లోకం నిండా ఇందరు దేవుళ్ళనీ, ఇన్ని మతాలనీ సృష్టించిన మనిషికి అనాది దైవం ఎవరు? బహుశా, ఆ అనాది దైవం ఒక రొట్టె ముక్క అయివుంటుంది. లేక వొక అన్నం మెతుకు!
బహుశా, అనంతర కాలంలోని ఈ వేలాది దేవుళ్ళు, లోకంలోని సంపదనంతా తమ వద్దే పోగేసుకున్న అతి కొద్ది మంది సృష్టి అయి వుంటుంది. లేక, ఆ కొద్ది మంది పోషణలో శ్రమ భారం తెలియక విశ్రాంత జీవులుగా మిగిలిన మరి కొద్ది మంది సృష్టి అయి వుంటుంది. అట్లా అని, లోకం లోని మెజారిటీ ఐన శ్రమ జీవులు తమ అనాది దైవాన్ని మరిచిపోయారా?
లేదు…
లేదు కాబట్టే, భారతీయ సమాజంలో మొదటి అన్నంముద్దని నోట్లో పెట్టుకునే ముందు కళ్ళకు అద్దుకునే ఒక సంప్రదాయం ఇంకా కనిపిస్తుంది. అన్నమ్ముద్ద పైనో, రొట్టె ముక్క పైనో రాసిన కవితలలో తీవ్రమైన భావోద్వేగాలు అగుపిస్తాయి. అట్లాంటి ఒక అపురూపమైన కవిత, విశేష ప్రాచుర్యం పొందిన కవిత, ఎన్ గోపి రాసిన ‘రొట్టె’.
రొట్టెను గురించి కవిత్వం చెబుతూ చెబుతూ, తన తల్లికి సంబంధించిన జ్ఞాపకాల లోనికీ, తన మూలాల లోనికీ ప్రయాణిస్తాడు కవి. తెలుగులో ఎన్నో ఉన్నతమైన చదువులు చదుకున్నప్పటికీ, గంభీరమైన పద చిత్రాలతో చదువరులని బెంబేలు ఎత్తించకుండా, చాలా సరళమైన భాషతో, పద చిత్రాలతో కవిత చెప్పడం ఈ కవి ప్రత్యేకత!
రొట్టె
రొట్టె ఆకాశం నుండి ఊడిపడదు
భూగర్భ సారం లోంచి
చెమట బిందువులు మోసుకొచ్చిన
ఆకలి స్వప్నం రొట్టె
ఇది మెత్త పొలాల మట్టి రాగానికి
చేతులు వేసే తాళం లోంచి
నడిచొచ్చిన కాంతి చక్రం
తెల్లారటమంటే
మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే
పిండి ఐదు వేళ్ళ సందుల్ని అలంకరిస్తూ
అరచేతి రేఖల్ని ఆప్యాయంగా ముద్దాడుతూ చేసే
శ్రమ స్పర్శా సిద్ధాంతం రొట్టెపిసికేటప్పుడు ఏ పొర ఏ ఆకృతి దాలుస్తుందో
వ్యక్తమౌతూ మాయమయ్యే
అసంఖ్యాక విన్యాసాల పర్యవసానం రొట్టె
అమ్మ ముద్దను పిసుకుతుంటే
అమ్మ తన చేతుల్తో
మా కడుపులను నిమురుతున్నట్టుండేది
రొట్టె పెంక మీదకు చేరగానే
అందరం చుట్టూ మూగేవాళ్ళం
సలాకితో రొట్టెను కాలుస్తుంటే
ఆమె శ్రద్ధగా రొట్టె మీద
మమకార మహాకావ్యాన్ని లిఖిస్తున్నట్టుగా వుండేదిఅప్పుడప్పుడూ రొట్టె మీద
నీళ్ళతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి
మాకవేవీ తెలియదు
రొట్టెంటే రొట్టే
రొట్టె మీద ఓనమాలు దిద్దుకున్నాం
రొట్టెను ఏనాటికీ మా తలల పైన
సూర్యుడిగా ధరించాం!
‘రొట్టె ఆకాశం నుండి ఊడిపడదు’ అంటూ కవిత ప్రారంభమవుతుంది. నిజమే – ఆకాశం నుండి, గాలిలో నుండి ప్రారంభం కావడానికి ఇదేమీ ఆషామాషీ వస్తువును స్వీకరించిన కవిత కాదు. ఆకలినీ, అందులోనూ శ్రమను నమ్ముకున్న మనుషుల ఆకలినీ, ఆ ఆకలిని తీర్చే రొట్టేనీ వస్తువుగా స్వీకరించిన కవిత.
అందుకే, మరింత వివరంగా ‘భూగర్భ సారం లోంచి / చెమట బిందువులు మోసుకొచ్చిన / ఆకలి స్వప్నం రొట్టె’ అంటాడు కవి. ఇంకా ముందుకు వెళ్లి, ‘మెత్త పొలాల మట్టి రాగానికి / చేతులు వేసే తాళం లోంచి / నడిచొచ్చిన కాంతి చక్రం’ అని అంటాడు. రొట్టెలు చేసే క్రమంలో చేతులు లయబద్ధంగా కదలడాన్ని తాళం వేయడంతోనూ, ఈ రొట్టెకు కావలసిన దినుసుని అందించే క్రమంలో పొలాల మట్టి పడిన తపనను రాగంతో పోల్చడంలోనూ, శ్రమకూ, పాటకూ వున్న ఒక అవిభాజ్య సంబంధాన్ని అన్యాపదేశంగా చెప్పాడు కవి! ఆ రాగ తాళాల లోంచి నడిచొచ్చిన కాంతి చక్రంగా కూడా రొట్టేని అభివర్ణిస్తున్నాడు కవి.
నిజమే కదా… చేతిలోని ముద్దకూ, నోటికీ నడుమ వందల పోరాటాలు వుండే శ్రమ జీవుల ఇళ్ళల్లో ఒక్క రొట్టె ముక్కకు నోచుకోని రోజు ఒక చీకటి దినమే కదా! అందుకే అంటున్నాడు – ‘తెల్లారటమంటే / మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే’ అని. ‘అమ్మ ముద్దను పిసుకుతుంటే / అమ్మ తన చేతుల్తో / మా కడుపులను నిమురుతున్నట్టుండేది’ అని గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు.
‘నెరూడా’ కూడా అంటాడు-
You rise
from flour,
water
and fire.
Dense or light,
flattened or round,
you duplicate
the mother’s
rounded womb (Bread)
ఎక్కడి నెరూడా? ఎక్కడి ఎన్ గోపి??
కవి ఏ కాలం వాడు ఐతేనేమి. ఏ నేల మీది వాడు ఐతేనేమి. ఆకలీ, దానిని తీర్చే రొట్టెముక్కా, వాటి చుట్టూ అల్లుకున్న పద్యాలూ, పాటలూ, పోరాటాలూ అనాది కాలం నుండీ సాగుతూనే వున్నాయి కదా!
కవిత చదవడం పూర్తి చేశాక, కవి చాలా సులువుగా రొట్టె పైన ఒక కవిత చెప్పినట్టుగా తోచిందా? ‘How simple / you are, bread / and how profound’ అంటాడు నెరూడా!
రొట్టె పైన కవిత్వం చెప్పడానికి రొట్టె లేకుండా గడిపిన చీకటి రోజుల జ్ఞాపకాలు వుండాలి గదా. ఆ రొట్టెను అందించడానికి అమ్మలు అనుభవించిన రహస్య దుఃఖపు జ్ఞాపకాలు వుండాలి గదా. అందుకే గోపి గారు ఈ కవితని ‘రొట్టెను ఏనాటికీ మా తలల పైన సూర్యుడిగా ధరించాం‘ అన్న వాక్యంతో ముగించాడు.
రొట్టెను తలల పైన సూర్యుడిగా ధరించిన శ్రమ జీవుల నుండి ఆ సూర్యుడిని ఎత్తుకు పోయే వాళ్ళ ఆగడాలు రోజు రోజుకీ మితిమీరి పోతున్నపుడు, ఆ శ్రమజీవులు తామే సూర్యుళ్ళుగా మారిపోతే ఆ నేరం ఎవరిది?
**** (*) *****
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్