కథ

సౌభాగ్యం రోడ్డున పడింది . (దానికి మనవేం చేస్తాం !)

మే 2013

లోకం తెలీని ఆరేడేళ్ళ పసిపిల్ల , ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకున్న రోగిష్టి మొగుడు , నాలుగు సంచుల్లో కుక్కిన గుడ్డలు -చిన్నా చితకా సామాను, చెంబూ తపేలాలతో సహా భాగ్యం రోడ్డున పడింది. దానికి సాయం బక్కచిన్నిన ఆవొకటి కాళ్ళకీ మెడకీ బంధాలు వేసుంది , ఒక్క గడ్డిపరకయినా దొరక్కపోతుందా అని ఆబగా నేల నాకుతుంది .

ఉన్నపళంగా ఇలా జరగడంతో మతిపోయినట్టూ పిచ్చిగా అరుస్తుంది భాగ్యం .కన్నోళ్ళనీ కట్టుకున్నోడినీ ఆడిపోసుకోటం అయిపోయాకా , కనిపించినోళ్ళందర్నీ తిట్టడం పట్టింది. ఇదివరకెప్పుడూ భాగ్యం అంతలా ఆవేశపడటం , ఆక్రోశించడం నేను చూళ్ళేదు.

” కులకండి బాబూ….బాగా కులకండి . మీరంతా పెట్టిపుట్టినోళ్ళు , ఒకటికి నాలుగు మేడలు కట్టుకోండి …. కార్లూ ఇమాణాలూ కొనుక్కోండి …నేలమీద కాలెట్టకుండా అయ్యెక్కి ఊరేగండి. మీ పిల్లలకి పరవాణ్ణాలు తినిపించుకోండి. మేం ఇలా రోడ్డుమీద పడి దుమ్ముగొట్టుకుపోతాం …..తిండానికి తిండిలేక, నెత్తిన ఇంత నీడలేక మలమల్లాడిపోతాం……మీరు సుడేసుకు పుట్టేరుమరి….మేం దరిద్రాన్ని ఎంటెట్టుకు తగలడ్డాం బూమ్మీదికి …. మమ్మల్ని రోడ్డున పడేసి మీరు మాత్రం సుకంగా ఊరేగండి “ నోటికి జతగా రెండు చేతుల్నీ ఆడించేస్తుంది . అది విని అర్జెంటుగా మీరో నేనో భుజాలు తడుకోవాల్సిన పని లేదు . భాగ్యం రోడ్డున పడ్డానికి మనం కారణం కాదుగా . మరి…, ఒకటి దాని ఖర్మ , రెండు ప్రభుత్వం . లేదా ఒకటి ప్రభుత్వం రెండు దాని ఖర్మ . అబ్బా…ఏదైనా మనం మాత్రం కాదు.

బోయ్…బొయ్ మని హారన్ కొట్టుకుంటూ మీదకొచ్చేసిన కారుమీద తుపుక్కున ఉమ్మేసి , ఎంతమాటందో విన్నారా ….” దొంగ ల…కొడకా , మా కొంపలు కూలగొట్టేసి పోయేరు కదరా ….మడుసుల మీంచి కూడా తొక్కించుకు పోతారంట్రా ” మీ ……..” హవ్వ..హవ్వ…. నిజంగా భాగ్యానికి పిచ్చెక్కింది.

మిట్టమధ్యాహ్నం తన గంపెడు సంసారాన్నీ నెత్తినేసుకుని , మొదలంటా పడిపోయిన ఆ చింత చెట్టునూ , ఆనవాలు లేకుండా పోయిన తన బడ్డీ కొట్టునూ చూసుకుంటూ ఎంత సేపట్నించో అలా గగ్గోలు పెడుతుంది . ఘొల్లున ఏడుస్తూన్న భాగ్యాన్ని దగ్గరకెళ్ళి పలకరించలేను . నేనున్నానని ధైర్యం చెప్పలేను . అందుకే దూరంగావుండి గమనిస్తున్నాను . నిజం చెప్పాలంటే నాకు భాగ్యం పరిచయం అయినప్పటినుంచీ గమనిస్తూనేవున్నాను. ఓహ్….చెప్పనేలేదు కదూ నేనొక రచయితని .

ఆ మాటంటే మా ఆవిడ ఒప్పుకోదు . నువ్వో పనికిమాలినవాడివి అంటుంది. ‘ ఆ కథలు కెలుక్కునే టైం లో ట్యూషన్లు చెప్పి నాలుగు రాళ్ళు సంపాదిస్తే , నాలుగు రకాలుగా ఖర్చుపెట్టుకోవచ్చు . నీకామాత్రం బాధ్యతలేదు ‘ …అని చట్నీలేని ఇడ్లీ పెడుతూ సందు దొరికినప్పుడల్లా దెప్పుతుంది .

‘ అవును ఆవిడ అన్నదీ నిజమే ‘ !అని మీరూ అనేలోపు మీకో సంగతి తెలియాలి. ఒకానొక ‘ ఊడలమర్రి ‘ స్కూల్ లో లెక్కల టీచర్ని నేను. మా స్కూల్లో అన్ని సబ్జెక్టులకీ పిరియడ్స్ ఉంటాయి , కానీ అన్ని పిరియడ్స్ లోనూ లెక్కలే నడుస్తాయి . మీకు మనసుంటే తప్పక అర్ధమవుతుంది నా బాధ. ‘ స్టడీ అవర్స్ అయ్యేవరకూ స్కూల్లోనే తగలడితే ఇంకో రెండువేలు సంపాదించుకోవచ్చు . ఇంటికొచ్చి ఎవర్ని ఉద్ధరించాలి ‘ అని ఆవిడ అభిప్రాయం . అనుమతిలేకుండా గాలికూడా చొరబడలేని ఆ పందికొక్కు కలుగులో ఒక్కో గంటా ఒక్కో యుగంలా గడుస్తుంది నాకు . అక్షరాన్ని ప్రేమించే నేను అంకెలతో సావాసం చేయాల్సి రావటం నా రెండవ దురదృష్టం .

“నాకు తలనెప్పిగావుంది . నే లేవలేను బయటెక్కడో తినండి పోయి “ అని మా ఆవిడ అనడం, నేను భాగ్యం బడ్డీ కొట్టుముందు వాలడం ….” రండ్రండి బాబుగారూ ఇలా కూకోండి. ” అని అక్కడున్న ఒకే ఒక ప్లాస్టిక్ స్టూలు మీద నన్ను మహారాజంత మర్యాద చేసి భాగ్యం కూచోపెట్టడం ఇంచుమించుగా రోజూ జరిగేదే.

నేను కాలుమీద కాలేసుకుని , ఇంకెక్కడా వెలగబెట్ట వీలులేని దర్జా అంతా ఒలకపోస్తూ …. ఇస్తరాకులోంచీ వేడి వేడి అట్టుముక్క రెండు వేళ్ళతోనూ సుతారంగా తుంచి అల్లం పచ్చడిలో నంజుకుంటూ ” రోజూ ఒకటే చట్నీ చేస్తే ఎలా తింటావే…. రేపు కొబ్బరి పచ్చడి చేయ్ ” అని ఆర్డరేస్తాను . ” ఆయ్….. గొబ్బర కాయలు సేలా పిరివయిపోయాండి బాబుగారూ “ అంటూ గాజుగ్లాసు నిండా టీ పోసి , తొణక్కుండా జాగ్రత్తగా చేతికందిస్తుంది.

ఈలోగా మిగతా కష్టమర్లు ఒక్కొక్కరూ రావటం మొదలుపెడితే ‘ ఇంక లెగరేటి బాబూ ‘ అన్నట్టు చూస్తుంది. నాలుగు గుక్కల్లో టీ గొంతులో పోసుకుని, రెండు పదులు దాని చేతిలో పెట్టి రోడ్డుమీద పడతాను.

రోజూ వెళ్ళేవాళ్ళయినా ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాల్సిందే . అరువు లేదు అని ఖరా ఖండిగా చెప్పే బోర్డొకటి వేలాడీసింది ఆ కొట్టుకి.
కానీ ఆ ఆటో స్టాండు మీద పెత్తనం చేసే రౌడీ దొరబాబుగాడు ఏరోజూ ఒక రూపాయి దాని చేతిలో పెట్టడం చూళ్ళేదు. మొన్నోరోజు సాయంత్రం , వాడి బాన కడుపులో మూడు కొబ్బరి బొండాలు ఒంపేసుకు పోయాడు. వాడెళ్ళినవైపు కొబ్బరిబొండాన్ని కసిగా విసిరేస్తూ ‘ పీడాకారం యెదవ ‘ అని భాగ్యం తిట్టడం వినిపించింది.

ఏ ఆదివారం సాయంత్రమో , ఇంట్లో టి.వినీ పెళ్ళాన్నీ భరించలేక రోడ్డున పడ్డప్పుడు భాగ్యం పిలుస్తుంది ” రండ్రండి బాబుగారూ ….ఇయ్యాల మిరపకాయ బజ్జీలు ఏసేను ” అంటుంది.

ఆటోలు నడిపేవాళ్ళూ , ప్రయాణాల మీద ఉన్నోళ్ళూ, నాలాంటి కాలక్షేపం గాళ్ళూ ఎప్పుడూ కొట్టుకు సరిపడా జనాలు బాగానే మూగుతారు .

అక్కడ రోజూ పొద్దున్నే టిఫినూ, సాయంత్రం బజ్జీలూ, పుణుకులు లాంటి చిరుతిళ్ళు, రోజల్లా టీ …చేసి అమ్ముతుంది భాగ్యం . అంతేకాదు వేసవిలో చల్లని కొబ్బరిబొండాలూ, వానల్లో వేడివేడి మొక్కజొన్నపొత్తులూ కూడా అందుబాటులో వుంచుతుంది. ఇంకా , ఆ దారిన స్కూల్ కి వెళ్ళే పిల్లలుకోసం బిళ్ళలూ బిస్కెట్లూ సీసాల్లో పోసింది. ఈ మధ్యన అందరూ అడుగుతున్నారని చిప్స్ పేకెట్లూ తెప్పించి బడ్డీకి వేళ్ళాడదీసింది.

టౌనుకి దూరంగా ఉన్నజంక్షన్ . నాలుగు మూలలనించీ జనం అక్కడికి చేరుకుని ,తమ తమ పనులమీద నాలుగు వైపులకీ పోతుంటారు . ఆ రోడ్డుతో పరిచయం ఉన్నవారికెవరికయినా చింతచెట్టు సెంటరు అనగానే ….
కూడలిలో గుబురైన ఆ చింత చెట్టు , చుట్టూ పరుచుకున్న చల్లని నీడ, ఆ నీడన భాగ్యం బడ్డీ కొట్టూ , ఆ కొట్టుకు- ఆ నీడకూ అవసరార్ధం చేరే జనాలూ అవన్నీ కలిసి ఒకే దృశ్యంగా స్పురణకొస్తాయి .

చెట్టునీడన కొట్టునానుకుని ఒక పక్క పెద్ద రాళ్ళు పేర్చి వాటిమీద చెక్క పేళ్ళు వేసింది. నిలబడలేని వాళ్ళుంటే వాటిమీద కూర్చుంటారు. కొందరు చెట్టు మానుకి జారబడి కూర్చుంటే , నాలాంటి ఇస్త్రీ బట్టలకోసం ప్లాస్టిక్ స్టూల్ ఒకటుంది.

ఒక రాత్రి వచ్చిన గాలివానకి ఎదర , రేకు తలుపు ఊడిపోయింది కాబోలు … “సూడండి బాబూ ఎంత అన్నేయవో ……సెవి కమ్మలమ్మి ఆడు అడిగినట్టే మూడేలు సేతిలో పొసేను . ఇట్టంటే ఊడిపోయేలా దిగ్గొట్టిపోయేడు ఆ కంసాలోడు . నిండా ఏడాదన్నా కాలేదు …..” అని బాధ పడింది.

“ఇది మళ్ళీ బిగిచ్చాలంటే ఇంకెంత అడుగుతాడో ….. ఏ రోజు వొచ్చింది ఆ రోజుకే సాల్తాలేదు నా మొకానికి అప్పెట్టేవోళ్ళూ లేరు”. అని నాకూ వినిపించేలా సణుక్కుంటుంటే …..నాకనుమానం వచ్చి ., “ఇవాళ టీ వద్దులే ఇంట్లో మా ఆవిడ వెయిట్ చేస్తుంటుంది “ అని చెప్పి, జేబు గట్టిగా పట్టుకు జారుకున్నాను. ఆవిడ ఆ టైం లో తన వెయిట్ తగ్గించుకోటానికి వెళ్ళుంటుందని తెలిసే !…….”అయిదు కేజీల బరువుకి డబ్బులు కడితే , అదనంగా మరో అయిదు తగ్గిస్తారట . నేను పదికి కట్టాను …పదివేలు. రోజూ వెళ్ళి రెండు గంటలు ఒంటికి మిషన్ తగిలించుకు కూర్చోవాలి .మీరు పెత్తనాలు చెయ్యకుండా కొంపకి తగలడి పని మనిషితో దగ్గరుండి పనులు చేయించండి ” . అని పొద్దున్నే చెప్పింది నా పెళ్ళాం. భర్తనుంచీ అన్నిసుఖాలూ పొందడం భార్య హక్కు. నేను నా భార్య హక్కులకు భంగం కలిగించలేను .
ఓరోజు , మా ఊర్లో చోటా ‘ మోటా’ నాయకుడొకడు హరీమంటే మధ్యాహ్నం స్కూల్ కి సెలవు ప్రకటించేసారు. నేను న్యూస్ పేపర్ ఒకటి కొనుక్కుని కులాసాగా అడుగులేసుకుంటూ వస్తుంటే …” రండ్రండి బాబుగారూ పెసరట్ట్లేసేను ” అంటూ పుట్టింటి చుట్టాన్ని చూసినంత ఆనందంగా పిలిచి స్టూల్ జరిపింది భాగ్యం.

ఓసారెప్పుడో అనుకున్నాను. భాగ్యం కథేవిటో తెలుసుకోవాలని. దానికి కొన్ని విలువలు, వ్యాఖ్యానాలూ జోడించి కథ రాసుకుంటే ‘ ఓ సౌభాగ్యం కథ ‘ అని పేరు పెట్టాలని కూడా అనుకున్నాను. మీ ఆయనెప్పుడూ కనపడడేం ? అడిగాను . “ఆడు మంచాన పడ్డాడండి బాబూ అందుకే గదా నాకీ తిప్పలూ “ గిన్నెలోంచీ టీ వడపోస్తూ అంది .

“అయ్యో….అలాగా , జబ్బేంటీ .. …”

“ఏదయినా, డబ్బు లేకుండా తగ్గీ జబ్బుకాదండి. ఉన్నంతవరకూ వదిలిచ్చుకున్నాను. ఇంక దేవుడిమీద భారమేసి కూకున్నాను . పిల్లని బడి మానిపించి నాన్న కాడ కాపలా ఎట్టేను. అదుగోండి ఆ కనపడీ పాకలోనే ఉంటాం. ఆ తళం ఒకప్పుడు మాఊరు సర్పంచి గారికి బాగా కావల్సినోళ్ళది. ఆరి ద్వారాగా ఇక్కడికొచ్చి పడ్డాం”

చెట్టువెనక్కి దూరంగా పెద్ద ఖాళీ జాగా చూపించిoది. స్తలాన్ని ఎవరూ కబ్జా చేసేయకుండా వీళ్ళని అక్కడ ఉండనిస్తున్నారేమో అనుకున్నాను.

“బాబుగారూ ఉప్పుడు అనుకున్నా రాదనుకోండి …. ఈనాటికి ఇలా రోడ్డున పడ్డాం కానండీ ఒకప్పుడు మేవూ బాగా బతికినోళ్ళవండీ “…. టీ గ్లాసు నా చేతికిచ్చి, చేతిలో పెసరట్టు ముక్క పట్టుకుని, చెట్టు మొదలుకు జారబడి కూర్చుంది . తీరుబడిగా ఉన్నట్టుంది. నేనడగక పోయినా అన్నీ తనే చెప్పేసేలావుంది.

నా పూర్తిపేరు ‘ సౌబాగ్యలచ్చి ‘ వండి అంటూ , ఎత్తుగడ తెలిసిన కథకుడిలా మొదలుపెట్టింది
“మా ఊరు పోలారం కేసి ఉందండి … మా మాంగారికి ముగ్గురు కొడుకులూ, ఆరెకరాల పొలం వుండీదండి. అదిగాక ఇంకో పదెకరాలు కౌలుకి సేసేవోరండి . మా అత్తమ్మ గారు మొగపిల్లల్ని ఎన్న ముద్దలెట్టి పెంచిందండి . దూళ్ళూ పాడీ బాగావుండీదండి. నేను మా ఇంట్లో సిన్న కోడల్ననీ గారంగా సూసేవోరండి మా అత్తమ్మగారు . మా తోడికోడళ్ళిద్దరికీ బయట పనులు పురమాయించి , నన్ను ఒంటపనిలో ఎమ్మటే తిప్పుకోనేవోరు .మా యాయన గారు పెద్ద పనిమంతుడు కాదండి .అర్బకం మడిసి . ఉమ్మడి కుటంబం లో అన్నలిద్దరి అండనా అలా గడిసిపోయీది . మా పోలంలోనూ, దొడ్లోనూ లేని సెట్టంటే లేదండి .

“ మా పిల్ల కడుపున పడ్డం , మా పొలం గవర్నిమెంటోళ్ళు తీసేసుకోటం ఒక్కసారే జరిగిపోయేయండి . ఒక్క పొలవేటండీ …ఇల్లూ ఓకిలీ అన్నీనూ . ఊర్లకి ఊర్లు ఖాళీ చేసేయాలన్నారు. అన్నిటికీ రేటు కట్టి ఎప్పుటికో డబ్బులిచ్చేరనుకోండి. అయితే మాత్రం డబ్బుకి నిలకడ ఎక్కడండీ. తాగి తందనాలాడి కుంతమంది తగలేసుకున్నారు , అందరూ మంచోళ్ళే అని నమ్మి కొందరు పోగొట్టుకున్నారు . ఒకరో ఇద్దరో కుంత జాగర్తయినోళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు సేసుకునీ , ఈలయిన సోట ఇళ్ళు కట్టుకుని కాళీ సేతుల్తో నిలబడ్డారు .

కొడుకులు గురించి దిగులు పడ్డట్టూ మా మాంగారు గుండినెప్పితో పుటిక్కిన పోయేడు. దుక్కలాటి మడిసి అద్దాంతరంగా పోయేడని అందరూ అనుకున్నాం. బేంకీలో పడ్డ డబ్బులు , ఇంట్లో ఉన్న సమానాలూ అన్నదమ్ములు ముగ్గురూ వోటాలేసుకున్నారు . అత్తమ్మ గారిని తీసుకుని మా పెదబావగారు అయిద్రాబాదు ఎల్లిపోయేరు. రెండో ఆయన ఎవర్నో నమ్మి యాపారంలో పెట్టేడు మోసపోయేడు . అయ్యన్నీ సూసి నా గుండెలు అల్లల్లాడేయి. మా ఆయన సూత్తే లోకం తెలని మడిసి. పుట్టిపెరిగిన ఆ ఊరు ఆ జనాలూ తప్ప ఏనాడన్నా బయటి పపంచకం లోకి ఒత్తేనా !ఓరి బగమంతుడా , అయినోళ్ళంతా తలో దిక్కూ అయిపోయేరు, కట్టం సుఖం వొత్తే ఎవరితో సెప్పుకోవాల, పిల్ల ఎదిగీదాకా ఈ డబ్బెలా నిలబెట్టుకోవాలా , ముందు ముందు ఎలా బతకాలా అని ఒకటే బెంగ నాకు .

పెద్ద వాహనం ఒకటి హోరుమని రొదపెట్టుకుంటూ వెళ్ళింది. మాటలాపి భాగ్యం దాన్ని చూస్తూ ఉండిపోయింది.

దొంగ కాకొకటి భాగ్యం చేతిలో పెసరట్టు ముక్క మీద కన్నేసినట్టుంది , చెట్టుమీదకీ కిందకీ ఎగురుతూ అవకాశం కోసం చూస్తుంది. అది మధ్యలో కావ్ కావ్ మంటూ తోటి కాకులకి సందేశం కూడా పంపుతుంది. ‘ ముందది తినేయ్ భాగ్యం ‘ అని చెప్పాలనిపించినా …..నా డిగ్నిటీకి భంగం అనిపించి కాం గా వుండిపోయాను.

ఇక్కడి వరకూ ఏకధాటిగా కబుర్లు చెప్పిన భాగ్యం , ఇక చెప్పటం ఇష్టం లేకో ఏమో విసుగ్గా మొహం పెట్టి ,” షూ…..” అంటూ కాకిని అదిలిస్తూ అజాగ్రత్తలో చేతిలో అట్టుముక్క విసిరేయడంతో ఎప్పటికయినా ఇలా జరుగుతుందని తెలిసిందానిలా కాకి లటక్కన అట్టుముక్క నోట కరుచుకు ఎగిరిపోయింది.

దానికి కావల్సింది అది దక్కించుకుంది . నాకే ఏదో అసంతృప్తిగా వుంది .

అవునూ గవర్మెంట్ పొలాలు తీసుకుని డబ్బిస్తే , ఆ డబ్బుతో తిరిగి ఇంకో ఊర్లో పొలాలు కొనుక్కోచ్చు కదా పొలం పోయినా డబ్బులున్నాయి కదా చేతిలో అనేసాను నిబ్బరంగా .

భాగ్యం గట్టిగా నిట్టూర్చి…..”ఎక్కడ బాబూ, ఆ డబ్బు మా చేతికొచ్చీసరికి ఎకరం పొలానికి కుంచుడు నేల కూడా రానంత పెరిగిపోయాయండి ధరలు.. అదీగాక , బేంకు అప్పులు , బయట అప్పులూ అన్నీ ఉన్న పళంగా తీర్సాల్చి వొచ్చిందాండీ. ఇంకే మిగులుతాయి బాబుగారూ. పొలాలు పోయీసరికి మా ఊరుకేసి సంబంధాలకి కూడా రాటం మానేసేరండి. అయ్యన్నీ పడ్డోళ్ళకి గానీ మీలాటోళ్ళకి సెప్పినా అర్దం కావులెండి “ అనేసింది , నే చెప్పింది విను చాలు వొడ్డున కూర్చుని సలహాలివ్వకు అన్నట్టుందా మాట.
బాబుగారూ సినిమల్లో సూసినదానిమీద సెపుతున్నాను ….ఒక్కో దేవుడూ ఒక్కో రాచ్చసుడ్ని సంపేసేడు కదాండీ ! అయినా ఎక్కడనుంచి ఒచ్చేత్తన్నారండీ ఈ రాచ్చసులు అంది.

నేను అర్ధం కానట్టు చూసేను !

మా సేతుల్లో డబ్బులున్నాయని తెలగానే , నాలుగు సినుకులు పడీసరికీ పెంట దిబ్బలమీంచీ రెక్కల పురుగులు పుట్టుకొత్తాయి సూడండి . అలా మా ఊర్లో రాచ్చసులు మొలిచుకొచ్చేసేరు . డబ్బిందులో పెట్టండి , అందులో పెట్టండి , అగి కొనుక్కోండి ఇది కొనుక్కోండి అనీ ….జోరీగల్లా గీ పెట్టెత్తేనా !

మాకు ఊపిరాడకుండా సేసేసి , కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోయినట్టూ మిగిలింది కుంతా ఎగరేసుకుపోయేరు . అదయ్యేకా ….కేసులన్నారు కోరుటులన్నారు . మళ్ళీ అయ్యో కర్సులు . ఈనాటిదాకా ఒక్క ముం..కొడుకూ దొరకలేదు . ఒక్క రూపాయీ ఎనక్కి రాలేదు . అమాయకులిని నిలువునా ముoచేసిన అసుంటోళ్ళు బాగుపడతారంటారా ? దేవుడు ఈ పాటికే ఆళ్ళకి సిచ్చ ఏసేసివుంటాడు . “ తలొంచుకుని చెంగుతో కళ్ళొత్తుకుంటున్న భాగ్యాన్ని చూస్తుంటే మనసుకి కొంచెం కష్టంగానేవుంది. అబ్బెబ్బే ….ఇలాంటి కథలని నువ్వు బుర్రకేకానీ ,మనసుకి ఎక్కించుకోకూడదు అని బుద్ధి హెచ్చరిస్తుంది . “అక్కడికి మీ ఒక్కరికే మనసున్నట్టూ …..ఎవరికీ లేని బాధ మీకెందుకూ “. అని నా పెళ్ళాం తరచూ నాకు హితోపదేశం చేస్తూనేవుంటుంది . నేను నా బుద్ధికి వ్యతిరేకంగా ప్రవర్తించగలను కానీ….. !

భాగ్యం నోటి దగ్గర తిండి ఎత్తుకెళ్ళిన కాకి ఇంకో నాలుగు కాకుల్ని తీసుకొచ్చింది .

అబ్బా గోల…కాకిగోల . భరించలేకుండావుంది. గుప్పెడు రాళ్ళుతీసుకుని వాటిమీదికి బలంగా విసరాలనిపించింది. .

ఎవరో ఇద్దరు వచ్చి టీ అడిగారు . భాగ్యం పనిలో పడింది. స్కూటర్ వెనక కూర్చున్నావిడ మెడ విరిగిపోయేలా తల వెనక్కి తిప్పి నన్నే చూస్తుంది . ఆమెని మా ఇంట్లో నా పెళ్ళంతో మాట్లాడుతుండగా చాలా సార్లు చూసాను.ఎక్కువసేపు ఇక్కడ కూర్చోటం మంచిది కాదు అనుకుంటూ పేపెర్ మడతపెట్టి వెళ్ళటానికి లేచాను .

ఎప్పుడొచ్చాడో నేను గమనించలేదు . దొరబాబు …భాగ్యంతో ఏదో ఘర్షణ పడుతున్నాడు. వేలు చూపించి బెదిరిస్తున్నాడు . వాడిమీద చాలా కేసులున్నాయనీ, స్థానిక రాజకీయ నాయకుడి సహస్ర బాహువుల్లో వాడు ఒకడని ,అక్కడ అందరూ అనుకుంటూవుంటారు . అలా అని వాడు ఎవర్నీ కొట్టడం ,తన్నడం వంటివి చేస్తుండగా నేనెప్పుడూ చూళేదు. మరేం చేస్తే …అన్ని కేసులు పెట్టారో !! వుండేలు దెబ్బను ఊహించిన బొంతకాకిలా ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా చెట్టుకిందనుంచీ రోడ్డుమీదకి గబగబా నాలుగడుగులు వేసానో లేదో ….
“ఇదుగో…నువ్వు మళ్ళీ ఆ మాటంటే బాబుగారికి సెపుతాను నలుగుర్నీ పోగేసి గోలసేత్తాను. నేను భయం పడను ఏవనుకుంటునావో ” . గట్టిగా అంటూ వేగంగా నా ముందుకొచ్చేసింది భాగ్యం. నా గుండెలు దడదడలాడాయి . నాకేం చెపుతుందీ అసలు దానికీ నాకూ సంబంధం ఏంటీ ….ఇప్పుడు నన్నే గొడవలోకి దించుతుందీ. ఊపిరి బిగపట్టాను . నడక ఆగిపోయింది. ఆలోచనలు పరిగెడు తున్నాయి.

“ఎల్లిపోయాడులెండిబాబూ….యదవ సచ్చినోడు “. భాగ్యం మాటకి ఊపిరి పీల్చుకుని తల తిప్పిచూస్తే , దొరబాబు వెనక్కి వెనక్కి చూస్తూ ఇంకా ఏదో బెదిరింపుగా అంటూ వెళ్ళిపోయి ఆటో ఎక్కేసాడు.

ఏంటి గొడవ అని నేను అడగాలనుకోలేదు…….వాడసలే రౌడీ , ఇద్దరికీ ఏ గొడవలున్నాయో ఏ లింకులున్నాయో …..అసలు భాగ్యం నేననుకున్నంత అమాయకురాలు కాదేమో. ఎందుకొచ్చిన కథలూ కాకరకాయలూ ….నా పెళ్ళం చెప్పినట్టు వింటే పోయేదానికి అనిపించిందా క్షణం . అంతగా రాయాలని సరదాపుడితే ..బుర్రా బుద్ధీ బానే వున్నాయిగా ఊహించి రాసుకోవచ్చు, లేదా వెనక్కెళ్ళి చిన్నప్పటి జ్ఞాపకాలో , కాలేజీ ప్రేమ కథలో రాసుకుంటే సరి. అప్పటికీ సరదా తీరకపోతే ఈ నాటి నా బానిస బతుకును , నిరాశక్త జీవితాన్నీ మారుపేర్లతో కసితీరా రాసుకోవచ్చు . ” ఈ రోడ్రేవన్నా ఆడి అబ్బ సొంతవా ….మీరే సెప్పండిబాబూ ….” ఇంకేదో చెప్పబోతున్న భాగ్యాన్ని ఇంచు మించు విదిలించుకున్నట్టే, విసుగ్గా ఓ చూపు చూసి కంగారుగా నా దారిన పడ్డాను .

అది జరిగాకా చాలా రోజులు భాగ్యం కొట్టు దగ్గర ఆగలేదు. మరెక్కడ తిన్నాను …! అన్న బాధ మీకెందుకు నా పెళ్ళానికే లేనప్పుడు దాని గురించి వదిలేయండి .

మంచి వేసవికాలం . ఎండ భగభగలాడుతుంది .పరిక్షలు కావటంతో మిట్టమధ్యాహనం రోడ్డుమీద దింపేసి వెళ్ళిపోయింది స్కూల్ బస్సు .
“రండ్రండి బాబుగారూ ” అని భాగ్యం పిలుస్తుంది . గొబ్బరి బొండం కొట్టమంటారేటండీ. అంటూ నా సమాధానం కోసం చూడకుండా బొండం కొట్టి , స్ట్రా వేసిచ్చింది.

” బాబుగారుకి కాళీ లేనట్టుంది ఇటేపొత్తం మానేసేరు ” అంది నవ్వుతూ .
నేను కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటూ ఉండిపోయాను . స్కూల్ లో ఏ. సి కన్నా ఆ చెట్టునీడనే చల్లగా ఉన్నట్టుంది. మనసుకి హాయిగా అనిపిస్తుంది.

మెడకీ కాలికీ బంధం వేసి వెనక బీడులో వదిలేసిన ఆవు అక్కడినించే మోర కొంచెం పైకెత్తి అంబా అని పిలుస్తుంది.

“వొత్తన్నానే మణీ …” అంటూ భాగ్యం సేవండి బకెటు తో నీళ్ళు పట్టుకెళ్ళింది.
తాదూర కoతలేదు మెడకో డోలన్నట్టు వుంది యవ్వారం అనుకున్నాను మనసులో .
పిల్లల శిక్షణా ఉపాద్యాయ శిక్షణా పూర్తయ్యాకా ఓ నెల పూర్తి సెలవు దొరికింది. నా పెళ్ళాం నన్ను తనతోపాటూ వాళ్ళ అమ్మగారింటికి తోలుకుపోయింది. తిరిగొచ్చి చూస్తే ……
ఇలా భాగ్యం నడిరోడ్డున పడి వుంది. చల్లని నీడనిచ్చిన చింతచెట్టు కొమ్మలూ, మొదలూ నరికేసి అస్తవ్యస్తంగా పడివుంది. బడ్డీ కొట్టు ఆనవాలు లేకుండా చెక్కా బద్దా ఆయిపోయింది .

భుజాన్నున్న బరువునీ, భార్యనీ, ఇంట్లో దించేసి ఏం జరిగుంటుందో అన్న కుతూహలంతో రోడ్డుమీదకొచ్చాను నన్ను చూస్తూనే భాగ్యం కళ్ళు తుడుచుకుని పరిగెత్తుకొచ్చింది .

“సూడండి బాబూ దౌర్జన్యం . నేనేదో నాయంగా నాకొచ్చిన పని సేసుకుని ఓ రూపాయి సంపాదించుకుంటున్నాను. శనెదవలా దాపరించేడు నా పేణానికి. నీతీ జాతీ లేని మడిసిని కాదు నేను . దొంగ సారా అమ్మాలంట . కమీసను ఇత్తాడంట . చీ…చీ…ఆకలితో అలమటించి సచ్చిపోతాను కానీ , అలాటి పాపపు పనికి పేణముండగా ఒప్పుకోనన్నాను .నన్నెదిరించి ఇక్కడెన్నాళ్ళుంటావో సూత్తానంటూ ఎల్లేడు . తెల్లారేపాటికి ఇదుగో ఇలాగా నన్ను రోడ్డున పడేసేడు. పచ్చని సెట్టు పడగొట్టి సమాది కట్టుకుంటాడంట . ఆడు సేసీ ముదనష్టపు పనికి పెద్దపెద్దోళ్ళందరూ వొత్తాసు పలుకుతున్నారు .

మా కుటొంబమెలాటిదో నేనెలా బతికేనో మీకు తెల్దా…. బాబూ మీరు సెప్పండి బాబూ….ఇదన్యాయం కాదా ! పచ్చని సెట్టుని కొట్టేటం పాపం కదాండీ . దొంగ సారా అమ్మి పదిమంది ఉసురు పోసుకుంటే దేవుడు కూడా చమించడని మీరు సెప్పండి బాబూ. మీకు పుణ్యం వుంటది . సాణ్ణాళ్ళబట్టీ మీరు నన్నెరుగుదురు కదాండీ….. తలదాసుకోటానికి మీ సూరుకింద కుంత సోటియ్యండి బాబూ ! .మాకు తిండి పెట్టి పోసించక్కరలేదు మళ్ళీ మేవే ఎలాగో పొట్టపోసుకుంటాం. నిలబడ్డానికి కుంత సోటు సూపెట్టండి బాబూ. నన్నేకాదు కనపడ్డవాళ్ళందర్నీ బ్రతిమాలుతుంది భాగ్యం . ఇన్నాళ్ళుగా తననెరిగినవాళ్ళే అయినా అందరూ దూరం నించీ చూసి తప్పుకుంటున్నారు . నేనూ అందర్లో ఒకడిగా దూరంగా వచ్చేసాను …నాకేం పట్టనట్టూ , తనెవరో నేనెవరో…..అన్నట్టు. అదిగో సరిగ్గా అప్పుడందుకుంది దండకం…..
దయ తలిచి ఓపూట భోజనం పెట్టొచ్చు , లేదా కొంత డబ్బుసాయం చేయ్యొచ్చు, కానీ భాగ్యం అడుగుతుంది. నిలబడ్డానికి కొంత చోటివ్వమని, తలదాచుకోటానికి ఇంత నీడ చూపించమని ……..
అదెలా సాధ్యం……పల్లెల్ని తుడిచేస్తూ ప్రాజెక్టులూ, పవర్ ప్లాంటులూ , ఆరు వరసల రోడ్లూ , ఇండస్ట్రియల్ కారిడార్లూ , పట్నాలని ముంచేస్తూ స్టూడియోలూ ,షాపింగ్ కాంప్లెక్సులూ , షోరూం లు , ఫ్లై ఓవర్లూ, మెట్రో లైన్లూ …..ఇంకా రాబోయేవి ఎన్నెన్నో . పోనీ తనన్నట్టే మీరో నేనో జాలిపడి చూరుకింద చోటిద్దామన్నా వందిళ్ళకి ఒకటే చూరు …కార్లతోనూ బళ్ళతోనూ కిక్కిరిసి . వాటికే చోటు చాలక గొడవపడుతుంటే …పిచ్చి భాగ్యం నిలబడటానికి చోటడుగుతుంది. తలదాచుకోటానికి నీడ కావాలంటుంది .
చీకటి పడే వేళకి భాగ్యం ఇంకా అలానే రోడ్డున పడుంది . రాత్రి ఆలోచనలతో కొంచెం ఇబ్బంది పడ్డా సుఖంగానే నిద్రపోయాను . ఇక్కడినుంచీ వెళ్ళిపోయి భాగ్యం ఎక్కడో సుఖంగా బతుకుతున్నట్టూ కలగన్నాను .
ఎప్పట్లానే…. “రాత్రి నిద్ర చాల్లేదు. బద్దకంగావుంది నే లేవలేను. బయటెక్కడన్నా తినండిపోయి “ అని నా పెళ్ళాం అనడంతో హమ్మయ్యా….ప్రపంచమంతా ఎప్పటిలానే వుంది అనుకుని రోడ్డున పడ్డాను. మరో బడ్డీకొట్టు వెతుక్కోవాలికదా .
జంక్షన్లో ….
కాళ్ళ బంధాలు విప్పదీసిన బక్కావు రోడ్డుమధ్యకొచ్చి మోరపైకెత్తి ఎవర్నో వెతుకుతుంది.

చింతచెట్టు కొమ్మలు నరికి, మానును కోసి , లారీకెక్కిస్తున్నారు. కూలీల హడావిడీ ఆర్భాటం . అక్కడ కట్టిన ఒక బేనర్ ద్వారా తెలిసిందేమంటే …….మొన్నామధ్యన పోయిన మోటా నాయకుడి విగ్రహం ఆ చోట్లో నిలబెట్టబోతున్నారని. ఆ సందర్భంగా జరగబోయే భారీ మీటింగుకోసం , చింత చెట్టు వెనకున్న ఖాళీ ప్రదేశాన్ని గడ్డిపరక కూడా లేకుండా బుల్డోజర్లతో చదును చేస్తున్నారు. దాంతో భాగ్యం పాక ఆనవాలు లేకుండా పోయింది . ఆ పనులన్నీ దొరబాబే చూస్తున్నాడు . ఆ జంక్షన్ కూడా పేరు మార్చుకోబోతుంది. ఇక ముందు ఆ జంక్షన్ పేరు వింటే ఎవరికయినా గబుక్కున గుర్తొచ్చేది ఆ గొప్ప నాయకుడు, వారు వెలగబెట్టిన అవినీతీ, పోగేసుకున్న సంపదా……

( ఇంత జరిగాకా నాకు కథ రాయాలనే సరదా పోయింది. పోనీ, మీరనుకున్నట్టే … ఆ అర్హతే లేకుండా పోయింది )



19 Responses to సౌభాగ్యం రోడ్డున పడింది . (దానికి మనవేం చేస్తాం !)

  1. May 2, 2013 at 6:27 pm

    కథ కన్నా మీరు రాసిన విధానం (కథనం అనాలేమో) చాలా నచ్చింది లలిత గారూ.. Very well written story!

    • లలిత
      May 4, 2013 at 1:16 pm

      థాంక్స్ మధుర . హమ్మయ్యా…ఏదో ఒకటి నచ్చింది కదా కష్టానికి ప్రతిఫలం దక్కింది .

  2. May 3, 2013 at 5:37 am

    ఆ మొగుడూ పెళ్ళాల సంసారాన్ని భలేగా చెప్పారు. శైలి చివరి వరకూ చదివించేటట్లు ఉన్నా, కధకి ఒక స్పష్టమైన ఆకృతి లేదేమోననిపించింది.

    • లలిత
      May 4, 2013 at 1:18 pm

      థాంక్స్ అండీ . ఓపిగ్గా కథ చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేసారు .
      బుర్రకథలో పిట్టకథ నచ్చిందన్నమాట

  3. May 3, 2013 at 12:47 pm

    లలిత గారూ,
    I think this is your best, so far.
    శారద

    • లలిత
      May 4, 2013 at 1:20 pm

      చాలా సతోషం శారదగారు . మీ వ్యాఖ్య నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది . thank you

  4. Sirisha
    May 4, 2013 at 10:19 am

    Lalita garu,

    Story is heart touching…. how much of a contrast between your Eedasina Godavi vs. this story !!! very well written.

    • లలిత
      May 5, 2013 at 11:10 am

      Thank you very much Sirisha garu

  5. May 4, 2013 at 1:02 pm

    పల్లెల్ని తుడిచేస్తూ ప్రాజెక్టులూ, పవర్ ప్లాంటులూ , ఆరు వరసల రోడ్లూ , ఇండస్ట్రియల్ కారిడార్లూ , పట్నాలని ముంచేస్తూ స్టూడియోలూ ,షాపింగ్ కాంప్లెక్సులూ , షోరూం లు , ఫ్లై ఓవర్లూ, మెట్రో లైన్లూ …..ఇంకా రాబోయేవి ఎన్నెన్నో . పోనీ తనన్నట్టే మీరో నేనో జాలిపడి చూరుకింద చోటిద్దామన్నా వందిళ్ళకి ఒకటే చూరు …కార్లతోనూ బళ్ళతోనూ కిక్కిరిసి . వాటికే చోటు చాలక గొడవపడుతుంటే …పిచ్చి భాగ్యం నిలబడటానికి చోటడుగుతుంది.

    ఈ వాక్యాలు మరీ మరీ నచ్చాయి …
    మొత్తం కధ నాకు బాగా నచ్చింది
    వాస్తవాన్ని చక్కగా చెప్పారు

    • లలిత
      May 5, 2013 at 11:13 am

      కథ పై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు శైల బాల గారు

  6. May 5, 2013 at 7:14 pm

    హాస్యమే కాదు సీరియస్ కధలూ మీ కిట్టీలో చాలా వున్నాయండి. బాగా రాసారు లలితగారు:))

    • లలిత
      May 8, 2013 at 8:08 pm

      థాంక్యు సునీత గారు .

  7. sureshpeddaraju
    May 6, 2013 at 11:34 am

    (భారంగా నిట్టూరుస్తూ)ఇలాంటి బతుకులు ప్రతినిత్యం ఇంకెన్ని రొడ్డున పడుతున్నాయో కదా..ఆలోచనలు రేకెత్తించే కథా, కథనం. అభినందనలు లలిత గారు.

    • లలిత
      May 8, 2013 at 8:09 pm

      సురేష్ గారు ధన్యవాదాలండి

  8. May 27, 2013 at 7:54 pm

    రావి శాస్త్రి గారు చెప్పని ఏడో సారా కథ చదివినట్టు ఉందండీ !!

  9. Aparna
    June 4, 2013 at 4:27 pm

    మీ శైలీ, ఇతివ్రుత్తం అన్నీ super.
    నిన్న నే matruki bijleeki mandola( Vishal Bhardwaj) అన్న సినిమా చూసానండీ .మీ కధ నే ఒక హీరో సుఖాంతం చేస్తాడు కానీ కధనం బాగుంది.

  10. శ్రీనివాస చామర్తి
    July 6, 2013 at 6:53 pm

    అడుగడుగునా సెటైర్లతో గోదావరి మాటలాగా చాలా బావుంది కథ!

  11. Varaprasad
    December 25, 2017 at 11:48 am

    ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతః, మా పసలపూడి vamsi మించిప వంశీని మించిపోయారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి కథలు రాస్తూనే ఉండండి మేము చదువుతూనే ఉంటాం.

Leave a Reply to sailabala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)