కథ

నిర్జీవగీతం

ఏప్రిల్ 2013

మైదుకూరు వదిలి బస్సు కడప దారి పట్టింది. నెమ్మదిగా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. కలెక్టర్ ఆఫీసు లో పని ఇవాళే పని అవుతుందో, రెండు రోజులు పడుతుందో తెలీదు. నిజానికి నేను నిన్ననే వచ్చాను బెంగుళురు నుంచి. పని పూర్తయితే ఈ రోజు రాత్రికే తిరిగి బయలు దేరాలి !బహుశా మరో గంట పడుతుందేమో కడప చేరడానికి.

వెనక్కు పోతున్న కొండల్ని, ఎండి నెర్రెలు విచ్చిన పంట పొలాలను చూస్తూ “ఎటు చూసినా కరువు” అనుకుంటూ నిట్టూర్చాను. బస్సు నిండుగా ప్రయాణీకులున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల చుట్టు పక్కల వూళ్ల వాళ్లు పొద్దున్నే కడపకు వెళ్ళి పనులు చూసుకుని సాయంత్రాలకు ఇళ్ళు చేరడం మామూలే! బస్సు లో ఎక్కువ మంది రైతులే ఉండటం తో, కరువు,వానల్లేక ఎండిన పొలాల వైనం, బావుల కింద వ్యవసాయం చేసే వాళ్ళు కరెంట్ కోతతో పొలం ఎండి పంట చేతికి రాని వైనం, బిగ్గరగానే చెప్పుకుంటున్నారు. దగ్గర దగ్గర వూళ్ళ వాళ్ళే కావడం తో పరిచయాలు కూడా ఉన్నాయేమో… మధ్య మధ్యలో నవ్వులు, సరదా మాటలు కూడా వినిపిస్తున్నాయి.బాధల్ని చెప్పుకుంటున్నా, నవ్వు ని మాత్రం ఇంకా మర్చిపోలేదు వాళ్లు!

వాళ్ళ మాటల్ని వింటూ వాళ్ళని పరిశీలిస్తూ మధ్య మధ్యలో బయటకు చూస్తున్నాను!

ఖాజీ పేట మరో మూడు కిలోమీటర్లు ఉందనగా బస్సు వేగం మందగించింది. రోడ్డు మీద వరసగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి . మా బస్సు కూడా వాటి వెనుకే ఆగి పోయింది. చాలా మంది బస్సు దిగి ఏమైంది ఏమైందని ఆరా తీయసాగారు . గుంపులోనుంచి ఎవరో సమాచారం తెచ్చారు ..వ్యవసాయ రుణాల మాఫీ, మద్దతు ధరల గురించి రైతుల ధర్నా జరుగుతున్నదట రోడ్డు మీద! ఉసూరుమన్నారు అందరూ! ఇహ ఈ బస్సు కదిలేదెప్పుడు?

పావు గంట అయినా బస్సు కదిలే సూచనలు కనిపించకపోవడం తో బస్సు లోంచి ఒక్కొక్కరే కిందకు దిగసాగారు. చేసేది లేక నేనూ వారి వెనకాలే దిగి ముందుకు నడిచాను . ముందు ఆగి ఉన్న బస్సుల్ని, జనాన్ని దాటుకుని నెమ్మదిగా నడుస్తూ గాంధీ బొమ్మ సెంటర్ చేరుకున్నాను.అక్కడ వెయ్యి మందికి పైగా జనం ఉన్నారు. కొందరు గాంధీ బొమ్మ దగ్గర కింద కూచుని ఉండగా మరి కొందరు నినాదాలు చేస్తున్నారు. నిజానికి వారిలో రైతులకంటే డబ్బు లిచ్చి ప్రతిపక్ష పార్టీ తీసుకొచ్చిన వ్యవసాయ కూలీలే ఎక్కువ మంది ఉన్నారన్నది స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుత కరువు కాలంలో పనులు ఎలాగూ లేవు. ఇలా ధర్నాలకు వస్టే రోజుకు వందో నూట యాభయ్యో ఇచ్చి బిర్యానీ పెట్టిస్తారు. అదీ నయమే అనుకున్న వారు ఇలాంటి అవకాశాలను వదులుకోరు. ధర్నా ఎందుకు చేస్తున్నారనేది వాళ్లకు అనవసరం కూడా!

ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షం ఆధ్వర్యంలో ఇలాంటి ధర్నాలు జరగడం మామూలే! ఇదొక విరామం, విశ్రాంతి లేని నిరంతర ప్రక్రియ. ధర్నా జనాలకు దగ్గరగా కొద్ది సంఖ్యలో సివిల్ పోలీసులు, వారి వెనుక నెత్తిన ఇనుప టోపీలు పెట్టుకుని సి ఆర్ పి ఎఫ్ పోలీసులు మరి కొంత మంది ఉన్నారు . వాళ్లకు ముందుగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరొకతను ఎస్సై అనుకుంటాను నాయకత్వం వహిస్తున్నట్లు నిలబడి చూస్తున్నారు .వారిని దాటి అక్కడ ఉన్న కూల్ డ్రింక్ షాపు వైపు నడిచాను. అక్కడ మరి కొందరు సి ఆర్ పి ఎఫ్ పోలీసులు ఇద్దరు ముగ్గురుగా నిల్చుని గన్స్ నేలకు ఆనించి పెట్టి బాతాఖానీ కొడుతూ కనిపించారు.ధర్నా హింసాత్మకం అయ్యే సమాచారం ఏమీ లేకపోవడం వల్లనేమో వాళ్లు ఎవరి కబుర్లలో వారుండి, మధ్యలో దారేపోయే స్త్రీల వంక ఒక ఆకలి చూపు విసిరేస్తున్నారు

“ఈ ముసలోడు జేసిన పని వల్లే ఇదంతా! ఈ గొడవలన్నీ” అన్న మాటలు వినిపించడం తో తల తిప్పి చూశాను. కూల్ డ్రింక్ షాపుని ఆనుకుని జారగిల బడినట్లు నిల్చున్న నలుగురు సి ఆర్ పి ఎఫ్ పోలీసుల గుంపు నుంచి వచ్చాయి ఆ మాటలు.

“ఈ ముసలోడు సోతంత్రమో సోతంత్రమో అని తన్నుకులాడి ఉండకపోతే మనకీ లంపటాలు ఉండేయి కాదు” అన్నాడు గాంధీ బొమ్మ వైపు చూపిస్తూ!

నాకు కాస్త ఆశ్చర్యమేసి వారి వైపు నడుస్తూ “ఏందన్నా , అంత మాట అనేస్తివి?పాపం ఆయనేమి జేసినాడు?” అన్నాదు మాటలు కలిపే ఉద్దేశంతో!

“మరి ల్యాకపోతే ఏందన్నా, ఆయన సోతంత్రం తాకుంటే ఈ నా కొడుకులంతా కుక్కిన పేల్లాగా పడుండే వాళ్ళు గాదా? సోతంత్రం వొచ్చినాక మట్టసంగా, మర్యాదగా పన్లు జేసుకుని బతకొచ్చు గదా! పతి దానికి దర్నాలు స్ట్రైకులు గొడవలు జేస్చూ మా దుంప దెంచుతున్నారు” అన్నాడు ఆ పోలీసు కోపంగా!

“అదేందన్నా, రైతుల కష్టాలు తెలీవా నీకు? వానల్లేక కరువొచ్చి అప్పుల పాలై, ఏం జేయాల్నో తెలీకనే కదా ఈ స్ట్రైకులు, దర్నాలు జేసేది?” అన్నాను

“నువ్వు జెప్పేది నిజమే గానీ అటు జూడు” అని ధర్నా చేస్తున్న గుంపుకు దూరంగా వక్కిలేరు బ్రిడ్జి కి దిగువన ఉన్న ఒక గుడిసె వైపు చూపించాడు. అక్కడ కొందరు జనం గుంపుగా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ధర్నాకు వచ్చిన వ్యవసాయ కూలిలందరికి సారాయి పాకెట్లు పంచడం నా కంట పడింది.

“నిజంగా దర్నా జే్సే వాళ్లైతే మేమెవరం అవసరం లేదన్నా ఈడ, ఈళ్లందరు గొడవ జేసే నాయాల్లు అందుకే మాకు పని బడింది”

“ఏదైనా కాని దర్నాలు చేస్తారు జనాలు, అదుపు తప్పితే దానిని కంట్రోల్ చేయడానికే కదా మీరు అవసరం. దానికి కాక ఇంకెందుకు మీరు” అడిగాను

ఈ మాటతో మధ్యలో ఉండే పోలీసాయనకు ఉక్రోషం వచ్చింది .

“పదహైదు రోజుల నుంచి పంచాయితీ ఎన్నికలకని, గొడవలయ్యే వూళ్ళని పంపిస్తే రాత్రి పగలు అని కూడా లేకుండా కునుకు గూడ లేకుండా డ్యూటీ చేసినామన్నా! ఈ డ్యూటీ అయినాక పోలింగ్ బాక్సుల్ని నిన్న రాత్రి జిల్లా పరిషత్తు ఆఫీసులో అప్పజెప్పేసరికి తెల్లారుజాము అయిదైంది. అయిపోయింది గదా డ్యూటీ అని మా బెటాలియన్ కాంపు కి వచ్చి అట్ట ఒక గంట పడుకున్యామో లేదో, ఇక్కడ దర్నా ఉందని లేపి డ్యూటీకి పదమని తెచ్చినారు”

అని ఒక నిమిషం ఆగి మళ్ళీ తనే ” పదైదు రోజులన్నా ! ఒక్క గంట కూడా కన్ను మూయలా ! ఇంగ డ్యూటీ అయిపోయింది లే అనుకున్యామో లేదో ఇదిగో మళ్ళీ దర్నా డ్యూటీ అంట. రొంత గూడా రెస్టు లేదా ఇంగ మా బతుక్కి? ఏంది ఈ అన్యాయం?” అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ!

పక్కన ఉన్న ముగ్గురూ అవునన్నట్లు మౌనంగా తలలూపారు.

నాకేమి చెప్పాలో పాలు పోలేదు.

మళ్ళీ అతనే “ఈళ్ళేమన్నా నిజంగా జనం మీద ప్రేమతో జేస్చనారా ఏంది ఈ దర్నాలు? ఇంటి కాడ కూత్కాయి దాకా తినేసి వొస్చారా …… ? అది అరగాలి గా ! ఇంగ ఈడికొచ్చి ఈ గలాట జేస్చనారు” అన్నాడు.

పక్కనున్న పోలీసులిద్దరు కలగజేసుకుని ” రేయ్ పోనీరా సర్లే గానీ, మనకియ్యాన్నీ అలవాటేగదా” అన్నాడు

“ఏంది అలవాటు? ఆర్నెల్ల నుంచి ఇంటి మొహమే జూళ్ళా నేను! నా కూతురెట్ల ఉందో కూడా తెలీదు.ఏంది అలవాటు?” అని నా వైపు చూసి “నాకు రెండు రోజులు సెలవులిస్తే పోయి పెళ్ళాం పక్కలో పడుకుని వొస్తానన్నా” అన్నాడు.

షాక్ తిన్నాను ఒక్కసారిగా ! నిమిషం క్రితం పరిచయమైన అపరిచితుడిని నేను. అయినా నా వద్ద అంత పచ్చిగా తన బాధను వెళ్ళబోసుకున్నాడంటే పాపం ఎంత కుంగిపోయి ఉన్నాడో ….అనుకుంటూ అతని వైపు చూశాను.

అతని వయసు 30 లోపే ఉంటుంది. కాస్త ఎమోషనల్ గా తీవ్రంగా స్పందించే తత్వం ఉన్న వ్యక్తిలా కనపడుతున్నాడు. పక్కనున్న వారికి 40 ఏళ్ళ పైనే వయసుంటుంది. వాళ్ళు ఇతని ఆవేశాన్ని మామూలుగా చూస్తున్నారు. బహుశా అనుభవం నేర్పిన పాఠమో , సహనమో! వృత్తి జీవితం నేర్పిన రాజీ తత్వం వాళ్ళలో కనపడుతోంది .

“నిజమన్నా రెండు రోజులు చాలు నాకు ! ఎన్ని రోజులైందో పెండ్లాం బిడ్డల్ని చూసి! ఇక్కడ ఈ ముండ నా కొడుకులు జూడు, రోజంతా కావాల్సినన్ని జల్సాలు జేసుకుంటూ, రోజూ పెండ్లాం పక్కలో పడుకుంటా , బోరు కొట్టినపుడు దర్నాలకు దిగతారు. వీళ్ల కోసం మా బతుకులు ఇట్లా జేసుకొవాల్నా” అన్నాడు మొదటి పోలిసు.

“ఇంగ పోనీరా నాయనా !ఎంత మొత్తుకుంటే ఏమి లాబం? ! ఎవరన్నా ఆరుస్చారా తీరుస్చారా?” పక్కనున్న ఇద్దరు పోలీసులు అనునయించడానికి ప్రయత్నించారు.

అప్పటి వరకూ మాట్లాడకుండా ఉన్న నాలుగో పోలీసు నెమ్మది గా అన్నాడు ” ఆరు నెల్లవుతుంది ఇంటికి పోయి. ఎప్పుడు పోదామన్నా ఏదో ఒక కర్ఫ్యూనో మరొగటో వొచ్చి సెలవు ఇయ్యనే లేదు. ఇంటికాడ ఏమి జరుగుతుందో అర్థం కాదు. నా కూతురు పదో క్లాసు చదవతా ఉండాది . ఎట్లా చదువుతున్నావమ్మా అని పక్కన గూచొని అడిగిన పాపాన పోలా నేను !! ఏమి సమస్యలున్నయ్యో తెలవదు. ఎవరికైనా రోగమో రొష్టో వస్తే దగ్గా మగ మనిషి ఉంటే ఆ దైర్నం వెరు గదా ! ఏ ఆర్నెల్లకో ఇంటికి పోతే రెండు మూడ్రోజులు సంబరంగానే ఉంటుందా…ఆ తర్వాత ఇంట్లో ఏదో ఒక గొడవ. ఇన్నాళ్ళుగా ఇంట్లో నేను లేనప్పుడు పడిన బాదలన్నీ చెప్తంది నా బార్య. పైగా అదేదో నా తప్పన్నట్లు మాట్లాడుతుంది. అంతే…కొంచెం కూడా సుకం, శాంతి ఉండదు. ఎప్పుడెప్పుడు డ్యూటీకి పోతానా అనిపిస్తింది . ఈడికొచ్చినాక మళ్ళీ ఎప్పుడు ఇంటికి పోతానా అని చూస్తాను ”

మా మాటలు జరుగుతూ ఉండగానే దర్నాను పర్యవేక్షిస్తున్న సి ఐ లోకల్ నాయకుడిని పిల్చి “గంట అయిపోయింది గా, ఇంగ ఆపేయండి దర్నా ! అటు జూడండయ్యా బండ్లన్నీ ఎట్లా ఆగి పోయున్నాయో ” అన్నాడు రోడ్డు వైపు చూపిస్తూ. ఆయన చెప్పింది నిజమే! అది హైవే కావడం తో దాదాపు రెండు వందల వాహనాలు రెండు కిలోమీటర్ల మేర అటూ ఇటూ ఆగిపోయి ఉన్నాయి రోడ్డు మీద .

ఆ లోకల్ లీడర్ వచ్చి సి ఐ ని బతిమాలుతూ “ఇంకొక్క గంట తట్టుకోండి సార్, గంటకే అయిపోతే జనాల ముందు అబాసు అయిపోతాము. రోంత తట్టుకోండి” అంటున్నాడు . జనం దృష్టిలో పడాలంటే ఎక్కువ సేపు ధర్నా చేయాలి, ఎక్కువ వాహనాలు ఆగిపోవాలి, న్యూస్ పేపర్లో, టివీలో రావాలి..ఫలితంగా పార్టీలో పై లీడర్ల వద్ద తన పరపతి పెరగాలని అతని తంటా!

ఎవరి గోల వాళ్లది. ఎవడి తంటా వాడిది

సి ఐ అతని మాటల్ని లెక్క చేయకుండా “ఇంగ జాల్లేవయ్యా… ఇది రేపు పేపర్లో పడుతుంది లే పో! ఫొటో కూడా వొస్తుంది. వెళ్ళి పొమ్మని చెప్పు మీ వాళ్లకి” అని హుకుం జారీ చేశాడు.

“అయ్యన్నీ మామూలే నన్నా, అప్పుడే దర్నా ఆపరు” అన్నాడు నలుగుర్లో ఒక పోలిసు. చటుకున్న ఇటువైపు తల తిప్పాను. ఇందాక మాట్లాడిన పోలీసే మళ్ళీ అందుకున్నాడు.

“ఇదిగో ఈయన కత కూడా అంతే! ఇన్నాళ్ళు గా ఇక్కడ డ్యూటీ చేస్తాడా..! ఏ ఆర్నెల్లకో ఇంటికి పోతే బోలెడు పన్లు, సమస్యలు! మగోళ్ళు మాత్రమే తిరిగి చేయాల్సిన పనులన్నీ వాయిదా పడుంటాయి గదా ! అయ్యన్నీ ఒక్కసారి వొచ్చి నెత్తిన పడతాయి. దానితో మొగుడూ పెళ్ళాల మధ్య మాటా మాటా వొచ్చి గొడవలవుతాయి. దాంతో మంచం పంచుకోరు. దానికోసం ఈయన బయట తిప్పలు పడతాడు పాపం. ఏవని జెప్పాలి?”

తన వ్యక్తిగత విషయాలు అలా బట్టబయలు చేయడం చూసి పక్కనున్న పోలిసు విసుక్కున్నాడు “సాల్లే సంబడం, రోంత కూడా మర్యాద లేకుండా” అన్నాడు కోపాన్ని కనబరుస్తూ .

“సంబడం కాదన్నా, రేపు నా బతుకు కూడా నీ బతుకులాగా కాకూడదు కదా!” అని మళ్ళీ నా వైపు తిరిగాడు “నా బార్య మరీ మెతక మనిషన్నా! ఎవరితోనూ పూసుకుని తిరగదు. నోట్లో నాలిక లేదు. నా కూతురికి రెండేళ్ళు వొస్తున్నాయి. ఎప్పుడు ఇంటికి పోయినా దగ్గరికి రాదు. బెరుకు బెరుకు గా చూస్తాది. రెండు మూడు రోజులు పోతే తప్ప దగ్గరికి రాదు. అదెంత బాదనుకున్నావ్? వీళ్ళని చూస్తుంటే నా బతుకు కూడా ఇట్లనే అయితిందా అనిపిస్తుంది ఒక్కోసారి” అన్నాడు.

ఈ లోపు లోకల్ నాయకుడికి సి ఐ కి మధ్య మాటలు పెరిగాయి. ఫోన్లో పై నాయకుల నుంచి ఆదేశాలు రావడం తో దర్నాని మరి కొంచెం పెద్ద గొడగా మార్చి , రాష్ట్ర స్థాయిలో తన మైలేజి పెంచుకోవాలన్న తపన తో సి ఐ తో వాగ్వాదానికి దిగాడు.

“గొడవ అయ్యేట్టుంది పదండి” అని పోలిసులు నలుగురూ గన్స్ సర్దుకుని గబ గబా ముందుకు నడిచారు.

వాళ్ళు వెళ్ళినా వాళ్ళ మాటలు మాత్రం నన్ను వదల్లేదు.

“సమాజాన్ని అరాచకాల నుంచి అకృత్యాల నుంచి రక్షించడానికే ఉన్నాయి ఈ ఉద్యోగాలు! ఎంతో కఠిన శారీరక శిక్షణ తరవాత వస్తారు. కానీ ఆచరణలోకి వచ్చి , ఎదురైన పరిస్థితుల్ని చూస్తే…. కర్కశంగా ప్రవర్తించడం తప్ప ఏమీ చేయలేని వాస్తవ స్థితి వీళ్ళను నిరాశలోకి నెట్టేస్తుందా? మామూలు పౌర జీవితాన్ని తమ జీవితంలోని వెలితి తో పోల్చి చూసుకుని ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోతారా?

“ఏమి జీవితాలో పాపం” అన్నాను నాలో నేను మాట్లాడుకుంటున్నట్లు!!

“ఏం చేస్తారండీ, ఏదో ఒకటి చేసి బతకాలి గదా! ఎంత కష్టమైనా గవర్నమెంట్ ఉజ్జోగం కదా ! అంత పోటీ ఉంటుందో ఈ ఉజ్జోగాలకి మీకు తెలీదా ఏంది” అన్నాడు రెండడుగుల దూరంలో సిగరెట్ ఊదుతూ నిల్చున్న నా సాటి బస్ ప్రయాణీకుడు.

“అలా అని కాదు, వారికి కూడా విశ్రాంతి అవసరం కదా, ఎంత భద్రతా దళాలైనా! కుటుంబం తో గడపలేని పరిస్థితి, నిరంతరం డ్యూటీలు..పాపం ఎంత నలిగి పోతారో ” అన్నాను .

“అంతే కాదు గా? నెలల తరబడి సంసార జీవితానికి దూరంగా ఉండటం, మిగతా వారందరికీ దక్కేది తమకు దక్కలేదన్న కసిని వాళ్ళలో పెంచేస్తుంది. సెక్స్ మనిషిని రిలాక్స్ చేస్తుంది . ఒత్తిడి నుంచి విముక్తి కల్గిస్తుంది అని అందరికి తెలుసు !! కానీ వీళ్ళ విషయం వచ్చే సరికి అది వారికి కూడా అవసరమనే విషయం ఎవరూ గుర్తించరు. మామూలు జనం లాగా సాయంత్రం ఇల్లు జేరగానే ఎదురయ్యే పిల్లలు, సినిమాలు షికార్లు ఏమీ ఉండవు. అనుక్షణం ఒత్తిడి. రిలాక్స్ కావడానికి అవకాశం ఏదీ? భర్త ఇక్కడ ఉన్న కాలంలో ఇంట్లో ఉన్న భార్య పరిస్థితో? ఎన్నో కోరికలు ఉంటాయి. భర్త ఇంట్లో ఉన్నపుడే చెయ్యాల్సిన పనులుంటాయి. తీరాల్సిన సాంగ్యాలు ఉంటాయి . అర్థం చేసుకోవాలి , సర్దుకోవాలి అని పెద్దోళ్ళు చెప్తుంటారు నిజమే కానీ, ఇంటికి ఇన్నేసి రోజులు దూరంగా ఉన్నోళ్ళకు ఆచరణలో ఈ అర్థం చేసుకోవడం అనేది అంత సులభం కాదు! దూరంగా ఉన్న భర్త ఇంటికి రాగానే ఎన్నో ఆలోచనలు పంచుకోవాలని ఉంటుంది స్త్రీలకు. ఏదో ఎక్కడో లోపల అసంతృప్తి ! దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలీదు … ఇద్దరికీ ! అది మెల్లి మెల్లి గా పెరిగి దాని ప్రభావం సంసారం మీద పడుతుంది . “అన్నాడు అతను సిగరెట్ నుసిని విదిలిస్తూ కూల్ గా ..

ఆశ్చర్యంగా చూసాను అతని పరిశీలనకు

పైగా వీళ్ళు చేయాల్సిన డ్యూటిలో కూడా ఎంతో కఠినంగా ఉండాల్సి వొస్తొంది. జనాలకు వీళ్ళను చూస్తే భయమే తప్ప గౌరవం ఉండదాయె! ఖాకీల దౌష్ట్యం, దురాగతం అని మీడియా కూడా వీళ్ళని భూతాల్ని చేసి చూపిస్తుంది! వీళ్లకు తగిలే దెబ్బలకు వార్తల్లో చోటే ఉండదు…” అన్నాడు అతను . తల వూపాను అవునన్నట్లు..

“…ఇన్ని బాధలు పడుతూ ఎప్పుడో ఇంటికి పోతారా..? మొగుడూ పెళ్ళాల మధ్య ఏవో తేడాలు! ఒక్కదాన్నే నెట్టుకొస్తున్నాను అని ఆమె అంటుంది. నేనేమైనా సుఖ పడుతున్నానా అని ఈయన అంటాడు.. ! ఫలితంగా గొడవలు… మానసికంగా సరే, శారీరకంగా కూడా దూరం పెరగడం. లోపల ఎక్కడో అసంతృప్తి,ఏమి చేసి దాన్ని పోగొట్టుకోవాలో తెలీదు! అందుకే ఇలాటి గలాటాలు జరిగినపుడు కసి కొద్దీ లాఠీలకు పని చెప్పి జనం మీద చూపిస్తుంటారు. అది తప్పో కాదో వాళ్ళకు తెలీదు. వాళ్లకు అవుట్ లెట్ కావాలి ” అతను చెప్తుండగానే ఏదో గొడవ అవుతున్నట్లు కేకలు వినపడి అటు చూశాము ఇద్దరమూ.

ధర్నా తీవ్రం అవుతున్నట్లు ఉంది . జనం తోసుకుంటున్నారు. ఏవో పార్టీనినాదాలు వినిపిస్తున్నాయి. గుంపులో ఎవడో ఒకడు బస్సు అద్దాలు పగిలేలా రాళ్ళు విసరడం తో అదొక అంటువ్యాధిలా వ్యాపించి వెంటనే గాల్లోకి లేచాయి రాళ్లు. అటూ ఇటూ రోడ్ల మీద ఆగి ఇన్న లారీలు బస్సుల అద్దాలు టప టపా పగిలిపోతున్నాయి. పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఒక వైపు గా నిలబడి ఉన్న ఒక మీడియా ఛానెల్ కెమెరా మన్ లాఠీలతో విరగ బాదుతున్న పోలీసుల్ని శ్రద్ధగా చిత్రీకరిస్తున్నాడు. లోకల్ నాయకుడి మీద విరుచుకు పడ్డారు సి ఆర్ పి ఎఫ్ పోలీసులు. తెలియని కసి వాళ్ళ మొహాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

సి ఐ. టియర్ గాస్ వదలమంటున్నాడు. టియర్ గాస్ ఉన్న పోలిసు ఎంత ప్రయత్నించినా అది గాల్లోకి విడుదల కానే లేదు. ఈ లోపు జనం విసిరిన రాళ్ళు తగిలి ఇద్దరు పోలిసులకు తల పగిలి రక్తం కారడం మొదలైంది. సి ఐ ఫోన్లో ఎవరితోనో మాట్లాడి గాల్లోకి ఫైరింగ్ చేయమని అనుమతి ఇచ్చాడు.

ఇందాక నాతో మాట్లాడిన పోలిసు “గాల్లోకి ఎందుకు సార్, జనాల మీదికే కాలుస్తాను” అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ! ఎర్రబడ్డ కళ్ళు, కళ్ళ కింద అలసట, నిద్ర లేమి తాలూకు చిహ్నాలు…మొహంలో కోపం తీవ్రత ..అతడిని చూస్తే భయం వేస్తోంది నిజంగా!

సి ఐ కంగారు పడి పోయాడు. “ఏయ్, మతి పోయిందా నీకు? ఇది ఎస్పీ ఆర్డర్..ఫైరింగ్ చెయ్,…గాల్లోకి” అంటూ దానితో పాటే నాలుగు బూతు మాటలు వాడాడు .

ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మొహంలో మరింత కాఠిన్యం చోటు చేసుకుంది. “లేదు సార్, జనం మీదికే కాలుస్తా! గాల్లోకి పేల్చి గుండ్లెందుకు వేస్టు జెయ్యాల? నాలుగైదు శవాలు పడితే గానీ ముండకొడుకులకు బుద్ధి రాదు” అని మెషీన్ గన్ ని ఎత్తి పట్టుకున్నాడు.

నాకు ఒళ్ళు జలదరించింది. ట్రిగ్గర్ నొక్కితే నాలుగైదు కాదు, పిట్టల్లా రాలిపోతారు జనం. మరో పక్క పోలీసులు జనం రాళ్ల నుంచి తప్పించుకుంటూ ఈ సి ఆరి పి ఎఫ్ పోలీసు ప్రవర్తన చూసి నివ్వెర పోతున్నారు. అతని ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి అర్థమవుతున్నా… జనం మీదికి కాల్చడం ఎంత అవివేకమో అతనికి చెప్పే ధైర్యం చెయ్యలేకపోయారు.అతని చేతిలో గన్ సిద్ధంగా ఉంది మరి !

అతని పరిస్థితి అక్కడ ఉన్న చాలా మందికి అర్థం కావడం లేదు . “ఎంత పొగరో చూడండి పోలీసు నా కొడుకులకు.జనం మీదికి కాలుస్తాడంట. తిని కూచుని… పని లేక….! వీళ్లకసలు ఇట్టా ఎక్కడైనా గలాటా అయితే తప్ప డ్యూటీలే ఉండవంట ” ఎవరో అంటున్నారు.

నా పక్కన ఉన్న వ్యక్తి అటు చూసి నింపాదిగా నవ్వాడు. తిరిగి నా వైపు చూస్తూ ” చూశారా? జనం ఏమనుకుంటా ఉన్నారో? ఎవరి ఉద్యోగం లో అయినా ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. దాన్ని వాళ్లు కింది ఉద్యోగుల మీద చూపిస్తారు. ఇప్పటికే కానిస్టేబుల్స్ గా ఉన్న వాళ్ళు దాన్ని ఎవరి మీద చూపించాలో తెలీక ఇదిగో చూడండి….ఇట్లా తెగబడతారు. అటు వైపు చూడండి ఆ న్యూస్ ఛానెల్ వాడు చూడండి… పోలీసుల్ని మాత్రమే చూపిస్తూ “దమన కాండ, దుర్నీతి “లాంటి తుప్పు పట్టిన మాటలు వాడుతూ పాపం వీళ్లని మరింత రాక్షసులుగా చూపిస్తున్నాడు!! మామూలు మనుషులు వీటిని చూసి టీవీ ముందు కూచుని సమాజాన్ని బేరీజు వేస్తుంటారు. అదీ సహజమే! వాళ్ల జీవితాల్లో ఉండేదేందో ఎవరికి తెలుసు! ఎవరి బాదలు వాళ్ళకే తెలుస్తాయి!ఏవంటారు” అన్నాడు.

కాల్పులకు సిద్ధ పడిన సి ఆర్ పీ ఎఫ్ జావాను ని ఇద్దరు పోలీసులు పట్టి అవతలికి తీసుకెళ్తున్నారు.పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లుంది నెమ్మదిగా! డ్రైవర్లు బస్సుల వైపు నడుస్తూ ప్రయాణీకుల్ని వచ్చి ఎక్కమని హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా ఇద్దరం మా బస్సు వైపు నడిచాము. మా బస్సు అద్దాలేవీ దాడికి గురి కాలేదు.

మరి కాసేపటికి రోడ్డు క్లియర్ అయి బస్సు బయలు దేరింది. ఆలోచనలు తుట్టలు తుట్టలుగా ముసురుతున్నాయి.

వృత్తి జీవితం లో ఉండే ఒత్తిడి స్ట్రెస్ సమాజం పట్ల మనిషి దృష్టిని, అతడి ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండు.. అనుకుంటూ “మీరేమి చేస్తారు సార్” అని అడిగాను అతన్ని.

నవ్వాడు ఆయన . “పోలీసునే ఒకప్పుడు. ఎస్సైగా చేస్తూ వాలంటరీ తీసుకున్నాను. పిల్లల్ని చదివించుకుంటూ ఏదో చిన్న షాపు పెట్టుకుని కాస్త హాయిగా బతుకుతున్నా ఇప్పుడు… “అన్నాడు.

బస్ పోలీసుల్ని దాటుకుంటూ పోతోంది. నుదురు మీద దెబ్బ తగిలి రక్తం కారుతున్న కానిస్టేబుల్ ని కూచోబెట్టి సోడా తాగిస్తున్నాడు మరో కానిస్టేబుల్. చెమట తుడుచుకుంటూ సి ఐ ఫోన్లో ఎవరితోనో సంజాయిషీ ఇచ్చుకుంటూ ప్రాధేయపడుతున్నాడు. మరో వైపు ఏదో వార్తా చానెల్ విలేకరి పోలీసుల రాక్షసత్వాన్ని వర్ణించడానికి పదాలు వెదుక్కుంటున్నాడు.