కథన కుతూహలం

స్లోగన్లు లేని విప్లవం కథ మన్నం సింధు మాధురి “కాళావు”

ఏప్రిల్ 2013

కొన్ని కథలు జీవితాల్ని పరిచయం చేస్తాయి. ‘అసలు ఇలాక్కూడా ఉంటాయా జీవితాలు’ అని సామాన్యులు ఆశ్చర్యపోయే నిస్సహాయమైన,అసాధారణమైన,అద్భుతమైన అభాగ్యుల జీవితాల గురించి కొందరే తమ రచనల ద్వారా పరిచయం చేస్తారు. అలాంటి ఒక కథ ‘కాళావు’. అలాంటి ఒక సాహసి మన్నం సింధు మాధురి.

మొట్టమొదటిసారిగా కథ చదివినప్పుడు ఒకరకమైన గగుర్పాటుకి లోనయ్యాను. మళ్ళీ చదివినప్పుడు మరింత ఎక్కువయ్యింది. ఎంచుకున్న నేపధ్యం, వాడిన శైలి, వాడైన శిల్పం, వొడుపు ఉన్న యాస, జానపదసాహిత్యాన్ని పోలిన కథనగుణం అన్నీ కలగలిపి ఒక క్లాసిక్ కథగా నిలపగలిగిన తీవ్రత ఉంది ఈ కథలో అనిపించింది.

“జీవితం అంటే ఏంటి? మనస్సంటే? శరీరం అంటే ఏంటి? ఈ మూడిటికీ ఉన్న బంధం ఎలాంటిది. ఒకదానికొకటి ఎందుకు ఎదురు తిరుగుతయ్యి. ఒకే దిశలో ఎందుకు నడవవు. మనస్సుకీ శరీరానికీ ఏంటి మెలిక. కాస్సేపు మనసుని ఎందుకు పక్కకి తొయ్యలేము. నాకేనా అందరు ఆడాళ్లకీ ఇంతేనా. అర్థం కాలేదు.” ఒక జోగిని ప్రశ్న ఇది. బసివినిని చేసి మగాళ్ళ కామవాంఛల్ని లాంఛనంగా తీర్చమని బలవంతం చెయ్యబడిన ఒక స్త్రీ ప్రశ్న ఇది. మొదటి మగాణ్ణి సహజంగానే నావోడని instinctiveగా నమ్మి ప్రేమించే primordial స్త్రీ మనస్తత్వపు ప్రశ్న ఇది. చాలా లోతైన ఘాఢమైన ప్రశ్న. ఇంత profound ప్రశ్న అడిగిన కాళావు మనసు, బ్రతుకు, భవిష్యత్తుని ఆర్తిగా తనలో ఇముడ్చుకుని ఒక దేవరహస్యంలాగా, కాటిపాపడి మాయలాగా మనకు పరిచయం చేసి, మనలో కాళావుని ప్రతిష్టించి, పూజింపజేసే కథ ఇది.

కాటిపాపడి రాకతో ఒక డాక్టర్ గారి అమ్మాయి మనసులో రేగిన జ్ఞాపకాల తుట్టెతో మొదలౌతుంది కథ. ఆ అమ్మాయి ధృక్కోణంలో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా కాళావు, కాళావు తమ్ముడు ప్రత్యక్షమౌతారు. కథ మన కళ్లముంది సాగుతుంది. కాళావుని బసివిని చెయ్యడం. గవాక్షం (గవాచం) వెలుగుతో కాళావు మౌనసంభాషణలు. మొదటి రాక్షస రతితో మానవత్వం లేని, మనిషితత్వం కోల్పోయిన మగాళ్ళనే మనుషులతో ఘర్షణ. తన జాగృతమైన మనసుతో సంఘర్షణల వివరణల మధ్య సాగుతుంది.

“అరుద్దాం అనుకునే అంతలో ఏదో భయంకరమైన అవయవం నా శరీరంలో ప్రవేశించింది, ఒక చెయ్యి నా నోటిని మోసేసింది. బలవంతపు నెప్పి, వళ్ళంతా కొట్టి పడేసిన పచ్చి పుండులా ఎదురుదెబ్బ తిన్న కాలిబొటన వేలికి జొన్న మోడు కస్సున దిగబడిన నెప్పిలాంటి ఒక నెప్పి, దీన్ని నాకిచ్చి, తలకిందకొన్ని నోట్లు ఉంచి రాత్తిరి రెండింటికి గౌడు ఎప్పి పోయాడు” అంటూ కాళావు మొదటి అనుభవాన్ని రచయిత్రి వర్ణించిన తీరు చదివితే, పాఠకుడికళ్లలోనూ వెలుగు మాయమై కాళావుకు గవాక్షంలో కనిపించిన నల్లవెలుగే కనిపించక మానదు. ఎదుటివాళ్లకు మాత్రమే సుఖ్ఖాన్నిచ్చే ఈ కాళావు దు:ఖంలో తనకున్న ఒకేఒక్క ఆటవిడుపు కాటిపాపడి మాయ. ఆ మాయపుచ్చే కాస్సేపటి ఆనందమే. ఇంతలో గర్భం. తుంచడానికి అందరి ప్రయత్నం. గౌడు ఆసరాకొసం వెళితే గుండెపగిలే ఒక నిజం. అంత ఘర్షణలోనూ కాటిపాపడి “ఇదే ఆసరా.దీంతోనే జీవితం.”అనే ఎరుకలో బిడ్డడి జన్మం. మూడు నెలలు కాగానే మళ్ళీ కాళావుకి దినదిన మరణం. గౌడుతో పాటూ గౌడుసావాసగాడితో సహవాసం. ఈ అన్నింటి మధ్యా పిల్లాడు పెరగడం. పెరుగుతున్న పిల్లడి ఇబ్బందికరమైన ఐడెంటిటీ ప్రశ్నల మధ్య పెల్లుబికే అవాజ్యమైన ప్రేమ. పసిమనసుకు అర్థమైన తల్లికష్టాన్ని తీర్చడానికి ఎనిమిదేళ్ళ కొడుకు చేసే యుద్ధం. చివరిగా కాటిపాపడి మాయతో విజయం.

ఒక రచయితకు భావపుష్టి, పలుకుబడి ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం సాంస్కృతిక సంపద – Cultural capital. ఆ సాంస్కృతిక సంపద పుష్కలంగా కలిగిన రచయిత్రి మన్నం సింధు మాధురి. వ్యవసాయం కోసం కోస్తాప్రాంతం నుంచీ కర్ణాటక గంగావతి ప్రాంతానికి వలసవెళ్ళిన కుంటుంబాల నేపధ్యం గలిగిన సింధు మాధురి కథల్లో ఆ తెలుగు కన్నడ మిశ్రమ సంస్కృతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. Culture in trasition తోపాటూ ఒక సొగసైన యాస మట్టివాసనల్ని వెదజల్లుతూ ఉంటుంది. రాసే విధానంలో సహజంగా మాట్లాడిన తీరు ప్రతిఫలిస్తూ సహజత్వం ఉట్టిపడుతుంది. కొన్ని పదాలు, కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఠక్కున అర్థంకాకున్నా, భావం ఎక్కడా చెడని శిల్పం, ఒడుపు రచయిత్రి సొంతం.

అక్కడక్కడా పాత్రల సహజ ప్రవృత్తి, వాళ్ళకే తెలీని సైద్ధాంతిక మూలాల్లోంచీ కొన్ని భావప్రకటనల్ని పదాల్లో పలికించి పాఠకుడిలో రసస్పందన కలిగించడం (మిగతా కథలతో పాటూ) కాళావు ప్రత్యేకత. స్కూల్లో కొడుకుపేరు పరమేశ్వరుడు అని రాస్తున్నప్పుడు ‘ఉన్నాడో లేడో తెలియనివాడు ఇలా ఉపయోగపడ్డాడు’ అని దేవుడిపై నిరసన ప్రదర్సించినా, గౌడుతోపాటూ వచ్చే మగాళ్లను ‘పొలం మీద పడిమేసే దేవరదున్నలు. అంబోతుల జాతి’ అని ఈ సడించుకున్నా, ‘పుట్టంగానే లోకం కుళ్ళు భరించలేక కేర్ కేర్ న ఏడిశాడు’ అని పుట్టిన బిడ్డ ఏడుపుని అభివర్ణించినా అన్నీ కథకురాలికే చెల్లు. కాళావు వివిధ దశల్లో వివిధ మూడ్స్ లో గవాక్షాన్ని దాని వెలుగునీ చూసి అనుభవించిన తీరుని రచయిత్రి పదాలతో పెయింట్ చేసిన విధానం అద్భుతం.

జానపదకథలు చెప్పే తీరులాంటి నెరెటివ్ కారణంగా ఒక మిస్టరీ, ఒక ఉత్తేజం, ఒక అద్భుత గాథలా ఈ కథ గోచరించడంతోపాటు విషయంలోని ఘాఢత, తీవ్రత పాఠకుడికి సమస్య పట్ల తీవ్ర నిరసనతోపాటూ సహానుభూతిని కలిగిస్తుంది. స్లోగన్లు లేని సైలెంట్ విప్లవ గాథ, కాళావు కథ.

http://www.scribd.com/doc/96722685/Kallavu-Mannam-Sindhu-Madhuri-Story-The-Sunday-India

 

 

 



15 Responses to స్లోగన్లు లేని విప్లవం కథ మన్నం సింధు మాధురి “కాళావు”

  1. ns murty
    April 1, 2013 at 5:55 pm

    మహేష్ గారూ,

    చాలా మంచికథని పరిచయం చెయ్యడమే కాదు, చాలా చక్కగా ఉంది మీ విశ్లేషణ.

    రచయిత్రికి అభినందనలు.

    • April 3, 2013 at 4:39 pm

      మామూలుగా కథలు ఎవరికెవరు చదువుకుని అనుభవిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటాను. కానీ కొన్ని కథలు చదివినప్పుడు కలిగే భావావేశాన్ని దాచుకోలేక, కారణాల్ని వెతుక్కుంటూ నాలోసాగే ఆలోచనలకి కొంత (నాకు తెలిసిన) లిటరరీ థియరీని అన్వయించుకుంటూ ఒక విశ్లేషణ చేసుకుంటాను. అలా చేసుకుని వదిలెయ్యకుండా రాయాలి అంటే ఎవరో ఒకరు రాయమని పట్టుబట్టాలి. ఆ పని వాకిలి చేసింది. అందుకే ఇలా…

  2. April 2, 2013 at 6:05 am

    Dear Sister,

    Last weekend mee katha ‘KALAVU’ chadivanu. Its really heart touching. Nenu enthaku mundu ‘Jogini’ vyavasta gurinchi vinnanu kani ee katha chadivina tharuvatha adi entha darunam ga untunda anipinchindi. Elanti kathalu rayadaniki mundu writer ki guts undali endukante ‘how the readers will accept’ anedani gurinchi.. Meeru enchukonna ethivruttam alage meeru danini rasina vidhananiki Naa hrudaya purvaka abhinandanalu. Meenundi marenno manchi kathalanu aashistu

    -Srinivas Mannem

  3. venkata thrinadha rama rao
    April 2, 2013 at 6:09 am

    namaste mahesh garu

    chala chala bagundi ee kadha jogini la jeevithalu yela vuntayo rachaitri chala baga chepparu jogini la manasuloni bhavalanu madhuri garu baga chepparu meeru ee kadhani parichayam chesi, visleshan chesinanduku krutanyatalu. sindhu gariki naa nakaskaralu

  4. లలిత
    April 2, 2013 at 9:46 am

    మాధురి గారు వ్రాసిందే క్యాంపు కథలని ఎక్కడో ఒక కథ చదివాను. చాలా ప్రత్యేకంగా ,ఎంత బాగా రాసారో అనుకున్నాను.
    మహేష్ గారూ మీ విశ్లేషణ ద్వారా ఆ కథనంలో ప్రత్యేకత ఏంటో తెలిసింది . అలాగే రచయిత్రి పరిచయం కూడా కలిగింది

    • April 3, 2013 at 4:45 pm

      ఉళేనూరు క్యాంపు కథలు అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో రాస్తున్న కథలు మన్నం సింధు మాధురి గారివే. కర్ణాటక క్యాంపు జీవితంలోని తన బాల్యం గురించి రాస్తున్న సిరీస్ అది. అదీ ఒక సాంస్కృతిక ప్రయోగమే సాహిత్యంలో అనిపిస్తుంది.

  5. satyavathi
    April 3, 2013 at 5:04 am

    సత్యవతి

    నమస్తె మాధురి గారు
    మీ కళ్లవు కధ చాలా బాగుంది జోగిని వ్యవస్త గురుంచి బాగా రాశారు కధలో వాడిని పదజాలం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది జోగినీల గురుంచి వినాడమే గాని ఇంత వివరంగా మీ కధలో తెలుసుకున్నాను మీ కధలు జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి మీరు కధలు కూడా చాలా ధైర్యంగా రాస్తారు మీ కధలు చాలా చదివాను చాలా చాలా బాగుంటాయి మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నాను ఇంకా మంచి కధలు మీ నుండి ఆశిస్తూ మీ అభిమాని

    మహేష్ కుమార్ గార్కి

    మీరు ఈ రచయిత్రి ని పరిచయం చేసి ఈ వాకిలి కె అందం తీసుకుని వచ్చారు మీ విశ్లేషణ కూడా చాలా బాగుంది కధ గురుంచి మీరు చెప్పిన తీరు చాలా బాగుంది ఈ కధాని పరిచయం చేసిన మీకు నా అభినందనలు

  6. April 3, 2013 at 5:45 am

    Mahesh garu madhurikee meeku abhinandanalu.chaalaa baagundi.

  7. April 3, 2013 at 6:47 am

    ఎంత పదునైన వ్యాక్యలు…మంచి కధను పరిచయం చేసారు. కధ లింక్ ఇవ్వటం బాగుంది.

  8. కృష్ణ
    April 3, 2013 at 10:42 am

    mee foto bagundi. oka mahaa-rachayitalaa unnaaru. mee vyaasam maatram bagoledu. not clear.

    • April 3, 2013 at 4:48 pm

      నేను ఆపధ్ధర్మ రచయితనిలెండి. ప్రొఫెషనల్ని కాను. కాబట్టి అంత అర్థవంతంగా అనిపించకపోవడంలో సందేహం లేదు.

  9. April 3, 2013 at 8:58 pm

    మహేష్ గారు,

    మంచి కథని పరిచయం చేసినందుకు థాంక్స్. పరిచయం చేసిన విధానం నచ్చింది.

    సింధు మాధురి గారికి అభినందనలు.

    రవి

  10. April 4, 2013 at 5:24 am

    మంచి కథను పరిచయం చేసినందుకు మహేష్ గారికి ధన్యవాదాలు..

    సింధు మాధురి గారి క్యాంపు కథలు ఆదివారం జ్యోతిలో క్రమం తప్పకుండా చదువుతుంటాను. తను రాసే శైలి చాలా బాగుంటుంది. నాకయితే కథ చదువుతున్నట్టుగా ఉండదు… నా బాల్యంలోకి తొంగి చూస్తున్నట్లుగా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది తను రాసే రచనల శైలి.. మంచి రచయిత్రి.. నాకు ఇష్టమైన రచయిత్రి గురించి, తన రచనల గురించి పరిచయం చేసినందుకు మహేష్ గారికి మరోసారి ధన్యవాదాలు…

    సింధు మాధురి గారికి మనస్ఫూర్తి అభినందనలు…

  11. రమాసుందరి
    April 5, 2013 at 8:45 am

    నిన్న కలాపి చదివాను. ఈ రోజు కళావు చదివాను. సింధు మాధురి సాహస రచయిత్రి అనే కంటే స్రీ జీవితపు కోణాలన్నింటిని సవివరంగా దర్శించిన మేధావి అనిపిస్తుంది.ఒక మహిళ రచయిత్రికి అంత బాహ్య ప్రపంచం ఉండటం అరుదు. మీ పరిచయం పదునుగా ఉంది.

Leave a Reply to కత్తి మహేష్ కుమార్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)