ముఖాముఖం

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

మార్చి 2016

నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల

1. మీ తల్లితండ్రులు, తోబుట్టువులు, బాల్యం, గురించి?

మాది చాలా పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములూ, నలుగురు అక్కచెల్లెళ్ళం. మా నాన్నగారు ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు. మాలో అన్నదమ్ములంతా పెద్దవాళ్ళు. మగపిల్లలు త్వరగా చేతికందిరావాలని వారిని చదివించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు. నేను కూడా బాగా చిన్నతనంలో స్కూలుకి వెళ్ళాను కానీ తర్వాత మా నాన్నగారు ఇంటి దగ్గరే చదువు చెప్పించారు. నాన్నగారికి బదిలీలు ఎక్కువగా అయ్యేవి. దానివల్ల మా చదువులు సరిగా సాగేవి కాదు. ఊరు మారినప్పుడల్లా కొత్త ఇంటి తో పాటు ఓ డాక్టర్ని, సంగీతం మాస్టారుని కూడా చూసేవారు నాన్నగారు. ఇక ఆడపిల్లల చదువుల విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఆయన. కానీ మేము తణుకు వచ్చే సరికి, అప్పటికి నాకు పదీపదకొండేళ్ళు ఉంటాయి, మా అమ్మ గొడవ పెట్టి అక్కడి బాలసరస్వతి స్త్రీ సమాజం అనే పాఠశాలలో చేర్పించింది. నన్ను మా చిన్న చెల్లినీ పంపారు. అక్కడ నా చదువు మరో మూడేళ్ళు సాగింది. అక్కడే నాకీ నాటకాలతో పరిచయమయింది. తోటి ఆడపిల్లలతో స్టేజి మీద చిన్న చిన్న నాటకాలు వేసేదాన్ని. అక్కడే నాకు హిందీ బాష కూడా అబ్బింది. హిందీ పరీక్షలు రాసి పాసయ్యాను. ఓ పరీక్ష ఫలితం పేపర్ లో రావడంతో నాకు ఇంకా శ్రద్ధ పెరిగింది. తణుకులోనే ‘రాష్ట్ర భాష’ వరకూ చదవగలిగాను. ఈలోపు మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఇక అక్కడి నుండీ నా చదువంతా ఇంట్లోనే సాగింది. మాస్టారుగారు ఇంటికి వచ్చి చెప్పేవారు. అప్పుడు ‘విశారద’ పాస్ అయ్యాను. ‘ప్రవీణ ప్రచారక్’ కు మాత్రం బెజవాడ మా అన్నయ్యగారింటికి వచ్చిన తరువాత అక్కడ కాలేజీలో చేరాను. అప్పుడే నాకు రేడియోతో పరిచయం అయ్యింది.

మాలో ఇద్దరు మగపిల్లలు తరువాత మధ్యలో ఒకమ్మాయి. ఆమెకి చిన్నతనంలోనే మా మేనత్త కొడుకిచ్చి వివాహం చేసారు. ఒక రకంగా బాల్యవివాహం. అప్పటికి మన రాష్ట్రంలో బాల్యవివాహాలు నేరం అంటున్నారని తెలంగాణాలో ‘మధిర’ తీసుకువచ్చి అక్కడ పెళ్ళి చేసారు. ఇక మా సంగతికొచ్చే సరికి నాన్నగారు రిటైర్ కావడం, పెద్దవారైపోవడం వల్ల పెళ్ళిళ్ళు కాస్త ఆలస్యంగానే అయ్యాయి. నాన్నగారు రిటైర్ అయ్యాకా మా ఊరు వెళిపోయారు. అక్కడ మా పొలాలు కౌలుకు తీసుకున్న రైతులు అక్రమంగా వాటిని తమ సొంతం చేసేసుకున్నారు. మిగిలిన వాటిని సగానికి తెగనమ్మి మొత్తం కుటుంబం అంతా బెజవాడ అన్నగారి దగ్గరకు వచ్చేసింది.

అమ్మ గృహిణి, ఇంత మంది పిల్లలతో ఆవిడకు సరిపోయేది. అయితే ఆవిడ నుండీ మాకు అబ్బిన మంచి గుణం ఏమిటంటే పుస్తకాలు చదవటం. మా అమ్మ బాగా పుస్తకాలు చదివేది. మా నాన్నగారు బదిలీల మీద ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి లైబ్రెరీ నుండీ పుస్తకాలు తెప్పించేసుకునేది. మామూలు వచనమే కాకుండా పద్యకావ్యాలు కూడా చదివి అర్థం చేసుకునేది. అలాగని పెద్దగా చదువుకోలేదు కూడా. చిన్నతనంలో ఏదో మిషనరీ స్కూలులో ఐదు వరకూ చదివినట్టు చెప్పేది. కొందరు పిల్లలు పుట్టి పోయారు, నాకు తెలిసే ఇద్దరు బిడ్డలు పోయారు. అప్పట్లో ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అవీ లేవు కదా! ఇక బతికిన తొమ్మండుగురు సంతానమూ, వాళ్ళ ఆలనా పాలనా చూస్తూనే తన అభిరుచిని కొనసాగించారు అమ్మ.

నా తరువాతి చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటున్నారు. చివరి చెల్లెలే ఆడపిల్లల్లో బాగా చదివింది. ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మమ్మల్ని కావాలనుకుని వచ్చి చేసుకున్నవే. నేనూ, శ్రీనివాసన్ గారూ ఇద్దరం ఇష్టపడి మా పెద్దలను ఒప్పించి చేసుకున్నాం. మగపిల్లలు నాన్నగారు ఆశించినట్టుగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడలేదు.

2. శ్రీనివాసన్ గారితో మీ వివాహం ఏలా జరిగింది?

మేము రేడియో స్టుడియోలోనే కలిశాం. అక్కడే పనిచేసేవాళ్ళం. ఆయన మంచి జోకులు చెప్పేవారు. నేను, సావిత్రిగారు, వీవీ కనకదుర్గ, ఇంకా మిగతా వారంతా పడిపడి నవ్వేవాళ్ళం. మేము భక్తి రంజని పాడుతుంటే ఆయన మురళి వాయించేవారు. అలా మాకు మంచి స్నేహం. మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ హాల్ దగ్గరి మైసూరు కేఫ్ కి టీకి వెళ్ళేవాళ్ళం. మా అమ్మవాళ్ళు పెళ్ళికి మొదట ఒప్పుకోలేదు, వాళ్ళు తమిళ అయ్యర్స్, మేము బ్రాహ్మిన్స్. వాళ్ళ వాళ్ళకు అసలు తెలీదు. శ్రీనివాసన్ గారు చెప్పడానికి ఇష్టపడలేదు. నెమ్మదిగా చెపుతాను అన్నారు. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాం. తర్వాత తెలిసాకా నెమ్మదిగా వాళ్ళలో కలుపుకున్నారు.

3. మీ రేడియో నాటకాల పట్ల మీ అమ్మగారు, నాన్నగారు ఎలా స్పందించేవారు?

నాన్నగారికి బహుశా ఆడపిల్లలు నాటకాలు వేయడం అన్నది ఇష్టంలేదు అనుకుంటా. అయితే స్టేజి నాటకాలే ఆయనకు తెలుసును తప్ప ఇలా మైకు ముందు ఎవరి పాత్రలు వాళ్ళు చదువుతారని ఎరగరు. ఇంతకీ ఆయన మనసులో ఏముందో నాతో ఎప్పుడూ అనలేదు. ఇదంతా నేను ఊహించుకోవడమే. ఆయన నా నాటకాలను ఎప్పుడూ వినలేదు. అమ్మ కి నేనంటే చాలా ఇష్టం. నేను హైదరాబాదులో ఉంటే తను బెజవాడలో ఉండేది. నన్ను చాలా మిస్ అయ్యేది. రేడియోలో నా మాట వింటుంటే నేనేదో దగ్గరకు వచ్చినట్టు ఉండేదామెకు. విని తెగ సంతోషపడిపోయేది. ‘ఎంత బాగా చేసావురా’ అని మెచ్చుకునేది.

4. మీలోని రచయిత్రికి ప్రేరణగా నిలిచిన రచయితలు, రచయిత్రులు ఎవరు?

నేనొక పెద్దరచయిత్రిని అనుకోవడంలేదు. అయితే కథలు రాయాలనే కోరిక ఉండేది. మా అమ్మాయి మెంటల్లీ ఛాలెంజ్డ్. ఏదన్నా ఆలోచన రాగానే పాప గుర్తుకు వచ్చేది, అక్కడితో ఆలోచన ఆగిపోయేది. అయినా పిల్లలకు సంబంధించి కొన్ని రచనలు చేసాను. ‘ఉత్తమ ఇల్లాలినోయి’, ఇంకా పేర్లు గుర్తుకు రావడం లేదు గానీ, అవి ఆంధ్రప్రభ, మహిళావాణి లాంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అయితే ఎక్కువగా రాయలేకపోయాను. చాలామంది ఈ రేడియో విషయాలను గురించి రాయమని అడిగారు. ఎప్పుడన్నా ఎవరి గురించైనా రేడియో సంగతులవీ మాట్లాడుతుంటే ఆ విన్నవాళ్ళు “అయ్యో ఇవన్నీ పుస్తకరూపం చేస్తే బాగుంటుందండీ” అనేవారు. ఆ విషయంలో నన్ను ప్రోత్సహించింది మాత్రం నా తోటి రేడియో ఆర్టిస్టు చిరంజీవిగారే. అలా రాసిందే ‘నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు’.

అసలు మొదట అనుకున్న దాని ప్రకారం అది నేను రాయాల్సింది కాదు. ఒక రచయిత్రి రాసిపెడతానంది. నేను కొంత రికార్డు చేసి కూడా ఇచ్చాను. నేను ఓ సంవత్సరన్నర చూసాకా, అప్పుడు చిరంజీవి గారు, “మీరు ప్రయత్నం చేసి చూడండి రాకపోతే చూద్దాం” అన్నారు. అనగా అనగా నాకే రాయాలని అనిపించింది. రాస్తూన్న కాలంలోనే ఒక యాక్సిడెంట్ లో చెయ్యి కాస్త దెబ్బతింది. పట్టులేక అక్షరాలు సరిగా వచ్చేవి కావు. అయినా పట్టుదలతో ఓ 80 పేజీల దాకా అయ్యాకా అది చిరంజీవి గారికే వినిపించాను. ‘అసలు రచయిత్రి రాసినట్టు వచ్చిందా’ అని నా సందేహం. ఆయన చాలా బాగా వచ్చింది ఆలస్యం చెయ్యకుండా రాయడం పూర్తి చేయమన్నారు. అప్పుడు ఆమెను పిలిచి ‘మీరు ఏమీ అనుకోవద్దు, నేనే రాసుకుంటాను’ అని చెప్పి రాయడం మొదలు పెట్టాను. మా చిన్న చెల్లెలు ఫెయిర్ కాపీ చేసి పెట్టింది.

ఇక ఇప్పుడు మళ్ళీ ‘చిరంజీవి సాహిత్య సమాలోచనం’ అనే పుస్తకం రాసాను. చిరంజీవిగారి వీధినాటకాలు, స్టేజి నాటకాలు, రేడినాటకాలు, నవలలు వీటి మీద రాసిన పుస్తకమది. దీనికి సహ రచయిత్రిగా మా చెల్లెలు పని చేసింది.

ఇక నాకు నచ్చిన రచయిత్రుల విషయానికి వస్తే రంగనాయకమ్మగారు, మాలతీ చందూర్, వాసిరెడ్డి సీతాదేవి, ఇక తర్వాత వాళ్ళల్లో వరలక్ష్మిగారు, ఆదూరి సీతారాం గారు వీళ్ళ నవలలైతేనేం, కథలైతేనేం చాలా ఇష్టంగా చదువుతాను.

మనల్ని ప్రభావితం చెయ్యడానికి పెద్ద గ్రంథాలే అవసరం లేదు. చిన్న కథ చదివి కూడా ప్రభావితం కావచ్చు. మొదటి నుండీ రంగనాయకమ్మగారి కథలు, నవలలూ నా మీద ఎక్కువ ప్రభావం చూపాయని చెప్పాలి. అలాగే మాలతీ చందూర్ పాఠకులను తన రచనలతో చాలా గైడ్ చేసేది. నా చిన్నతనం నుండీ ఆవిడ రచనల్ని కూడా ఎక్కువగా ఇష్టపడేదాన్ని.

5. రేడియో హవా తగ్గిన ఇప్పటికాలంలో మీరు పుట్టి ఉంటే మీ ఆసక్తులు మరెటువైపు మళ్ళేవనుకుంటున్నారు?

చెప్పలేనండీ. ఇప్పుడు పుట్టుంటే ఇపటి పిల్లలతో సమానం అయిపోయేదాన్నేమో, అప్పటి మనసుతో ఇప్పుడు ఆలోచించలేను కదా! నా కాలంలో రేడియో నాకు తగినట్టుగానే ఉంది. ఇప్పటి రేడియో అలా లేదనుకోవాలి. ఇప్పుడు ఎఫ్.ఎం స్టేషన్లు ఎక్కువ ఆదరణలో ఉన్నాయి. వాటిలో ప్రసారమయ్యేవి అధికం సినిమాపాటలే. నాకు సినిమా పాటలు నచ్చక కాదు. కానీ రేడియోలో అవి రావటం నచ్చదు. ఎందుకంటే రేడియో ద్వారా చెప్పేందుకు చేసేందుకు ఎంతో ఉంది. రేడియో ఆ కాలంలో ఎన్నో విషయాల్లో ప్రజల్ని చైతన్యపరిచింది. అలాంటి చైతన్య సాధనాన్ని రోజంతా సినిమా పాటలతో నింపేస్తున్నాం. ప్రజలకు సందేశం ఇచ్చేది తక్కువ, వారిని వినోదపరిచేది ఎక్కువగా తయారైంది పరిస్థితి. ప్రజలు కూడా వినోదానికే అలవాటు పడిపోయారు. మీరు మధ్యలో ఏదన్నా చెప్పడానికి చూస్తే “ఆ ఎప్పుడీగోలైపోతుంది, తరువాతి పాట ఎప్పుడేస్తారు” అన్న ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు. ఎప్పుడో ఓ పాట వేసేవారు. నాటకాలు, నాటికలు ఒకటేమిటి ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజలను చైతన్యపరచాలనే కోరిక బలంగా ఉండేది. అందులో కుటుంబ నియంత్రణ, అంటరానితనం నిరక్షరాస్యతల నిర్మూలన, ఆరోగ్యం, వైద్యం ఇంకా ఎన్నో విషయాల్లో వారిని ప్రభావితం చేసింది.

6. మీరు ఎన్నో నాటకాలలో నటించారుకదా మీకు నచ్చిన నాటకమేది?

అన్ని నాటకాల్ని ఇష్టం తోటే వేసాను. బాగా నచ్చిన నాటకం ‘సుప్తశిల’ నాటకం, తరువాత ‘పురూరవ’ నాటకం. ‘సుప్తశిల’ చాలా చిన్న నాటకం, పెద్దగా డైలాగులు కూడా లేవు అందులో, కానీ ఆ మాటలను చాలా బాగా రాసారు తిలక్ గారు. అందువల్లనో ఏమో, మిగతా ఏ నాటకమన్నా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించేది కానీ ‘సుప్తశిల’, ‘పురూరవ’ మాత్రం ఇక చెయ్యాల్సింది ఏమీ లేదు అనే తృప్తినిచ్చిన నాటకాలు.

7. లక్కాకుల సుబ్బారావుగారు అనువదించిన “రాజా ఇడిపస్” నాటకంలో “రాణి జొకాస్తా” పాత్ర మిమ్మల్ని వెంటాడిందని చెప్పుకున్నారు?

రాణీ జొకాస్తా ఇడిపస్ తల్లి. ఇడిపస్ పుట్టగానే ‘ఈ పిల్లవాడి పుట్టుక రాజ్యానికి అశుభం, జాతకం మంచిది కాదు, రాజ్యంలో ఎన్నో అరిష్టాలు జరుగుతాయి, కాబట్టి బ్రతకకూడద’ని చెపుతారు జ్యోతిష్యులు. రాజు చంపించేయమని చెపుతాడు బటులకు. పిల్లవాడిని తమ చేతులతో చంపడం ఇష్టంలేక అడివిలో మృగాలు తినేస్తాయని వదిలి వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఆ పిల్లవాడు ఓ తెగవాళ్ళకు దొరుకుతాడు. అక్కడ పెరిగి పెద్దయి వీరుడై ఆ తెగకు రాజవుతాడు. చుట్టుపక్కల మిగతా తెగలనన్నింటినీ జయిస్తూ ఈ రాజ్యం మీదకు దండెత్తుతాడు. రాజ్యాన్ని జయించి రాజును చంపేసి రాజ్యం చేజిక్కించుకుంటాడు. రాజ్యంలోని రాణులందరినీ తన వశం చేసుకుని జొకార్తాని కూడా పెళ్ళి చేసుకుంటాడు. ఆవిడకు పిల్లలను కంటాడు. అప్పటికి రాజ్యంలో విపరీత పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు రాజ పురోహితులు రాణికి పుట్టిన బిడ్డ వల్ల జరగాల్సిన విపరీతాలు ఇప్పుడెందుకు జరుగుతున్నాయని శోధన చేసి, రాజైన ఇడిపస్ జొకార్తా కొడుకే అని నిర్ధారిస్తారు. ఆమెకు ఈ విషయం తెలియగానే బాకుతో పొడుచుకుని చనిపోతుంది. తల్లిని భార్యను చేసుకున్నాని తెలియగానే ఇడిపస్ తన కళ్ళను పొడిచేసుకుంటాడు. ఇంత విషాదం నిండిన కథను నాటకంగా వేయడం, అందులో నేను రాణీ జొకార్తా కింద నటించడంతో నన్ను ఏదో గిల్టీనెస్ వెంటాడింది. అప్పటికి నా వయసు ముఫ్పైఐదు నలభై మధ్యలో ఉంటాయ్. ఆ తల్లి పడ్డ బాధనంతా నేను పడ్డాను చాలా రోజులు. నవ్వుతూ కూర్చున్న సమయాల్లో కూడా ఆ సంగతి గుర్తొస్తే నేను ఏదోలా అయిపోయి కాసేపు ఎవరితోనూ మాట్లాడలేకపోయేదాన్ని. అంటే ఒక వేషం వేసినప్పుడు దాన్ని ఒక రకంగా ఆవాహన చేసుకుంటాం. దానిలో జీవించాలని చూస్తాం. ఎంత మన ఒళ్ళు మనకు తెలిసి చేస్తున్నా, పాత్ర పడే బాధ మన మనసుకు పట్టుకుంటుంది. రాత్రులు నిద్రలో సడెన్ గా మెలుకువ రావడం లేచి కూర్చుంటే ఏవో ఆలోచనలు వెంటాడటం… ఇలా చాలా రోజులు కుదురు లేదు నాకు. ఇక ఈ బాధ పడలేక చిరంజీవి గారితో చెప్పాను “తీసేద్దామండీ ఈ నాటకాన్ని” అని. అంటే, “అదేమిటి ఇంత మంచి నాటకం, ఎంతమంది మెచ్చుకున్నారు. అది కేవలం నాటకం ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు” అన్నారు. కానీ నాకు కుదురులేదు. ఏలాగైనా తీసేయండంటూ ఆయనను సంవత్సరం పోరి చివరికి తీయించేసాను.

8. సినిమా అవకాశాలు వచ్చినా ఎందుకు కాదన్నారు?

నాకు ఆరంగం మీద ఆసక్తి లేదు. ఆ కెమెరాలు, ఆ హడావుడి నచ్చలేదు. సినిమా మీద ఓ మోజుండాలి. నాకు ఉద్యోగం మీద మోజుంది. అసలు పెళ్ళే వద్దనుకున్నాను.

9. అప్పటి రచయితలు, రచయిత్రులతో మీకు ఉన్న స్నేహం గురించి చెపుతారా?

నాకు యద్దనపూడి సులోచనారాణి బాగా తెలుసు. దాదాపు నా వయసుదే తను. ఆమె రాసిన ‘సెక్రటరీ’ నవలను నేను వేసాను. “శారదా నువ్వు వేస్తానంటే నా నవల ఇస్తాను” అనేది. అలా ఉండేది మా స్నేహం. వాసిరెడ్డి సీతాదేవిగారి ‘బంధితుడు’, ‘మట్టిమనిషి’ వేసాను. పి. శ్రీదేవి గారి ‘కాలాతీతవ్యక్తులు’, అలాగే ద్వివేదుల విశాలాక్షిగారి నవల నాటకంగా వేసాను. పీవీ నరసింహరావు గారు ఒక మరాఠీ నవలను ‘ఎవరు లక్ష్యపెడతారు’ అని తెలుగులోకి అనువదించారు. దాన్ని నండూరి విఠల్ గారు రేడియోకి నాటకంగా చేసారు. దాన్ని వేశాం. ఆయన ఎంత సంతోషించారో, “ఎంతబాగానో వేసారమ్మా మీరు” అని చెప్పి మెచ్చుకున్నారు. రంగనాయకమ్మగారి ‘బలిపీఠం’ రేడియోకి నాటకంగా చేసివేశాం. ఆవిడదే ‘స్త్రీ’ నవలను రేడియోలో నవలా పఠనం స్త్రీల కార్యక్రమంలో చదివాను. చాలా మంది రచయితల,రచయిత్రుల ప్రసంశలు పొందాను.

10. ఓ నాటకాన్ని వేసే ముందు మీరు ప్రత్యేకించి ఎలాంటి శ్రద్ధ తీసుకునేవారు?

నాటకాన్ని మైక్ ముందు చదివే ముందు రిహార్సల్స్ ఉండేవి. అందరితో కలిసి రెండు మూడు రోజులు బాగా చదివి ఎవరి వేషాన్ని వారు ఆకళింపు చేసుకోవాలి. నేను అలాగే ఇంట్లో పనిచేస్తున్నా నాలోనేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ పాత్రలోకి ప్రవేశించడానికి, ఆ పాత్రను ఆవాహం చేసుకోడానికి ప్రయత్నించి చేసినవే నా నాటకాలన్నీను. ఇంకోమాట ఏమిటంటే రేడియోకి ప్రతీ అక్షరమూ క్షుణ్ణంగా పలకాలి. అలా ప్రతీ అక్షరాన్ని పలకడంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకునేదాన్ని. లేకపోతే వినే వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళకు అర్థం కానిది చదివేసి ఏదో ప్రోగ్రాం పూర్తి చేసానని ఎప్పుడూ అనిపించుకోలేదు. దానికోసం తపన పడి అదే తలంపుగా చేసాను. కాబట్టే ఈరోజు ఇంత మంది గుర్తుపెట్టుకోవడం జరిగింది నన్ను.

11. ఎందరో కలల స్వర సుందరి తన గాత్రాన్ని ఎలా కాపాడుకునేది?

(నవ్వుతూ) ఏమీ చేయలేదు. అది అలా పుట్టుకతో వచ్చిందే, దేవుడిచ్చిందీను. దాన్ని కాపాడుకోడానికంటూ ప్రత్యేకించి నేను చేసిందేమీ లేదు. నా గొంతు నా పనికి సహకరించింది అని మాత్రం చెప్పగలను. జలుబు చేసినప్పుడు తప్పితే గాత్రంలో పెద్దగా తేడా ఏం రాలేదు. ఇప్పటికీ కూడా.

12. మీ గొంతును ఇష్టపడి మిమ్మల్ని ఆరాధించిన అభిమానుల గురించి చెపుతారా?

అభిమానులు రేడియో ఆర్టిస్టుల గొంతును మాత్రమే గుర్తు పెట్టుకుని అభిమానించేవారు. ఎందుకంటే టీవీలోలా మేం కనపడం కదా. ఇంత శ్రద్ధగా రేడియో విని నన్ను గుర్తుపెట్టుకున్నారా – అనే ఆశ్చర్యం కలిగేలా ఇప్పటికీ నన్ను కలుస్తున్నవాళ్ళను చూస్తే అనిపిస్తుంది. ‘ఎంతకాలం నుండో మేము మీ అభిమానుల’మంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా మొన్న వైజాగు వెళ్ళినపుడు ఎంతోమంది అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు.

13. జనగణమన, వందేమాతరం ఎందరో ప్రముఖుల ముందు ఆలపించారు కదా. అప్పుడు మీకు గురుతుండిపోయిన సంఘటనలు కొన్ని పంచుకుంటారా?

అలా ఏం లేవండి. ఆ నెహ్రూ గారి దగ్గర పాడినప్పటి సంగతి మాత్రం భలే అనిపిస్తుంది ఇప్పటికీ. దేశ ప్రధాని ముందు పాడటం అంటే మరిచిపోలేని అనుభవం. మేము పాడుతున్నప్పుడు ఆయన జమ్మంటూ కుర్చీలో నుంచీ లేచి స్టేజి మీద మా పక్కన నించుని మాతో పాటు పాడుతుంటే కంగారేసిపోయింది. మొన్ననే నేనూ, సావిత్రి గారు అనుకున్నాం ‘అయ్యో మనకు ఓ ఫోటో తీసుకోవాలని కూడా అనిపించలేదే’ అని. ఇప్పుడైతే సెల్ఫీ కూడా తీసుకునేవాళ్ళు.

ఒకసారి ఇందిరాగాంధీ మా రేడియో స్టేషన్ కే వచ్చారు. ఆవిడ పక్కన నిలబడి ఫోటో తీయించుకోవాలని నేను, సావిత్రిగారు చెరో పక్కా నిలబడ్డాం. ఇంతలో వింజమూరి సీతాదేవి, రతన్ ప్రసాద్ గారు వచ్చారు. మేము వాళ్ళకు దారి ఇచ్చి వెనక్కు నిల్చున్నాం. మాకే కాదుకదా, అందరికీ ఆమెతో ఫోటోలు తీయించుకోవాలని ఉంటుంది కదా. అందులోనూ నేను అందరి కన్నా కాస్త పొడవు కావడంతో, వెనక్కు వెళ్ళి నిలబడేదాన్ని. మెత్తానికి ఆ ఫొటోలో మా ముఖాలు కనిపించాయి.

ఇక పీవీ నరసింహరావుగారు మాత్రం ఏ మీటింగులో కనిపించినా పలకరించేవారు. “అదిగో అక్కడ కూర్చున్నారే ఆవిడ చాలా గొప్ప కళాకారిణి” అంటూ ఏదో మాట్లాడేసేవారు. నేను మాత్రం సిగ్గుతో మునగదీసుకు పోయేదాన్ని.

14. మీకు మాత్రమే తెలిసిన శారదాశ్రీనివాసన్ గారు ఏలా ఉంటారు. ఆవిడ స్వభావం ఎలాంటిది?

అందరిలో కలిసే మనస్తత్వమా అంటే, తోసుకుని ముందుకు వెళ్ళే మనిషిని కాను. నేను, నా వృత్తి అంతే. దానిని పట్టుకుని పేరు సంపాదించేయాలనే యావ ఉన్నదాన్ని కాను. నలుగురిలో దూసుకుపోయే మనిషిని అంతకన్నా కాదు. ఫోటోకి కూడా ముందుకు వచ్చేదాన్ని కాను. వెనగ్గా నించుంటే “రండి మీదే నాటకంలో ప్రధాన పాత్ర మీరు ముందుకు రావాలని” తోటివారు బలవంత పెట్టి ఫోటో తీయించే వారు. నేను పొడుగు కదా వెనక వాళ్ళు కనిపించరేమోనని వెనక్కు పోయేదాన్ని. కాస్త వెనక బెంచీ విద్యార్థిని నేను.

15. ప్రస్తుత కాలం ఏలా గడుపుతున్నారు?

మొన్నటి వరకూ చిరంజీవి గారి పుస్తకం రాయడంతో సరిపోయింది. పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఇక ఓపిక కూడా లేదనిపిస్తుంది. పాపకు సాయంత్రాలు టీవీలో హిందీ కార్యక్రమాలు చూడటం ఇష్టం, దానికి నేను దగ్గర ఉండాలి. ఇంటిపని చేసుకుంటూ పాపని చూసుకోవడంతో సమయం తెలీకుండానే గడిచిపోతుంది.

**** (*) ****



8 Responses to “చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

  1. కె.కె. రామయ్య
    March 1, 2016 at 9:55 am

    ” ఓ తరం తెలుగు వాళ్లకి సంబంధించి ఆల్ ఇండియా రేడియో ( All India Radio, AIR ) అనగానే… ఠక్కున గుర్తొచ్చేది చలం ‘పురూరవ’ శ్రవణ నాటకం. అందులో ‘ఊర్వశి’ శారదా శ్రీనివాసన్! కావ్యాల్లోని ఊర్వశి సోయగాన్ని తన మధురస్వరంలో ఒలికించి శ్రోతల ఊర్వశిగా నిలిచారు. చలాన్ని సైతం మైమరిపించారు..! ఆ పురూరవ ఊర్వశి… ఆకాశవాణి మానసి ” … శారదా శ్రీనివాసన్ గారు!

    ‘ఆ శారదకు వీణ కరమునుందు ఈ శారదకు వీణ గళము నందు’ అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిచే కీర్తించబడిన శారదా శ్రీనివాసన్ గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు.

    ప్రముఖ కథారచయిత గొరుసు జగదీశ్వర్‌రెడ్డి గారు (అదేలే మన గోరుసన్న) శారదా శ్రీనివాసన్ గారిని భీమ్లీలో ఉంటున్న చలంగారి అమ్మాయి సౌరీస్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనేది ఈ సందర్భంలో తలుచుకోవాల్సిన మరో ముచ్చట.

    ఊర్వశి పాత్రకు శారదా శ్రీనివాసన్ గారు ప్రాణప్రతిష్ఠ చేసిన చలం ‘పురూరవ’ శ్రవణ నాటకం వాకిలి పాఠకుల కోసం మళ్లీ ఇక్కడ అప్లోడ్ చెయ్యవచ్చా ?

  2. కె.కె. రామయ్య
    March 1, 2016 at 10:04 am

    మొదటిసారిగా 1974లో ఆకాశవాణి లో ప్రసారితమైన పురూరవ శ్రవ్యనాటికను శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఈమాట అంతర్జాల మాస పత్రిక (నవంబర్ 2008 సంచిక)లో శబ్ద తరంగాలు శీర్షికన పొందుపరిచి ఉంచారు.

    దానికి లింకు : http://eemaata.com/em/issues/200811/1350.html

  3. చంద్రిక
    March 2, 2016 at 11:37 pm

    శారద శ్రీనివాసన్ అనగానే మరిచిపోలేని మధుర కంఠస్వరం. ఆదివారం బాలానందం అవ్వగానే మూడు గంటలకి మొదలయ్యే నాటకం కోసం ఎదురుచూసేవారు. చిన్నపిల్లలం అవటం వలనో ఏమో నాటికలు అన్ని తెలియవు. కానీ నాకు బాగా గుర్తుండి పోయిన నాటకం ఘటనం సర్వజనీనం. ఎంత అద్భుతమైన క్రియేటివిటీ కదా అన్పిస్తుంది ఇప్పుడు తలచుకుంటే. ఆ రోజుల్లో రేడియో అన్ని వయసుల వారిని ఆకట్టుకొంది. అందర్నీ కలిపింది.

  4. కె.కె. రామయ్య
    March 3, 2016 at 9:21 am

    ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే ఉషశ్రీ పురాణ ప్రవచనాలు, రేడియో అక్కయ్య అన్నయ్యల బాలానందం కార్యక్రమం, మూడు గంటలకి మొదలయ్యే రేడియో నాటకం …. గత కాలపు అద్భుత లోకాన్ని తలపుకు తెచ్చారు చంద్రిక గారు. ధన్యవాదాలు.

    తెలుగు సినిమా సాంగ్స్ కి ఘంటసాలోడి స్టోను లాగా రేడియోకి శారదా శ్రీనివాసన్ గారి కంఠస్వరం అని నాటి చిన్నా పెద్దా అనుకునేవాళ్లు.

  5. K SHESYU BABU
    March 22, 2016 at 12:27 am

    Ee mukhamukham chaduvu tuntunte naaku chinnappati rojulu gyapakam vachchayi. Appudu radio lo vunna viluva ippudu sravya madhyamamu luptamaipotondi. Sahitya viluva leeni karyakramalu chotu chesukuntunnayi. Doors darsini lo asleela drusyaalu pillala manasulanu peedistunnayi. Radio viluvanu nokki vakkaninchinanduku meeku dhanyavaadalu.

  6. కె.కె. రామయ్య
    March 24, 2016 at 12:03 am

    ” ఈ ముఖాముఖం చదువుతుంటే నాకు చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు రేడియో లో వున్న విలువలు ఇప్పుడు శ్రవ్య మాధ్యమము లో లుప్తమైపోతోంది. సాహిత్య విలువలు లేని కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. దూరదర్శినిలో అశ్లీల దృశ్యాలు పిల్లల మనసులను పీడిస్తున్నాయి. రేడియో విలువను నొక్కి వక్కాణించినందుకు మీకు ( శారదా శ్రీనివాసన్ గారికి ) ధన్యవాదాలు ” ~ కె. శేషు బాబు

  7. దేవరకొండ
    May 13, 2016 at 2:08 pm

    “ఇంకోమాట ఏమిటంటే రేడియోకి ప్రతీ అక్షరమూ క్షుణ్ణంగా పలకాలి. అలా ప్రతీ అక్షరాన్ని పలకడంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకునేదాన్ని. లేకపోతే వినే వాళ్ళకు అర్థం కాదు. ” ఎంతో విలువైన సలహా! ఈమధ్య రేడియోలో చాలా మాటలు అర్ధం కాకుండా పలుకుతున్నారు. పాత తరం రేడియో కళాకారులు అంతశ్రద్ధతో ఉచ్చరించేవారు కాబట్టి ఇప్పటికీ మన మనసుల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారు. ఎఫ్ఫెమ్ రేడియోల్లో ఒకటే పిచ్చి వాగుడు, గోల! శారదా శ్రీనివాసన్ గారి వంటి అగ్రశ్రేణి కళాకారులు తమ విలువైన అనుభవాన్ని నేటి, ముందు తరాల వారికి ఎంత ఎక్కువ అందిస్తే అంత మంచి జరుగుతుంది రేడియోకి. సంబంధిత సబ్జెక్టులో ప్రొఫెసర్లుగా విశ్వవిద్యాలయాల్లో ఉండవలసినంత విద్వత్తు ఉన్న ఆకాశవాణి కళాకారుల్లో ఒకరు శారదా శ్రీనివాసన్ గారు. వాకిలికి అభినందనలు.

  8. boddapati chandrasekhar
    March 4, 2017 at 4:18 pm

    ముఖాముఖంలో శారదగారి మాటలు బహు ముచ్చటగా ఉన్నాయి. రేడియో గొంతుల్లో ఓ అద్భుతం. శబ్దంమీద ఆవిడకు ఎంత సాధికారతో కదా .ఇప్పటివరకు మల్లి అటువంటి గొంతు నేను వినలేదు. శబ్దశాసనురాలు.

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)