కవిత్వం

భద్రచరిత్ర

08-ఫిబ్రవరి-2013

అక్కడ కొండచరియల మీది నుంచి
తూటాలు దూసుకు వస్తుంటాయి.
తాళవృక్ష చత్రశిరసులను రాసుకుంటూ
అరణ్యవ్యూహంలో చిక్కుకున్న జవానుల
సైనిక దుస్తులను చీల్చుకు పోతుంటాయి
కుంభవృష్టిలో నాని దొర్లుతున్న బండరాళ్లలాగా
పైనుంచి ఛిద్రదేహాలు కిందికి దొర్లుతుంటాయి…

ఇక్కడ మాటలు కురుస్తుంటాయి
ప్రసంగాలు పిడుగులై నేలని బద్దలు చేస్తుంటాయి
త్యాగాల,పోరాటాల చరిత్ర దస్త్రాలు తెరుచుకుంటుంటాయి
అపరాధ భావనల అశ్రుతర్పణలు జరుగుతుంటాయి
పశ్చాత్తాపాల ఉద్వేగ ధారాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి….

నిరాశలూ నిస్పృహలూ
వాస్తవాలూ వంతెనలూ నిచ్చెనలూ
కొత్త నినాదాలూ వినూత్న ఆచరణలూ
చర్చలూ సంఘర్షణలూ సమీక్షలూ సింహావలోకనలూ
యాభై యేళ్ళ రక్తరంజిత జనవందిత చరిత్ర….అన్నీ
సమావేశ మందిరాల గోడల మీద చిత్రలేఖనాలవుతుంటాయి…

వీరులే యుద్ధానికి వెళతారు
వీరులే మెరుపులై మెరుస్తారు
వీరులే పిడుగులై కురుస్తారు
వీరులే అమరులై నిలుస్తారు….

కథలైనా రాద్దామా
ఆ గాధలైనా పాడదామా
నాలుగు చుక్కలు సిరా పోసి
మనం వాళ్ళ కాళ్లయినా కడుగుదామా….!3 Responses to భద్రచరిత్ర

 1. nsmurty
  February 8, 2013 at 2:22 am

  దేవీ ప్రియ గారూ,

  కథలైనా రాద్దామా
  ఆ గాధలైనా పాడదామా
  నాలుగు చుక్కలు సిరా పోసి
  మనం వాళ్ళ కాళ్లయినా కడుగుదామా….!

  ఎలాగూ వీరులై యుద్ధరంగానికి కదలలేని వాళ్లు ఆమాత్రమైనా చెయ్యకపోతే ఎలా?

  అంతరాల్ని కదిలించి, మౌలికమైన విశ్వాసాలను ప్రశ్నించే కవిత.

  అభివాదములు.

 2. IVNS Raju
  February 8, 2013 at 10:01 am

  దేవిప్రియ గారు ఉదయంలో మీ రచనలు ప్రతిరోజూ చదివేవాడిని.
  చాల నచ్చేవి నాకు .
  నిజానికి ఈనాడు శ్రీధర్ బొమ్మలకు మీ కవితలు తోడైతే భలే ఉండును.
  ఉదయం దినపత్రిక చాల త్వరగా అస్తమించింది !!

  • గరికపాటి పవన్ కుమార్
   February 8, 2013 at 8:15 pm

   దేవిప్రియ మారాడు

   ఉదయం టూ జ్యోతి

   ఉదయానికి అస్తమయం

   జ్యోతికేమో ఖ్యాతి

   కుర్ర తనం లో మీరు ఉదయం నుండి మారినప్పుడు రాసుకున్నా సరదాగా. మళ్ళీ మీ కవితలు చూడడం సంతోషం.

   గరికపాటి పవన్ కుమార్

Leave a Reply to IVNS Raju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)