‘ సత్యభామ పప్పు ’ రచనలు

గుల్జార్ కవితలు రెండు

అదేదో నాక్కూడా కాస్త నేర్పగూడదూ?

చాలా సార్లు గమనిస్తూంటాను -
ఒక దారం ఐపోతుందా,

ఇంకో దారమేదో తెచ్చి కలుపుతావు
ఇంకో దారం చిక్కుపడుతుంది, ఓర్పుగా విడదీస్తావు
మరో దారం తెగిపోతుంది, నేర్పుగా ముడివేసి ముందుకు సాగుతావు
నీ అల్లికలో ఒక్క ముడి గానీ, ఒక్క చిక్కుగానీ వెతికినా కనిపెట్టలేరెవరూను

నేను ఒకే ఒక్కసారి అల్లాను ఒక ప్రేమని! ఒక బాంధవ్యాన్ని!
నా అల్లికలో చిక్కులూ ముడులూ ఖాళీలూ అన్నీ తేటతెల్లంగా కనపడిపోతూ ఉంటాయి..

నీ రహస్యమేంటో నాకు తెలిస్తేనా!

 

వీడ్కోలు

శ్రుతి చేసిపెట్టిన వీణ నుంచి
ఠంగ్ మంటూ అపశ్రుతితో తెగిపోయిన తీగెలాగ

పూర్తిగా »

గుల్జార్ కవిత: చిన్న గొడవ

01-ఫిబ్రవరి-2013


క్షణకాలపు మనస్స్పర్థ
గోడలకు తగిలి
భళ్ళున పగిలి
నేలంతా పరుచుకున్న
నిందల గాజు పెంకులు..

మండుతున్న మాటల సూదులూ
శూలాలూ ఎగిరి వెళ్ళి
చూపులోకి మాటలోకి
స్వరంలోకి ఆలోచనలోకి
ఊపిరిలోకి ప్రతి వస్తువులోకీ
అణువణువునా దూరిపోయాయి
ఆరోజున

అలా ఆ బంధం రక్తసిక్తమైపోయింది

ఆ రాత్రి నేలమీద పడున్న
ఆ మాటల గాజుముక్కల్ని ఏరుకుని
ఎవరో తమ రక్తనాళాల్ని కోసేసుకున్నారు
సడీ చప్పుడూ లేకుండా.
ఎవరైనా లేచి వస్తారేమోనని
భయం కాబోలు.
హిందీ మూలం: గుల్జార్
తెలుగుసేత: సత్యభామ పప్పు


పూర్తిగా »

దాగుడుమూతలాట

25-జనవరి-2013


కాలం కళ్ళకి గంతలు కట్టి
రాత్రి, పగలు,
చందమామ, నేను
దాగుడుమూతలాడుకుంటున్నాం

వెలుగులు తోసేస్తే
నేలమీద పడిపోయిన నీడలాగ
నేను కూడా
దూరంగా పడిపోయాను

పరిగెట్టుకుంటూ వెళ్ళి
స్తంభాన్ని ముట్టుకుని
పడిపోయే లోపు కాలం
“దొరికాడు దొంగ” అంటూ
నన్ను పట్టేసుకుని
తన కళ్ళగంతలు విప్పేసుకుంది.

హిందీ మూలం: గుల్జార్
తెలుగుసేత: సత్యభామ పప్పు


పూర్తిగా »