యెల్లో రిబ్బన్...

ఇట్లు మీ… (10)

అక్టోబర్ 2015

త కొద్ది రోజులుగా యిక్కడ వానలు. ప్రేమలో మన మనసులు తడిసి ముద్దైనట్టు ఆకులు పువ్వులు తడిసి ముద్దయ్యాయి. వొత్తైన జిల్లుమనే చల్లదనం పియానో మోహపు రాగంలా అల్లరి చేస్తుంటే సముద్రతీరాన వున్న యిసుక రేణువులని లెక్కపెట్టలేనట్టు లెక్కలేనన్ని సార్లు నిన్ను తలచుకొన్నాను. యెదైన కొత్త ప్రాజెక్ట్ చెయ్యబోయే ముందు ఆలోచిస్తూ అటూ యిటూ పచార్లు చేస్తుండే నువ్వు, నీకు నచ్చిన పాటలు ఆన్ లైన్ లో కొనుక్కుని యెంత పనిలో వున్నా సరే ముందు ఆ పాటలు చూడమని నీ నోట్ బుక్ దగ్గరకి లాక్కొచ్చే నువ్వు, కంపోజ్ చేసుకొంటూనో, లేదా చదువుతూనో కాఫీని చల్లార పెట్టే నీకు కాఫీ తాగమని గుర్తు చేస్తున్నా అలానే పనిచేసుకొంటున్న నువ్వు, రాత్రి 10 తరువాత వాక్ కి వెళుతూ, వాన రాగానే లాంగ్ డ్రైవ్ కి తీసుకు వెళ్ళే నువ్వు యిప్పుడు డ్రైవ్ కి వెళుతున్నావా – యిలా అనేక రకాలుగా గుర్తుకొచ్చే నువ్వు యిప్పుడు యేం చేస్తుంటావా అని వూహిస్తున్నాను.

చాలా రోజులుగా వూర్లు పట్టుకొని తిరుగుతూ యీ సముద్ర తీరానికి వచ్చాను. యీ రాత్రికి యిక్కడే వుంటాను. తిరిగి వుదయమే బయలుదేరాలి. యీ హోటల్ రూం యెదురుగా యెప్పటిలా సముద్రం. సముద్రంపై వాన పడుతుంటే యెంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా.. పోయినసారి యిలానే వొక ఫ్రెంచ్ విండో నుంచి వాన కురుస్తున్న సముద్రాన్ని నువ్వు చూస్తుంటే వెనక్కే వచ్చి నీ కళ్ళు మూస్తే నువ్వు అన్నావు ‘నదీ’ అని.

అదేంటి సముద్రం అంటావ్ అనుకున్నాను అంటే ‘యెప్పటికి అంతు తెలియని లోతు, యీదటానికి శక్తి చాలని విశాలత్వం నన్ను భయ పెడతాయి. నువ్వెప్పుడూ నన్ను భయపెట్టవ్. అందుకే నువ్వు యెప్పటికి సముద్రానివి కాలేవ్. నువ్వెప్పుడు జీవనదివే నా వరకు నాకు’ అన్నావ్. ఆ నీ ప్రశంస నా మనసులోకి యింకి శరీరపు నిత్య పరిమళంలా నన్ను సంతోష పెడుతూనే వుంది. నిన్ను హత్తుకొనే ప్రతి సారి వీస్తున్న ఆ సౌగంధం అదే. గుర్తు పట్టావా లేదా?! జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించకు… ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకునేది అపురూపమైన జ్ఞాపకం కాదు కదా. :)

అంత అందమైన కితాబు అందుకొనేక యింక నేను నీతో కొంచెమైన చెడ్డగా వుండలేనుగా. :)

స్త్రీ ని దేవత అంటే నిజమనుకొని సహనంగా వున్న మా ముందుతరాలు తెలుసు కదా. వొద్దులే dissection. :)

యేమైనా సరే కాంప్లిమెంట్స్ భలే మూడ్ బూస్టర్స్ అనుకో. ఫేస్ బుక్ లో పిక్చర్స్ పోస్ట్ చేస్తే మనం మన స్నేహితులని బోలెడంత మెచ్చుకుంటాం. ఆ ప్రశంస confidence ని, సంతోషాన్ని యిస్తుంది కదా. అందరిని యీ ఫేస్ బుక్ లోకి తీసుకొచ్చే యిష్టాన్ని భలే కనిపెట్టారులే మార్క్ జూకర్ బర్గ్. యిప్పుడే ఫేస్ బుక్ ఆఫీస్ లో మార్క్ మోదీతో మాటాడుతోన్న లైవ్ వస్తుంది. చూసాక మళ్లీ యీ వుత్తరం కొనసాగిస్తాను.

యీ వుదయమే యానం వచ్చాను. యిక్కడ నేను ఆత్మీయంగా డాడీ అని పిలిచే దాట్ల దేవదానం రాజు గారు, అమ్మ ఉదయిని గారి దగ్గరకి వెళ్లాను. కబుర్లే కబుర్లు. వాళ్ళిద్దరూ మనుష్యులని ప్రేమించడానికే పుట్టినట్టుంటారనుకో. అక్కడ గోదావరి పై కట్టిన బ్రిడ్జి స్థంభానికి స్థంబానికి మధ్య వుండే సిమ్మెంట్ పలక మీద ‘హ్యాపీ బర్త్ డే తులసి’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన పెయింటింగ్ ని చూపించారు. సంవత్సరం క్రితం రాత్రికి రాత్రి ఆ బ్యానర్ వెలిసిందంట. యెవరు అక్కడ దానిని అంత యెత్తులో పెయింట్ చేసారో యెవ్వరికి తెలియదంట. యీ యేడాది ఆ రాసిన వాళ్ళు యెవరో అక్కడికి వస్తారేమోనని అనుకున్నారంట. యెవ్వరు కనబడ లేదంట. భలే ముచ్చటేసింది సునాయాసంగా చెరిపి పారెయ్యడానికి వీలులేని చోట వొక ఆనవాలుని చిత్రించటం. మరోచరిత్ర సినిమాలో బాలు స్వప్నా అని రాసి వున్న ఆ పేర్లని చూడటానికి రౌండ్ బంగ్లా కి చాల మంది వచ్చేవారంట ఆ సినిమా వచ్చినప్పుడు. మనం చాల చోట్ల యిలా పేర్లు రాసుకోవటం చూస్తాం కదా. అందరికి తెలిసేలా, కనిపించేలా. మనం మన జ్ఞాపకాలని అనేక రకాలుగా పదిలపర్చుకొంటాం.

సెప్టెంబర్ అనగానే నాకు వొక విషయం జ్ఞాపకం వస్తుంటుంది.

1908 సెప్టెంబర్ లో మూసీకి వరదలు వచ్చినప్పుడు మెహబూబ్ ఆలి ఖాన్ మూసి నదికి హారతి యిచ్చారని, అప్పుడు వరదలు ఆగిపోయాయని చెపుతారు. హారతి వల్ల ఆగాయన్నది వొక నమ్మకం. నమ్మకాలు, గుర్తులు మనం యెర్పరుచుకొనేవి. అక్కడ వున్న చింతచెట్టు పైకి యెక్కి చాల మంది ప్రాణాలు కాపాడుకున్నారంట. కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడిన ఆ చెట్టు యిప్పటికి అక్కడ అలానే వుంది. అప్పటి నుంచి ప్రతి యేడాది సెప్టెంబర్ 28న ఆ చెట్టుని దర్శించుకోడానికి అక్కడికి చాల మంది వస్తారు. ప్రాణప్రదాతగా ఆ చెట్టుని గుర్తు చేసుకొంటారు. అక్కడున్నది వొక గుర్తు. అక్కడ ఆ చెట్టు యిప్పటికి వుండటంతో ఆ విషయాన్ని గుర్తుచేసుకోడానికి వొక ఆనవాలు వుంది. ఆ చెట్టే లేకపోతే యెలా జ్ఞాపకం చేసుకొంటారు!!! ఫేస్ బుక్ కూడా మన జ్ఞాపకాలని యెప్పటికప్పుడు అందిస్తుంటే మనం చాలా సార్లు అవును కదా ఆ రోజు యిలా అని అనుకొంటూ సంతోషంతో తిరిగి వాటిల్లో కొన్నింటిని తిరిగి అప్పటి స్నేహితులతోనూ, కొత్తగా వచ్చిన నేస్తాలతోనూ పంచుకొంటున్నాం. యెంతటి సంతోషానికైనా, బాధకైన వొక ఆనవాలు తప్పని సరి కదా. చెట్లు, పుట్టలు, వూళ్ళు, స్థలాలు, బిల్డింగ్స్ మనం దానిని యెలా గుర్తు పెట్టుకోవాలి అని యెవరి లెక్కలు వాళ్ళు వేసుకొంటారు. చెట్టు, రాయి, రప్పా యేదైనా కావొచ్చు. ప్రతి రోజు మరిచిపోతోన్న మన నగరంలో జ్ఞాపకాల ఆనవాళ్ళు కోరుకోవటం యెండమావే కదా!

మనం రేడియో వింటున్నప్పుడు అనుకోకుండా వొక పాట మన చెవిని గిల్లుతుంది. ఆ పాట వొకానొక సమయాన మన పసితనాన్నో, బాల్యంలోనో, టీనేజ్ లోనో మన పెదవులపై అలవోకగా తిరిగాడుండొచ్చు. వొక పుస్తకం, బెల్లం వండుతోన్న వాసన, కొన్ని జ్ఞాపకాలు కుందేలు పిల్లల్లా పక్కకొదిగి కొత్త జ్ఞాపకాలకి దారినిస్తాయి. వాన పిట్టల సందోహంలా కొన్ని జ్ఞాపకాలు చిలిపిగా నవ్వుతాయి. కొన్ని జ్ఞాపకాలు లేడి పిల్లల్లా చేతిని వదల్లేక కన్నీళ్ళ పర్యంతమవుతాయి. అప్పుడు మనం గతంలోకి వెళతాం. భవిష్యత్తులోకి తొంగిచూస్తాం. జ్ఞాపకాలు చుట్టిముట్టే వేళ ఆలోచించాల్సింది నడిచి వచ్చిన దారుల్లో మన కోసం, అలానే మనకి యెదురైన వారిలో, మనం స్నేహితులమో ఆప్తులమో అనుకునేవారిలో యెన్నెన్ని పిల్లల నవ్వుల్లాంటి, రంగురంగు గులాబీ పువ్వుల్లాంటి, శరత్ వెన్నెల్లాంటి జ్ఞాపకాలని జల్లాం.

యెర్ర జూకా మల్లెల్లా వొక ఆధారాన్ని పెనవేసుకొన్నంత సొగసైన జ్ఞాపకాలని మనిద్దరం యెప్పటికప్పుడు ప్రతి మలుపులోనూ యిచ్చుకుందామనే హామీ పత్రం రాసుకొంటే… అయ్యో … హామీ పత్రం అనుకోవటం బాగులేదు కాని ముద్దొచ్చే ప్రామిస్ చేసుకొందామా మరోసారి వో నా వుదయపు కాఫీ పరిమళపు అబ్బాయి.

సరే, పనికి వెళ్ళాలి. మళ్ళీ మాటాడుకొందాం. అప్పటి వరకు చిన్ని ముద్దు కుడివైపు కాలర్ బోన్ మీద…

**** (*) ****