ప్రత్యేకం

సుతి మెత్తని సవ్వడి

జనవరి 2016

“ఒక్క నీటి చుక్కనీ కనపడనీయని వేదన మనసంతా గుర్రపు డెక్కలా పరచుకొని…”

అడుగుతారు; ఏమిటీ, ఏమైందీ అని దీర్ఘాలు తీస్తూ.

ఏమో తెలీదు, ‘ఏదో’ దిగులు అంటావు. ఏం చెబుతావు?! ‘ఏదో’ వెనుక దాక్కుందామని ప్రయత్నం.

నిష్ఠుర సత్యాన్ని ‘ఏదో’ వెనుక దాచి చెప్పే ప్రయత్నమే నేమో కవిత్వం.

ఏదీ దిగులు? ఎక్కడ? కనిపించదేం? నువ్వు బానే వున్నావే అని అడుగుతారు, నువ్వు చెప్పేదంతా అబద్ధమని అన్యాపదేశ రీతిలో స్ఫురింపిస్తారు. బహిష్కరించ జూస్తారు కవిని.
అంటారు గాని, కవులేమంత నిరంకుశం కాదు. చాల హంబుల్ కూడా.

ఆ ‘ఏదో’ దిగులును కాస్త తీసి చూపించాలనే అనుకుంటావు వాళ్లకి.

చూపించ లేవు. దాని మీద దట్టమైన గుర్రపు డెక్కలా వేదన. ఇదిగో, ఇది నీరు, ఇది కొలను అని ఎలా చూపిస్తావు, ఆకుల కింద అంతా నీరే నని, కన్నీరే నని?

భూమిలో ఇంకిపోయిన వాన చినుకు వంటి దిగులుని ఎలా చూపిస్తావు? చూపించలేవు.

దిగులును బయటికి కనపడనీయని దళసరి వేదన. నీటిని కనపడనీయని గుర్రపు డెక్క.

కొలను నీ కన్ను. నా కన్ను కూడా.

1.

ఈ పుస్తకం పేరు ‘ఆవిరి’.

ఆవిరి అంటే నీరే.

ఆహాఁ! అలాగా! నిజమా? నువ్వు చూశావా ఆవిరిని? ఆవిరి లోని నీటిని? ఆవిరి కనబడదు. వినబడదు. ఫీలవుతావు. అది గాలి కాదు. కేవలం గాలి కాదు. ఇంకేదో వుంది. భగవంతుని వలె అనుమాన ప్రమాణం కూడా కాదు. అంతకన్న గట్టి ప్రమాణమే. కేవలం బౌద్ధిక ప్రశ్నావశేషం కాదు. వాస్తవికం. పాదార్థికం. ఆవిరి వుంది. ఒక్కో సారి… టి.ఎస్. ఎలియట్ ‘మరుభూమి’లో మాదిరి ఇళ్ల కిటికీల అద్దాలకు వీపు రాసుకుంటూ కొంచెం కనిపించవచ్చు. కాని, కనిపించే ఒక రూపమంటూ లేదు ఆవిరికి.

మనస్సు సంగతీ అంతే. మనస్సు వుంది. లేదని ఎవరూ అనరు. మరీ మనసు లేని వారయితే తప్ప.

మనస్సు వుందనే అందరం అంటాం.

ఉందా? ఏదీ? ఒక చిటికెడు మనస్సును తీసి చూపిస్తారా? ఎంత గొప్ప మైక్రోస్కోపులోనైనా, ఎన్ని నిలువు కోత అడ్డు కోత పటాల్లోనైనా చూపించగలరా? చూపించలేరు, అయినా మనస్సు వుంది.

ఇదిగో స్వాతి కుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా…. మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి.

నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానం లోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవలం అన్న కోసం కాదు, గులాబీల కోసం కూడా. ముఖ్యం గులాబీల కోసమే.

2.

కనిపించాల్సిన అవసరమే లేనిది… తాకీ తాకగానే లోపలికి ఇంకిపోయి, తిరిగి, లోపల్నించి బయటికి చల్లని లావా వలె పెల్లుబికేది… మరొకటి వుంది. అది సంగీతం.

ఈ పుస్తకంలో చాల చోట్ల సంగీతం అక్షరమై కనిపిస్తుంది. కనపించకుండా అంతటా వినిపిస్తుంది.(బయటికి చదవక్కర్లేకుండానే పద్యాల్ని వినొచ్చు). దానికి సంబంధించిన ‘హింట్’ కూడా వుంది, పుస్తకం మొదట్లోనే.

“ఏకాంతం సంగీతంగా మారే సుతి మెత్తని సవ్వడిని నింపుకోడానికి సంచీ లోని సంపదనంతా ఒలకబోసుకున్న వాడి”కి నివాళి కదా ఈ పుస్తకం, ఈ పద్యాలూ!

ఇంకేమీ వద్దు. ఆ సుతిమెత్తని సవ్వడి తప్ప, ఆ సాలిట్యూడ్ తప్ప… ఆ వినిపించే నిశ్శబ్దం తప్ప ఇంకేమీ వద్దు. ఆ సవ్వడిని నింపుకోడానికి ఒక సంచి కావాలి. జీవితమే సంచి. దానిలో ఆ సవ్వడికి స్థలం వుండాలి. సంచిలో ఖాళీ ఏర్పడాలి. ఇంకేమీ వద్దు అని కచ్చితంగా అనుకుని ఖాలీ చేసుకోవాలి. అలా ఖాళీ చేసుకుని, సుతి మెత్తని సవ్వడితో బతుకు సంచిని నింపుకుని చిద్విలాసంగా జీవించే వాళ్లుంటారు. వాళ్లు ఈ కవయిత్రికి తెలుసు. తెలుసు అనడానికి ఇందులో ప్రతి పద్యమూ సాక్ష్యమే.

సుతి మెత్తని సవ్వడిని సృష్టించే వాటిలో ‘ఊపిరి’ని మించినది ఇంకేదైనా వుందా?

లేదు.

ఊపిరి అంటే (శ్వాస కోశాల) గాలి. ఊపిరి అంటే ప్రాణం. ఊపిరులూదడం అంటే ప్రాణం పోయడం. న్నిజ్జంగా ఊపిరులూదే సందర్భం- సంగీతంలో- వేణువు. ఊపిరి వేణువు ప్రాణం.

వేణువుది “ఊపిరి పాట”. మహాబలి పురంలో ఒక “వేకువను వణికించే వేణువు”ను చూసిందీ కవయిత్రి. “రాత్రులను కళ్లుగా చేసుకు”న్న వాడిని, “చీకటి” తన “తోబుట్టువై”న వాడిని చూసిందీమె. “చూసిందా? కాదు”ట, “కరుణించి కనపడ్డాడ”ట అతడు తనకు. అతడు ఈమె కొక రహస్యం చెప్పాడు. “గుళ్లోకి రావేమ”ని అడిగితే, “పంచేంద్రియాలకు అందని పరవశంతో గుస గుస”లాడాడు, “రగస్యం స్వామీ! ఎనక్కు ఇంగెయే దరిసమాగుం” అని.

“రహస్యం స్వామీ, నాకు ఇక్కడే దర్శనమవుతుంది / అని నమస్కార ముద్రతో తడుముకున్నాడు/ వేణువు వొంటి పైన ఏడు కళ్లనీ….”

వారెవ్వా! ఎవరండీ అంటారు, ఆయనకు కళ్లు లేవనీ, ఏడు కళ్లూ అయనవే. (సత్యం సప్త భంగి అని ఎక్కడో చదువుకున్న జైన సూత్రం ఇక్కడ గుర్తుకు వచ్చినా, నాకేమీ అసందర్భం అనిపించ లేదు). “ఏకాంతం సంగీతంగా మారి”న సుతిమెత్తని సవ్వడితో అతడి సంచీ నిండిపోయి వుంది. అదే పాట లోపలి ఊపిరి, పాట లోని ప్రాణం. అట్టాంటి “పాటకు చూపేదీ?” అని ఎలా అడుగుతారు? చూపు అంటే ‘దర్శనం’ (తాత్విక దృష్టి) కూడా. ఆ ‘ఊపిరి పాట’లో చూపు వుంది. చర్మ చక్షువులకు చూపులనిచ్చే చూపు.

3.

మలుపు అని ఒక పదం వుంది. “టర్నింగ్ పాయింట్’కు తెలుగు. ఒకటి రెండు మలుపులయినా లేకుంటే కథ ఏం బాగోదు. మనకు తెలీకుండానే కథలో మలుపు కోసం ఎదురు చూస్తాం. మలుపు ఎదురయ్యే వరకు కాస్త అసహనంగా కూడా వుంటాం. మలుపు వల్లనే కథ కథ అవుతుంది. దేర్ఫోర్, మనం ఎదురు చూస్తున్నది మలుపు కోసం కాదు, కథ కోసమే అని లాజిక్. రివర్స్ లాజిక్. ఈ రివర్సల్ ని నేటి బతుకు డొల్లతనాన్ని చెప్పడానికి స్వాతి కుమారి వుపయోగించుకున్న తీరు బలే బాగుంటుంది. “ఎక్కడో ఒక చోట కథ ఎదురవడమే మలుపు” అంటారామె. మొదట అదేంటి అలా అంటారూ అనిపించి, ఆ వెంటనే ఔను కదా, జీవితం ఇదే కదా అనుకుంటాం మనలో మనం.

“ఒక పొడుగాటి విరామంగా/దారి పొడుగునా ముగింపులుగా”, ఇక చాలిద్దాం అనిపించేలా జీవితం కొనసాగు…తూ…. వుంటుంది. ఇదంతా “కత్తిరించిన మొక్కల మధ్య కాసేపు నడిచిపోవడం”గానే వుంటుంది. దీనికి అంతం ఎప్పుడబ్బా, ఏమీ జరగదా, ఏదైనా జరిగితే బాగుండు అని జీవికి విసుగేస్తూ వుంటుంది. ఈ విసుగుతో పాటు, ఇక, “చుట్టూ ఒక తోట (కూడా) పెరిగితే, బయటికి దారేదని, (ఎంత) వెదుక్కున్నా (దారి) దొరకద”ని భయం వెన్నాడుతుంటుంది. అయినా, తోట పెరుగుతుంది, కత్తిరించిన మొక్కల తోట. చుట్టూరా ఎవరెవరో వస్తారు. ఏమేమో వస్తాయి. వాటి నుంచి బయటికి దారి లేక మొద్దుల్లా ఎద్దుల్లా ‘పని’ చేస్తూ వుండిపోతాం.

ఇలాంటి చోట మనం “అయిష్టాలేం లేకుండా ఏ పనైనా చెయ్యగల చేతగాని వాళ్లం” అంటారు కవయిత్రి. అదేంటి? ఏ పనైనా చెయ్యగలిగే వాళ్లం చేతకాని వాళ్లమెలా అవుతాం? అవుతాం. అయ్యాం. అయిష్టాలు ఏమీ లేవంటే ప్రత్యేకించి ఇష్టాలు కూడా ఏమీ లేవని అర్థం. మన ఇష్టాయిష్టాలతో పని లేకుండా యంత్రాల్లాగ ఏ పనైనా చెయ్యడానికి నిత్యం రెడీగా వుంటాం. మానసిక బానిసలం.

ఇలాంటి చోట మనుషుల మధ్య మాటలు కూడా ఎందుకు, వద్దులే అనిపిస్తుంది. “మాటలు లేకపోతే బాధ”. ఆ బాధను తీర్చుకోవచ్చు. కాని, “మాటలే వద్దు” అనుకునేంతగా మనుషుల మధ్య దూరం (ఎలియనేషన్) ఏర్పడితే? అదీ అసలు విషాదం.

ఈ విషాదం ఇద్దరి మధ్య కావొచ్చు, కొందరి మధ్య కావొచ్చు.

ఇలా చెబుతూ చెబుతూ చివరికి “ఇకపైన చాల కథలుంటాయి గాని/ వాటిలో మనుషులెవరూ వుండరు” అని గుండెకు గురి చూసి బాణం విసురుతారు కవయిత్రి. మనుషులుండరు అంటే, మనుషులు యంత్రాలయిపోయి వుంటారు.

ఇదే కదా, ఇంతే కదా నేడు బతుకు,

‘కత్తిరించిన మొక్కల మధ్య నడక’లే కదా, ‘అయిష్టాల్లేకుండా ఏ పనైనా చెయ్యడ’మే కదా, ‘మాటలు వద్దనుకునే విషాద’మే కదా…

దీన్నుంచి బయట పడలేమా?

“వేరే దారుల్లో తిరుగుతాం కానీ/ చివరికి ఈ తోటకి చేరకుండా తప్పి పోలేం” అంటారామె: ‘తప్పి పోలేం’ అనేది కీలక పదం. ఎద్దుల్లా మొద్దుల్లా నడుస్తున్న దారి నుంచి ‘డీవియేట్’ కాలేం. ఎక్కడెక్కడో తిరిగినా, తిరిగి మళ్లీ ఇక్కడికే వస్తాం అంటారు కవయిత్రి.. ఇది అజెర్షన్ కాదు, ప్రశ్న, ఈ ‘కత్తిరించిన మొక్కల’ తోట నుంచి తప్పించుకోలేమా అనేది. ఒకేసారి సామూహికమూ, వయ్యక్తికమూ అయిన ప్రశ్న. ఎవరికి వాళ్లం బుతకులో ఎప్పుడో ఒకసారి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్న. ఆ జవాబు వాళ్ల జీవితాల్ని నిర్ణయిస్తుంది.

‘ముందు మాట’ కవితలో కవయిత్రి వేసిన ఈ ప్రశ్న పుస్తకమంతా మెత్త మెత్తగా గుచ్చుకుంటూనే వుంటుంది, ఇంకోసారి గుచ్చుకుంటే బాగుండు అనిపించేంత అందంగా, చివరి పద్యం వరకూ.
అలా గుచ్చుకోవడంలోనే వుంది ఈ కవితల హిప్నాటిక్ శక్తి.

4.

“రాజీ ప్రయత్నాలన్నీ విజయవంతంగా విఫలమయ్యాక, దుఃఖం ఎలానూ దారిని మెలి పెడుతుంది కాబట్టి, తర్వాతి మలుపు కోసం కాస్త దాహాన్ని దాచుకుంటాను” అంటారు కవయిత్రి ఒక చోట (“మొగలి పొద నీడ కోసం”).
దారి సవ్యంగా లేదని చెప్పడానికి మెలికల దారి (tortuous way) అంటాం. జాగర్తగా చూసి వెళ్లాల్సి వుంటుంది. చాల ఓపిక అవసరమవుతుంది. అలా దారి మెలికలు తిరగడం వేరు, దారి మెలి పెట్టబడడం వేరు. దుఃఖం వల్ల కడుపులో పేగులు కదిలాయంటాం. పొట్టలో మెలి పెట్టినట్టయిందని అంటాం. ‘మెలి’. విపరీతమైన దిగులును స్ఫురింపించే పదం. ఇలాంటి పదాలు కల్పించే ‘సజెషన్స్’తో మన లోపలి మన దుఃఖాలు పెల్లుబికి గిర గిర తిరుగుతాయి.

పదాలకు అలాంటి శక్తి వుంది. అది మంత్ర వేత్తలకు తెలుసు, హిప్నాటిస్టులకు తెలుసు. హిప్నాటిస్టు ఒక పద్ధతిగా వాడే కొన్ని మాటలు మన లోపలి ‘పురా స్మృతుల’ను వెలికి తీస్తాయి. ఆ స్మృతులకు సంబంధించిన గాఢమైన అనుభూతికి లోనవుతాం. నిజంగా ఆ అనుభవాలు కలిగిన ఫీలింగ్ కి గురి అవుతాం.

పై వాక్యం చూడండి, వాక్యం ‘రాజీ…’ అని మొదలైనప్పటి నుంచి ఒక్కో పదంతో నిరాశ/నొప్పి కొంచెం కొంచెం యాక్సెంచువేట్ అవుతూ, ‘మెలిపెడుతుంది’ వద్ద కాస్త ఆగి మరీ సాగుతుంది. ఆ ‘తర్వాతి మలుపు’ కూడా దాహం తీర్చేది కాదు. అందుకే దాహం దాచుకోవాలని చిరు హెచ్చరిక. దాహం అంటే కోరిక. దాహం అంటే దాహానికి పుచ్చుకునే నీళ్లు, మజ్జిగ మొ. అని కూడా అర్థం. (‘ఎండన పడి వచ్చారు, కాస్త దాహం పుచ్చుకుంటారా?!’ అనే మాట విన్నారా?!)

ఇలా, ‘దాహం’ మాదిరి పదాలను వాటి అతి సహజ దైనందిన వ్యావహారిక రూపాల్లో వాడే విద్య ఈ కవయిత్రికి బాగా తెలుసు. అలాంటి పద సంచయాన్ని ఎక్కువగా వాడడం వల్ల, పనిగట్టుకుని పుస్తకం చదువుతున్నట్టు కాకుండా చుట్టూరా ప్రవహించే జీవితాన్ని మనం అందులో భాగమై చూస్తున్న భావన కలుగుతుంది.

5.

‘గాలి మళ్లింది’ అనేది లోతయిన బతుకు పరిశీలనతో కూడిన పద్యం. ప్రిటెన్షియస్ లోతు ఏమీ లేని గొప్ప పద్యం.

“ఇహనో, ఇపుడో వచ్చేస్తారు”. ‘ఇహనో, ఇపుడో’. “ఒక్కత్తినీ కదూ, ఇంత పెద్ద ఇంట్లోనూ…”. చివర్న ను దీర్ఘం సాగతీత. “దాటిపోయారు ఆ మనుషులు, ఆ రోజులిలా ఉండేవా”. ‘దాటిపోయారు ఆ మనుషులు’. పద్యంలో అలవోకగా దొర్లే ఇలాంటి మాటలు ఆ అబ్బాయిని కాదు, మనల్ని తీసుకెళ్లి ఆ పెద్దామె ఇంటి వసారాలో కూర్చోబెడతాయి.

ఇంతా చేసి, ఆమె పెద్దామె అని, అతడు అబ్బాయి అని, అది వసారా అని కవయిత్రి చెప్పలేదు. పద్యంలో అడుగడుగునా వ్యక్తమయ్యే యాంబియెన్సుతో మన మనస్సుకు తెలిసిపోతుంది.
ఇక్కడ మరొక మాట చెప్పాలి. ఏదేనా మాట్లాడాలని… … ప్రత్యేకించి ఎవరో ఒకరితో అని కాదు, ఎవరితోనైనా సరే ఏదైనా మాట్లాడాలని వయసు మీరిన వాళ్లు అశ పడతారు. చాల నేలబారుదై వుండీ ఒక పట్టాన తీరని జాలి గొలిపే ఆశ ఇది. దాని పక్కనే, ఈ సొద మనకెందుకురా బాబూ అని తప్పించుకుపోజూచే యువ వయస్కుల మసస్తత్వమూ వుంటుంది. ఈ రెండింటినీ చాల గొప్పగా, చాల ప్రేమగా, చాల సహజంగా చెప్పారు ‘గాలి మళ్లింది’లో కవయిత్రి.

ఈ పద్యమే కాదు. దాదాపు అన్ని పద్యాలు ఇంత హోమ్లీగా, ఎవరు చదువుతుంటే వారి ఆత్మలకు చేరువగా, ఆత్మీయం;గా వుంటాయి, చదివాక, వాచికంగా కొంత, వాచికం అక్కర్లేని అనుభూతి కెరటాలుగా అత్యధికం… స్వాతి కుమారి కవిత్వం మనతో వుండిపోతుంది.

6.

ఏం జరిగినా అనుకోకుండానే జరుగుతుంది. అనుకుని జరిగేవి చాల తక్కువ. అసలుండవు.

‘నువ్వు అనుకున్నది జరుగుతుంది, కాని నువ్వు అనుకున్నట్టు కాదు’ అంటాడు ఆర్ ఎస్ సుదర్శనం నవల ‘సంసార వృక్షం’లో ఒక స్వాములోరు. ‘నేను’ అనుకున్నట్టు జరగకపోతే, ఇక అనుకున్నది జరిగితేనేమి జరగకపోతేనేమి అనిపిస్తుంది, బాధేస్తుంది.

కాని, అదంతే. జరిగేవన్నీ అనుకోకుండానే జరుగుతాయి. అప్పటికప్పుడు మాత్రం, ఏదీ జరరగదనే అనిపిస్తుంది. స్పార్టకస్ అని ఓ గొప్ప గ్రీకు వీరుడున్నాడు. బానిసత్వం అనేది వుండగూడదని యుద్దానికి తెగించాడు. బానిసల్ని కూడగట్టాడు. వాళ్లందరితో పాటు తానూ రహదారి కిరువైపులా రాటల మీద శిలువ కొట్టబడి ప్రాణాలు వదిలాడు. స్పార్టకస్ అనుకున్నది జరగలేదు.

జరగలేదా? బానిసత్వం పోయింది కదా?!

జరిగిందా? బానిసత్వం పోయిందా?

బానిసత్వం పోవడం ఇప్పటికే జరిగింది, ఎంజాయ్.

లేదు, ఇంకా జరగాల్సి వుంది. ఫైట్.

ఈ సత్యపు సప్తభంగిత్వాన్ని, ఉండడం ఉండకపోవడం అనేవి కలగలిసిపోవడాన్ని చాల అలవోకగా, ‘అనుకోకుండా’ పలవరించారు కవయిత్రి.

ఇదొక కాలమ్. ‘కినిగే’ అనే అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి రాసిన కాలమ్. కాలమ్స్ అన్నీ ఇద్దరి మధ్య సంభాషణలు.

ఆ ఇద్దరు ఎవరు? మనిషీ, భగవంతుడూనా? ప్రేయసీ ప్రియులా? జస్ట్ ఏ ఇద్దరయినా నా? ఏమైనా కావొచ్చు. ఆ ద్వంద్వాల మధ్య పెద్ద తేడా లేదు.

ఆ ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు. కలుసుకోడానికి నిరంతరం మేల్కొని వుంటారు,

“చిన్నోడా! తడి చెంపలని ముద్దాడడానికి నీకున్న ధైర్యం సరిపోదు. ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు. భయం లేదులే. ఈ రాత్రి ఎక్కడికీ పోదు. మనిద్దరం చెరో కొసలో ఇలా మేల్కొని వున్నంత కాలం”
ఎక్కడికి పోతుంది రాత్రి, ఇలా ఇద్దరూ మేల్కొని వుంటే. అదీ, కలిసి మేల్కొని వుండడం కాదు. రాత్రికి ఒక కొసన ఒకరూ ఇంకో కొసన ఇంకోరూ.

‘అనుకోకుండా’ కాలమ్స్ అంతటా ఇదిగో ఇలా టాంటలైజ్ చేసే దృశ్యాలే. ఇద్దరు. ఆ ఇద్దరు నిజంగా ఒక్కటైపోతే…? ద్వంద్వత్వం సమసిపోతే…? స్వాతి కుమారి మరో చోట అన్నట్లు ‘వెన్నెల వెల్లువే’ కదా?!
భలే ఛాలెంజ్ కదూ?!

వెల్లువలెత్తిన వెన్నెల కావాలా? తడి చెంపలమీద ముద్దు కావాలా?

అది కావాలంటే ‘నువ్వు’ చాలా నేర్చుకోవాలి.

మళ్లీ అడుగుతారేమో, నువ్వంటే ఎవరని? రవీంద్రుణ్నీ కూడా ఇలాగే అడిగి వుంటారు. ఆయన అర్థం చెబుతూ కూర్చో లేదు. లలిత లలితంగా పాడాడంతే, పిల్లల్నించి నేర్చుకొమ్మన్నాడంతే.

ఈమె కూడా అంతే. ఎవరికో మనమంటే ఇష్టమై, ఎవరు తప్పు చేసినా మనల్నే “ఎండలో నిల్చోబెట్టినప్పుడు, ఉన్నఫళాన కుడి వైపుకు పరిగెడితే ఏ వూరొస్తుందా అనిపించి, ఆ వూర్లో కొన్నాళ్లు రహస్యంగా పొలాల్లో నిద్రపోయినట్టు ఊహించుకునే లోపు బడిగంట మోగు’తుంది. నా మట్టుకు నాకు ఎడమ వైపు పరిగెడితే ఏ వూరొస్తుందా అనిపించింది అప్పుడు. ఒక్కొక్కరు ఒక దిక్కుకి. దిక్కుల్లోనే తేడా,

ఎట్టాగూ ఎండలో నుంచున్నారు. బడి గంట మోగే లోపు మీరూ పరిగెట్టండి మీ మీ ఊహల్లోనికి, స్వాతి కుమారి మాటల సాయంతో, వెన్నెల పొలాల్లోనికి.

(ఆవిరి సంపుటికి రాసిన పరిచయ వ్యాసం నుండి)

**** (*) ****

For book copies:
e-Book and printed copies: http://kinige.com/book/Aaviri
Topudubandi: Sheik Sadiq Ali, 9346108090, On whatsup 9505686837
J.V Publishers: jyothivalaboju@gmail.com, ph:8096310140