కవిత్వం

ఆ పాట

డిసెంబర్ 2015

డిసిన రాత్రి గడిచిపోయింది

నేను అదే తోటలో మరో కొమ్మకు వ్రేలాడుతున్నాను

నిన్నటి రంగులనే ఆకాశం మరలా పులుముకుంది

లోలోపలికి
వెలుతురు చొచ్చుకుపోతున్న నొప్పి

రహస్యంలో దాచినవేవో
కన్నులు దాటి జారిపోతున్నాయి

నేను తప్ప అన్నీ పుష్పించాయి

ఆ పాట వినబడుతూవుంది…

***

పదే పదే మనసును తడుతున్న చప్పుడు
తెరిచే ఓపిక లేక కూలబడిపోయాను

పువ్వులన్నీ వాడిపోయాక
ఏవరో ఈ తోటను కాల్చివేసారు

నడిచిన పాదాల గుర్తులు మాత్రం
ఆ మసిలో వెలుగుతున్నాయి

అదే పాట వినబడుతూవుంది…

***

మరో తోటలో
ఆ పాట వినబడుతూనేవుంది…