రా.వి.శాస్త్రి గారి ‘ఆరు సారా కథల’ను ఇరవై ఏళ్ళ కిందట మొదటిసారి చదివాను. అప్పటికే అవి రాసి 30 సంవత్సరాలు దాటింది.
రెండక్షరాల సారా చుట్టూ అల్లిన ఈ కథల శీర్షికల్లోనూ రెండక్షరాలే. (పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం).
వీటిలో… ఇన్నేళ్ళలో నేను మర్చిపోని కథానికల్లో ‘మాయ’ ఒకటి. సారా వ్యాపారం చేసుకునే ముత్యాలమ్మను పోలీసు హెడ్డు అక్రమంగా జైల్లో పెట్టటం, కేసు కోర్టు విచారణ, వాదనల తర్వాత ఆమె ఎలా బయటికి వచ్చిందన్నది స్థూలంగా కథ.
కథ ఇంతే! కానీ కథనం గురించి చెప్పాలంటే ఎంతో ఉంది!
ఈ ‘మాయ’ కథానికను ఈ లింకులో చదవొచ్చు: http://www.scribd.com/doc/135355638/Maaya
ఇలాంటి లింకు ఇచ్చాక- అధిక ప్రసంగం మాని పక్కకి తప్పుకోవటం మర్యాద అని తెలుసు.
కానీ మంచి సినిమాలోని అపురూప సన్నివేశాలను ఇష్టంగా గుర్తు చేసుకుంటామే… అలాగ ఈ కథలో, కథనంలో నాకు నచ్చినవేమిటో ఓసారి గుర్తు చేసుకుంటాను.
ఇంగ్లీష్ వారి వీరాభిమాని
ఇంగ్లీష్ వారి గుణగుణాల్ని వర్ణించడంలో వళ్ళు తెలీని ఓ పెద్ద ప్లీడరు న్యాయవాద వృత్తిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న మూర్తికి హితబోధ చేయటంతో ఈ కథానిక మొదలవుతుంది.
ఇంగ్లిష్ వాడిని ‘గొప్ప మాయగాడు’ అని వర్ణించే సందర్భంలో ఆ ప్లీడరు ‘‘ఆనంద పారవశ్యంలో నిమీలిత నేత్రుడై మాటాడతాడు’’. ఈ సందర్భంలో రావిశాస్త్రి మార్కు చురక- ‘‘ఆయనే కాని ఆడదైతే ఏ ఇంగ్లిష్ వాడితోనో ఒకడితో ఏనాడో లేచిపోయుండును’’!
‘వేశ్యలు వీధిగుమ్మాలు కనిపెట్టుకునుంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్ళాడుతాయి. కొంగలు రేవుని కాసుకునుంటాయి. సామ్యం బావులేదు. కాని మనం చెయ్యవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకునుండాలి. ’ అని ప్రబోధిస్తాడు పెద్ద ప్లీడరు.
కొంచెం పచ్చిగా చెప్పినా ఇది వాస్తవమే కదా?
‘‘… సివిల్ కేసవనీ, క్రిమినల్ కేసవనీ, సాక్ష్యంతోనే సంబంధం కానీ, సత్యంతో సంబంధం లేదు ’’అని ఘంటాపథంగా చెప్పేస్తాడు. అందుకే- న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించాలనీ, కానీ అంతా మాయేనని తెలుసుకోమంటాడు.
ఎందుకంటే ‘‘పద్ధతే’’ అలా ఉంది.
పద్ధతి అంటే వ్యవస్థ అని అర్థం చెప్పుకోవచ్చు. ‘‘ఇందులో మనం ఏం చేసినా సరే, పాపం మనకెలా అంటుకుంటుందదీ? అంటుకోడానికి వీల్లేదు’’ అని సమర్థించుకుంటూ వాదిస్తాడు.
పాపభీతి అనేది చెడుపనులు చేయకుండా నిరోధిస్తుందా? కష్టమే. పైగా వాళ్ళకు ఆత్మసమర్థన తోడైతే ఎలా ఉంటుందో ఈ ప్లీడరు మాటలే తేటతెల్లం చేస్తాయి.
కవిత్వంలాంటి వచనం
రావిశాస్త్రి గారి రచనల్లో కవిత్వ సదృశమైన వచనం వాక్యాలకు ఒక తూగునూ, లయనూ ఇస్తుంది. ఆ వచనంలో వ్యంగ్యం, వాస్తవం జోడుగుర్రాల్లా పరుగులు తీస్తుంటాయి.
సరదా సంభాషణైనా, నిస్సహాయ నిర్వేదమైనా హత్తుకునేలా చెప్పటం ఆయన రచనల స్వాభావిక లక్షణం. చూడండి ఈ వాక్యాలు- ‘‘… పాపాలన్నీ జడ్జీలవి. ఖర్చులన్నీ పార్టీలవి. లంచాలన్నీ సాక్షులవీ, గుమస్తాలవీ. ఫీజులన్నీ మనవి’’
‘‘నా మొగుడు సారాపాలైపోనాడు. నా యాపారం పోలీసోళ్ళ పాలైపోనాది. నా కూతురు కుక్కలపాలైపోనాది.’’
రావిశాస్త్రి తన కథల్లో మనుషులను వర్ణించే తీరు విచిత్రంగా ఉంటుంది. ఈ ‘మాయ’కథలో జామీను మనిషిని ‘గెద్దలాంటి మనిషి’ గా పోల్చి, ‘అతని పక్కనే మరో గెద్దలాంటి మనిషున్నాడు. అతను మరో జామీను మనిషి’ అంటారు. ఇక ముత్యాలమ్మ మొగుడు ‘కునుకు కుక్క’లా నిల్చున్నాడని వర్ణిస్తారు.
ముత్యాలమ్మను పరిచయం చేసిన తీరు రచయిత నైపుణ్యానికి ఓ మచ్చుతునక -
‘‘ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలా రోజుల క్రిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది. ’’
ఆమె ప్రస్తుతం ఎలా ఉందో నేరుగా రచయిత ఎక్కడా వర్ణించలేదు. ఒకప్పుడు ఎలా ఉండేదో మాత్రమే అంచనాగా సూచించారు. చాలు! చెప్పదల్చిందంతా స్పష్టంగా బొమ్మ కట్టింది. కాస్త వ్యంగ్యం కూడా అద్దుకుని ఆమె దు:స్థితి అంతా పాఠకుల మనసుల్లోకి అనితర సాధ్యంగా బదిలీ అయిపోయింది.
ఈ వాక్యాల సారాన్ని వేరే ఏ రకంగా చెప్పబోయినా- రావిశాస్త్రి గారి వాక్యాలతో పోలిస్తే పేలవంగానే ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు!
ముత్యాలమ్మ మొగుడు ‘‘సారా తప్ప వొణ్నం ముట్టడు’’. జామీను మనిషికి ఆమె నిస్సహాయత, పేదతనం బాగానే తెలుసు. కానీ జాలీ, దయా… ఇలాంటి గుణాలే కనపడవు అతనిలో. ఆమె ద్వారా తనకు వచ్చే కమీషనే ముఖ్యం. ఎందుకంటే అతడు దళారీ. నిజాన్ని జంకూ గొంకూ లేకుండా తలకిందులు చేయటంలో నేర్పరి. అందుకే ఫీజు కింద వందకు తక్కువ ముత్యాలమ్మను అడగొద్దని మూర్తికి సలహా ఇస్తాడు. ఇవ్వగలదా అనే సందేహపడితే ‘‘పులిసుంది ఇవ్వకేం చేస్తుంది!’ అని పచ్చి అబద్ధం చెప్తాడు.
ఈ లోపాయకారీ వ్యవహారాన్ని ముత్యాలమ్మ ఇట్టే గ్రహించేస్తుంది. సారా వ్యాపారం ఆమెకు మంచి చేయకపోయినా లోకంలోని చెడుగులన్నిటినీ గ్రహించేలా చేసింది. అనుబంధాల మీద నమ్మకం కోల్పోయేలా చేసింది. విరక్తితో ఆమె చెప్పే వాస్తవాలు ఎవరికైనా కంగారు పుట్టిస్తాయి. ఆవేదన కలిగిస్తాయి.
కట్ట తెగి ప్రవహించిన వేదన
ఏకబిగిన ఏరులాగా సాగే ముత్యాలమ్మ వాగ్ధోరణి ఈ కథలో ప్రత్యేకం. అది అసహజమనిపించదు. కారణం ఆమె చెప్పే మాటల్లోని కఠోర సత్యాలే. ఎదుట ఉన్నది మూర్తి లాంటి మంచి లాయర్ కాబట్టి ఆమె బర్ స్ట్ అయి, మనసు విప్పి చెప్పుకుందని అర్థం చేసుకోవచ్చు.
ఆమె పెను విషాదం సుదీర్ఘమైన దు:ఖంగా సాగి మాటలై పొంగుతుంది.
‘మోనోలాగ్’లా ఆమె చెపుతూపోతుంటే మూర్తి అవాక్కయి వింటుంటాడని ఊహించుకోవచ్చు. మరి దళారీ జామీను మనిషి రియాక్షన్ ? అంతకుముందే ‘‘నీకు నాను కాణిస్తే అందల సగం గుంజుతాడు’’ అని అతణ్ణి స్కాన్ చేసేసింది ముత్యాలమ్మ. వాడిక ఏమనాలో తోచక బిక్కచచ్చి నోర్మూసుకుని ఉండుంటాడు.
‘‘డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయ్యేన్నమ్ముతున్నారు….. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరేట్నేదీ లోకంలో’’ అని ఆమె చెప్పే మాటల్లో ఎవరూ కాదనలేని చేదు నిజాలున్నాయి.
‘‘… పేనం మీద ఇసుగెత్తి పోయున్నాను. కన్నతండ్రే కాదు, కట్టుకున్న మొగుడే కాదు, కడుపున పుట్టిన పిల్లలే కాదు- ఒవురన్నా నాకు నమ్మిక నేదు. ఆ కాడి కొచ్చినాక మరింక నాను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే! ’’
‘‘… పీడరు బాబూ! సారా టూబులూ, గాజు గలాసులూ దాసుకున్నాను గాని కన్నకూతుర్ని దాసుకోనేకపోనాను. ఏం బతుకు బాబూ నాది?’’
‘‘సీ! ఏటీ యాపారం? ఏటీ బతుకూ? అని నా మనసు మనుసంతా ఇరిగిపోయింది’’
ఎంత కష్టంలో ఉన్నా ఇతరులపై ఆధారపడకూడదనే ఆత్మగౌరవం ఆమెది. ‘‘నీ కష్టం నా మీదెందుకుండాల? ఇవ్వనేకపోతే యింట్లో అంట్లు తోమిస్తాను.’’ అంటుంది. ‘‘ సారా అమ్మకానికి దిగి, తాగేవోళ్ళని సెడిపేను, నాను సెడ్డాను ’’ అని అనే పశ్చాత్తాపం కూడా ఆమెలో ఉంది.
సరే, చివరకు ప్లీడర్ మూర్తి గట్టిగా క్రాస్ పరీక్ష చేసి ఇద్దరు సాక్షుల్లో ముఖ్యుణ్ణి బోల్తా కొట్టిస్తాడు. ‘మంచు విడిపోయినట్టుగా’ కేసు సులభంగా విడిపోతుంది.
కానీ అదంతా జరిగింది అతడి వాదనా పటిమ వల్ల కాదు. దానికి కారణం వేరు. ముత్తేలమ్మ అదేమిటో చెప్పేసరికి మూర్తికి
నీరసం వచ్చేస్తుంది. ఒక్కసారిగా చప్పబడిపోయి ముత్యాలమ్మ దగ్గర డబ్బు ససేమిరా తీసుకోడు.
‘‘చేసేదేం లేక, వణుకుతున్న చేతుల్తో డబ్బు తిరిగి పట్టుకు వెళ్ళిపోయింది ముత్యాలమ్మ’’
లోకమంతా చెడేనని తిరుగులేని నమ్మకం ఏర్పరచుకున్న ఆమెకు మూర్తి మంచితనం అనూహ్యం. అందుకే ఈ సందర్భంలో ఆమె చేతులు వణకటం!
తప్పుడు కేసుల మాయల నుంచి బయటపడటానికి ముత్యాలమ్మ లాంటి బడుగు జీవులకు ఎంత కష్టం.. ఎంత ప్రయత్నం… ఎంత బాధ!
ఈ వ్యవస్థలో ముత్యాలమ్మలకు కొదవ లేదు. మూర్తి లాంటివాళ్ళు ఎంతమంది ముందుకొచ్చి ఎంతవరకూ వారికి సాయపడగలుగుతారు?
ఇలాంటి ప్రశ్నలు రేపుతూ, ఆలోచింపజేస్తూ ముగుస్తుంది ఈ కథ.
పెద్ద ప్లీడరూ, ముత్యాలమ్మా స్వీయానుభవాలతో లోకం గుట్టు విప్పి చెప్పినపుడు మూర్తి గాభరా పడతాడు. అతడే కాదు; ఆ జీవితసత్యాలు పాఠకులకూ గాభరా పుట్టించి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి!
ఈ వ్యవస్థలో ముత్యాలమ్మలకు కొదవ లేదు. కాని రావి శాస్త్రులే ఇంకా రావాలి. మహరాణి పేట లో మా హాస్టల్ ఎదురుగా ఉండేది రావిశాస్త్రి గారి ఇల్లు. (ఇప్పుడు కొట్టేసి అపార్టమెంట్ కట్టేసారు.) ఇప్పటి సాహిత్య జ్ఞానం అప్పుడు ఇంత ఉంటే రోజు వెళ్ళి మొక్కి వచ్చేదాన్ని. మీ పరిచయం చాలా బాగుంది.
nenu ee maddina raavishaastri gaari rukkulu chadivaanu malle.aa rachanaa shaili ki emichhi runam theerchukovalo manam!
మా చాత్రి బాబు కత మా బా సెప్పీసినావు వేను బాబూ !!
ఏటీ సెప్పనేవూ …. ఒల్లకోనేవూ … దణ్ణవెట్టీసుకోతవే !!
Tried reading this nice story in my sahiti radio show in TORI radio.
http://www.mypodcastone.com/archives.php?q=5874&host_id=129
Indrani Palaparthy.
@ రమాసుందరి: రావిశాస్త్రి గారి లాంటి రచయితల అవసరం ఈ వ్యవస్థకు ఉంది. కానీ అది సాధ్యమేనా? మీ స్పందనకు సంతోషం.
@ venkatrao.n : రావిశాస్త్రి గారి రచనాశైలి చాలావరకూ బీనాదేవి గారి రచనల్లో చూడొచ్చు. థాంక్యూ.
@ రామ్: చాత్రి బాబు కత మా బా సెప్పీసినానా? తాంక్సండీ మరి.
@ indrani Palaparthy: ‘మాయ ’కథను శ్రవ్య కథన రూపంలో వినటం బాగుంది. రేడియో లింక్ ఇచ్చినందుకు థాంక్యూ.
దగాలనుంచీ,దోపిడులనుంచీ, మోసాలనుంచీ, అణచివేత నుంచీ పుట్టుకొచ్చిన అధోజగత్తు బిడ్డలు -బతుకు అరగదీసి సానపడితే ముత్యాలమ్మలౌతారు. సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్న పెద్దప్లీడర్లు గట్టిగా తత్వాలు చెబుతారు. స్పందించే సంస్కారం వున్న మూర్తులు చాలాసార్లు నిషి్క్రయాపరులగానే ఏం చేసినా ముత్యాలమ్మలే చెయ్యాలి. ఏంచేసినా పెద్దప్లీడర్లే చెయ్యాలి.
జీవితంలో సజీవత ఇదే. ఈ “చిరంజీవులను “మనముందుంచిన రావిశాస్త్రిగారూ చిరంజీవే. సామాజిక వాతావరణానికీ, సాహిత్యవాతావరణానికీ అతీతమైన కథ రావిశాస్త్రిగారిది. నేపధ్యాలూ, ఎత్తుగడలూ, పద్ధతులూ మారివుండోచ్చేమోగాని మూలాలు వందేళ్ళుగా అవే. అవసరం చూసి మనుషుల్ని వాడేసుకునే మనుషులున్నంతవరకూ ఈ మూలాలే వుండిపోతాయి.(అరువులుపెట్టి దొంగలెఖ్ఖలు చెప్పి పిల్లల డబ్బులన్నీ లాగేసుకోడానికి హైస్కూలు పక్కన జీళ్ళు పప్పుండలు అమ్ముకునే రాములమ్మ ప్లేసులో టై కట్టుకుని ఇంగ్లీషు మాటలతో వచ్చిన వోడాఫోన్ వాడు రకరకాల ఫోనాటలతో పిల్లల డబ్బులన్నీ లాగేసుకుంటున్నట్టు)
చేపనుచేప మింగేసే ఆటలో గడుసుతనాల మీద రావిశాస్త్రిగారివన్నీ వెటకారపు బాణాలే. అవి భలే తగిలేశాయని 50 ఏళ్ళతరువాత కూడా కులుక్కోడానికి మనకి అవకాశమిచ్చి పోయిన ఆ పెద్దమనిషి (రాచకొండ విశ్వనాధ శాసి్త్ర 30-7-1922 – 10-11-1993) మీద
పుస్తక ప్రేమికుడు, అపురూపమైన పాఠకుడు, మర్యాదస్తుడైన సమీక్షకుడు
మిత్రుడు వేణు పరిశీలన ఘనంగావుంది…రావిశాస్త్రిగారంటే వుండే మోజుతోపాటు అతిజాగ్రత్తగా వేణు కూర్చిన అక్షరాలవల్లా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి కొన్నిసార్లు చదివాను…పనిలోపనిగా అసలుకథా చదివాను
నవీన్ గారూ, >> చేపనుచేప మింగేసే ఆటలో గడుసుతనాల మీద రావిశాస్త్రిగారివన్నీ వెటకారపు బాణాలే. అవి భలే తగిలేశాయని 50 ఏళ్ళతరువాత కూడా కులుక్కోడానికి మనకి అవకాశమిచ్చి పోయిన.. >> ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది. మీ స్పందనకు కృతజ్ఞతలు.
ఈ కథ గురించి రాసినప్పుడు దీనిలో ఈ కథ గురించి శ్రీశ్రీ ప్రశంసను కూడా యథాతథంగా ఇవ్వాలని ఆశపడ్డాను. కానీ ఆ పుస్తకం దొరక్క కుదిరింది కాదు. ఇప్పుడా పుస్తకం దొరికింది!
‘ఆరు సారాకథలు’ పుస్తకంగా వచ్చినపుడు మే 1962లో ‘మొదటి మాట’ రాశారు శ్రీశ్రీ. దానిలో ఈ ‘మాయ ’ కథలో ముత్యాలమ్మ ప్రసంగాన్ని సాహితీ శిఖరంగా అభివర్ణించారు. ‘‘… ముఖ్యంగా ముత్యాలమ్మ మూర్తి వద్ద వెళ్ళబోసుకున్న సొద హృదయ విదారకమైనది. ఇది ‘One of the great passages in all literature’ అని నిరాక్షేపణీయంగా చెప్పవచ్చును’’.