కవిత్వం

వాడు నవ్వుతాడూ…

అక్టోబర్ 2015

పెదవులను సాగదీసి
ఇంటినిండా వెలుగుల్ని పుక్కిలిస్తాడు
అమ్మ భుజం మీద తలవాల్చి
తక్కిన ప్రపంచంతో సవాలు చేస్తాడు
నవ్వుతాడు
నవ్వుతున్నానని
ఎలా చెప్పాలో తెలియక నవ్వుతాడు
పడుతూ
లేస్తూ
పడినందుకూ
లేచినందుకూ నవ్వుతాడు
రెప్పల తలుపుల్ని
మూస్తూ తెరుస్తూ ముచ్చటగా నవ్వుతాడు

వాడు మేలుకుంటే వెలుగు
వాడు నిద్రిస్తే వెన్నెల
వాడి నవ్వు వెలుగులే లేకపోతే
ఇంటిలోకమంతా చీకటి.