పాఠకులకు నమస్కారం.
డిసెంబర్ నుడి విజేత:
1. రాజా పిడూరి
ఒక తప్పుతో పూరించిన వారు:
1. రవి చంద్ర
2. నాగరాజు రామస్వామి
విజేతలకు అభినందనలు.
వాకిలి డిసెంబర్ నుడి పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
ఒకటి రెండు ఆధారాల సమాధానాలకు వివరణ యిస్తున్నాను. Cryptic clue లు గల పజిళ్లతో పరిచయం ఉన్నవారికి ఈ వివరణల అవసరం లేదు. అటువంటి పజిళ్లంటే యేమిటో బొత్తిగా తెలియనివారి కోసమే ఈ వివరణలు.
15 నిలువు దగ్గర చాలా మంది తడబడ్డారు.
దాని ఆధారం ఇలా ఉంది. వాదన సాధనమే కాని వంపు తిరిగి వుండదు (3). దీనికి సమాధానం కమాను. సమానం అని కొందరు, మీమాస అని కొందరు, సామాను అని కొందరు రకరకాలుగా పూరించారు.
వివరణ: కమాను = Bow of a violin. కమాను = Arch (ఇది వంపును కలిగి వుంటుంది)
20 నిలువు దగ్గర కొందరు తడబడ్డారు.
ఆధారం ఇలా వుంది. ఈ చెట్టు తల్లుల తడబాటు (3). దీనికి జవాబు తమాల.
వివరణ: తల్లుల = మాతల. తల్లుల తడబాటు = తమాల = ఒక రకం చెట్టు (కానుగ)
2 నిలువు నిజానికి కఠినమైన ఆధారం. కాని grid pattern అలా ఉన్నందుకు జవాబు (వంచన) సులభం అయిపోయింది. ఎందుకంటే సమాధానంలోని ప్రతి అక్షరమూ లింక్ అక్షరమే.
ఆధారం ఇట్లా వుంది. మాచన మాను వంచేస్తే మోసమే (3).
వివరణ: ‘మా’ను ‘వం’చేస్తే (అంటే ‘మా’ అనే అక్షరాన్ని ‘వం’ అనే అక్షరంగా మార్చితే ‘మాచన’ ‘వంచన’గా మారుతుంది!)
ఇక 9 అడ్డం విషయంలో కూడా కొంత వరకు అదే జరిగిందనుకుంటాను. దీనికి జవాబు కిరికిరి.
వివరణ: ‘రికి’ రెండుసార్లు రివర్సు అయిందన్న మాట!
పాఠకులనుండి feedback మమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలదు కనుక, దాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
Congratulations రాజు.
‘నుడి’ పాఠకులకు క్షమాపణలు తెలుపుకోవలసిన అవసరం ఏర్పడింది కనుక తెలుపుకుంటున్నాను. 3 నిలువు, 15 నిలువు, 27 నిలువులకు కపోలం, తోమాల, మావటి అనేవి జవాబులు అయినట్టుగా ప్రచురితమైంది. నిజానికి మొదట్లో ఆ నంబర్లకు నేను తయారు చేసిన ఆధారలకు జవాబులు అవే. కాని, నుడిని కొంచెం కఠినం చేయాలని నేనూ ఎడిటర్ గారూ కలిసి నిర్ణయించుకున్నందున ఆ మూడు ఆధారాలను మార్చి కొత్త ఆధారాలను పంపాను. వాటికి సమాధానాలు పో,పో,పో (కపోలం కాదు), కమాను (తోమాల కాదు), దవనం (మావటి కాదు). కీ సొల్యూషన్ లో తదనుగుణంగా మార్పులు చేయవలసిందిగా ఎడిటర్ గారిని కోరాను. వారు మరిచిపోయినట్టున్నారు. ఈ తప్పులు దొర్లినందుకు క్షమించవలసిందిగా పాఠకులను కోరుతున్నాను. 3 నిలువు, 15 నిలువు, 27 నిలువులకు సమాధానాలు పో,పో,పో, కమాను, దవనం అని సవరించి చదువుకోవాలని నా విన్నపం. అయితే ఇవ్వబడిన ఆధారాలు కరెక్టే. విజేతలను నిర్ణయించటంలో దీనిమూలంగా ఎలాంటి అవకతవకలూ జరగలేదని హామీ యిస్తున్నాను.
ఎలనాగ గారు,
27 నిలువు “దవనం” – బదులు “దవని” కూడా సరిపోవచ్చుగా? వని – అంటే కూడా “అడవి” అనే కదా అర్థం? “దవని” ఒక వేళ సరైన సమాధానమని అంగీకరిస్తే, ఒక్క తప్పుతో సమాధానం వ్రాసిన వారిలో నా పేరూ రావాలి.
రవి గారూ,
గత నెల నుడి లోని 27 నిలువు ఆధారం ఇలా ఉంది: అడవి పైన కొంత మీద సువాసన గలది (3)
ఇందులో కొంత మీద అంటే ‘మీద’లోని ఒక అక్షరమైన ‘ద’ను తీసుకున్న తర్వాత అడవికి సమానార్థకమైన పదాన్ని కలపాలి.
వనం అన్నా వని అన్నా అడవే కదా అనే మీ argument సరైనదే కాని, ‘దవని’కి అర్థమేమిటి? సువాసన గలది అనే అర్థం వుందా ఆ పదానికి? దవనం సువాసన గల ఒక రకమైన ఆకు. మరువం దవనం అని సాధారణంగా జంటగా వాడుతారు ఆ పదాలను. ఒకవేళ దవనం, దవని రెండూ సమానార్థక పదాలై వుంటే అప్పుడు మీ సమాధానం కరెక్టు అయ్యేది.
ఎలనాగ గారు, మీ వివరణ సరిపోయింది. “సువాసన” గుర్తించక నేనే తొందరపడ్డాను. అన్యథా భావించకండి. రెండు లేదా మూడు తప్పులతో నేను కరెక్ట్.
వాకిలి ఎడిటర్లకి, గడి నుడి మార్చి సరియైనది పెట్టండి ప్లీజ్. కింద ఎలనాగ గారు వివరణ ఇచ్చారనుకోండి అయినా భవిష్యత్ లో ఈ శీర్షిక చూసే వాళ్ళకి కన్ ఫ్యూజన్ లేకుండా ఉండాలి కదా!?
రాధ గారూ,
నిజమే. నేనిచ్చిన వివరణ ఇప్పటికి సరిపోయినా భవిష్యత్తులో దీన్ని చూసి పాఠకులు confusion కు గురయ్యే ప్రమాదముంది కనుక సరిదిద్దే మార్గాన్ని అన్వేషించటం కోసం ఎడిటర్ గారితో సంప్రదిస్తున్నాను. మార్చమని సూచించినందుకు మీకు నా కృతజ్ఞతలు.
నిజానికి ఈ పొరపాటులో నా భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. మార్చిన మూడు ఆధారాలను, జవాబులను ఎడిటర్ గారికి చాలా ముందుగా పంపాను. నేను మళ్లీ గుర్తు చేయవలసింది. నిర్వహణ నాదే కాబట్టి, డిసెంబరు చివరి వారంలో corrected key solution ను తెప్పించుకుని చెక్ చేసుకోవలసిన బాధ్యత నాదే. ఈ విషయంలో ఎడిటర్ గారికి embarrassing situation ను కలిగించినందుకు క్షంతవ్యుడిని.
నెట్ ప్రపంచంలో అలాగే ఉండిపోతాయి కదండీ మన ఒప్పులైనా, తప్పులైనా… తెలిసినప్పుడు మార్చుకుంటే మంచిదని.. అంతే.
నిలువు 15 – వాదన సాధనం అన్నది తప్పుగా తోస్తోంది. వాద్య సాధనం అవ్వాలి. వాదన అంటే వాదం కి సంభందించినది కద.
సౌమ్య గారూ,
వాదన అంటే వాదంకి సంబంధించినది కద – అన్నారు మీరు. కాని, సరైన భాష ప్రకారం వాదం వేరు వాదన వేరు. Argument ను సూచించడానికి వాదన అనే పదాన్ని మనం వ్యవహారంలో వాడుతాం కాని, దానికి సరైన పదం వాదమే. కోర్టులలో జరిగే arguments and counter arguments ను వాదప్రతివాదాలు అనాలి తప్ప వాదన ప్రతివాదనలు అనకూడదు. అయితే, అతడు తన వాదనను విపించాడు, ఆమె వాదన ప్రకారం…. – ఇట్లాంటి వాక్యాలు వాడుక భాషలో ఉన్నప్పటికీ అవి సరైనవి కావు. వాదన(ము) అంటే సంగీత వాద్యాలను వాయించటం. ఉదాహరణకు వీణా వాదనం, సరోద్ వాదనం. వైలిన్ వాదనం, తబలా వాదనం మొదలైనవి. ప్రామాణిక నిఘంటువులలో వాదనము, వాదము అనే పదాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటి అర్థాలు వేరువేరు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమంటే, వాదన సాధనం అనకుండా వాదనా సాధనం అని ఇచ్చివుంటే పాఠకుల దృష్టి అటు మళ్లేదేమో. కాని, నపుంసక లింగానికి చెందిన నకారాంత పదాలతో సమాసాలను ఏర్పరచినప్పుడు పూర్వపదం లోని చివరి అక్షరానికి కొన్నిసార్లు దీర్ఘం వస్తుంది, కొన్నిసార్లు రాదు అని మాత్రమే తెలుసు తప్ప, ఏ సందర్భంలో వస్తుంది, ఏ సందర్భంలో రాదు అనే విషయమై స్పష్టత లేదు. ఈ సందేహాన్ని తీర్చడానికి వ్యాకరణ సూత్రం ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. పండితులెవరైనా ఈ విషయంలో స్పష్టతను ఇస్తే వారికి మనం కృతజ్ఞతలను తెలుపుకోవచ్చు. ఒకవేళ అవి స్త్రీలింగాలైతే మాత్రం తప్పక దీర్ఘం రావాలి. ఉదాహరణకు వేదనా భరితం, రచనా సామర్థ్యం. వాదన(ము) నపుంసక లింగానికి చెందిన పదం. ‘వాదన సాధనం’ను మనం అసమాసంగా కూడా భావించవచ్చు. సమాసం కానప్పుడు దీర్ఘం వచ్చే ప్రశ్నే లేదు. బహుమతి ప్రదానం అన్నది సమాసం కాని రూపమైతే బహుమతీ ప్రదానం మాత్రం సమాసం అవుతుంది. ఇదీ నాకు తెలిసిన విషయం.
వాదన సాధనం అన్నది సరైన పదమే! ఆలిండియా రేడియో భాష విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ అనౌన్స్ మెంట్లలో కూడా “ఫలానా వారి వీణా వాదనం, శాక్సో ఫోన్ వాదనం” అనే వాడతారు.
“వాదన” అనే పదానికి పత్రికాభాషా నిఘంటువు, (తె,వి) లో “(న్యాయస్థానంలో) తర్కబద్ధంగా చేసే అభిప్రాయ ప్రకటన ఆర్గుమెంట్” అనే అర్థం మాత్రమే ఉంది. మీరు “వాదనము” అనే మాటకి మువర్ణకలోపంతో ఆధారం ఇచ్చారనిపించింది. భమిడిపాటి రామగోపాలం గారి సరదా కథల సంకలనంలో ఈ మాటకి ఉన్న అపప్రయోగం గురించి ఒక కథే (తెలుగు టివి. “వాదన”) ఉంది.
దానిలో ఆయన వాదన అనే మాటను వాదనము అనే సంస్కృత మాట నించి తెచ్చేరనీ, దాన్ని కూడా హిందీ ద్వారా తీసుకొచ్చారని రాశారు. అయినా ఇలాంటి ప్రహేళికలలో వ్యాకరణాన్ని, భాషాసూత్రాలని ఎంతవరకు అవసరమో అంతవరకే పట్టించుకోవాలేమో! సందర్భాన్ని బట్టి, మిగతా ఆధారాలను అనుసరించి వెళ్ళాలి కాని మరీ తర్కం కూడదేమో! (శ్రీ శ్రీ గారి లాత్వం ఆధారం దానికి ‘ల్’ జవాబు మనకందరికీ గుర్తున్నవే కదా! )
రాజా పిడూరి గారూ,
సౌమ్య గారు వెలిబుచ్చిన సందేహానికి నేనిచ్చిన వివరణలోని ఒక భాగం మీద వ్యాఖ్య చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. భాషా విషయాల పట్ల నాకున్న మిక్కుటమైన ఆసక్తే నా చేత అటువంటి వివరమైన వివరణలను ఇప్పిస్తోంది. అంతే కాక, భాష బాగా తెలిసినవాళ్లెవరైనా నా అనుమానాలను తీరుస్తారేమోనన్న ఆశ ఒకటి. ఉదాహరణకు వాదన సాధనం అనాలా, లేక వాదనా సాధనం అనాలా? పాఠకులను తికమక పెట్టడం ప్రహేళికలలోని ముఖ్యాంశాలలో ఒకటి కనుక, ఎట్లా ఇచ్చినా ఫరవా లేదనిపించే వెసులుబాటు నాకు ఉండటం అదృష్టం అనుకుంటున్నాను.
తెలుగులో మనకు ఎన్నో నిఘంటువులు ఉండటం, వాటిలో uniformity లేకపోవడం చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో నేను ఎక్కువ సార్లు శబ్దరత్నాకరంనే ప్రామాణికంగా తీసుకోవలసి వస్తున్నది. ఆ కారణంగానే argument ను వాదన అనకూడదని చెప్పాను. పజిల్ లో కాక మామూలు రచనలలో వాదన అనే పదాన్ని నేను కూడా అదే అర్థంలో వాడుతాను. అది వేరే విషయం.
మనకి హాయిగా అన్ని డిక్షనరీలు ఉన్న ఆంధ్రభారతి ఉందిగాండీ… అక్కడ చూడటం ఈజీ కూడానూ… అయితే ఈ గడినుడి నెలకొకటి కాకుండా వారానికొకటి ఉండే బావుండు అనిపించేంతగా బావున్నాయి. థాంక్ యు సో మచ్
అన్ని నిఘంటువుల సమాహారం అనతగిన ఆంధ్ర భారతి online లో దొరుకుతుండటం నిజమే. అయితే పత్రికాభాషా నిఘంటువు, ఆచార్య జి. ఎన్ రెడ్డి పర్యాయపద నిఘంటువు, శంకర నారాయణ నిఘంటువు మొదలైన వాటిని ప్రామాణికంగా తీసుకోవచ్చా అన్నదే సందేహం.
ఇక చక్కని కథారచయిత్రి అయిన మీరు నా క్రాస్ వర్డ్ పజిళ్లు చాలా బాగున్నాయనటం నాకు ఎంత సంతోషాన్నికలిగిస్తున్నదో చెప్పలేను. మంచిమంచి కామెంట్లను పెడుతూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు అనేకానేక కృతజ్ఞతలు. మిగతా కవులు, రచయితలు స్పందించకపోవటానికి కారణం తెలియటం లేదు. ఈ పజిళ్లు వారిలో ఆసక్తిని రేకెత్తించటం లేదో, లేక ప్రతి వొక్కరూ These are not my cup of tea అని అనుకుంటున్నారో అంతు చిక్కటం లేదు!