి చేతిలో చీపురును కిందపడేసింది. పైకి దోపిన చీర కుచ్చిళ్ళను కిందకు జార్చి పరుగులాంటి నడకతో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది.

నిజానికి ఆ ఇంటిని ఇల్లు అనడానికి కూడా మనసొప్పదు విజయకు. ఉండేది ఒకటే గది. దానికి ఆనుకోని వుండే వంటగదిని కూడా ఒక గది కింద లెక్కేస్తే రెండు గదులు. ఈ చివరి నించి ఆ చివరకు పద్దెనిమిది అడుగులు. ఇంకో వైపు ఇరవై అడుగులు. అందులో, ఒక మూల వుండే టీవీ, ఇంకో గోడవైపు వుండే సోఫా వదిలేస్తే ఇంకో రెండు అడుగులు తగ్గించుకోవాలి. అసలు ఆ సోఫాని కూడా సోఫా అనలేమని విజయ అంటుంది. ఎన్నో ఏళ్ళు ఎవరో వాడిపడేసిన ఆ సెకండ్ హ్యాండ్ సోఫా మధ్యలో గుంట పడిపోయి వుంటుంది. ఏ పక్క కూర్చున్నా మధ్యలోకి జారిపోతుంటారు. అదనంగా దాంట్లో నల్లులు, బొద్దింకలు. సోఫా కింద జాగానే చెప్పులు పెట్టుకునే స్థలం.

మరాఠీలో కోలీ పిలవబడే ఆ ఒక్కగది ఇల్లు దాటి కారిడార్లోకి వచ్చిందామె. అలాంటి పధ్నాలుగు ఇళ్ళ ముందు పరుచుకున కారిడార్ చివరి వైపుకి వడివడిగా నడిచింది.

“ఎలా వుంది మన చాల్” అన్నాడు పెళ్ళై ముంబై వచ్చిన రోజు రిక్షా దిగుతున్నప్పుడు.

“చాల్ ఏంటి?” అంటే – “మనలాగా ఎక్కడెక్కడ్నుంచే వచ్చే వాళ్ళకోసం గవర్నెమెంటు, మిల్లు ఓనర్లు కట్టించిన ఇళ్ళు” అన్నాడు. మహానగరం మాయలో దిష్టి చుక్కలాంటి ఇంటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలేదు విజయ. ఆ ఇరుకు గదినే ఇల్లంటారని తెలుసుకున్న రోజు అడిగేసింది.

“గది చిన్నదినేం? ఈ ముంబై మహానగరంలో ఇంత జాగా ఎవరికి దొరుకుతుంది చెప్పు” అన్నాడు కారిడార్ ని చూపిస్తూ. అప్పటికి వాళ్ళకి పెళ్ళై రెండు నెలలో మూడు నెలలో అయ్యింది. కారిడార్లో పడుకోని వున్నారప్పుడు.

“ఇదంతా నీదే అయితే మన మహారాజులం అనుకోవాలి” అంటూ నిరసించింది విజయ.

“ఇప్పుడేం తక్కువైందని” అన్నాడతను కాస్త దగ్గరకు జరుగుతూ.

“దూరం జరుగు. కనీసం వంద మంది పడుకోని వున్నారు మన చుట్టూ. కారిడార్లో సరసాలేంటి?” అంది సర్దుకుంటూ.

అతని దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పలేడు. ఆ ఒక్క గది ఇంట్లో ఉండేది ఆరుగ్గురు మనుషులు. ఆనంద్, అతని భార్య విజయ, అతని అన్న శివ, వదిన మాధవి, తల్లి, తండ్రి. ఆనంద్ కి పెళ్ళైన కొత్తల్లో అంతా బాగానే వుండేది. వాళ్ళిద్దరూ కొత్త దంపతులని మిగిలిన నలుగురు నెలరోజులు బయటే పడుకున్నారు. ఆ తరువాత నెమ్మదిగా మాధవి తోడుకోడలి దగ్గర మనసు విప్పింది.

“ఇక్కడ చాలా మంది ఇళ్ళలో రెండు మూడు జంటలు వుంటాయి. అందరికీ అవసరాలు వుంటాయి కదా. ఆ విషయాలన్నీ నోరు విప్పి ఎలా మాట్లాడుకుంటాం చెప్పు? అందుకని వాళ్ళ మధ్య ఒక కోడ్ భాష వుంటుంది. ఎవరు ముందు దుప్పటి పరిస్తే వాళ్ళకి రాత్రి లోపల పడుకోవాలని వున్నట్లు గుర్తు. గది వాళ్ళకి వదిలేసి మిగతా వాళ్ళు బయట పడుకుంటారు” అని చెప్పింది. ఆ చెప్పడం కూడా యధాలాపంగా, కూరగాయలు ఎక్కడ కొనుక్కోవాలో చెప్పినట్లు చెప్పింది. చివర్లో – “అర్థం అయ్యిందా?” అంది. విజయ తలాడించింది. ఆ రోజు రాత్రి మాధవి ముందుగా దుప్పటి పరిచింది.

అలా ఒక వారం రోజుల పాటు మాధవి ఆ గదిని ఆక్రమించడంతో విజయ భర్తతో కలిసి, బయట అత్త మామల పక్కనే పడుకోక తప్పలేదు. చుట్టూ వందమంది వున్నా పడుకోవటం ఆమెకి పెద్ద ఇబ్బంది కాలేదు. వున్న సమస్యల్లా మూడున్నరకో, నాలిగింటికో లేచి బకెట్లో నీళ్ళు తీసుకోని కారిడార్ చివర్లో వుండే సామూహిక టాయిలెట్ల దగ్గరకి పరిగెత్తడమే. ఆలస్యమైతే క్యూ ఎక్కువైపోతుంది. మగవాళ్ళు వచ్చేస్తారు. పెళ్ళికి ముందు అమెకు అలవాటైన టైమ్ అది కాదు. అయినా తప్పటంలేదు.

ఇప్పుడు కారిడార్ చివరికి వచ్చేసరికి రోజు అంత ఉదయాన్నే వెళ్ళటం ఎంత ఆమెకు మంచిదో అర్థం అయ్యింది. ఎనిమిది కావస్తుండటంతో చాలా పెద్ద క్యూ వుంది. కొంత మంది అక్కడే నిలబడి నోట్లో బ్రష్ తో పళ్ళు తోముతుంటే, ఇంకొంతమంది సిగరెట్ కాలుస్తున్నారు. లోపలి వాళ్ళు బయటకొచ్చేదాకా కాలక్షేపంకోసం పేపరు చదువుతున్నారు. మాటలు రకరకాల భాషల్లో దొర్లిపోయి మరకలు పడ్డ గోడల్లా కంగాళీగా వున్నాయి. క్యూ మధ్యలో వున్నాడు ఆనంద్. పిలిచింది. క్యూలో తన ప్లేస్ ముందు వెనక వున్నవాళ్ళకి చెప్పుకోని వచ్చాడు. వెనకనుంచి ఎవరో మరాఠీలో ఏదో అని నవ్వేశాడు.

“ఏంటి ఇక్కడికొచ్చావ్?” అన్నాడు లుంగీ దించుతూ. మాట్లాడలేదు విజయ. గుప్పట తెరిచి చూపించింది. చింపేసి వున్న ఖాళీ కాండోమ్ పేకట్. అదిరిపడి అటూ ఇటూ ఎవరూ చూళ్ళేదని నిర్థారించుకోని దాన్ని చటుక్కున లాగేసుకున్నాడు.

“ఏంటే ఇది?” అన్నాడు కాస్త కోపంగా.

“మీ అన్నగారి నిర్వాకం. వాళ్ళిద్దరూ ఇది వాడుతున్నారు.” అంది ఉక్రోషంగా. ఒక్క క్షణం ఆలోచించాడు.

“నాన్న మనవల్ని చూడాలంటున్నాడ్రా అని నన్ను బ్రతిమిలాడితే కదా బయటపడుకుంటున్నాను” అన్నాడు.

“ఏడ్చినట్లే వుంది. నిన్న పదమూడో రోజు, ఈ మూడు రోజులు మాకొదిలెయ్యవే అని అక్క అంటే నేను కూడా నమ్మేశాను” అంది విజయ. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. విజయ కళ్ళలో నీళ్ళు కనపడ్డాయి.

“ఈ రోజు మాట్లాడతాను” అన్నాడు.

“అక్కర్లేదు. సాయంత్రం త్వరగా రండి. దుప్పటి నేనే పరుస్తాను. ఎవరడ్డం వస్తారో చూద్దాం” అంటూ వెనక్కి తిరిగింది విజయ. ఆమె వెళ్ళిపోతుంటే లైన్లో నుంచి మళ్ళీ ఏవో కామెంట్లు, నవ్వులు వినపడ్డాయి.

***

రాత్రి భోజనాలయ్యాయి. విజయ సాయంత్రం నుంచి దుప్పటి వుండే చోటే తిరుగుతుండటం గమనిస్తూనే వుంది మాధవి. పదమూడు, పధ్నాలుగు, పదిహేను వదిలేయమని చెప్పింది కాబట్టి, భయం లేదు అనుకుంటూ వుంది. కానీ పరిస్థితి చూస్తే అనుమానంగానే వుంది. మూడు రోజులు ఆగలేరా? అనుకుంది ముందు. మరుక్షణం జాలేసింది. పాపం చిన్న పిల్ల, పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు. అనుకుంది. కానీ శివ ఒప్పుకోడు. పొద్దున వెళ్తూనే చెప్పి వెళ్ళాడు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు.

ఇంటి పని మొత్తం విజయే చేస్తుంది. మామగారు సెక్యూరిటీ గార్డ్ గా వెళ్తాడు. అత్తగారు ఒక ఇంట్లో పిల్లలకి కేర్ టేకర్ గా పని చేస్తుంది. శివ, ఆనంద్ మిల్లులో కూలికి వెళ్తారు. మాధవి ఆయమ్మగా పనిచేస్తోంది. ఇంట్లో వుండేది విజయే కాబట్టి పని భారం మొత్తం ఆమె మీదే పడింది. రోజూ రాత్రి భోజనాలు అయ్యాక అక్కడ చీపురుతో చిమ్మేసి ఆ చెత్త మొత్తం బయట కారిడార్లో వున్న డస్ట్ బిన్ లో వెయ్యడానికి వెళ్తుంది. అప్పుడు టీవీ స్టాండ్ కింద వున్న దుప్పటి తీసి పరిచేస్తే సరిపోతుంది.

ఆలోచిస్తూ టీవీ కింద చూస్తే వాళ్ళు వాడే దుప్పటి కనపడట్లేదు. పైన విజయ, ఆనంద్ వాడే దుప్పటి మాత్రం వుంది. విషయం అర్థమైంది. గబగబా లేచి ఏదో పని వున్నట్లు అటూ ఇటూ తిరిగి చూసింది. ఎక్కడా కనపడలేదు. విజయ ఏమీ ఎరగనట్లు భోజనాలు అయిపోయిన చోట చిమ్మేసి చెత్త మొత్తం కవర్లో పెట్టుకోని బయటికి నడిచింది. నడుస్తూ ఆమె ఆనంద్ వైపు చూడటం, ఆనంద్ ఓరగా చూసి నవ్వటం గమనించింది.

సోఫాలో కూర్చోని పళ్ళు కుట్టుకుంటున్న భర్త వైపు చూసింది మాధవి. అతను యధాలాపంగా ఆమె వైపు చూసి ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేశాడు. కళ్ళతోనే దుప్పటి వుండే స్టాండ్ వైపు చూపించింది. అప్రయత్నంగా అతను కూడా లేచాడు. అంతలోనే విజయ లోపలికి వచ్చింది.

“పాలు తోడు పెట్టలేదనుకుంటా. పక్కింట్లో కాస్త పెరుగు తీసుకురామ్మా” అంది అత్తగారు విజయను చూసి. విజయ ఒక చూపు మాధవి, శివ వైపు చూసి వాళ్ళ చేతుల్లో దుప్పటి లేదని నిర్థారించుకోని బయటకు నడిచింది. అదే మంచి అవకాశంలా కనిపించింది మాధవికి. గదిలో కనపడటంలేదంటే ఖచ్చితంగా వంటింట్లోనే వుండి వుంటుంది. చటుక్కున దూకి వంటింట్లో వెతకడం మొదలుపెట్టింది. అరనిముషంలో దొరికేసింది.

దుప్పటి చేత్తో పట్టుకోని పరుగుపందెంలో ఆఖరి అంగ వేసినట్లు ముందు గదిలోకి వచ్చింది. అప్పటికే విజయ కూడా వచ్చేసి వాకిట్లో నిలబడి వుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా గది మధ్యలో దుప్పటి పరుస్తున్న అత్తగారిని, గోడవారగా నిలబడి నేల చూపులు చూస్తున్న మామగారిని చూస్తున్నారు.

**** (*) ****

Picture Credit: Sudhir Patwardhan