‘గిన్నీసు రికార్డుకాదు.. ఇంట్లో గిన్నెలూ చెంబులూ బద్దలైపోతున్నాయేందే నీ దెబ్బకీ!’
‘నా దెబ్బ కాదయ్యా మగడా! ధరల దెబ్బ! బోడి బీరకాయ కిలో యాభయ్యా! బీన్సు ఎనభయ్యా! బీటురూటు ముప్పై.. బెండ ముప్పై రెండా! దొండ..’
‘అబ్బబ్బ! ఆపవే బాబూ! ఆ ధరల దండకం!’
‘లేకపోతే ఏందయ్యా! నువ్వేడనో కోడిని కొట్టుకొచ్చి పలావు చెయ్యమని నా పీకలమీద కూకున్నావు ! పుంజునంటే కొట్టుకొచ్చావుగానీ.. పలావులోకి దినుసులు నేనే కొట్టుకాడ కొట్టుకురావాలి మావా!’
‘కొట్టుకు రావడమేంటే.. కొత్తగా మాట్లాడుతుండావ్! నెలమొదట్లో జీతం మొత్తం కుడుముల్లా నీ చేతిల్లోనే పోసాను గందే! అదంతా మార్నింగుషోలకే మటా!’
‘ఆ తమాషా ఒక్కటే తక్కువ నా బతుక్కి! నా బతుకే ఓ టీవీ సీరియల్లు మాదిరిగా అయిపాయినాది! అసలు పలావు కావాలంటే ఏమేం కావాలో తెలుసా మావా నీకూ!’
‘ఆ మాత్రం తెలీకపోవడానికి నేనేమన్నా అదేందో.. సివిల్ ఎజ్జామిషనా.. ఏందో.. దానిక్కూకునే కుర్రాడినా! నూనె.. పసుపు.. కారం.. ఉప్పు.. కొబ్బరి.. మసాలా దినుసులు.. టమాటోలో, బీన్నీసులో, ఆలుగడ్డలో నాలుగు తగలనిస్తే ఆ మజానే వేరే మరదలా!’
‘వంటనూనె బొట్టు ఎట్టా మండిపోతా వుందో తెలుసా మావా నీకు! పండక్కి గడపకి పసుపు రాయడమట్టా ఉంచు! మెళ్లో తాడుకింత పులుముకుందామనుకున్నా చిటికడంతకూడా కొనే సతువలేక చేతులు ముడుచుక్కూకున్నానిక్కడ! నువ్విప్పుడొచ్చి కోడిపలావు సెయ్యమని మారాం సేస్తా ఉండావు!’
‘పసుపు లేకపోతే మానె.. పోనీ ఉప్పూ కారమన్నా పోసి వండరాదే!’
‘సడిపాయ! ఉప్పు సంగతే సెప్పు ఇంగ! కల్లు, సారా అంటే ఏరులై పారతా ఉందిగానీ.. కల్లుప్పు.. తాగేనీళ్లల్లో తప్ప కలికానిక్కూడా కనిపించడం లేదయ్యా మగడా! రాతి ఉప్పుకూడా పాతిక పెడితేగానీ కిలో చేటలో పడ్డం లేదు. పలావుకు సరిపడా కొనాలంటే నీ జగన్ బాబులాగానో.. ఆ కెటీఆరుకు బాబులాగానో పుట్టాల మళ్ళీ!’
‘ఈ మధ్య మరీ నీకు ఎటకారాలు ఎక్కువైపోయాయే! పోనీ వట్టి గొడ్డుకారమన్నా కూరి వండవే! నాలిక జివ్వ చచ్చిపోయుండది!’
‘కారం.. కారం.. అంటూ పదిమార్లు ఊరికే అట్టా పలవరించమాక మావా! నా కళ్లంట నీళ్ళు గిర్రున తిరుగుతా ఉండాయి! కొట్లో కారం పొట్లాల రేట్లెట్లా మండిపోతున్నాయో తెలిస్తే నివ్విట్లా కారంజపానికి తగులుకోవు! కూరగాయలెట్లాగూ కొనే సౌభాగ్గెం లేదు. కొరివికారమన్నా కలుపుకు తిందామంటే మళ్లా అది కొంటానికి బ్యాంకుకాడికి లోనుకు పరిగెత్తాల!’
‘ఆపూ! ఇంటున్నాను గందా అని.. ఓ.. వూరికే దంచేస్తన్నావు ఊకదంపుడు ఉపన్నేసాలు! పలావు ఎట్టా సేయాలో.. అందులోకి ఏమేం కావాలో.. ఆ సోదంతా నాకెందుకంట? కట్టుకున్నదానివి.. అడిగింది టక్కుమని చేసి పెట్టేయడం నీ డూటీ! ముందా పొయ్యి ఎలిగించూ!’
‘ఏం పెట్టి ఎలిగించమంటావయ్యా పొయ్యీ? గేసు అయిపొయ్యి పదిరోజుల పైనయ్యింది. పోనులో పలకడు. పోయడిగినా ఉలకడు.. ఆ గేసుబండ బండమడిసి. రేపో ఎల్లుండో రేట్లు పెంచుతారంటగా! అప్పటిదాకా .. నో స్టాకు.. నాటకాలంట!’
‘ఆహాఁ! గేసు లేకపోతే పొయ్యే ఎలగదా ఏంటే సోద్దెం! కట్టెపేళ్లతో కుస్తీ పట్టిన రోజులు అప్పుడే మర్చిపోతే ఎట్లానే బాలాసుకుమారీ! గేసుమాటలు మానేసి ముందా పలావు సంగతి సూస్తావా లేదా!’
‘సరేనయ్యా! పొయ్యిలోకి నా కాళ్లో చేతులో పెట్టి వండుతా గానీ.. ముందు నువ్వా పలావు దినుసుల సంగతి సూడరాదా! నిజం చెబితే నీకేదో.. గిట్టని పత్రికల్లో రాసే కట్టుకతల్లాగుంటాయిగానీ.. ఇదిగో సంచీ! నువ్వే అట్టా బజారుమీద్దాగా పోయి నాలుగు రకాల కూరగాయలు కొనుక్కురా! ఒక్క కోడిపలావేం కర్మ.. కోడికూర.. గరమా గరమ్ కోడి పులుసు.. కోడిగారెలుకూడా కోరినన్ని చేసిపెట్టడానికి నేను రడీ!’
‘ఎట్టాగైనా మాటల్లో నువ్వు మన సర్కారోళ్లను మించిపొయ్యావే ఈ మద్ద మరీనూ! నీ కబుర్లతో కడుపు నింపేసినావు! తెల్లారిపోయినట్లుంది. అదిగో! అప్పుడే కోడికూడా కూస్తావుంది!’
‘అది కోడికూతేగానీ.. కోడి కూసింది కాదు మావా! మన సిన్నోడిని గోడవతల కూకోని అట్టా కుయ్యమని నేనే సెప్పినా! నువ్వు కోడిపలావో అని కలవరిస్తుండావు గందా పాపం పండగ వచ్చినకాణ్ణుంచీ! ఇదిగో.. ఆ కోడికూతలు ఇనుకుంటా ఆ జావనీళ్ళు తాగతా ఉండు! కోడిపలావేం కర్మ! పేద్దవొటేల్లో చికెన్ బిర్యానీ మింగేకన్నా మజాగా ఉంటాది!’
‘మరి నేను కొట్టుకొచ్చిన కోడిపుంజే భామా!’
‘వదిలేసినాను మావా! మన సర్కారోళ్ల పున్నెమా అని దాన్నైనా నాలుగునాళ్లు పేనాలతో హాయిగా బతకనీయరాదా! మనబతుకులు ఎట్టాగూ ఇట్టా ఏడుస్తానే ఉంటాయి పద్దస్తమానం’
**** (*) ****
నీ ఇంట కోడిని కాల్చా. కొట్టుకొచ్చిన కోడిపుంజును అదట్టా వదిలేస్తే సూత్తా ఉన్దావేన్దిరా. ఉరకతా పోయి ఈ సారి ఓ గుడ్లుపెట్టే పెట్టనైనా కొట్టుకురాక. .