ఈదురుగాలితో పాటు ముఖానికి గుచ్చుకుంటున్నట్టుగా సూటిగా తాకుతున్న చినుకులు.
వాన నీటిలో కొట్టుకొస్తున్న పసుపు పచ్చని తురాయి పూలు చెప్పుల్లో దూరి చికాకుపెట్టి విసుగ్గా కాలు విదిలిస్తున్నాడు సిధ్ధు.
అలాగే తన చెప్పుల్లో దూరుతున్న పూలని మురిపెంగా చేతుల్లోకి తీసుకుంటోంది సౌరభ.
పుస్తకాల బేగ్ భుజానికి తగిలించేసి ఆ పూలతో దోసిలి నింపుకుంటోంది.
మళ్ళీ చెప్పుల్లో ఇరుక్కున్న మరి కొన్ని పూలని విదిలించబోయినవాడల్లా ఆగిపోయాడు. ఒంగి చేత్తోనే ఆ పూలని తీసి నెమ్మదిగా గట్టు మీద పెట్టాడు.
కను చివరల్లోంచే గమనించింది సౌరభ.
“సిధ్ధూ, నీ బుక్స్ ఇటివ్వు. నా బేగ్లో పెడతాను. “
“ధాంక్స్. “ సగం సగం తడిసిన రెండు పుస్తకాలూ ఆమె బేగ్లో పెడుతూండగా కాలేజీ బస్ వచ్చింది.
సౌరభ కూర్చుంది. వెనుకాల సీటొకటి ఖాళీ ఉన్నా చూడనివాడిలా ఆమె పక్కనే ఉన్న రాడ్ని ఆనుకుని నిలబడ్డాడు.
***
“అప్పుడే వెళ్ళాలా ?”
సౌరభ చుట్టూ చూసింది. చాలా మంది ఉన్నారు బస్ స్టాప్ లో . తెలిసినవాళ్ళెవరైనా చూస్తారేమో అనే ఆరాటం.
“వెళ్ళాలని లేదు. కానీ, మనం బస్ దిగి చాలాసేపయింది. ఇంకెంతసేపు ఇక్కడ బస్ కోసం ఎదురుచూస్తున్నట్టు ఇలా… “
“ఊ …”
***
“సిధ్ధూ … ఏంటి ఆ మార్కులు టెస్ట్ లో. మాథ్స్ అస్సలు ప్రాక్టీస్ చెయ్యట్లేదా?“
“నువ్వు మరీ అలా అడిగెయ్యకు. మాథ్స్ బుక్ తీస్తే చాలు పిచ్చెక్కుతోంది.“
“అయితే విను. కాలేజీ అవగానే ఇకనుంచీ బస్ స్టాప్ లో కబుర్లు బంద్. తిన్నగా మా ఇంటికి వెళదాం. ఇద్దరం కలిసి రోజూ ఓ గంట మాథ్స్ చేద్దాం. “
***
“సౌరభా, సిధ్ధూకీ నీకూ టిఫిన్ పెట్టాను టేబుల్ మీద. తినేసి చదువుకోండి. “
“అలాగే అమ్మా.“
“సిధ్ధూ, టొమాటో బజ్జీలంటే నీకిష్టం కదా. ఇవాళ అమ్మ అవే చేసింది. రా “
బజ్జీలు తింటూంటేనే కరెంటు పోయింది.
“ ఇంట్లో చీకటిగా ఉంది. డాబా మీదకి వెళితే మరో అరగంట వరకూ ఆ వెలుగులోనే చదవొచ్చు. “
చల్లటి సాయంత్రం.
సిధ్ధూ పుస్తకం తెరిచి ఈ రోజు చెయ్యాల్సిన లెఖ్ఖలు చూసుకుంటున్నాడు.
సౌరభ పేజీలు అలా వెతుకుతూనే ఉంది.
“ఏంటి పేజి తియ్యడానికి ఇంతసేపు … “
“ఆ … అదే … ఇవాళ ఏం ఛాప్టర్? “
“ఏంటి నన్ను టెస్టింగా .. నేను ఆల్రెడీ ప్రోబ్లమ్స్ చెయ్యడం కూడా మొదలుపెట్టేసాను. “
“ఆ … నేను కూడా … చేస్తాను … “
సిధ్ధూ పుస్తకంలో తెరిచిన పేజీ నెంబరు చూసి కానీ, తన పుస్తకంలో తెరవలేకపోయింది.
డాబా మీద ఒక పక్కగా పూల కుండీలు. విరబూసిన చామంతులు.
‘అమ్మ నీళ్ళు పోసిందా మొక్కలకి… ..’
లబ్…డబ్…లబ్…డబ్…
‘అయిదారు సీతా కోకలు ఎగురుతున్నాయ్. ఎంతబావున్నాయో … ‘
లబ్…డబ్…లబ్…డబ్…
‘ఆ మూల పైన ఆకాశంలో చూస్తే ఒక పెద్ద తెల్లటి మబ్బు వెన్నముద్దలా …. ‘
లబ్..డబ్…లబ్….డబ్….లబ్…డబ్….
“హలో … మేడం … ఏంటివాళ? నేను చూడు … రెండు సమ్స్ చేసేశాను. “
“ఊ … గుడ్ గుడ్ …”
రెప్పలు బరువు….
“హేయ్… నీకివాళ మాథ్స్ చేసే మూడ్ లేనట్టుందిలే. నేను కూడా వెళతాను… “
….
“అప్పుడేనా అని కూడా అడగవా …”
“ఆ …. “
“మా అమ్మ ఏవో సరుకులు తెమ్మని వారంగా పోరుపెడుతోంది. డాడీ ఊళ్ళో లేరు. ఇవాళ తప్పదు. తేకపోతే నాకే తిండి బొక్క. మనకి ఏది పడితే అది తిని సర్దుకునే అలవాటు లేదు. “
“ఊ ….”
“సరే సరే … బై. “ తన పుస్తకాలు తీసుకుని వెళిపోతున్న సిధ్ధూ వంక బొమ్మలా చూస్తూ కూర్చుంది.
ఉఫ్ ఫ్ ఫ్ ఫ్ ….. ఇప్పుడు చక్కగా ఊపిరాడుతోందేవిటి…!!.
***
“హలో సిధ్ధూ … “
“చెప్పు సౌ…. ఏంటి ఈ టైంలో ..”
“ఎక్కడున్నావ్ …? “
“ఏముంది .. ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లు …నువ్వెక్కడున్నావ్? ..పిచ్చి ప్రశ్న కదా. నీ రూంలో చదువుకుంటూ ఉంటావ్ కదా. “
“ఊ … సరే కానీ, ఒకటి చెప్పు. నువ్వేమైనా చాలాసేపుగా చందమామని చూస్తూ ఉన్నావా “
“…. బయట ఉన్నా కదా …ఇవాళ పౌర్ణమి అనుకుంటా. నీ మొహంలా ఉందని … చందమామని చూస్తూనే ఫ్రెండ్స్ తో మాట్లాడాలే. నీకెలా తెలుసు? “
“అలా ముసి ముసిగా నవ్వుతావేంటి? చెప్పు… ఎలా తెలుసు? “
“అకస్మాత్తుగా నా గుండె నిండా వెన్నెల పరుచుకుంది. అందుకే అడిగాను … నేననుకున్నది నిజమని తెలిసిపోయింది. …”
కట్ అయిన ఫోన్ వంక ఎగా దిగా చూశాడు సిధ్ధూ.
“ఏం తెలిసిపోయింది? ….. తన మనసు సౌరభకా సౌరభ మనసు తనకా … “
***
“సౌ … నీకంత మంచి పర్సెంట్ వచ్చిందని నీ తరఫున నేను మన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాను. కనీసం నీ మొహంలో ఆ సంతోషం కూడా లేదు… ఇక్కడా ఏమీ మాట్లాడట్లేదు. ఏమయింది నీకు … “
“నీ మార్క్స్ ఏంటి సిధ్ధూ… రెండు సబ్జక్ట్స్ ఫెయిల్. డిగ్రీ…. ఇలా చదివితే భవిష్యత్తు ఎలా? “
“ఓ అదా… నా మార్కుల గురించి నేనే వర్రీ అవ్వట్లేదు. నీకెందుకు బాధ? “
“వర్రీ అవ్వట్లేదా … ఏం చెయ్యాలనుకుంటున్నావ్ ఫ్యూచర్లో … “
“సౌ … మూడ్ పాడుచెయ్యకు. నీకు మార్కులొచ్చాయని నేనింత సంతోషంగా ఉన్నాను. ఆనందించకుండా ఏంటిది? “
“నీకూ మంచి మార్కులొచ్చి ఎదర భవిష్యత్తుకి దారి చక్కగా కనపడినప్పుడే నాకు సంతోషం…ప్లీజ్ … డిగ్రీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. పీ.జీ కూడా చేసి మనం మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. తెలుసుకో. “
“సౌ … అలా వెళిపోతావేంటి. నీ విజయాన్ని నేనో ఉత్సవంగా జరుపుకోవడం చూసి నువ్వు ఉత్సాహంగా వచ్చి మనసులో మాట బయటికి చెబుతావనుకున్నాను. ఇలా మనసు పాడు చేస్తావనుకోలేదు… “
“సౌ … “
***
“సౌ … ఎందుకీ మధ్య నన్ను దూరం చేస్తున్నావ్ … నేను ఇదివరకులా మీ ఇంటికి వస్తాను. కలిసి చదువుకుందాం … “
“కలిసి చదువుకుందామా … లబ్ .. డబ్…లబ్ …డబ్ …”
“ఒద్దు సిధ్ధూ. ఈ మధ్య నాకు అలా చదివితే సరిగ్గా ఎక్కడంలేదు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చెయ్యి. ఫోన్లోనే చెప్తాను. “
***
“రేయ్ సిధ్ధూ … ఏంట్రా అలా ఉన్నావ్ ..”
“ఏం లేదురా.”
“రేయ్ మామా … ఈ మధ్య నువ్వు మాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదురా. నిన్నొదిలేసి వేరే ఎవరితోనో తిరుగుతున్న అమ్మాయి కోసం నువ్వెందుకురా మాకు దూరమవుతున్నావ్ …”
చివ్వున తలెత్తాడు సిధ్ధూ… “ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ? చంపేస్తాను … “
“.. సౌరభ వాళ్ళ ఇంటి పక్కన కుర్రాడితో చనువుగా ఉంటోందనే కదా.. నువ్వు పరధ్యానంగా ఉంటున్నావ్ “
“ఎవడ్రా వాడు? సౌరభ వాడితో ఎందుకు చనువుగా ఉంటుంది?”
“అవున్రా. ఆ అబ్బాయి అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాడు. మొన్న గుడిలో కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నా కళ్ళారా చూశాను. “
సిధ్ధూ ముఖం కౄరంగా మారింది.
“నువ్వు సరిగ్గా చదవట్లేదనే సౌరభ నిన్ను దూరం పెట్టిందని తెలుస్తూనే ఉంది. ఆ అబ్బాయి సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మా పక్క వీధేగా. వాళ్ళ అమ్మ , మా అమ్మా ఫ్రెండ్స్ లే. తన పక్కన నువ్వు సరిపోవని ఇంజినీరింగ్ చదువుతున్న వాడిని ఎంచుకుంది. అలాంటి దానికోసం నువ్వెందుకురా మామా డల్ అవుతావ్ …”
“ఈ మధ్య నేను మాట్లాడుతుంటే నా ముఖం లోకి చూడటంలేదు. ఫోన్ చేసినా ఇదివరకులా ఎక్కువగా మాట్లాడటం లేదు. నన్ను ఇంటికి రమ్మని కూడా అనడం లేదు. కలిసి చదువుకుందామని నేనే అడిగితే కూడా నాతో చదవడం కూడా ఇష్టం లేనట్టు ముఖం మీదే కుదర్దని చెప్పేసింది. ………… తన వెనకాల అయిదేళ్ళుగా తిరిగుతున్నాను……..ఒకే స్కూల్ …….ఒకే కాలేజీ…..ఒకే ప్రేమ కూడా అనుకున్నాను……సూటిగా కాకపోయినా ఎన్నో సార్లు నేనంటే ఇష్టం ఉన్నట్టే మాట్లాడింది…………..”
సిధ్ధూ ఆయాసపడుతున్నాడు. అతని ఊపిరి పాము బుసలా భయంకరంగా ఉంది. చెమటలు తలలోంచి కణతల మీదకి జారుతున్నాయ్.
“ఇంజినీరింగ్ వాడు దొరికాక …..అమ్మాయిలకి మనలాంటి వాళ్ళెందుకు కనపడతారు మామా … ఊరుకో… రా … అలా ఓ దమ్ము వేసి వద్దాం…”
స్నేహితుడి చేతిని తన భుజం మీద నుంచి విసురుగా తోసాడు. ఆవేశంగా బైక్ ఎక్కాడు.
ఇరవై నిముషాల్లో బైక్ సౌరభ ఇంటి ముంది ఆపి విసురుగా గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు.
ఆ సమయంలో సౌరభ తల్లి వంటింట్లో ఉంది. తిన్నగా సౌరభ గదిలోకే వెళ్ళాడు. ఫాన్ తిరుగుతోంది. కానీ తను అక్కడ లేదు.
“సిధ్ధూ, సౌరభ బట్టలు ఆరెయ్యడానికి మేడ మీదకి వెళ్ళిందమ్మా. కూర్చో. వచ్చేస్తుంది. “ తనని గమనించి చనువుగా వంటింట్లోంచే అరచిన సౌరభ తల్లి మాటలు వినిపించాయి. అసహనంగా తల విదిల్చిన తనకి సౌరభ మంచంపైన తెరిచి పెట్టుకున్న డైరీ రెప రెపలాడుతూ కనపడింది.
కొత్త ప్రేమికుడి గురించి ఏం రాసుకుందో చూడాలనిపించి కసిగా ఆ డైరీని చేతుల్లోకి తీసుకున్నాడు.
“సిధ్ధూ,
నా హృదయంలో కలాన్ని ముంచి ఈ లేఖలు వ్రాస్తున్నాను. ఏవేవో వాక్యాలు తుమ్మెదల్లా రొద చేస్తూ, నీ మీద ప్రేమతో నిండిపోయిన నా హృదయం చుట్టూ మూగుతున్నాయ్ కానీ దాన్ని అందుకోలేకపోతున్నాయ్. అందుకే ఆ వాక్యాలన్నిట్లో ఎంత బోలుతనమో చూశావా? ఒక్కటీ నా మనసుని నీకు చెప్పలేకపోతోంది.
ఊహూ.. భాష చాలదు. మరేదో కావాలి. నీకు నా హృదయం స్పష్టమవడానికి.
అందరూ నిద్రించే రాత్రి ఏకాంతంగా కూర్చుని, మెల్లగా కదిలిపోతున్న మేఘాలు నిండు చందమామని పూర్తిగా చూపించేవరకూ తదేకమైన చూపులో విరహించిన క్షణాల్లో ఏదో ఉంది. దాన్ని పట్టుకోవాలి…
మా పెరట్లో ఉన్న జీడిమామిడి తోటలో పండిన ఆ జీడి మామిడి పళ్ళ పసరు వాసనల్లో ఒకవిధమైన మత్తుంది. దాన్ని పట్టుకోవాలి. “
మరో పేజీ తిప్పాడు.
“సిధ్ధూ ,
నువ్వెంత దగ్గరవాడివైనా , నీతో చిన్నతనం నుంచీ ఎంత చనువున్నా, నువ్వంటే నాకు ఎనలేని ప్రేమ అని తెలిశాక ఏదో సంకోచం, ఏదో భయం నన్ను నీ సమక్షంలో నిలబడలేకుండా చేస్తున్నాయ్ సిధ్ధూ. నీకు నేనంటే ఇష్టమని తెలిసినా ధైర్యం చెయ్యలేకపోతున్నాను. నా ప్రేమ నీకు చెప్పకపోయినా నా వెంట తిరిగి నీ చదువుని ఇప్పటికే నిర్లక్ష్యం చేశావు. ఇంక నా ప్రేమ వెల్లడిస్తే ఊహల్లోపడి ఈ డిగ్రీ కూడా నువ్వు పూర్తిచెయ్యకుండా భవిష్యత్తు నాశనం చేసుకుంటావేమో అని భయంగా ఉంది. నా పరిస్థితీ అలాగే ఉంది. చదువు మీద శ్రధ్ధ పెట్టలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావ్. ఇద్దరం ముందు చదువులు పూర్తిచేసుకుని మంచి ఉద్యోగస్తులమైతే కదా మన జీవితమంతా హాయిగా గడుస్తుంది. “
“సిధ్ధూ,
‘ఈ లోకమంతటితో నాకున్న బంధం ఒకెత్తు అయితే నీతో నాకున్న అనుబంధం మరో ఎత్తులా ఉంది. అది డిటాచ్డ్ ఎటాచ్మెంట్ , ఇది ఎటాచ్డ్ డిటాచ్మెంట్. నేనే నువ్వైపోయాను. కానీ నీకు దగ్గరగా రాలేకపోతున్నాను. ‘
చేతిలో డైరీతో అలాగే క్రింద కూలబడిపోయాడు సిధ్ధూ. కళ్ళవెంట అపరాధభావం ధారలుగా వర్షిస్తోంది. ప్రపంచం బ్రద్దలయ్యేలా ఏడవాలనిపించింది.
“అమ్మా, పక్కింటి రాజేష్, సుధా ఆంటీ కార్లో బాబా గుడికి వెళుతున్నారుట. మనిద్దర్నీ కూడా రమ్మంటున్నారు ఆంటీ. పది నిముషాల్లో తయారవుతాం అని చెప్పాను. ”
హాల్లోంచి సౌరభ మాటలు వినపడి చురుగ్గా కదిలాడు. కొన్ని పేజీలు చింపుకుని మడిచి జేబులో పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న సౌరభ పెన్నుతో ఓ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా వ్రాశాడు
“సౌరభా,
సరిగ్గా మూడేళ్ళ తరువాత ఇదే రోజు , అంటే జనవరి ఒకటి సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకి వెంకటేశ్వరస్వామి గుడికొస్తాను. అప్పటిదాకా నేను నీకు కనిపించను. ఈ జీవితం నీది. నీకోసం మాత్రమే బ్రతుకుతాను. అందుకు నేను ప్రయోజకుడిని కావడం చాలా అవసరం. అందుకే వెళిపోతున్నాను. నా కోసం మూడేళ్ళు ఎదురుచూడగలవా? ఆ తరువాత ప్రాణమున్నంతవరకూ నిన్ను విడిచిపెట్టను.“
ఆ పేజీలోనే పెన్ను పెట్టి మూసి, వేగంగా బయటికి నడిచాడు. తన సౌరభ ముఖంలోకి తను చూడలేడు.
“ఏయ్ ..సిధ్ధూ… ఎప్పుడొచ్చావ్? సిధ్ధూ … సిద్ధూ … ఏమయింది? ”
గడప దాకా పరుగెట్టుకొచ్చినా సిధ్ధూ వెనక్కి తిరిగి సౌరభని చూడలేదు.
బైక్ ఆ వీధి మలుపులో ఆపి పాంటు జేబులో చెయ్యి పెట్టాడు.
యాసిడ్ సీసా ప్రహరీ గోడకి తగిలి భళ్ళున పగిలి ముక్కలై బుసలు కొడుతూ మురికి కాల్వనీటిలో కలిసిపోయింది
**** (*) ****
బావుంది ప్రసూన గారూ
ధన్యవాదాలు మైథిలి మేమ్.
సూపర్ గా ఉంది కధ. చివరిలో మలుపు బాగుంది
హమ్మయ్య! సుఖాంతం చేశారు. బావుంది.
మంచి ప్రేమకథ. బావుంది.
ధన్యవాదాలు రాధ గారు.
బాగుంది ప్రసూన గారు.
ధన్యవాదాలు పద్మ గారూ.