కథ

ఉలవచారు రత్నం సారు

ఏప్రిల్ 2017

“ఏ బ్రాంచ్ అమ్మా మనది?”

“ఎలెక్ట్రికల్ అండ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  సా”    చెప్పాను.

“ఏది.. దాన్ని సింప్లిఫై చేసి చెప్పు”.

“ఈ ఈ ఈ సా”

“ఆపకుండా మూడు సార్లు చెప్పు”

“ఈ ఈ ఈ  ఈ ఈ ఈ  ఈ ఈ ఈ ”

“ఎందుకు పాపా ఏడుస్తున్నావు. చీమ కుట్టిందా”

అప్పటి దాకా బిక్కు బిక్కు మంటున్న నాకు భలే నవ్వు వచ్చింది. యాడో ఒంగోలు దగ్గర వున్న ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇంత పెద్ద విశాఖపట్నంకి ఇంజనీరింగు చదవటానికి వచ్చా. రాగింగ్ అని ఒకటుంటుందని ఆడా ఈడా అనుకుంటుంటే విన్నా. సీనియర్లు ఏమడిగినా చెప్పాలని, సీనియర్లని సార్ అనాలని అట్లా మా ఆడ సీనియర్లు ముందు రోజే మాకు  పాఠాలు చెప్పారు. ఇదే రాగింగ్ అయితే ఇది బాగానే వుందే అనుకున్నా.

“సరే గాని పాపా, ఈ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నావు” అడిగాడు ఒక సీనియర్.

“ మంచిదని సా” ఒద్దికగా చెప్పాను.

“రత్నం సారు గురించి విన్నావా”.

“ తెలియదు సా. నిన్ననే వచ్చా సా”

“డాక్టర్ చదివే వాడు అనాటమీ అన్నా ఒక పది సంవత్సరాలకు పాసు అవుతాడేమో గాని రత్నం సారు బారిన పడిన వాళ్ళు చదువు మానేసి వెళ్ళిపోవటమే. ఒక ప్రశ్న వేస్తాడు. సమాధానం చెప్పక పోతే నువ్వు గెట్ అవుట్ అన్న మాట. ఆయన బారిన బడి ఇక్కడ బీచ్ ఒడ్డున చాలా మంది గుడ్డలు పీక్కుని తిరుగుతున్నారు. పాపం నువ్వు ఎట్టా బయటపడతావో.” అనేసి నా బుర్రలో బాంబు వేసి  వెళ్లి పోయారు.

రూముకి  ఎట్ట వచ్చానో తెలియదు. కాళ్ళు చేతులు వణకతావున్నై. తిండి తినబుద్ది కాలే. కూచున్నా నించున్నారత్నం సారే. నాతో పాటే ఉన్న మిగతా వాళ్ళకి కూడా బాదే. కాని నా బాధే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళంతా ఇంగ్లిష్ మీడియం. కనీసం ఇంటర్ అన్నా ఇంగ్లిష్ మీడియంలో చదివున్నారు. నేను ఒక దాన్నే ఇంటర్ కుడా తెలుగులోనే చదివి చచ్సా.

ఇంకా మా వూర్లో ఆడ పిల్లల్లో కాని మొగపిల్లల్లో కాని నేనే ఫస్టు ఇంజనీరుని. నా చదువు చూసి మా వూళ్ళో అందరు దెయ్యం పట్టింది అనుకునే వాళ్ళు. మా ఇంటి పక్కన తులిసెవ్వ వాళ్ళింట్లో ఉలవచారు కాస్తే వాళ్ళ కోడలితో “మేయి ఆ పిల్ల రేయి బగుళ్ళు దెయ్యం పట్టినట్టు చదవతా వుంది.దానికి కాసిని ఉలవచారు ఇచ్సి రాపో” అని చెప్పేది. మా వూర్లోనే తులిసెవ్వ వులవచారంటే నోరు వూరి పోద్ది. అంత గోప్పన్నమాట.

నేను విశాఖపట్నం వస్తుంటే మా వూరి వాళ్ళంతా అదేదో సినిమాలో చిరంజీవిని టౌనుకు సాగనంపినట్టు  పంపారు. ఇప్పుడు నేను ఈ రత్నం సారు వల్ల చదవలేక ఎళ్ళి పోతే నా పరువు ఏమవుద్దా అని, తులిసెవ్వ ఉలవచారు ఇచ్చుద్దో లేదొ నని మనేదిలో పడ్డా.  బీచ్ ఒడ్డున శివాలయం వుందని అందరూ పోతుంటే నేను కూడా పోయా. ఏ పుట్టలో ఏ పాముందో ఒకేళ నిజంగా దేముడుంటే అందరి కోరికలు తీర్చి నాయి తీర్చడేమోనని బయ్యంపుట్టి పోయా.

“సోమి నీకు నెత్తిమీద గంగ, చందమామ, మెళ్ళో పాము వున్నాయి. మూడు కళ్ళు కూడా వున్నాయి కదా. అయ్యన్ని నువ్వుంచుకో. కాని ఒక కన్ను నా మీదేయ్. నీకు పుణ్యం వుంటుంది. ఆ రత్నం సారు మాకు రాకుండా చూడు. కావాలంటే శివరాత్రికి ఒక్కపొద్దు ఉంటా అని శివుడికి ఆశ పెట్టి వచ్చి పొణుకున్నా..

పొణుకుంటే నిద్రపడితే కద. తెల్లార్లూ రత్నం సారు వచ్చి కొచ్చెన్లు అడుగుతున్నట్టు నేను చెప్పక పొతే గెటౌట్ అన్నట్టు, మా వూరికి పొతే తులిసెవ్వ ఉలవచారు పోయ్యనట్టు ఒకటే కలలు. ఆ పాట్న నిద్ర లేచి ఒక శపతం చేసుకున్నా.ఒకేళ నేను గాని ఫెయిలైతె విశాఖపట్నం సముద్రంలో బడి చావనన్నా చస్తాను గాని మా వూరికి మాత్రం పోకూడదు అనుకున్నా.

తెల్లారి లేచి శివుడికి మళ్ళీ గుర్తు చేసి క్లాసుకి వెళ్ళి కూర్చున్నా. అందరికి ఒకటే చమటలు కారుతున్నాయి. అసలికే సముద్రపు వుక్క. దానికి తోడు రత్నం సారు బయ్యం. ఒక మాట లేదు. ఒక నవ్వు లేదు. సచ్చిన సెవాలకు మల్లె వున్నాం. నాకంతా మణి రత్నం సినిమాలాగా బూజర బూజర గా కనపడతుంది.  కాసేపటికి అంతా గోల గోలగా ఉండింది. కళ్ళు నులుముకుని చుస్తే ఉమా మేడం వున్నారు. ఉమా మేడం వచ్చారంటే  ఈ సమచ్చరం రత్నం సారు రారన్న మాట. నాకైతే రోజుకు మూడు పూటలు కాకుండా పది పూటలు వున్నట్టు, అన్ని పూటలు వులవచారన్నం తిన్నట్టు భలే ఉండింది. ఈ సమచ్చరం బతికిపోయా, వచ్చే సమచ్చరం సంగతి అప్పుడు చూసుకోవచ్చులే. బీచ్ ఒడ్డున శివుడు లేడా వాడికి మూడు కళ్ళు లేవా ఒక కన్ను నామీద యెయ్యకపోతాడా అనుకున్న.

అయితె ఉమా మేడంతో ఒక తంటా వుండింది. ఆమె చెతుల్లేని రవికెలు యేసుకునేది. సార్లు కొరుక్కుతినేటట్టు చూసేవాళ్ళెమో పాపం బయటంతా కొంగు భుజాల చుట్టూ కప్పుకొని వుండేది. మా క్లాసుకి రాంగనె భుజాల చుట్టూ వున్న కొంగు తీసేది. ఆ పైటకి పిన్నీసు పెట్టుకునేది కాదు. అప్పుడప్పుడు చాక్ పీసు కింద బడితే వొంగేది.ఆ పయిట యాడ జారుద్దో నని ఆడపిలకాయలమంతా టెన్షను బడి చచ్చేవాళ్ళం.

మొకం అంతా నవ్వులు పూస్తా వున్నాయ్. క్లాస్ అయిపోయి బయటకు రాగానే ఇంకో గుంపు వచ్చింది.

“సెల్ఫ్ డబ్బా కొట్టుకో” అన్నారు. అంటే నా పేరు, వూరు మిగతావి అన్నమాట.

“ఫేవరిట్ హీరో ఎవరో చెప్పు”

“ చిరంజీవి”

“ ఇంటిపేరు చెప్పు పాపా “

చెప్పాను. అట్ట కాసేపు బుర్రతిని వాళ్ళు యెళ్ళిపోయారు.

తరవాత రోజు పొద్దున్న క్లాసుకి  పోతుంటే ఇంకో గుంపు వచ్చింది. మళ్ళీ మొదలుపెట్టారు.

“పేరేంటమ్మా”

“………”

“ఇంటిపేరు ?”

“………..”

“ఫేవరెట్ హీరో ఎవరో చెప్పు “

“ చిరంజీవి “

“ఇంటిపేరు ఇంకోసారి చెప్పు”

“………..”

“మరి ఇంటి పేరు ఇదయితే బాలకృష్ణ  కాకుండా చిరంజీవి ఫేవరిట్ హీరో ఎట్ట అయ్యాడు? అనడిగారు.”

“చిరంజీవి డాన్సు భలే చేస్తాడు సా” అని చెప్పా.

“బాలకృష్ణ చెయ్యడా. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, అనసూయమ్మ గారి అల్లుడు చూడలా. ఎంత బాగా చేసాడు. అంత లావు వున్నా చిరంజీవి బ్రేక్ డాన్సు చేస్తే బ్రేకు, స్నేక్ డాన్సు చేస్తే స్నేకు ఎన్ని చేసాడు. సరే ఇప్పటి దాక జరిగిపోయింది మేము మర్చి పోతాము. ఇక నుంచి బాలకృష్ణ అని చెప్పాల”. అని సీరియస్ గా చెప్పారు.

అసలేమి జరిగిందంటే నిన్న వచ్సిన గుంపు ఫేవరిట్ హీరో చిరంజీవి అని చెప్పేసరికి నేను చిరంజీవి కులపుదాన్ని  అనుకున్నారు. ఇంటి పేరు చెప్పేసరికి వాళ్ళకి తెలిసిపాయింది. వాళ్ళు వెళ్లి ఫణికుమార్ అని మా కులపోళ్ళకి లీడరన్న మాట. వాడి దగ్గరకు పోయి ఇదిగో ఫణి కుమారా, మీ కులపమ్మాయి ఫేవరిట్ హీరో చిరంజీవి అంటా వుంది. సంగతి చూడుపో అని చెప్పి పంపారు. వీళ్ళు యూనివర్సిటీకి వచ్చి చదువు నేర్చుకున్నారో లేదో గాని ఇంటి పేరు బట్టి కులం చెప్పటం మాత్రం బాగా నేర్చుకున్నారు.

నాకేమి చెయ్యాలో తెలియాలా. పోనీ బాలకృష్ణ అని చెబ్దాం అంటే చిరంజీవి బాధ పడతాడని, ఇప్పటికే జనాలు నానా చావు చస్తుంటే బాలకృష్ణ ఇంకా ఇరగతీసి సినిమాలు తీసి జనాల్ని ఇంకా సంపుతాడేమోనని బయ్యం పుడతా వుంది.

సరే బాలకృష్ణ అని చెప్తే వీళ్ళ బాధ వొదులుద్ది కదా అని ఫేవరిట్ హీరో బాలకృష్ణ అని చెబ్దామనుకున్న. పక్కకు చూసే సరికి చిరంజీవి కులపోళ్ళున్నారు.

“ఏమ్మాయి వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయి ఫేవరిట్ హీరో బాలకృష్ణ అని చెప్తావా. చిరంజీవి సినిమాలు చూసి ఇదేనా నువ్వు నేర్చుకుంది. ఖైదిలో ఏమి చేసాడు, చట్టానికి కళ్ళు లేవు లో ఏమి చేసాడు.అన్యాయాన్ని ఎదిరించోద్దా. చిరంజీవిని గుర్తు తెచ్చుకో. ధైర్యంగా చెప్పు. దిక్కులు పిక్కటిల్లేలాగా చెప్పు. చిరంజీవి నీ ఫేవరిట్ హీరో” అని వీళ్ళు .

ఇట్టాంటి తగలాటకాలుంటాయంటే ఏ కమల హాసన్ నో అమితాబచ్చన్ నో చెప్పేదాన్ని కద. వీళ్ళ బారినబడితినే అని గింజుకుంటున్నా.

తలెత్తి చుస్తే ఒక్కరు లేరు. ఏమైందబ్బా అని చూసే సరికి అటునుంచి రత్నం సారు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్… అన్నట్టు వస్తా ఉన్నాడు. అందుకే చిరంజీవి గుంపు , బాలకృష్ణ గుంపు పరారైయ్యాయి. చెప్పద్దూ, అప్పుడు రత్నం సార్ని చూస్తే నాకు చిరంజీవికంటే గొప్పోడు అనిపించాడు. నమస్తే సా అందామనుకున్నా గాని కరెంట్ అంటే, వోల్టేజి అంటే  ఏంటని కొచ్చెన్లు యేసి గెటవుట్ అంటాడేమోనని బయ్యంపుట్టి వూరుకున్నా.

అట్ట చిరంజీవి ,బాలకృష్ణ అని వేపుకుతినే వాళ్ళబారి నుంచి, రత్నం సార్ బారినుంచి నుంచి  మొదటి సమచ్చరం బయట పడ్డా. రెండో సమచ్చరంకి వచ్చా. మళ్ళీ రత్నం సారు బయ్యం మొదలు.

బబిత అని మొదటి సమచ్చరం పిల్ల. ఎక్కిళ్ళు బెడతా వచ్చింది. ఏందమాయ్ అన్నా. సముద్రంలాగా పడిపోయింది. రత్నం సారు వాళ్ళ క్లాసుకి యెళ్ళి ఈ పిల్లని గెటౌట్ అన్నాడంట. ఒకటే ఏడుపు. ఎందుకమాయ్ ఏడుస్తావు. రేపో ఏల్లుండో మాది మీ పరిస్తితేలే అన్నా. అయినా ఆ పిల్ల దుక్కం ఆగల. ఆ సారు మీకు రాడంట. వాళ్ళ అబ్బాయిది మీ క్లాస్ అంట గదా. యూనివర్సిటీలో సార్లు వాళ్ళ పిల్లలు చదివే క్లాసులకి పోగూడదని ఒక రూలు ఉందంట. ఆయనకి నలుగురైదుగురు పెళ్ళాలు  ఉండకూడదా, ఒక్కక్కరికి ఐదారుగురు పిల్లకాయలుండ గూడదా, ఒక్కొకరు ఒక్కో క్లాసులో చదవ గూడదా అని ఆ పిల్ల శోకండాలు పెడతా వుంది. ఆ పిల్ల అంతలావున యాడస్తావుంటే నవ్వితే బాగుండదని గాని లేకపోతే దొర్లి దొర్లి నవ్వాలని ఉండింది. యూనివర్సిటీలో ఇట్టాంటి మంచి రూలు వుందని తెలియక బేజారైతినే  అని అట్టాంటి మంచి రూలు పెట్టిన వాళ్లందరికి మనసులో దండాలు పెట్టుకున్నా.

ఆ మాదిరిగా నేను రత్నం సారు బారిన పడకుండా నాలుగు సమచ్చరాలు చదివి మా వూరి పరువు కాపాడి తులిసెవ్వ ఉలవచారు ఋణం తీర్చుకున్నా.

రత్నం సారు క్లాసుకి వచ్చినట్టూ, నన్ను థెవినిన్స్ థియరం అడిగినట్టూ, నేను చెప్పనట్టూ, ఆయన నన్ను గెటౌట్ అన్నట్టూ నాకు ఇంకా కలలు వస్తానే వున్నాయి.

ఆడపిల్లల్ని చదువుకోమని ఉలవచారు పోసి ప్రేమించే మా తులిసెవ్వ ఇప్పుడు లేదు. కాని ఆ రుచి మా నాలికపైన ఇంకా తగులుతూనే వుంది. చిరంజీవి, బాలకృష్ణ ఫాన్ల నుంచి కాపాడే రత్నం సారు కూడా లేడు. కాని ఆంధ్రా యూనివర్సిటీ ఏలెక్ట్రికల్ అంటే యాడికి పోయినా రత్నం సార్ని గుర్తు చెయ్యని వాళ్ళు లేరు.

**** (*) ****



3 Responses to ఉలవచారు రత్నం సారు

  1. sunitha
    April 2, 2017 at 2:29 am

    రత్నం సారు ఉలవచారు చాలా బావుందండీ. సహజమైన వాతావరణం, గమ్మత్తుగా ఉన్న మాటలు భలే ఉన్నాయి. మొత్తానికి నాలుగేళ్లు గట్టెక్కాయి :) సంతోషం.

    • HARITHA DEVI
      April 29, 2017 at 7:40 am

      సునీత గారు ధన్యవాదాలు

  2. sreeram velamuri
    May 8, 2017 at 9:05 pm

    చాలా బాగుంది ..మా ఒంగోలు భాష కూడా .. అభినందనలు

Leave a Reply to HARITHA DEVI Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)