డైరీ

కాసిని మరకలు

డిసెంబర్ 2015

హాయ్ రా!

నువ్వెలా ఉన్నావో నన్ను చేరుకున్న నీ అక్షరాలు విప్పి చెప్పాయి. నీ అక్షరాలకి ఈ నా లేఖ సమాధానంగా రాసింది కాదు గానీ నువ్వు, నేను, మనలాంటి వాళ్ళందరం ఎలా ఉన్నామో ఆలోచిస్తుంటే కాగితాన్నద్దుకున్న సిరామరకలు ఇవి.

ప్రతి రోజూ కొత్త ఉషస్సు తడిమినప్పుడల్లా ఒక్కొక్కసారి కొత్త ఉత్సాహంలా, మరి కొన్నిసార్లు అదో ఉత్పాతంలా అనిపించటంలోనే మనసు ద్వైదీభావం కనిపిస్తుంది కదా.. ఉత్సాహానికి ఊపిరి వచ్చిన రోజు కాలాన్ని ఎంత త్వరగా పరిగెత్తిస్తుందో, శూన్యాన్నివెంటపెట్టుకొచ్చిన రోజు క్షణం గడవక విలవిల్లాడిపోతుంది.

మనసులోని పదార్ధం అంతా ఖాళీఅయి ఒక్క ఆలోచనా ముందుకు కదలని నీరవ నిశ్శబ్దంలో ఎంత శూన్యం దాగి ఉంటుందో నీకు తెలుసు కదా. కాసేపలా శూన్యాన్ని తాగేసిన ఉత్సాహమొకటి ఎన్ని వేదనల్ని బయటకి కక్కుతుందో కదా… ఎవరికి తెలుసోయ్… ఏ వేదన ఎవరిని కదిలిస్తుందో? ఏ కథని పరిష్కరిస్తుందో?

నీ వాళ్ళనీ, నా వాళ్ళనీ, గడచిపోయిన జీవితపు ఆనవాళ్ళని… దాటొచ్చిన సరిహద్దుల్ని, దాటలేని కంచెలని అక్షరాల్లో ఒంపటం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆ అక్షరాలకి అమరత్వం అద్దటంలో కురిసే స్మృతుల జడివానలో కొట్టుకుపోకుండా ఉండగలగటం దాదాపు అసాధ్యమే, అది నీకైనా మరి నాకైనా. ఎన్ని కవితలు, కథలు మనలో చెక్కుకున్నా శిలలు శిలలుగా ఎదురు పడే కొన్ని కాలాలు ఊహలకి అందవు కదా. మస్తిష్కానికి చేరని ఆహ్లాదపు శాసనాలు ఎన్ని చెక్కి ఏమి ప్రయోజనం? అంతరంగపు గోడలని మకిలి పరచటం తప్ప.

అవకాశం ఉన్నంత సేపు మనం కాలాన్ని ఎంతగా శాసించినా అంతిమ శాసనం మాత్రం కాలానిదే. ఇది నిర్వేదం కాదు వాస్తవం. కాలపు అడుగులకి మడుగులొత్తాల్సిన అవసరం లేదు. దాన్ని ధిక్కరించాల్సిన అవసరమూ లేదు మనం చెయ్యాల్సిందల్లా మనమున్నంత వరకూ తనతో సహజీవనం చెయ్యటమే.

జీవితం అంటే ఏదో అనుకుంటాం కానీ, ఎంత విసిగించినా, వెక్కిరించినా ఇది మన జీవితమే. దీన్ని దాటి వెళ్ళటానికి మనకున్నది ఒకే ఒక్క ఆప్షన్. అది కూడా మనకి మనం ఎంచుకోకూడని ఆప్షన్. దానికై అది హత్తుకోవాల్సిందే కానీ మనకి మనం ఎంచుకోవటం అంటే ప్రకృతిని ధిక్కరించి నడవటమే. వేదనలోనూ, వేడుకలోనూ, జీవితం ఎప్పుడూ మన మురిపమే. అదొక మధుపమై మనలో జీవాన్ని వెదుక్కుంటుంది.

ఎన్ని జన్మలు మనం దాటి వచ్చామో, ఇంకా ఎన్ని జన్మలు ప్రయాణం చేస్తామో,రాబోయేది జన్మ రాహిత్యమో, అసలు నిజంగా జన్మలంటూ ఉన్నాయో లేవో అంటూ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్న చోట ప్రస్తుతం మన ఎదురుగా ఉన్నదే జీవితం అని సమాధానం చెప్పుకుంటే, మన ఎదురుగా ఉన్న ప్రతి క్షణం ఎంత విలువైన సంపదో అర్ధం అవుతుంది కదూ. ఏ పాజిటివ్ ఎనర్జీ అయినా అందులో నుండే రావాలి. ఇచ్ఛ, ఆశ, ఆసక్తి పేరేదైతేనేం.. అన్నీ జీవితపు గమ్యానికి ఇంధనాలేగా! బాధని చూడని సంతోషమూ, తిమిరం తెలియని కాంతి, కుతూహలం పుట్టని జీవితమూ నిస్సందేహంగా నిస్సారమే. ఇవేవీ చూడకుండా ఎన్ని సోపానాలెక్కినా తెలియని అసంతృప్తి ఒకటి వెన్నాడుతుంది కానీ ఆనందం మాత్రం పుట్టదు.

కష్టమో, సుఖమో మనం నడిచే మార్గంలో ఎందరు తారస పడతారో, మనల్ని దాటి వెళ్ళే వాళ్ళు, మన అడుగులని జాగ్రత్తగా ఒడిసి పట్టుకునే వాళ్ళు, మన జతగా అడుగులు వేసేవాళ్ళు లేదా అసలు మన నడకనే ఆపేద్దాం అనుకునే వాళ్ళు.. ఇలా ఎంతమందో కదా?! కానీ వీళ్ళలో ఎందరు మనకి గుర్తుంటారు?! ఎందరి జ్ఞాపకాలు మనల్ని చుట్టుకుని ఉంటాయ్?!

కొన్ని మోసపు జీవాలని నమ్మేసి శలభాల్లా జీవితాన్ని కాల్చేసుకుంటాం. మనకి తెలియకుండానే మనల్ని అభిమానించే వాళ్ళని విస్మరిస్తాం. పరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపకాలే ఎంతో నయం. ఒక్కో సారి అవే పదిలం అనిపిస్తాయి కూడా. చిరపరిచితమొకటి మనల్ని అపరిచితంగా చూడటానికి మించిన గాయం ఏముందోయ్ జీవితంలో?

అసలు ఒకటి చెప్పు! ఈ క్షణం మనం చేసే పని ఏమిటి? గతాన్ని తలచుకోవడమో, లేదా భవిష్యత్ ఎలా ఉండబోతుందో అని తలలు బద్దలు కొట్టుకోవటమే కానీ ఇప్పుడేం చేస్తున్నావంటే సమాధానం ఉందంటావా? క్షణం తరువాత ఏమి జరుగుతుందో అన్న ఆందోళనతో ఇప్పుడు తనతో ఉన్న క్షణాన్ని కాల రాసుకోవడమే మనిషి నైజంగా మారిపోయింది. వాస్తవించే ఊహలు మోటివేషన్ ఇస్తాయి కానీ అలవిమాలిన ఊహలు, భ్రమల వెంట పరుగులు మనకిచ్చేది మాత్రం ఖాళీ చేయబడ్డ కాలం పాత్రనే.

జీవితం ఉంది ఎలాగోలా నడవటానికి కాదు. ఎలాగోలా అనటంలోనే ఒక రాజీ ఉంది. నీ జీవితం నీ కేంద్రంగా ఉండేలా చూసుకుంటే చాలు ఎలాంటి రాజీలు అవసరం ఉండదు. కానీ చాలా మంది జీవిత కేంద్రాలు మరెవరో… అక్కడే ఒక రాజీ ఆరంభమవుతుంది. ఒక జీవితం విచ్ఛిన్నమవుతుంది. అసంతృప్తి కొనసాగని రాజీ ఎప్పుడైనా తెలిసిందా? నాకైతే లేదు.

సిద్ధం చేసుకున్నవ్యూహాలు, పదును పెట్టుకున్న అస్త్రాలన్నీ వ్యర్ధం అయ్యే రణక్షేత్రం జీవితం మాత్రమే. నిజానికి వ్యూహాలు పన్నాల్సింది కాలం విసిరే అస్త్రాలని సమర్ధంగా అడ్డుకుంటూ దానితో పాటుగా ప్రయాణం చెయ్యటానికే. నిజానికి అసలు సమస్య అంతా జీవితాన్ని అతిగా ఊహించుకోవటంలోనే వస్తుంది. మనం సరళంగా ఉండాలంటే జీవితాన్ని సరళంగా చూడాలి తప్ప ఎక్కడెక్కడి సంక్లిష్టతలన్నిటినీ దానికి ముడేయ కూడదు. కాలంలో కలసిపోయిన గతాన్ని పట్టుకుంటే అదే ఊబిలో మనమూ కూరుకుని పోతాం కానీ అడుగు ముందుకు వెయ్యలేం కదా. గతం ఒక శిధిల కుబుసం. అక్కడ ప్రోది చేసుకున్న అనుభవాలని పాఠంగా మార్చుకోవాలి కానీ దాన్నో కేంద్ర బిందువుగా చేసుకుని దుఃఖసింధువుగా జీవితాన్ని మార్చుకోవటంలో వివేకం ఏముందిరా?


స్నేహితుడు

**** (*) ****